– తిగుళ్ల అరుణ కుమారి
ఈ ప్రపంచం అంతా చరాచరాలకు నిలయం. బ్రహ్మ దేవుని సృష్టిలో చైతన్యం కలిగిన జీవరాశికి ఎంత ప్రత్యేకత ఉన్నదో, చైతన్యం లేని పదార్థాలకూ అంతే ప్రత్యేకత ఉన్నది. ఈ కారణంగానే ఈ ప్రపంచం, బ్రహ్మదేవుడు మానవాళికి ప్రసాదించిన గొప్ప కానుక. ఈ కానుకను పవిత్రంగా కాపాడుకోవాలని తెలియజేసే పండుగ ‘బతుకమ్మ’.
ప్రతి ఏడాదీ శరదృతువులో ఆశ్వీయుజ మాసంలో సంభవించే బతుకమ్మ పండుగ తెలంగాణ జనపదాలలో పుట్టిన విశేష పర్వదినం. ప్రకృతి ఆరాధనకూ, ప్రాణికోటి మనుగడకూ నెలవైన ఈ పండుగలో ఎన్నో విశేషాలున్నాయి. వర్షఋతువు ముగిసిపోగానే శరదృతువు ప్రకృతిలో ప్రవేశిస్తున్నది. అప్పటి దాకా ధారాపాతంగా కురిసిన వర్షాలకు చెరువులూ, కుంటలూ, జలాశయాలూ నిండుకుండలై మానవాళిని కాపాడుతాయి. వర్షర్తువు పూర్తికాగానే ప్రవేశించే శరదృతువు నిర్మలత్వానికీ, స్వచ్ఛతకూ సంకేతం. శరదృతువులో అంతా తెల్లదనంతో భాసిస్తాయనీ, హంసలూ, నక్షత్రాలూ, కలువలూ, నీళ్లూ అన్నీ మేలిమి తెల్లదనంతో కనిపిస్తాయి కనుక ఈ సమయంలోనే దేవతలకు పండుగలను నిర్వహించడం పరిపాటి. ప్రకృతి శక్తి స్వరూపం కనుక ఈ కాలంలో శక్తిని ఆరాధించే శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమౌతాయి. శుక్ల పక్ష పాడ్యమి నుండి చంద్రునిలోని కళలు దిన దిన ప్రవర్ధమానం అవుతాయి కనుక చంద్రునితో మమేకమయ్యే భూమిపై కూడా చంద్రకళల ప్రభావం విశేషంగా ఉండడం సహజం. అందుకే చంద్రకళారూపిణి అయిన శక్తిని ఆరాధించడం శరన్నవరాత్రోత్సవాలలో పరిపాటి. నవరాత్రోత్సవాలలో జరుపుకొనే బతుకమ్మ పండుగ విశేష ప్రభావాన్ని చూపుతోంది.
పేరులోనే బతికించే గుణాన్ని కలిగి ఉన్న తల్లి బతుకమ్మ. సకల ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను జనులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రోజుకొక్క తీరుగా బతుకమ్మను అలంకరిస్తారు. పూలతో కూడిన ఈ పండుగ మానవ హృదయాలను పూలవలె మృదువుగా చేసి, శాంతి సౌభాగ్యాలను పండిస్తుందంటే ఎలాంటి సందేహమూ లేదు.
మహాలయ అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ దుర్గాష్టమితో ముగుస్తుంది. తొమ్మిది దినాల పాటు ప్రాకృతిక శక్తి స్వరూపాన్ని కుసుమశిఖరాలతో అనుసంధానించి ఆరాధించడం ఆకర్షణీయంగా ఉంటుంది. నవరాత్రులు అనగానే నవరత్నాలవలె ఎంతో విలువైనవిగా భాసిస్తాయి. ఈ తొమ్మిది రోజులూ పూజలతో విలువైనవిగా భాసిస్తాయి. ఈ తొమ్మిది రోజులూ పూజలతో పొందే ఆనందం ఆజీవనాంతం ఉల్లా సోత్సాహాలను నింపుతూ, మనిషిని ఆనంద తీరాలకు ప్రయాణింపజేస్తుంది. ప్రకృతి సహజంగా పూచిన కుసుమం చివరికి ప్రకృతిలోని జలాలలోనే కలిసిపోతుందనే సత్యాన్ని బతుకమ్మ పండుగ తెలియజేస్తోంది.
ముఖ్యంగా తెలంగాణ జనపదాలలో బతుకమ్మ పండుగకు ఉన్నంత ప్రత్యేకత ఇంకేదానికీ లేదంటే అతిశయోక్తి కాదు. బాలలూ, యువకులూ, వృద్ధులూ, స్త్రీలూ, పురుషులూ అనే భేదాలు లేకుండా అందరూ బతుకమ్మ పండుగను ఉత్సాహంతో జరుపుకొంటారు. ఇంటివాకిళ్లలో, వీధులలో, వీధికూడళ్లలో, విశాల మైదానాలలో, దేవాలయాలలో రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సామూహిక బృందాలుగా పాటలు పాడుతూ వృత్తాకారంలో లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆరాధించే సంప్రదాయం చూడముచ్చటగా ఉంటుంది. జనావళిలో తరతమ భేదాలు లేకుండా అందరినీ స్నేహ సౌజన్యాలతో కలిపే పండుగగా ‘బతుకమ్మ’ సార్థకమైంది. మనిషికి తల్లి ఎలాంటిదో బతుకమ్మ అలాంటిది. తల్లి తన సంతాన శ్రేయస్సు కోసం ఎన్ని విధాలుగా ఆలోచిస్తుందో బతుకమ్మ కూడా అన్ని విధాలుగా మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తుందని జనుల ప్రగాఢ విశ్వాసం. బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు ఎలా జరుగుతుందో పరిశీలిద్దాం.
