ramanareddyచిత్ర, శిల్ప కళలలేవైనా నాలుగు గోడల మధ్యనే ఉండిపోకుండా బహిరంగ ప్రదేశ్‌లలో ప్రదర్శనలు నిర్వహించి జనసమాజానికి కళలను చేరువచేసిన ప్రయోగశీలి రమణారెడ్డి. చిత్ర కారుడుగా, శిల్పిగానే కాకుండా ఈ మాధ్యమం బలమైంది కాబట్టి, ఏ కళాప్రక్రియకైనా సమకాలీన సాంస్కృతి, సామాజిక, రాజకీయ అంశాలను అనువుగా తీర్చిదిద్దడంలో కేవలం ఇతివృత్తి ప్రదాతగాను రమణారెడ్డి తన ప్రత్యేకతను చాటుకున్నారు. విశ్వజనీనతకు ప్రాధాన్యతనిస్తూ సృజనశీలంతో డిజైన్‌లు రూపొందించడంలోనూ రమణారెడ్డి చేయితిరిగినవాడు.

ఇటీవలి కాలంలో రమణారెడ్డి శిల్పిగా కన్నా కళాకారుల శిబిరాలు ఏర్పాటు చేయడంతో, వర్క్‌షాపులు నిర్వహించడంలో ఎక్కువ శ్రద్ద చూపుతున్నాడు.

” నిజానికి చిన్నారి పొన్నారి చిరుత కూకటి” నాటి మంచి చిత్రాలన్నా, శిల్పాలన్నా ఆయనకు ప్రాణం. పైగా జానపద చిత్రలేఖనంలో జగమెరిగిన ”రాజయ్య” ఆయనకు తొలినాళ్ళలో గురువు కావడం వల్ల బంగారానికి తావి అబ్బినట్టయింది. అయితే అందులో విశేషం ఏమిటంటే.. గురువేమో చిత్రకారుడు, శిశ్యుడేమో శిల్పిగా రూపుదిద్దుకోవడం. ఇది గురువు దూరదృష్టి, బోధనా వైవిధ్యం వల్లనే కాకుండా శిశ్యుడి సృజనాత్మకశీలం వల్ల, సాంకేతిక పరిజ్ఞాన కాంక్షవల్ల సాధ్యమైంది.

రమణారెడ్డికి కళారంగం పట్ల ఎంత ఆసక్తి ఉందో ఆయన తల్లిదండ్రులు – మాచెన్నగారి దయానందరెడ్డి – బాలామణికి తన కుమారుడు కళా ప్రపంచంలో పాదం పెట్టడం అంత ఆనసక్తిగా ఉండేది. ఫలితంగా తల్లిదండ్రుల మాటను ప్రక్కన పెట్టి, తమ ఇంటి గడప దాటి వెళ్ళిపోయాడు. లక్కడారం నుంచి లలితకళకు నెలవైన జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం లలితకళల కళాశాలలో చేరాడు.

చిన్నతనంలో రూపాయికి బ్రష్‌, రంగులు కొనుక్కొని రకరకాల చిత్రాలు గీయడంలో సాధనచేసిన రమణారెడ్డికి శిల్ప విభాగంలో సీటు లభించి 1991లో పట్టా పొందాడు. స్వర్ణ పతకం సాధించాడు. తన గురువు రాజయ్య గీసే బొమ్మల కంటే ఆయన వ్యక్తిత్వం, సతతం కష్టపడి పనిచేసే తీరులో స్ఫూర్తి పొందాడు.

బరోడాలోని ఎం.ఎస్‌. విశ్వవిద్యాలయంలో ఎం.ఎఫ్‌.ఎ.లో 1991లో చేరాడు. ఎనిమిది మాసాల్లోనే భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి సౌజన్యంతో జర్మనీకి వెళ్లి చదువుకోవడానికి అవకాశం లభించడంతో ఇక్కడి చదువుకు స్వస్తి వాచకం చెప్పాడు.

అయితే హాస్టల్‌లో తన జీవితాన్ని సాగించడానికి విద్యార్థిగానే ఎన్నెన్నో శిల్పాలను రూపొందించి, వాటిని విక్రయించి, తన చదువు సంధ్యలో కొనసాగించాడు. ఇలా తన కళాశాల విద్య సాగుతుండగానే తనదైన బాణీని రూపొందించుకొని కాగితం గుజ్జుతో కమనీయమైన బొమ్మలెన్నో చేశాడు. ఆ తర్వాత ‘టెక్రోటా’ ఎందరో బిడ్డలకు జన్మనిచ్చే తల్లిని ప్రతిబింబిస్తూ ఆమె విగ్రహం చేశాడు. పిదప ఫైబర్‌తోను ‘స్త్రీ’ని వస్తువుగా తీసుకొని తీరైన శిల్పాలు చెక్కాడు. అంగసౌష్టవం, కాంపోజిషన్‌ మాత్రమే కాకుండా వాటిని మించిన కళాత్మకత ఆ శిల్పంలో ద్యోతకం చేశాడు.

