మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, తెలుగుజాతి కళా ఖ్యాతి ప్రపంచ కీర్తి శిఖరంపై ఆవిష్కరించిన గొప్ప కళాకారుడు శిల్పి కృష్ణారెడ్డి. చిత్తూరు జిల్లా నందనూరు గ్రామంలో 1925లో జన్మించిన ఆయన పాఠశాల జీవితం గడుపుతుండగానే ఆయనలో కళాభిరుచి వికసించింది. నాడు కృష్ణారెడ్డి వయస్సు 15 సంవత్సరాలు. నాటి కాలంలో బ్రిటీష్ ప్రభుత్వ విద్యా విధానాలు నిర్వహిస్తున్న సమయం. క్విట్ ఇండియా ఉద్యమం తీవ్ర రూపు దాల్చిన రోజులవి. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉద్యమంలో ఉధృతంగా పాల్గొంటున్న సమయం. బ్రిటీష్ పోలీసులు విశ్వవిద్యాలయాలను మూసివేయించారు. ఆ సందర్భంలో ఎన్నో పోస్టర్లను రూపొందించిన కృష్ణారెడ్డి వాటిని బహిరంగ ప్రదేశాలలో అతికించి పలుమార్లు అరెస్టు కావడం, జైలుకు వెళ్ళడం జరిగింది.
కృష్ణారెడ్డి చదివే పాఠశాల వార్షికోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన కట్టమంచి రామలింగారెడ్డి, ఆ పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన చిత్రలేఖన పోటీలోని రవీంద్రనాథ్ ఠాగూర్ ముఖచిత్రాన్ని చూసి మంత్రముగ్ధుడై దానికి ప్రథమ బహుమతి ప్రకటించడంతో పాటు ఈ విద్యార్థిని పిలిపించమని అడిగాడు. ఆ విద్యార్థే కృష్ణారెడ్డి. ఎంతో ప్రశంసించిన సి.పి.రెడ్డి తప్పనిసరిగా కళాభ్యాసం చేయాలని ప్రోత్సహించాడు. రవీంద్రనాథ్ ఠాగూర్‌కు ఒక లేఖ రాసి ఈ విద్యార్థి కళాసక్తికి, విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రవేశాన్ని కల్పించి ప్రోత్సహించాలని కోరాడు. తన కుటుంబ ఆర్థిక స్థోమత అంతటి భారాన్ని మోయలేదని తెలిసినా 15 సం||రాల కృష్ణారెడ్డి ఎంతో ప్రయాసపడి కలకత్తా చేరుకుని ఆ కళాశాల ప్రిన్సిపల్‌ను కలిసి సి.పి.రెడ్డి ఠాగూర్‌కు రాసిన లేఖను అందించాడు. అది చదివిన ప్రిన్సిపాల్ ఫీజులు కట్టలేని విద్యార్థులకు తమ కళాశాలలో ఆశ్రయం లేదని, ఆర్థిక స్థోమతలేని వారికి ప్రవేశం ఇవ్వమని నిఖ్ఖచ్ఛిగా చెప్పి బయటకు పంపించారు.
వారాల తరబడి వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి (నాటి కాలంలో) ఎంతో ప్రయాసపడి అక్కడికి చేరిన కృష్ణారెడ్డి నిరాశ, భయాందోళనలతో రోదిస్తుండగా అటుగా వెళ్తున్న నందలాల్ బోస్ (ఆ కళాశాల అధ్యాపకుడు, ప్రముఖ కళాకారుడు) కృష్ణారెడ్డిని విషయం అడిగాడు. తను ఎంతో ఆసక్తితో ఇక్కడికి వచ్చానని అంతా వివరించాడు. విషయం అర్థం చేసుకొని నందలాల్ బోసు కృష్ణారెడ్డికి పెన్సిల్, పేపర్ ఇచ్చి ఆ చెట్టుపై చిలకను చూశావా! మళ్లీ చూడకుండా దానిని గీయమని అడిగాడు. క్షణకాలం చూసిన ఆ చిలుకను, ఆ కొమ్మలు, ఆకులు దాని పరిసరాలను కళ్ళకు కట్టినట్టు చిత్రించాడు కృష్ణారెడ్డి. వెంటనే ఈ బాలున్ని, ఆ చిత్రాన్ని ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకెళ్ళి, ఇలాంటి నైపుణ్యుడైన విద్యార్థిని మనం ఆర్థిక అవసరాలకోసం కోల్పోవడం సరైంది కాదని, అవసరమైతే తను ఈ బాలుడిని ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పి, ఆ కళాశాలలో ప్రవేశాన్ని కల్పించాడు.
