రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా శేఖర్ ప్రసాద్ సింగ్ నియమితులయ్యారు. ఆయన జనవరి ఒకటవ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్‌లను మర్యాదపూర్వకంగా కలుసుకొని, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గత డిసెంబరులో నియమితులైన ప్రదీప్ చంద్ర పదవీకాలాన్ని పొడిగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం సమ్మతించక పోవడంతో ఆయన డిసెంబరు నెలాఖరులో పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి ఎస్పీసింగ్ ను ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.1983 బ్యాచ్ కు చెందిన ఎస్పీ సింగ్ 2018 జనవరి వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు ప్రయత్నిస్తానని సింగ్ తెలిపారు.