జోడేఘాట్‌ను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటానికి చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్ బి.పి. ఆచార్య తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 2014 అక్టోబర్‌లో కొమురంభీం వర్థంతి సందర్భంగా ప్రకటించిన విధంగా 25 కోట్ల రూపాయలతో చేపట్టిన కొమురంభీం స్మారక స్తూపం, గిరిజన మ్యూజియం, ఆర్చిగేట్ల నిర్మాణాల ప్రగతిని పరిశీలించేందుకు బి.పి. ఆచార్య, పర్యాటకశాఖఎండి. క్రిష్టియాన జెడ్ చాంగ్డోలు, జిల్లా కలెక్టరు ఎం. జగన్మోహన్‌తో కలిసి ఏప్రిల్ 24న జోడేఘాట్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా వారు ముందుగా కొమురంభీం విగ్రహానికి నివాళులు అర్పించి, ఆర్చిగేట్, కొమురంభీం స్మారకచిహ్నం, గిరిజన మ్యూజియం నిర్మాణ ప్రాంతాలను సందర్శించారు. స్మారక స్తూపం, మ్యూజియం, ఆర్చిగేట్ నమూనాలను పరిశీలించారు. జోడేఘాట్ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి గిరిజన పర్యాటక కేంద్రంగా తయారు చేయుటకు అధికారులంతా అంకితభావంతో పనిచేయాలని, కొమురంభీం వర్థంతి జరిగే అక్టోబర్ మాసంలోగా ఆర్చిగేట్, కొమురంభీం స్మారక స్తూపాల నిర్మాణాలను పూర్తి చేయాలని, అందుకు వారం రోజుల్లోగా పనులను ప్రారంభించాలని పర్యాటకశాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కొమురంభీం ఆశయాలను ‘జల్, జమీన్, జంగిల్’ నినాదాలు ప్రతిబింబించేలా స్మారక స్తూపాలను నిర్మించాలని, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా, గిరిజనుల మనోభావాలకు అనుగుణంగా ఆర్చిగేట్, స్మారకస్తూపం, మ్యూజియంలను నిర్మించాలని అన్నారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు ఐటి.డి.ఏ. ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఆర్వీ కర్నన్‌ను నోడల్ అధికారిగా నియమిస్తున్నామని, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షించాలన్నారు.
ఈ సందర్భంగా జోడేఘాట్ గ్రామ గిరిజన ప్రజలతో మాట్లాడుతూ, కొమురంభీం ఆశయాలను ప్రపంచానికి తెలిసేలా జోడేఘాట్‌ను తీర్చిదిద్దుతామని ఇందుకు గిరిజనులంతా సహకరించాలని, ఈ నిర్మాణం వలన గ్రామంలోని ఇండ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగదని, స్థానికుల ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని బి.పి. ఆచార్య అన్నారు.
ఉదయం కడెం, జన్నారంలోగల తెలంగాణ టూరిజం రిసార్ట్స్‌లను సందర్శించి యాత్రికులను అధికమొత్తంలో ఆకర్షించేలా రిసార్ట్స్‌లో సౌకర్యాలు కల్పించి, సేవలను అందించాలని పర్యాటక సిబ్బందికి సూచించారు. జిల్లాలోగల పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ సందర్భంగా జిన్నారం రిసార్ట్స్‌లో పర్యాటకులతో ముచ్చటించారు.