అలా మొదలై ఏడు సంవత్సరాలు అక్కడే కళాభ్యాసం చేసిన కృష్ణారెడ్డి కళలోని మెళకువలు, తత్త్వాలను నేర్చుకున్నాడు. అదే కళాశాలలో చదివిన కె.జి. సుబ్రహ్మణ్యం, జగదీష్ మిట్టల్ ఆయన సమకాలీకులు. ఆ ఏడు సంవత్సరాలలో తను నేర్చుకున్నదెంతో ఐనా, ఒక సందర్భం మాత్రం కృష్ణారెడ్డి జీవితాన్ని ప్రభావితం చేసింది. ఒక రోజు ఆ విశ్వవిద్యాలయ తోటలో కూర్చొని ఆ చెట్టు పుష్పాలను చిత్రిస్తుండగా తన గురువైన నందలాల్ బోసు వచ్చి ”నాకు తెలుసు, నీవు చాలా కష్టపడుతున్నావు, చాలా అందంగా గీస్తున్నావు. కానీ నీవు చూసేదంతా బాహ్య ఆకృతిని మాత్రమే. నీవు కోరితే ఆ చెట్టు నిన్ను తనలోకి తీసుకెళుతుందేమో” అన్నాడు. ఆ సంభాషణ కళాకారుడిగా ఎంతో కదలిక తెచ్చింది. కంటితో కనిపించేది బాహ్య సౌందర్యం మాత్రమే. ఆ తత్త్వాన్ని శోధించినప్పుడే కళకు సార్ధకత ఉంటుందనే భావాన్ని గ్రహించిన కృష్ణారెడ్డి తనలోని కళాకారుణ్ణి పరిశోధించడం ప్రారంభించాడు.
ఆ తరువాత కాలంలో కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచ దేశాల వివిధ విశ్వవిద్యాలయాలలో అధ్యాపకుడిగా (ప్రొఫెసర్‌గా) పనిచేసిన కృష్ణారెడ్డి తన గురువైన నందలాల్ బోసు (మాస్టర్ మోషె అని ప్రేమగా పిలిచేవారు)ను మాత్రం ఏనాడు మరువలేదు. ”ఆయన ఒక సన్యాసి (జ్ఞాని)గా జీవిస్తూ, ఒక రైతులా అతి సామాన్యంగా కనిపించే గొప్ప మేధావి. ఆయనే నా సృజనాత్మకతను సృజించి, నేను నేనుగా జీవించే తత్త్వాన్ని బోధించిన గొప్ప గురువు. నా భావనలో గురువంటే నిరంతర తపన, పరిశోధనాత్మకత, నిత్య విద్యార్థి. గురువంటే నిండుకుండలా జ్ఞానాన్ని నింపుకున్న వ్యక్తిత్వంకాదు. ఇతరుల సృజనాత్మక తపనను మేల్కొలపడం, వారికి స్ఫూర్తినివ్వడం. సాంప్రదాయ పద్ధతులలో గురువు అంటే నాయకుడు కాదు, గురువు అంటే ప్రేరణ కర్త” అని కృష్ణారెడ్డి అన్నాడు.
