vileenamరాష్ట్రపతి ఎన్నికలతో కాంగ్రెస్‌లో ప్రారంభమైన వివాదాలు ప్రధాని ఇందిరాగాంధీని కాంగ్రెస్‌ పార్టీనుంచి బహిష్కరించేదాకా వెళ్ళాయి. 1969 నవంబర్‌ 12న సమావేశమైన కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశం ఇందిరాగాంధీపై 5 ఆరోపణలు సంధిస్తూ ఆమె క్రమశిక్షణ ఉల్లంఘించిందంటూ కాంగ్రెస్‌నుంచి బహిష్కరించింది. కొత్త నాయకున్ని వెంటనే ఎన్నుకోవాలని పార్లమెంటరీ పార్టీకి కాంగ్రెస్‌ కార్యవర్గం ఆదేశాలు జారీచేసింది.

పార్టీ కార్యవర్గం ఇందిరా గాంధీని ప్రాథమిక సభ్యత్వంనుండి కూడా బహిష్కరించింది. పార్టీ అధ్యక్షుడు నిజలింగప్ప అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి 21మందిలోను కేవలం 11మంది సభ్యులు మాత్రమే హాజరైనారు. ప్రధాని, ఆమె మద్దతుదారులు తొమ్మిదిమంది ఈ సమావేశానికి గైర్హాజరైనారు.

ప్రధానిని పార్టీనుండి బహిష్కరించడాన్ని 167మంది కాంగ్రెస్‌ ఎంపీలు ఖండించారు. ఆమెకు తమ మద్దతును ప్రకటించారు. నవంబర్‌ 13న జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇందిరా గాంధీకి 330మంది సభ్యులు మద్దతునిచ్చారు. వీరిలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 282. సభాపతికాకుండా లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 518. ప్రధానిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఆమెకు మద్దతుగా 259 ఓట్లకుపైగా కావాలి. కాంగ్రెస్‌ సభ్యుల్లో ఇందిరా గాంధీ మద్దతుదారుల సంఖ్య 212మంది అని ఆమె అంచనా. 47 ఓట్లు ఆమెకు అదనంగా కావాలి. జనసంఘం, స్వతంత్రపార్టీ, డీఎంకే, ఎస్‌.ఎస్‌.పి., సి.ఎస్‌.పి. మొదలైన పార్టీల సభ్యుల సంఖ్య 94.

మొరార్జీదేశాయ్‌ నిర్వహించిన పార్టీ సమావేశానికి కేవలం 50మంది కాంగ్రెస్‌ ఎంపీలు మాత్రమే హాజరైనారు.

కాంగ్రెస్‌ మాదిరిగానే టీపీఎస్‌లోనూ చీలికలు

ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న తెలంగాణా ప్రజా సమితి కార్యకర్తలలో లోలోపల పెరుగుతూ వచ్చిన విభేదాలు తీవ్రస్థాయిలో రావడంతో ప్రజాసమితి అధ్యక్ష పదవికి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి రాజీనామా చేశారు. ప్రజాసమితిలో విభిన్న భావాలు కలిగిన వారున్నారు. డా. శ్రీధర్‌రెడ్డి తొలిరోజే డా|| చెన్నారెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించి పోటీ ప్రజాసమితిని స్థాపించిన విషయం తెలిసిందే.

తెలంగాణకోసం మంత్రి పదవిని త్యజించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ అక్టోబర్‌లో చెన్నారెడ్డితో విభేదించారు. టీపీఎస్‌ నాయకుల మధ్య ఆంతరంగిక విభేదాలు తొలగించడానికి అసలు అధ్యక్ష పదవే వుండకూడదని ఒక వర్గం భావిస్తున్నది. నవంబర్‌ 15న చెన్నారెడ్డి తన రాజీనామా లేఖను ఉపసంహరించుకున్నారు. సమితి కార్యాచరణ సంఘం నవంబర్‌ 12న డా|| చెన్నారెడ్డి రాజీనామా లేఖను పరిశీలించి తెలంగాణ ప్రజా సమితి కార్యనిర్వాహకుల ఎన్నికలు డిసెంబర్‌లో జరుగనున్నందున రాజీనామాను ఉపసంహరించుకోవాల్సిందిగా ఏకగ్రీవంగా కోరింది.

తెలంగాణ ప్రజాసమితిని ఒక ప్రత్యేక లక్ష్యానికే తప్ప దానిని ఒక రాజకీయ వేదికగా చేయరాదని, తెలంగాణ ప్రత్యేక కాంగ్రెస్‌ సంఘానికి గుర్తింపుతెచ్చి కాంగ్రెస్‌ ద్వారానే తెలంగాణ అభ్యుదయాన్ని సాధించాలని కొండా లక్ష్మణ్‌ వర్గంవారు వాదిస్తున్నారు. కాంగ్రెస్‌ విభేదాలలో డా. చెన్నారెడ్డి ప్రధాని ఇందిరాగాంధీకి మద్దతుగా నిలిచారు.

తెలంగాణ నాయకులతో ప్రధాని సమాలోచనలు

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న డా|| మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, నూకల రామచంద్రారెడ్డి ఇతర ముఖ్య నేతలు చొక్కారావు, వి.బి. రాజు నవంబరు 24న ప్రధానితో అరగంటసేపు చర్చలు జరి పారు. తెలంగాణ సమస్య, కాంగ్రెస్‌ అంతర్గత కలహాలు తదితర అంశాలపై చర్చించారు.

నవంబరు 27న దేశీయాంగమంత్రి వై.బి. చవాన్‌ ఏపీ ప్రాంతీయ సంఘం అధికారాలు విస్తృతం చేసే సంగతి కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదని తమకు చెప్పారని చెన్నారెడ్డి హైదరాబాద్‌లో ప్రకటించారు. ఇది చొక్కారావుకు సంబంధించిన అంశమని వారికి చెప్పామని, తెలంగాణ సమస్యను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించాలని ప్రధానికి చెప్పామని చెన్నారెడ్డి అన్నారు. తమ ఉద్దేశ్యం ప్రజాస్వామ్య పద్ధతి అంటే ప్రజాభిప్రాయ సేకరణేనని చెన్నారెడ్డి అన్నారు. గోవా మహారాష్ట్రలో కలుపాలా వద్దా అనేదానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని, గోవా విడిగానే ఉండాలని అత్యధికులు సూచించారని చెన్నారెడ్డి అన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం గోవాను మహారాష్ట్రలో కలపలేదన్నారు.

ప్రధాని సూచనపై తెలంగాణ ఉద్యమానికి విరామం

ఈ విషయమై విభిన్న కథనాలను పత్రికలు ప్రచురించాయి. 26.11.1969న ఢిల్లీ ప్రతినిధి రాసిన ఈ కథనాన్ని ఆంధ్రప్రభ దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించింది.

తెలంగాణ ఉద్యమం తాత్కాలిక నిలుపుదల

ప్రస్తుతానికి తెలంగాణ సమస్యను గురించి ప్రస్తావించకుండా మారుతున్న పరిస్థితిని గమనించాలని డాక్టర్‌ చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీలతో సహా తెలంగాణ నాయకులు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు.

వి.బి. రాజుతోసహా ఈ ఇద్దరు నాయకులు ప్రధానిని కలుసుకుని ప్రస్తుతం ప్రశాంతంగావున్న తెలంగాణ పరిస్థితిని గురించి సింహావలోకనం చేశారు. వారు చవాన్‌నుకూడా కలుసుకున్నారు.

ప్రధాని కాంగ్రెస్‌ నిలద్రొక్కుకునేందుకు కొంత వ్యవధిని ఇవ్వాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని ఇప్పుడు వత్తిడి తీసుకురావడంలో అర్థం లేదని తెలంగాణ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో డా|| మర్రి చెన్నారెడ్డి 26.11.1969న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ”తెలంగాణా ఉద్యమం చచ్చిపోయిందని ప్రయోజనవాదులు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, అది నమ్మవలదనీ, ప్రస్తుతం విద్యార్థులు పరీక్షల్లో నిమగ్నులయ్యారు కాబట్టి ప్రశాంతంగా ఉన్నట్లనిపిస్తున్నదనీ, పరీక్షలయిపోయిన పిమ్మట మళ్ళీ ఉద్యమం తలెత్తవచ్చుననీ అన్నారు.

తెలంగాణ ఎంపీలు 14మందిలో 12మంది ప్రత్యేక వాదులన్న సత్యం గుర్తించాలని కూడా ఆయన కేంద్ర నాయకులకు చెప్పామన్నారు. (ఆంధ్రజనత, నవంబర్‌ 27, 1969) 26.11.1969న విశాలాంధ్ర దినపత్రిక కథనం.

”జనవరి నుంచి ప్రత్యేక తెలంగాణ ఆందోళన చెన్నారెడ్డి ప్రకటన: 1970 జనవరి 1వ తేదీనుంచి ప్రత్యేక తెలంగాణా ఆందోళనను పునరుద్ధరించడం జరుగుతుందని తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షులు డా|| యం. చెన్నారెడ్డి నేడిక్కడ పత్రికా విలేకర్లతో మాట్లాడుతూ అన్నారు.”

”విద్యార్థులు పరీక్షలలో నిమగ్నమై వున్నందున వ్యవసాయపనులలో గ్రామీణ ప్రజలు మునిగివున్న కారణంగా ఆందోళనలో ప్రస్తుతం స్తబ్ధత ఏర్పడిందని ఆయన అన్నారు”.