1. మహాలయ అమావాస్య :
పితృదేవతలకు ఎంతో పవిత్రమైన మహాలయ అమావాస్యను ‘పెతరమాస’ అని తెలంగాణ జనప దాలలో పిలుస్తారు. అంటే ఈ దినాన పితృదేవులకు సమర్పించే పూజలన్నీ వారి ప్రసాదాలుగా భావింపబడుతాయి కనుక ఈ దినాన ఎంగిలి పూల బతుకమ్మగా భావించడం సంప్రదాయం. ‘ఎంగిలిపూల’ పేరుతో బతుకమ్మను పేర్చి, నువ్వులు, బియ్యపు పిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు. ఇదంతా పితృదేవతల ప్రీతి కోసం జరిపే ఆచారం. వారి ఆశీస్సులతోనే కుటుంబాలు యోగ క్షేమాలతో వర్ధిల్లుతాయని విశ్వాసం.
2. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి :
బతుకమ్మ పండుగలో రెండవ రోజు అయిన పాడ్యమినాడు బతుకమ్మను గునుకపువ్వు, తంగేడు పూలు, గుమ్మడి పూలతో కలిపి పేర్చి, అటుకులు, చప్పటి పప్పు, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని బతుకమ్మకు నివేదిస్తారు.
3. ఆశ్వీయుజ శుద్ధ ద్వితీయ :
బతుకమ్మ పండుగలో మూడవ రోజు అయిన ఈ రోజున ముద్దపప్పు బతుకమ్మను కొలుస్తారు. పాలు, బెల్లంతో కూడిన పదార్థాలను నివేదిస్తారు.
4. ఆశ్వీయుజ శుద్ధ తృతీయ :
బతుకమ్మ పండుగలో నాల్గవ రోజు ఇది. ఈ రోజున నానవేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన మధుర పదార్థాలను బతుకమ్మలకు నివేదించి, ప్రసాదంగా స్వీకరిస్తారు.
5. ఆశ్వీయుజ శుద్ధ చతుర్థి :
బతుకమ్మ పండుగలో అయిదవ రోజు అయిన ఈ రోజున రకరకాల ‘అట్లు’ నివేదనలో ఉంటాయి. ఈ రోజున అంతా అట్లనైవేద్యాలనే స్వీకరిస్తారు.
6. ఆశ్వీయుజ శుద్ధ పంచమి :
బతుకమ్మ పండుగలో ఆరవ రోజున బతుకమ్మ అలుక బూనుతుందని జనులు భావిస్తారు. ఆమె అలుక తీర్చడం కోసం ఎన్నో విధాలుగా పాటలు పాడుతూ, ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించడం కనబడుతుంది.
7. ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి :
బతుకమ్మ పండుగలో ఏడవ రోజు ఇది. ఈ నాడు బియ్యం పిండితో వేపకాయల ఆకారంలో వండిన పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు.
8. ఆశ్వీయుజ శుద్ధ సప్తమి :
ఈ ఎనిమిదవ రోజున నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం కలిపిన పదార్థాలను నివేదిస్తారు.
9. ఆశ్వీయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి)
తొమ్మిదవ రోజు బతుకమ్మ పండుగకు ముగింపు రోజు. ఈ రోజు బతుకమ్మకు ఎన్నో విధాలైన చద్దులను వండి నివేదిస్తారు. ఈ చద్దులలో కొన్ని పెరుగుతో కలిపిన దధ్యోదనం వంటివీ, పులిహోర వంటివీ, నిమ్మరసంతో కలిపినవీ, కొబ్బరితో కలిపినవీ, నువ్వులతో కలిపినవీ నైవేద్యాలుగా ఉంటాయి. ఈ దినాన్ని విశేషమైన ‘చద్దుల బతుకమ్మ’ (సద్దుల బతుకమ్మ)గా పిలుస్తారు. ఈనాడు ఊరేగింపుగా మంగళవాద్యాలతో బతుకమ్మలను జలాశయాల దగ్గరికి తీసుకొని వెళ్లి, నీళ్లలో నిమజ్జనం చేసి, చద్దులను ఆరగించడం కనబడుతుంది.
బతుకమ్మకు ఎంతో ఇష్టమైన తంగేడుపూలనూ, గునుక పూలనూ, గుమ్మడి పూలనూ పూజా స్థానంలో ఉంచడం ఈ పండుగ ప్రత్యేకత. తంగేడు, గునుక పూలు నీటిలోని కల్మషాలను పోగొట్టి పర్యావరణాన్ని కాపాడుతున్నాయి. అందుకే బతుకమ్మ పండుగ కేవలం సంప్రదాయపరంగానే కాకుండా ప్రకృతి పరిరక్షణ, పర్యావణ పరిపక్షణ, ప్రకృతి వనరుల రక్షణలోనూ ప్రముఖ పాత్ర వహిస్తోంది. అందుకే బతుకమ్మ పండుగ అంటే సకల జనావళికీ ఎంతో ఆనందం, ఉత్సాహం కలుగుతాయి.
బతుకమ్మ పాటలు జగత్ప్రసిద్ధాలు. వీటిలో జానపదుల జీవనశైలి, జనుల పరస్పర ప్రేమాభిమానాలు సమ్మిళితాలై సమైక్యజీవన సూత్రాన్ని అందరిలోనూ బంధిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే బతుకమ్మ పండుగ తెలంగాణకు వన్నెతెచ్చిన దివ్యపర్వం !