1947 నుండి 1949 వరకు నాటి మద్రాసులోని కళాక్షేత్ర ఫౌండేషన్‌లో, మాంటిసోరి టీచర్స్ ట్రైనింగ్ సెంటర్‌లో అధ్యాపకుడుగా పనిచేశాడు. స్వాతంత్య్రానంతరం యూనివర్సిటి ఆఫ్ లండన్‌లో ప్రపంచ ప్రఖ్యాత శిల్పకారుడు హెన్రీమూర్‌తో పాటు శిల్పకళను అభ్యసించాడు. 1950లో పారిస్ వెళ్ళి ప్రపంచ ప్రఖ్యాత కళాకారులైన కాన్‌స్టాంటిన్, బ్రాంకుసి లాంటి ఎందరినో కలిశాడు. అక్కడే ఓసిప్ జడ్కిన్, విలియమ్ హైటర్ లాంటి ప్రముఖ కళాకారుల వద్ద విద్యనభ్యసించి 1957లో మిలాన్‌లోని బ్రెరా అకాడమిలో మారినో మారిని వద్ద విద్యనభ్యసించాడు. ఆ తరువాత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విశ్వవిద్యాలయాలలో గెస్ట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. అమెరికాలోని మెరిలాండ్ కాలేజీ ఆఫ్ ఆర్ట్, ప్రాట్ ఇన్‌స్టిట్యూట్, రస్కిన్ కాలేజి ఆఫ్ ఆర్ట్, యూనివర్సిటి ఆఫ్ టెక్సాస్, న్యూయార్క్ యూనివర్సిటి లాంటివి మచ్చుకు కొన్ని మాత్రమే.
ఆధునికతలో భారతీయత ఉట్టిపడే ఆరుదైన చిత్రకళా సంపద కృష్ణారెడ్డిది. ఎన్నో ప్రయోగాత్మక పరిశోధనలు నిర్వహించి ప్రింట్ మేకింగ్ కళలో ‘ఇంటిగ్లియో’ అనే నూతన ఒరవడి, పద్ధతులను తీసుకువచ్చిన గొప్ప కళాకారుడు ఆయన. ప్రపంచ వ్యాపితంగా ఎన్నో యూనివర్సిటిలలో, మ్యూజియంలలో ఆయన చిత్రాలు కొలువుతీరాయి. మాడర్న్ ఆర్ట్ గ్యాలరి ఢిల్లీలో, జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ ముంబాయి, కెజ్రివాల్ మ్యూజియం – చిత్రకళా పరిషత్, బెంగళూర్‌లో కొలువుతీరాయి ఆయన చిత్రాలు.
ప్రపంచ ఖ్యాతి చెందిన, మన తెలుగు కళాకారుడైన కృష్ణారెడ్డి ఆగస్టు 2018 సంవత్సరంలో చనిపోయారు. తాను బ్రతికినంత కాలం, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా తన కళా ప్రదర్శన నిర్వహించాలనే ప్రయత్నాలు ఎన్నో కారణాల మూలంగా ఫలించలేదు. తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచ కళామతల్లి కీర్తి శిఖరం పై ఆవిష్కరించిన మహనీయుని కళాకృతులను తొలిసారిగా హైదరాబాద్‌లోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ, లలిత కళా కళాశాల (జెఎన్‌ఎఫ్‌ఎ)లో డిసెంబర్ 2018లో ప్రదర్శించడం జరిగింది. హైదరాబాద్ ఆర్ట్ సొసైటి, తెలంగాణ ఆర్టిస్టు ఫోరం, ఖారా ఫెస్టివల్, జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ ముంబాయి, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. అతి విలువైన చిత్రాలు ఇతర కళాకారులతో పాటు మన సాలార్‌జంగ్ మ్యూజియంలో ప్రదర్శించడం ద్వారా ఇక్కడి కళాభిమానులకు ఆయన చిత్రాలను చూసే అవకాశం కలుగుతుంది.