ప్రముఖ ఇంజనీరు, రాష్ట్రప్రభుత్వ నీటిపారుదల రంగ సలహాదారు ఆర్. విద్యాసాగర రావు ఏప్రిల్ 29న కన్నుమూ శారు. సాగునీటి రంగంపై అపారమైన అనుభవంగల విద్యాసాగర రావు ఉమ్మడి రాష్ట్రంలో జలవనరుల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయం, వివక్షలపై గళమెత్తారు. 2006 లోనే నీళ్ళు- నిజాలు పేరిట సంకలనం వెలువరించి ప్రజలకు వాస్తవాలను వెల్లడించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధప డుతున్న ఆయన హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
విద్యాసాగర రావు మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యాసాగర రావును కొద్దిరోజుల క్రితమే ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఆయన తిరిగి కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో విద్యాసాగర రావు మరణవార్త ముఖ్యమంత్రితో సహా పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఉద్యమ సమయంలో తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయంపై విద్యాసాగరరావు గణాంకాలతో సహా వివరాలు సేకరించి, ప్రజలకు అవగాహన కల్పించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ప్రాజెక్టులపై జరిగిన అన్యాయంపై ఆయన చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యమైనదని సి.ఎం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి, వ్యక్తి గతంగా తనకు ఎప్పటికప్పుడు వివరాలు అంది స్తూ, సలహాలు ఇస్తూ ముందుకు నడిపారన్నారు. తెలం గాణ వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టుల రీ డిజై నింగ్, నీటిపారుదల రంగంలో చేపట్టాల్సిన కార్య క్రమాల రూపకల్పనలో విద్యాసాగర రావు విశేష అనుభవం ఎంతో ఉపయోగపడిందని సీఎం పేర్కొన్నారు.
జయశంకర్ తర్వాత తెలంగాణ జాతికి దక్కిన మరో గొప్ప మహానుభావుడు విద్యాసాగర రావు అని కె.సి.ఆర్ కొనియాడారు. విద్యాసాగర రావు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు.