తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మెరుగుదల రోడ్ల నాణ్యతపైనే ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎక్కడ ఎలాంటి రహదారుల నిర్మాణం అవసరమో గుర్తించి దానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సీఎం సూచించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి, మరమ్మత్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూస్తూ అవసరం ప్రాతిపదికనే నిర్మాణాలు చేపడుతున్నామని సీఎం వెల్లడించారు.
ప్రమాద రహిత ప్రయాణమే లక్ష్యంగా అంతర్జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాలతో తెలంగాణలో రహదారుల వ్యవస్థను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో రహదారులు ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, రాబోయే పదేళ్ల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుత రహదారులు ఎలా ఉన్నాయి? ఎలా ఉండాలి? భవిష్యత్తులో మెరుగైన రహదారుల వ్యవస్థ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలేంటి? జాతీయ రహదారులుగా మార్చాల్సిన రూట్లు ఏవి? కేంద్ర పథకాల ద్వారా నిర్మించాల్సిన రోడ్లు ఎక్కడున్నాయి? ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకునేలా రహదారులను నిర్మించడం ఎలా? తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేసి, భవిష్యత్తుకు పనికొచ్చేలా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. మనిషి ప్రాణాలు అత్యంత విలువైనవి కాబట్టి ప్రమాద రహిత ప్రయాణానికి అనుగుణంగా రహదారుల వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం చెప్పారు. రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం అవలంభించే విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఉండాలని సీఎం సూచించారు.
క్యాంపు కార్యాలయంలో అక్టోబర్ 18న ఆర్ అండ్ బి రహదారులు, భవనాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, డాక్టర్ లక్ష్మారెడ్డి, ముఖ్య కార్యదర్శులు సి. నర్సింగ్ రావు, సునిల్ శర్మ, ఇ ఎన్ సిలు రవీందర్ రావు, గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మెరుగుదల రోడ్ల నాణ్యతపైనే ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎక్కడ ఎలాంటి రహదారుల నిర్మాణం అవసరమో గుర్తించి దానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సీఎం సూచించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి, మరమ్మత్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూస్తూ అవసరం ప్రాతిపదికనే నిర్మాణాలు చేపడుతున్నామని సీఎం వెల్లడించారు. కేంద్రం నుంచి కూడా దాదాపు 2500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను మంజూరు చేయించుకోగ లిగామని చెప్పారు.
జాతీయ రహదారులతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలతో నిర్మించే రహదారులు, రాష్ట్ర పరిధిలోని రహదారులన్నింటిని పరి గణలోకి తీసుకుని దానికి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగురోడ్ అవతలి నుంచి 330 కిలోమీటర్ల మేర రీజనల్ రింగు రోడ్డు (ఆర్.ఆర్.ఆర్.) నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని సీఎంసూచించారు. రెండేళ్లలో ఆర్.ఆర్.ఆర్. పనులు పూర్తి కావాలని, దీనికి కావాల్సిన కార్యాచరణ రూపొందించాలన్నారు. డిపిఆర్ లు సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారని, అవసరమైతే పనిని ఎక్కువ ప్యాకేజీలుగా విభజించి తక్కువ సమయంలో డిపిఆర్‌లు సిద్ధం చేయాలని చెప్పారు. డిపిఆర్ లు సిద్ధం అయిన వెంటనే భూసేకరణ జరిపి నిర్మాణం ప్రారంభించా లన్నారు. రహదారులు నిర్మించడమే కాకుండా అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వర్షం వస్తే రోడ్లు పాడయ్యే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోడ్లు త్వరగా చెడిపోకుండా ఉండేందుకు ఇతర దేశాల్లో అవలంభిస్తున్న ఆధునిక పద్ధతులను అధ్యయనం చేసి అమలు చేయాలని కోరారు. యూరప్, అమెరికా దేశాల్లో రోడ్లు బాగుంటాయని, అక్కడ రోడ్లు ఎలా వేస్తున్నారో తెలుసుకోవాలని చెప్పారు. రోడ్ల పక్కన పిచ్చిచెట్లు తొలగించాలని, ఎప్పటికప్పుడు సైడ్ బర్మ్స్ నిర్మించాలని వివరించారు.
జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఎక్కడెక్కడ ఆర్.ఓ.బి.లు, ఆర్.యు.బిలు, నదులు, కాల్వలపై బ్రిడ్జిలు, కాజ్ వేలు, రోడ్ అండర్ పాస్‌లు నిర్మించాలో గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, దశల వారీగా వాటిని నిర్మించుకునేందుకు విజన్ డాక్యుమెంటులో పొందు పరచాలని ఆదేశించారు. జాతీయ రహదారుల వెంట అవసరమైన చోట ఐలాండ్‌లు నిర్మించాలని, వాటిని చక్కగా నిర్వహించాలని సీఎం చెప్పారు.
రోడ్డు ప్రమాదాల వల్ల నిత్యం అనేక మంది చనిపోవడం కలచివేస్తున్నదని సీఎం అన్నారు. మలుపులు తగ్గించేందుకు రోడ్డును నేరుగా పునర్మించాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర రహదారులు పట్టణాలు, పెద్ద గ్రామాల గుండా వెళ్లకుండా బైపాస్ లు నిర్మించాలని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు. జాతీయ రహదారులుగా బదిలీ అయిన రాష్ట్ర రహదారుల నిర్వహణ పనులు కూడా ఆర్ అండ్ బి శాఖ చేపట్టాలని, జాతీయ రహదారుల నిర్మాణం జరిగే వరకు బాధ్యత తీసుకుని వెంటవెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు.