ఆధునిక వ్యవసాయ పద్ధతులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాదిలోనే పాలీహౌస్ పథకానికి అంకురార్పణ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అధికంగా డిమాండ్ ఉన్న కూరగాయలు, పూల సాగును పెంచి మార్కెట్ అవసరాలు తీర్చే విధంగా రైతులను ప్రోత్సహించేందుకు ఈ పథకానికి రూపకల్పన చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలోని రైతులకు పాలీహౌస్(హరిత పందిళ్లు) పథకాన్ని అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. ఈ పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు 75 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకం ద్వారా కనిష్టంగా 200 చదరపు మీటర్లు, గరిష్టంగా 12000 చదరపు మీటర్ల (3 ఎకరాలు) విస్తీర్ణంలో సాగుకు అయ్యే వ్యయానికి మాత్రమే ప్రభుత్వ సబ్సిడీ వర్తిస్తుంది. ముందుగా ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకున్న కంపెనీల నుంచి మాత్రమే రైతులు పాలీహౌస్‌ల నిర్మాణం చేపట్టవలసి ఉంటుంది. ఎకరం స్థలంలో పాలీహౌస్‌ల నిర్మాణం, మొక్కల సరఫరా ఇతర మౌలిక సదుపాయాల నిమిత్తం మొత్తం 33.60 లక్షలు ఖర్చవుతుండగా ఇందులో 75 శాతం అంటే 25.20 లక్షలు సబ్సిడీగా రైతులకు ప్రభుత్వం అందజేస్తోంది. ఈ పథకం ద్వారా ఎకరం విస్తీర్ణంలో సాగు చేయటానికి రైతు రూ.8. 4లక్షలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.
పథకం ముఖ్య లక్ష్యాలు:
పంటల దిగుబడి పెంపు.. అధిక ప్రాధాన్యత కలిగిన ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం.. ఏడాది పొడవునా కూరగాయల ఉత్పత్తి. ముఖ్యంగా సీజన్ ముగింపు (ఆఫ్ సీజన్)లో కూడా కూరగాయల ఉత్పత్తి జరపడం.. పంటలు రోగాల బారిన పడకుండా ఉండడంతో పాటు గ్రామాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడం ఈ పథకంలో గల ముఖ్య ప్రాధాన్యతలు.
రాష్ట్రంలో జోరందుకున్న పౌలీహౌస్ సాగు:
రాష్ట్రంలో పాలీహౌస్ సాగు వేగం పుంజుకుంటోంది. చాలా మంది పాలీహౌస్ రైతులు పూలు, కూరగాయలు సాగు చేస్తూ లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. ఉన్నతోద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలీహౌస్‌ల కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 50 శాతం మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పాలీహౌస్ నిర్మాణంపై మరే రాష్ట్రంలో లేని విధంగా 75 శాతం సబ్సిడీని ప్రకటించారు. దాని ఫలితంగా పాలీహౌస్‌ల నిర్మాణం రాష్ట్రంలో ఊపందుకుంది. 2014-15లో కొత్తగా 56 ఎకరాల్లో పాలీహౌస్ నిర్మాణం జరిగింది. 2015-16 ఏడాదికిగాను 245 ఎకరాల్లో 196 మంది రైతులకు అనుమతులు ఇచ్చారు. మొత్తం వెయ్యి ఎకరాల్లో పాలీహౌస్‌లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.250 కోట్లను కేటాయించగా ఇప్పటికే రూ.125 కోట్లు మంజూరయ్యాయి.
పంట మొత్తం ఖర్చు 75 శాతం 25 శాతం
(ఎకరం) లక్షల్లో రాయితీ(లక్షలు) రైతు వాటా (లక్షలు)
కూరగాయలు 5.6 4.2 1.4
గులాబీ 6.3 4.73 1.58
జెర్బెర 10.8 8.1 2.7
కార్నెసన్ 25.3 18.97 2.7
చామంతి 14.9 11.17 3.73
పాలీహౌస్ సబ్సిడీని మొత్తం మూడు దశల్లో అందజేస్తారు. మొదటి దశలో ఫౌండేషన్ వేసి, నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి వచ్చిన తర్వాత 35 శాతం, రెండో దశలో నిర్మాణం జరిగి, అధికారుల తనిఖీ పూర్తయిన తర్వాత 50 శాతం, థర్డ్ పార్టీ తనిఖీ తర్వాత ఆఖరు దశలో మిగిలిన 15 శాతం అందజేస్తారు.
అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2.27 లక్షల హెక్టార్లలో ఏడాదికి 37 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయల ఉత్పత్తి జరుగుతోంది. రాష్ట్ర అవసరాల్లో ఇవి కేవలం 15 శాతం మాత్రమే. మిగిలిన కూరగాయలన్నీ ఆంధ్రపదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. మార్కెట్‌లో తగినంత డిమాండ్ ఉన్నందున పాలీహౌస్ విధానంలో భారీగా కూరగాయలు, పూలసాగు చేయడం వల్ల రైతులకు భారీగా లాభాలకు దక్కే అవకాశముంది.
పాలీహౌస్ పట్ల రైతుల స్పందన:
రెండు ఎకరాల్లో క్యాప్సికం వేశాను. మంచి లాభాలున్నాయి. మార్కెట్‌కి పోకుండా మా దగ్గరే కాంటా పెట్టి అమ్ముతున్నాం. రవాణా ఖర్చు కూడా మిగిలింది. ప్రభుత్వ సబ్సిడీతోటే పాలీహౌస్ పెట్టుకున్న. ఇంకో రెండు ఎకరాలు పెంచాలనే ఆలోచనలో ఉన్నా
– బి.శ్రీనివాస్, రైతు, ఇబ్రహీంబాద్, మెదక్ జిల్లా.
నాకు మూడు ఎకరాలకు పాలీహౌస్ పథకం మంజూరైంది. టమాట, కీర సాగు చేద్దామనుకుంటున్నా.
– బొంగు రాంరెడ్డి, వరంగల్ జిల్లా.
నేను జర్బర పూలు సాగు చేస్తున్నాను. 2000 సంవత్సరం నుంచే పాలీహౌస్ సాగులో ఉన్నాను. పాలీహౌస్‌లను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం సబ్సిడీలు పెంచటం చాలా బాగుంది.
– సత్యనారాయణ, ఫరూక్‌్‌నగర్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా.