మన తెలంగాణ ప్రజా సంస్కృతికి ఘనమైన వారసత్వ చరిత్ర ఉన్నది. తెలంగాణ సాహిత్యం రాతి గుండెలను సైతం కరిగించీ రాగాలు ఆలపించగలదు. ఇక్కడ ఆటా, పాటా ప్రధానమైన సామూహిక రాగం. బాధైైనా, బరువైనా, సుఖమైనా, దుఃఖమైనా పాట ద్వారానే వ్యక్తం చేస్తూ సామూహికంగా జీవించే సాంప్రదాయం కలిగినది మన తెలంగాణ ప్రజలు సానబట్టిన వజ్రం కన్నా పదునైన పాటలు పాడగలరు. అందుకే ఆంధ్ర వలసవాదుల పెత్తనాన్ని, వారి దోపిడి నుండి విముక్తిగావించేందుకు ఆటా, పాటా ప్రధాన భూమిక పోషించినది. ఫిరంగి గుండ్ల కన్నా వేగంతో ఆ పాట అరవై ఏండ్ల నాటి కోటలను పునాదులతో సహా పెకిలించి వేసింది. బానిస నిలువరించి విముక్తి గీతం ఆలపించింది.
సమైక్యాంధ్రలో కవులు, కళాకారులు వివక్షకు గురయినారు. ఇక్కడ గ్రామీణ జానపద కళారూపాలు అనేకం ఉన్నప్పటికీ వాటికి ప్రాముఖ్యం ఇవ్వలేదు సరికదా కళాకారులు కూడా సరియైన గుర్తింపునకు నోచుకోలేదు. ఉద్ధేశ్యపూర్వకంగానే వెనక్కి నెట్టివేయబడ్డారు. గుర్తింపును నోచుకోని కళాకారులు కళాతృష్ణపై మక్కువను చంపుకోలేక అప్రయత్నపూర్వకంగా తమ కళలను తామే పోషించుకున్నారు. అనేక అవమానాలకు గురికాబడ్డారు. గొప్ప కళాకారులు ఉన్నప్పటికీ వారి కళా ప్రదర్శనలకు అవకాశం లేకుండా వారిని దుఃఖపెట్టారు. తమ కళా ప్రదర్శనలు ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం కోసం ఎదురుచూస్తూ కాలం గడిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
తెలుగు కళాకారులూ, కళా ప్రదర్శనలు అంటేనే ఆంధ్ర కళాకారులని చెప్పే దుస్థితికి నెట్టివేయబడ్డారు. నిన్నటి వరకు రవీంద్రభారతి మెట్లు ఎక్కని కళాకారులు వేలాది మంది ఉన్నారు. పక్షపాతంగా ప్రభుత్వం కూడా తెలంగాణ సాహితీ, సాంస్కృతిక సంస్థల పట్ల వివక్షను చూపడం జరిగింది. భిన్నమైన వైవిధ్యభరితమయిన కళలు ప్రతి పల్లెలో మనకు కనిపిస్తాయి. వాటి కోసమే జీవిస్తున్న కళాకారులు గుంపులు గుంపులుగా నేటికీ సరైన ఆదరణ లేకుండా గ్రామాలలో జీవిస్తున్నారు. వారికి గుర్తింపును ఇచ్చి వారి వారసత్వ సంపదను జాతికి అంకితం చేయాలనే ఆలోచనే వారు మరిచిపోయారు. ఇక్కడి గత చరిత్రను తమ కళల సాహిత్య సంస్కృతిని కాపాడుతున్న కళాకారులను రక్షించు కోవలసినటువంటి బాధ్యతను ఉమ్మడి ప్రభుత్వం మరిచిపోయింది.
కళాకారులను గుండెలకు హత్తుకున్న ముఖ్యమంత్రి :
తెలంగాణ రాష్ట్ర చరిత్రను, పురాణ ఇతిహాసాలకు సాక్షీభూతంగా నిలిచిన కళాకారులను సాదుకొని వారికి సరియైనటువంటి గుర్తింపును ఇవ్వాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వాలకు, పాలనకు ప్రతిబింబాలుగా కళలు దర్పణంలాగా పని చేస్తాయి. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసినటువంటి ఆటా, పాటలకు ప్రభుత్వం పట్టం కట్టాలనే దృఢ సంకల్పంతో ఉంది. కళాకారులకు సముచిత స్థానాన్ని కలిపించాలనే సంకల్పంతో పని చేసేందుకు పూనుకున్నది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానంగా కళాకారులు పని చేయాలనే సదుద్దేశ్యంతో తెలంగాణ సాంస్కృతిక సారధి అనే ప్రభుత్వరంగ స్వతంత్ర సంస్థని ఒక వారధిగా ఏర్పాటు చేయలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జూన్ 19, 2015న ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో 550 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వారిని అక్కున చేర్చుకున్నారు.
కవులు, కళాకారులను గౌరవించిన విజయనగర సామ్రాజ్యాన్ని స్వర్ణ యుగంగా చరిత్రలో కీర్తించుకుంటున్నాము. ఆనాటి రచయితలను, కళాకారులను అంబారి మీద ఊరేగించి గండ పెండేరాలను తొడిగి గౌరవించిన ఖ్యాతిని విన్నాము. కానీ, నేటి మన ముఖ్యమంత్రి కడు బీద కళాకారులను చేరదీసి వారికి సరియైన గుర్తింపుగా ఉద్యోగాలను ఇచ్చి వారి కుటుంబాలలో వెలుగులు నింపారు. కవులను, కళాకారులను ఉన్నత శిఖరాలకు ఎత్తి ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు ఇంతకు ముందు చేయనటువంటి గొప్ప కార్యాన్ని చేశారు. ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ప్రభుత్వంలో వారిని భాగస్వామ్యం చేసేందుకు సాహసం చేశారు.
కళాకారులను అవసరాలకు వాడుకున్న ప్రభుత్వాలను గతంలో చూశాము. కొద్దో, గొప్పో వారికి ఆర్థిక సహాయం చేసిన వారిని చూశాం. కానీ, స్వయంగా కళా పిపాసకులయిన మన ముఖ్యమంత్రి గారు ఒకే ఒక్క నిర్ణయంతో చరిత్రలో నిలిచిపోయే ‘తెలంగాణ సాంస్కృతిక సారధి’ అనే సాంస్కృతిక సంస్థను నెలకొల్పి ఆ సంస్థ ద్వారా కళా ఖండాలను నిర్మించాలనే ఆయన కాంక్షకు, అభిలాషకు తగ్గట్టుగా ఈ రంగాన్ని ముందుకు తీసుకుపోతున్నారు.
ఉద్యమ స్ఫూర్తితో ఈ కళాకారులు ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమ ఆట పాటల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి లబ్ధిదారుడికి ఆ ఫలాలను అందే విధంగా కళాకారులు తమ బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఈ తెలంగాణ సాంస్కృతిక సారధి ఈ సంవత్సర కాలంలో చేసిన కృషి అమోఘం. ప్రభుత్వ పథకాల లబ్దిని ప్రజలకు అందించటమే లక్ష్యంగా పెట్టుకొని బంగారు తెలంగాణ దిశగా కళాకారులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. అశేష ప్రజలను ప్రభుత్వంలో భాగస్వాములను చేసేందుకై కళాకారులు కంకణబద్ధులై నిత్యం గ్రామాలలో ఉంటూ పని చేస్తున్నారు.