28.11.1969న ఆంధ్రపత్రిక కథనం

”మేము నలుగురం (చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, నూకల రామచంద్రారెడ్డి, వి.బి.రాజు) వెళ్ళి ప్రధానమంత్రిని కలవాలని పార్లమెంట్‌ సభ్యులు కోరినందునే వెళ్ళాము. మాకు ప్రత్యేక తెలంగాణ ఇస్తే మీతో ఉంటాము అనే సమయం కాదు. లేదా ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ప్రధానిపక్షం ఉన్నారు కదా. మీరు అటెందుకు చేరరు అనే ప్రశ్న కూడా నాకు నచ్చదు. జాతీయ శ్రేయస్సు దృష్ట్యా ఆయా సమస్యలను పరిశీలించుకోవాలి. మీకు వెంటనే ప్రత్యేక కాంగ్రెసు ఇస్తే లేదా ప్రత్యేక రాష్ట్రం ఇస్తే మీతో ఉంటామని ప్రధానితో మేము అనలేదు. అది పద్ధతి కూడా కాదు. తెలంగాణకు కొన్నాళ్ళుగా ప్రాంతీయకాంగ్రెస్‌ ఉన్నది. దానిని గుర్తించడంలో చిక్కు ఉండాల్సిన పనిలేదు. బొంబాయి కాంగ్రెస్‌ సభలు అయ్యాక ప్రధానమంత్రి ఈ సమస్యను గురించి పరిశీలించవచ్చు. ఈలోపల వారిని వత్తిడి చేయడం అంత మంచిదికాదు”. ‘అయితే ప్రస్తుతానికి మీరు వేచిచూడాలనుకుంటున్నారన్నమాట’ అన్న విలేకరి ప్రశ్నకు డా|| చెన్నారెడ్డి ఇలా చెప్పారు: ‘వేచి చూడాలని కాదు, ఉత్సాహం చల్లారికాదు. మొదట విద్యార్థులు మమ్ములను ఉద్యమంలోకి లాక్కువచ్చారు. మేము పరీక్షలకు వెళ్ళాలి. ఆగండి అన్నారు. సరే ఆగాము. అలాగే రేపు జనవరిలో పరీక్షలు అయిపోవడంతో మళ్లీ పదండి ముందుకు అని వాళ్ళు అనవచ్చు. అలాగే ప్రభుత్వోద్యోగులు. ఈ వ్యవహారం ఇంతటితో అయిపోయిందనుకుంటే పొర పాటు. ఇప్పుడు వ్యవస్థను పటిష్టం చేసుకుంటాము.”

మరొక విలేకరుల సమావేశంలో ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ మాట్లాడుతూ.. తానూ, చెన్నారెడ్డి తెలంగాణ సమస్యపై ప్రజాభిప్రాయం సేకరించాలని, అది ప్రజాస్వామ్య పద్ధతిని సూచిస్తుందని ప్రధానికి వివరించామన్నారు.

కాంగ్రెస్‌లో కొత్త జాతీయ నాయకత్వం పైకివస్తున్నదని, ఇందిరా గాంధీ పెత్తందారీతనం చెలాయించబోరని, ఇప్పటి కన్నా ఎక్కువ ప్రజాస్వామ్య తరహాతో వ్యవహరించి ప్రజల అభిప్రాయాలను మన్నించగలరని కొండా లక్ష్మణ్‌ అన్నారు. సమస్యలను బలప్రయోగంతో అవినీతి పద్ధతులతో అణచేబదులు ప్రజాస్వామ్య పద్ధతితోరాజ్యాంగ విహితమైన మార్గాలను కొత్త కాంగ్రెస్‌ పరిష్కరిస్తుందని కూడా ఆయన అన్నారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ను త్వరలో గుర్తించగల పరిస్థితులు ఏర్పడుతున్నవనే నమ్మకం తనకు కలుగుతున్నదని కొండా లక్ష్మణ్‌ అన్నారు.

మరో ప్రశ్నకు సమాధానమిస్తూ ”ప్రధానమంత్రిని తాము బేషరతుగా బలపరుస్తున్నామంటే, దాని అర్థం బ్రహ్మానందరెడ్డికి ఏదో మాట ఇచ్చామని అర్థం చేసుకోరాదని ప్రధానమంత్రిని బలపరుస్తున్నా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో బేరానికి సిద్ధంగా లేమని ఆయన విశదం చేశారు. తెలంగాణ సమస్యను సంతృప్తికరంగా పరిష్కరించకపోతే, ప్రస్తుతం స్తబ్దంగా ఉన్న పరిస్థితి ఒక్కసారి భగ్గుమని పెద్దఎత్తున ఉద్యమం పున:ప్రారంభమవడం తప్పదని కేంద్ర నాయకత్వాన్ని లక్ష్మణ్‌ హెచ్చరించారు.

డా|| చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ల ప్రకటనలనుబట్టి చూస్తే ఒకవైపు తెలంగాణలో విద్యార్థులు బడిబాటపట్టి నవంబరు మూడోవారంలో మొదలైన పరీక్షలకు పెద్దసంఖ్యలో హాజరవడం, మరోవైపు కాంగ్రెస్‌లోని అంతర్గత సంక్షోభం తెలంగాణ ఉద్యమ విరామానికి కారణంగా కనిపిస్తున్నది. వీటికితోడు ప్రజాసమితిలో నాయకులమధ్య విభేదాలు కూడా ఒక కారణం కావచ్చును.

(వచ్చే సంచికలో… తెలంగాణ ప్రజా సమితినుంచి డా|| చెన్నారెడ్డి బహిష్కరణ)

Other Updates