మనం రాష్ట్రంలో ప్రారంభించిన మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. అక్టోబరు 7న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో మిషన్ కాకతీయపై జరిగిన లఘు చర్చకు ఆయన సమాధానమిచ్చారు. కేసీఆర్ ముందుచూపుకు ఈ మిషన్ కాకతీయ నిదర్శనమన్నారు. పూర్వకాలంలో కాకతీయ ప్రభువులు తెలంగాణలో సాగునీటిని ప్రజలకు అందించడానికి గొలుసుకట్టు చెరువులు తవ్వించారని, అవి రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి మిషన్‌కాకతీయ అని పేరు పెట్టినట్లు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చెరువులు ధ్వంసం చేయబడ్డాయన్నారు. ఒకప్పుడు గంగాళంగా ఉన్న చెరువులు ఇప్పుడు తాంబాళంగా మారాయన్నారు. వాటిని పునరుద్దరించడానికి తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని వివరించారు. జలసంపద ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందన్నారు. చెరువుల పునరుద్ధరణ అనేది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షగా ఆయన అభివర్ణించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని చెరువులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని చెరువుల ద్వారానే ఎక్కువ భూమి సాగులోకి వచ్చేదన్నారు. అందుకే చెరువులు పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారన్నారు.
రాష్ట్రంలో మొత్తం 46,531 చెరువులు ఉన్నాయని, వీటిలో ప్రతి ఏడు 20శాతం చెరువులను పునరుద్ధరిస్త్తూ 5 సంవత్సరాలలో పూర్తి చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. దీని ప్రకారం ఈ ఏడు 8,217 చెరువులు పునరుద్ధరణకు తీసుకున్నట్లు తెలిపారు. రూ. 2,611 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇందులో 7,287 చెరువుల్లో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. 2016 మార్చి నాటికి పనులన్నీ పూర్తవుతా యన్నారు. కొన్ని జిల్లాల్లో వర్షాలు బాగా పడడంతో పూడికతీసిన చెరువులు నీటితో కళకళలాడుతున్నాయన్నారు. 5,732 చెరువులు పూర్తిగా నిండగా, 4,715 చెరువలు 50శాతం నుంచి 75 శాతం వరకు, 5,142 చెరువులు 25 నుంచి 50శాతం వరకునిండాయన్నారు. ఈ ఏడాది చెరువులలో మట్టిని తీసుకుని రైతులు పొలాలలో వేసుకోవడంతో ఎరువుల ఖర్చు తగ్గిందన్నారు. 2.50 కోట్ల ట్రిప్పుల పూడిక మట్టిని రైతులు తమ పొలాలలోకి తరలించుకున్నారని తెలిపారు. ఈ పూడిక తీత వల్ల చెరువుల్లో 2.24 టిఎంసీల నీటి నిలువ సామర్థ్యం పెరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 250 కోట్ల విలువైన పూడిక మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకుపోయినట్లు ఒక అంచనా వేసినట్లు తెలిపారు. చెరువుల పునరు ద్ధరణ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో చేపట్టినట్లు తెలిపారు. దీనికి మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ఎంతో సహకరించారని తెలిపారు.
విరాళాల వెల్లువ
చెరువులను దత్తత తీసుకునేందుకు ఎందరో వ్యక్తులు, సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. 48 సంస్థలు, వ్యక్తులు 30 చెరువులను దత్తత తీసుకుని 8.31 కోట్ల విలువైన పనులు చేపట్టినట్లు తెలిపారు. హెటిరోడ్రగ్స్ అధినేత రూ. 3.04 కోట్ల విరాళం ప్రకటించి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 4 చెరువులను పునరుద్ధరించినట్లు తెలిపారు. ఈ పథకానికి నాబర్డ్ గత ఏడాది 379 కోట్ల రూపాయల రుణం ఇచ్చిందన్నారు.
ఈ ఏడాది రూ. 389 కోట్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రెండో విడత డిసెంబరులో ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక మినీ ట్యాంకుబండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వీకే సారస్వత్, ఏకే జైన్, వాటర్‌మేన్‌గా పేరుగాంచిన రాజేందర్‌సింగ్‌లు ఈ పథకాన్ని ప్రశంసించారన్నారు. ఇది రైతులకు, గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడే పథకమని మంత్రి పేర్కొన్నారు.