ప్ర్రచారం చేసిన సంక్షేమ పథకాలు :
తెలంగాణ సాంస్కృతిక సారధి కళా కారులు ప్రభుత్వం చేపట్టిన పథకాలను తమ కళారూపాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ (వాటర్ గ్రిడ్), హరిత హారం, హాస్టళ్ళకు సన్న బియ్యం, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా, వికలాంగుల ఫింఛన్, షీ టీమ్స్, గ్రామ జ్యోతి, డబుల్ బెడ్ రూం, నిరంతర విద్యుత్, ఇంకుడు గుంతలు, రోడ్ల భద్రత, తల్లి పాల వారోత్సవాలు మొదలగు వాటిని విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. వీటితో పాటు స్వచ్ఛ హైదరాబాద్, బతుకమ్మ సంబురాలు, బోనాల జాతర, అవినీతి నిరోధక వారోత్సవాలు, గోదావరి పుష్కరాలు, వలసల నివారణ-ప్రభుత్వ ధ్యేయం, సమ్మక్క సారక్క జాతర, కళారాధన, రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా ప్రత్యేక కళారూపాలు రూపొందించి, ఘనంగా నిర్వహించడం జరిగింది.
రూపొందించిన పాటల సీ.డీ.లు :
తెలంగాణలో విశ్వ నగరంగా విలసిల్లుతున్న హైదరాబాద్ నగర వారసత్వ చరిత్రను ప్రతిబింభించే విధంగా స్వచ్ఛ హైదరాబాద్ పేరిట, రాష్ట్రంలో పసిడి పంటలను పండించేందుకు ”హరిత హరం”, ప్రపంచంలో ఎక్కడ లేని పూలను గౌరవించే సాంప్రదాయం కలిగిన తెలంగాణ జాతి పూల పండుగపై ”బతుకమ్మ సంబురాలు”, తెలంగాణ సంస్కృతిలో భాగమైన ఇక్కడి ప్రాంతీయ దేవతలను కొలిచి, మొక్కులు తీర్చుకునే లష్కర్ పండుగ ”బోనాల జాతర”, తెలంగాణలో ప్రవహించే పవిత్ర గోదావరి నదీమ తల్లిని కొలిచే ”గోదావరి పుష్కరాలు” ఇత్యాదిపై తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పాటల సీ.డీ.లను రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ పాటల సీడిలు ప్రజాదరణ పొందాయి.
ఖండాలు దాటిన కళాకారులు :
తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో మన సంస్కృతీ, సాంప్రదాయాలను కొనియాడుతూ పలు ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా బతుకమ్మ వేడుకలకు ఢిల్లీలో ఇచ్చినటువంటి ప్రదర్శన అక్కడి తెలుగు వారినే కాకుండా ప్రముఖుల మన్ననలను పొందింది. అంతర్జాతీయ హస్తకళా ప్రదర్శన జరిగిన హర్యానా లోని సూరజ్‌కుండ్‌లో 15 రోజుల పాటు తెలంగాణ సాంస్కృతిక సారధి నుండి 40 మంది కళాకారులు పాల్గొని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించి అక్కడి వారిని మంత్రముగ్ధులను చేశారు. అంతే కాకుండా అమెరికా, దుబాయ్, బొంబాయి, కువైట్ తదితర దేశాలలో వారం రోజులపాటు ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రదర్శనల్ల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలను అనతి కాలంలోనే ప్రగతి పథంలో దూసుకుపోతున్న రాష్ట్ర అభివృద్ధిని చాటి చెప్పినటువంటి ప్రదర్శనలు అనేకం ఉన్నాయి.
తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ప్రదర్శిస్తున్న కళారూపాలు :
అమరవీరుల స్మృతి గీతం, తలపై గండ దీపాలను పెట్టుకొని మహిళలు చేసే నృత్యం, డప్పు కొట్టుకుంటూ మహిళలు విన్యాసాలు ప్రదర్శించటం, మన భాష, మన యాసలో కడుపుబ్బా నవ్వించే పిట్టల దొర సన్నివేశం, పురుషుల ఒగ్గు డోలు విన్యాసాలు, డీ.జే. మ్యూజిక్‌తో సరికొత్త కళారూపం, మహిళల చేత ప్రదర్శించబడే బంగారు తెలంగాణ సంక్షేమ పథకాల ఒగ్గు కథ, గ్రామీణులు పాడుకునే సంవాధ నృత్యాలు, బోనాలు, బతుకమ్మ పండుగలకు ప్రత్యేక వేషధారణలు, గిరిజన కళా సంపదయిన గోండు గుస్సాడి, కొమ్ము డోలు, లంబాడి మొదలగు గిరిజన నృత్యాలతో పాటు, ప్రజలు మెచ్చిన ప్రభుత్వం ‘బ్యాలే’, తదితర కళారూపాల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
కళాకారుల శిక్షణా శిబిరాలు :
తెలంగాణ సాంస్కృతిక సారధి ఏర్పడినప్పటి నుండి నేటి వరకు జరిగిన ప్రచార కార్యక్రమాలకు శిక్షణా శిబిరాలను నిర్వహించుకోవడం జరిగింది. మాదాపూర్‌లోని తెలంగాణ సాంస్కృతిక సారధి కార్యాలయంలో, నాంపల్లిలోని లలిత కళా తోరణంలో ఈ శిబిరాలను ఏర్పాటు చేసుకున్నాము. బతుకమ్మ సంబురాలను పురస్కరించుకొని ఢిల్లీలో జరిగినటువంటి బతుకమ్మ సంబురాలకు, బొంబాయిలో జరిగిన ఉత్సవాలకు, హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో జరిగిన జానపద ఉత్సవాలకు, దుబాయ్, కువైట్, అమెరికా, తదితర రాష్ట్రాలు, దేశాలలో జరిగిన కార్యక్రమాలకు గానూ వారం రోజులకు తగ్గకుండా 100 నుంచి 150 మంది వరకు ముఖ్య కళాకారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది.
పాటలు, నాటికలు రాసే రచయితలకు శిక్షణా శిబిరాలను నిర్వహించుకున్నాము. హరిత హారం, స్వచ్ఛ హైదరాబాద్, తల్లి పాల వారోత్సవాలు, గోదావరి పుష్కరాలు, అవినీతి నిరోధక వారోత్సవాలు, బతుకమ్మ సంబురాలు, బోనాల జాతర, సమ్మక్క సారక్క జాతర, కాళోజీ నారాయణ రావు జయంతి, ఈశ్వరీ బాయి జయంతి, బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, డా|| బి.ఆర్. అంబేడ్కర్ జయంతి, వర్థంతి, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, బతుకమ్మ సంబురాలు, బోనాల జాతర, గోదావరి పుష్కరాలకు తీసినటువంటి సీ.డీ.లకు పాటలు రాయడానికి 20 మందికి తగ్గకుండా రచయితలు వారం రోజుల పాటు తెలంగాణ సాంస్కృతిక సారది కార్యాలయంలో వర్క్ షాపు నిర్వహించుకోవడం జరిగింది.
మహిళా డప్పు బృందానికి, మహిళా కోలాట బృందానికి, బంగారు తెలంగాణ సంక్షేమ పథకాల మహిళా ఒగ్గు కథ బృందానికి, పురుషుల ఒగ్గు డోలు బృందానికి, మహిళల దీపాల నృత్యానికి, సంక్షేమ పథకాల బ్యాలే బృందానికి వారం రోజులకు తగ్గకుండా ఈ శిక్షణా శిబారాన్ని నిర్వహించుకోవడం జరిగింది.
భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళడమే లక్ష్యంగా తెలంగాణ సాంస్కృతిక సారధి సరికొత్త కళారూపాలను రూపొందించుటకు ప్రయత్ని స్తుంది. నేటి ఆధునిక యుగంలో వేదికలే కాకుండా షార్ట్ ఫిలింలు, లఘు నాటికలను వీడియో సీ.డీ.లుగా రూపొందించి ప్రజలను చైతన్యపరిచేందుకు కృషి చేయాలని సంకల్పిస్తున్నది.