magaసొంత శాటిలైట్‌ ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉందని రాష్ట్ర ఐటీ, భారీపరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఐటీ శాఖ సారథ్యంలోని సాఫ్ట్‌నెట్‌ను టీశాట్‌గా పేరుమార్చి విద్య, నిపుణ శాటిలైట్‌ చానళ్ళ ద్వారా నూతన సేవలను అందించే కార్యక్రమాన్ని ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. టీశాట్‌తో నడిచే విద్య, నిపుణ, చానెళ్ళ ద్వారా దూరవిద్య, వ్యవసాయ విస్తరణ, గ్రామీణాభివృద్ధి, టెలి మెడిసన్‌, ఈ-గవర్నెన్స్‌ గురించి ప్రసారం చేయనున్నట్లు వివరించారు. ‘శాటిలైట్‌ పరిజ్ఞానం ద్వారా ఈ రెండు చానళ్ళను ప్రసారం చేస్తున్నాం, ఇక్కడితో ఆగిపోదలచుకోలేదు భవిష్యత్తులో మాకంటూ ప్రత్యేక శాటిలైట్‌ తయారుచేసుకోవాలన్నదే మా లక్ష్యం, అవసరానికి అనుగుణంగా 10 నుంచి 12 ఛానళ్ళ ద్వారా ప్రభుత్వం మరింత చురుకుగా పనిచేయాలనుకుంటున్నదన్నారు.

ప్రభుత్వం తరఫున మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఛానళ్ళ ద్వారా విద్యార్థుల కోసం విద్యకు సంబంధించిన కార్యక్రమాలు, యువత వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా మెరుగైన కార్యక్రమాలు ప్రసారం చేయడానికి కృషి చేస్తుందన్నారు. కొత్త టెక్నాలజీ చెప్పిన ప్రతి సందర్భంలోను దీనివల్ల సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందని సీఎం కేసీఆర్‌ అడుగుతారన్నారు. అలా ఉపయోగపడని టెక్నాలజీ వృథా అనే సీఎం మాటలకు అనుగుణంగా ఐటీశాఖ పనిచేస్తున్నదన్నారు. టీశాట్‌లోని ఎస్‌ అంటే స్కిల్స్‌, ఏ అంటే అకాడమిక్స్‌, టీ అంటే టెక్నాలజీ/తెలంగాణ, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి అనే ఐదు ప్రధాన అంశాలను వివరించేందుకు ఈ విద్య, నిపుణ చానళ్ళు పనిచేస్తాయని చెప్పారు. గతంలో ఆర్వోటీల ద్వారా ప్రసారాలకు పరిమితమైన మన టీవిని ఇప్పుడు ఇంటింటికి చేరవేయడంలో సఫలీకృతమయ్యామన్నారు.

ఇస్రోతో ఒప్పందం చేసుకున్న అనంతరం వేగంగా ముందుకు సాగిస్తున్నామని తెలిపారు. మనటీవి పాఠ్యాంశా లను యూట్యూబ్‌లో చూసే వీక్షకులు 2016లో 10,233 ఉండగా, ఈ ఏడాది జులై నాటికి ఆ సంఖ్య కోటీ 27 లక్షల 16వేల 526కు చేరిందని మంత్రి కేటీఆర్‌ వివరించారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాకెట్లతో సామాన్యులకు మేలు చేసేలా రాష్ట్ర ఐటీశాఖ ముందడుగు వేయడం ప్రశంసనీయమన్నారు.

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సీ.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం ప్రత్యేక అంశాలుగా ఛానళ్ళు ప్రారంభించడం సంతోషకరమన్నారు. వైద్యరంగంలో కొన్ని అనవసర సర్జరీల విషయంలో అవగాహన కలిగి ఉంటే కొందరు వైద్యుల అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్‌, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ డైరెక్టర్‌ కృష్ణమూర్తి, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ జీ.కిషన్‌, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం, టీశాట్‌ సీఈవో శైలేష్‌రెడ్డి, మీసేవ కమిషనర్‌ జీటీ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Other Updates