ఇవికాకుండా ‘దారువు’తో పది పన్నెండు భంగిమలతో ‘స్త్రీ’ మూర్తులను నైరూప్య పద్దతిలో చెక్కాడు. ‘నల్లరాయి’తో నాలుగైదు శిల్పాలు, ‘పాలరాయితో పడతి’ శిల్పం చెక్కాడు. లోహపు పోతతో, తీగలతో సైతం పలువురి మూర్తులను రూపొందించాడు.

ఇంత నేపథ్యంలో జర్మనీకి వెళ్ళిన రమణారెడ్డి 1992లోనే ప్రయోగం చేస్తూ ఓపెన్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌తో ప్రారంభించి, అక్కడే వ్యూయండార్ష్‌ గ్యాలరీలో, టౌన్‌ హాల్‌లో జరిగిన సమష్టి కళాప్రదర్శనలో పాల్గొని తన ఉనికిని చాటాడు.

అనంతరం 1994 నాటికి జన్మనీలోని ఫోర్ట్‌ ఎస్సెల్స్‌బర్గ్‌, మామింగెన్‌లోని హాఫ్‌ గ్యాలరీలో, రైల్వే స్టేషన్‌లో వ్యష్టి కళాప్రదర్శనలు ఏర్పాటు చేశాడు.

1990లో హైదరాబాద్‌ని ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో, మామింగ్‌జెన్‌ ఆంటోనియర్‌ హౌజ్‌లో, 2000లో బెర్లిన్‌లోని టాగోర్‌ సెంటర్‌లో, 2001లో ఆస్ట్రేలియాలో కాన బెర్రా స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో, మ్యూసాల్‌లోని గోటి బవారియాలోను కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. 2002లో మ్యూసావ్‌లోని గ్యాలరీ గోధె 53లో, ఆస్ట్రేలియాలోని మెస్సీ జంత్రంలో, ఫ్రీబర్గ్‌లోని గోధె ఇనిస్టూట్‌లో, జర్మనీలోని కుత్‌తూర్‌ ఫోర్డర్‌ క్రిస్‌లో, కున్‌స్థల్లీ – జమ్లెన్‌లో నిర్వహించాడు. 2003లో మ్యూసాద్‌లోని ఇండియన్‌ కన్సులేట్‌లో, బెంగళూరులోని చిత్రకళా పరిషత్‌లో జరిగాయి. 2004-05లో రెండుసార్లు మ్యూనిద్‌లోని గ్యాలరీ మల్లర్‌ అండ్‌ ప్లేట్‌లో, ”హైదరాబాద్‌-మ్యూసాద్‌” అనే అంశంపై వ్యష్టి కళాప్రదర్శనలు నిర్వహించాడు.

ఇట్లా ప్రదర్శనల పరంపర కొన సాగిస్తూనే కళాశిబిరాల్లో పాల్గొనడం, ఏర్పాటు చేయడం ప్రస్తుతం వీరు చేస్తున్నారు. 1985లో సిద్దిపేట లలిత కళా సమితిలో నిర్వహించిన కళాశిబిరంతో ప్రారంభించి దేశంలోని పలు నగరాల్లో, జర్మనీ లాంటి విదేశాల్లోను కనీసం ఇరవై శిబిరాలు నిర్వహించారు. ఇదే విధంగా శిల్పాలకు సంబంధించిన వర్క్‌షాపులు సైతం ఇరవై దాకా దేశంలోని నగరాల్లో, జర్మనీలో విజయవంతం చేశాడు.

ఢిల్లీలో జనవరి 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అలంకరణ శకటంగా రాష్ట్ర ప్రభుత్వ శకటం సుమారు పుష్కర కాలంగా ఎంపిక కాలేదు. గత యేడాది కొత్తగా తెలంగాణ ప్రభుత్వం అవతరించిన తర్వాత రమణారెడ్డి రూపకల్పన చేసిన ” బోనాల పండుగ” ప్రతిబింబించిన అలంకరణ శకటం ఎంపిక కావడం విశేషం.

ఇంకా వీరు రూపొందించిన శిల్పాలు నోవాటెలో డిజిటల్‌ టెకో, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం లాంటి చోట్లనే కాకుండా జర్మనీ, జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఎన్నో ఉన్నాయి. పార్క్‌హయత్‌లో ఆయన చేసిన కుడ్య చిత్రం ఉంది. సిద్దిపేటలో దీక్ష శిబిరం స్థూపం ఈయన రూపకల్పనే. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈయన కన్సల్‌టెంట్‌. ప్రస్తుతం ఆర్ట్స్‌ సొసైటీ అధ్యక్షులుగాను ఉన్నారు. ఎప్పటికప్పుడు కొంగొత్త సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రయోగాలకు ప్రాధన్యతనిస్తూ రమణారెడ్డి రూపకల్పన చేసే సృజనాత్మక శిల్పాలు కన్నులవిందు చేసే ఆలోచనాత్మక పుంతలు.

Other Updates