తెలుగు పత్రికలు ప్రసార మాద్యమాల భాషా స్వరూపం
తెలుగులో గత పాతిక సంవత్సరాల కాల వ్యవధిలో ప్రసార మాధ్యమాలు అనూహ్యస్థాయిలో విస్తరించాయి. ఒకనాడు గ్రామ సీమల్లో ఒకటి రెండు దినపత్రికలు మాత్రమే కనబడేవి. ఇపుడు వాటి సంఖ్య డజన్లకు చేరుకున్నది. 1990ల ఆరంభంనాటికి తెలుగు వీక్షకులకు దూరదర్శన్ ప్రసారాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇపుడు వివిధ ఛానళ్ళు, వాటి విస్తృతి ఏ స్థాయిలో ఉందో వివరించవలసిన పనిలేదు. ఇంటర్నెట్‌వంటి సమాచార వాహికలు అనూహ్య స్థాయిలో ప్రచారాన్ని పొందాయి. నాటికీ నేటికీ పోలికలు లేనేలేవు. అయితే పత్రికలు-ప్రసార మాధ్యమాలు విస్తరించినస్థాయిలో వాటికి సంబంధించిన వాజ్మయం పెరుగుతోందా? ఇది సందేహమే. ఈ రంగంపై కొంతమంది మాత్రమే కృషి చేస్తున్న సంగతి సత్యం. నిజానికి పత్రికలు ప్రసార మాధ్యమాల తీరుతెన్నులు, ప్రధానంగా వాటిలో వినిమయమవుతున్న భాషను గురించి నిరంతర సమీక్షలు జరగాలి. విశ్లేషణలు కొనసాగాలి. ఇటువంటివి విస్తృతంగా గ్రంథ రూపంలోకి వస్తే సమకాలీన ప్రసార జగతికి ఎంతో ప్రయోజనకరం అవుతుంది అంతే కాదు; భవిష్యత్తులో ఈ రంగాల్లో రాణించాలనుకునేవారికి సైతం మార్గదర్శనం దొరుకుతుంది. ఇటువంటి ప్రయత్నమే తెలంగాణ సారస్వత పరిషత్తు వేదికగా ఇటీవల జరిగింది. ఇదొక అభినందనీయమైన ప్రయత్నం. ‘తెలుగు పత్రికలు-ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం’ అనే అంశంపై పరిషత్తులో ఈ ఏడాది ఓ సదస్సు జరిగింది. సదస్సులో పత్రికా రంగ ప్రముఖులు, వర్థమాన పాత్రికేయులు సమర్పించిన పత్రాల్ని పుస్తక రూపంలో ప్రచురించారు. ఇటీవలి కాలంలో మీడియాపై తెలుగులో వెలువడిన మంచి పుస్తకాల్లో ఇది ఒకటి.
సీనియర్ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి ‘పట్టింపూ పట్టుదల ప్రధానం’ అంటూ రాసిన వ్యాసంలో ప్రస్తుత ప్రసార మాధ్యమాలలో భాష బలహీనపడేందుకు దోహదం చేసిన కారణాల్ని విశ్లేషించారు. భాషా వికాసానికి అవసరమైన చక్కని సూచనలూ ఈ వ్యాసంలో ఉన్నాయి. పత్రికలు-టెలివిజన్ ఛానళ్ళలోని భాషలో మౌలిక తారతమ్యాల్ని ‘ప్రసార మాధ్యమాలు-భాష’ అనే వ్యాసంలో జి. వెంకటరామయ్య సహేతుక రీతిలో వివరించారు. పత్రికల భాషా ప్రమాణాల ఎదుగుదలకు అవసరమైన ఆచరణాత్మక సూచనలు ‘పత్రికల పదసృష్టి’ అన్న గోవిందరాజు చక్రధర్ వ్యాసంలో దొరుకుతాయి. ‘ఉద్యోగంగా మారిన పాత్రికేయ వృత్తి’ అనే శీర్షికలో కె.ఎల్.రెడ్డి రాసిన వ్యాసం పత్రికలలో ఇప్పటి కొన్ని భాషా ధోరణుల్ని వాటిని మార్చుకోవలసిన అవసరాన్ని చెబుతోంది. ఇది ఎంతో చక్కని విశ్లేషణతో కూడుకున్నది. తెలుగు పత్రికలలో కనిపించే సూక్ష్మమైన భాషా దోషాల్ని గురించి సీనియర్ పత్రికా రచయిత టి. ఉడయవర్లు (తెలుగు పత్రికల భాష-తీరుతెన్నులు) వివరించారు. తెలుగు పత్రికల ద్వారా స్వరూపాన్ని చారిత్రక నేపథ్యం, వర్థమాన కోణాలతో డాక్టర్ జె. చెన్నయ్య పరిచయం చేశారు. భాషను పెంచుతున్నామా? దంచుతున్నామా? అంటూ డాక్టర్ రెంటాల జయదేవ రాసిన వ్యాసం పాత్రికేయులతోపాటు సామాన్య పాఠకులను కూడా ఆలోచింపజేస్తుంది. ‘తెలుగు దినపత్రికల శీర్షికల రచన-ఒక పరిశీలన’ అనే పగడాల చంద్రశేఖర్ వ్యాసం ఆసక్తికరంగా ఉంది.
ఇంకా ఈ వ్యాస సంకలనంలో ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియాలకు చెందిన పలువురి వ్యాసాలున్నాయి. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఆర్. అనంత పద్మనాభరావు, సీనియర్ జర్నలిస్టులు ఆర్. దిలీప్‌రెడ్డి, దోర్బల బాలశేఖరశర్మ, తోట భావనారాయణ, కోవెల సంతోష్‌కుమార్, రేడియో మాధ్యమంలో సుదీర్ఘ అనుబంధమున్న భండారు శ్రీనివాసరావు, వివిధ ఛానళ్లలో బాధ్యతలు నిర్వహిస్తున్న అమిర్నేని హరికృష్ణ, జి. బుచ్చన్న, వాడ్నాల చంద్రమౌళివంటి వారి వ్యాసాలున్నాయి. మీడియాలోని వివిధ సాధనాలలో పరిచయమున్న వీరు పత్రికలు, రేడియో, టెలివిజన్ మాధ్యమాల తీరుతెన్నులు గురించి చక్కగా తెలిపారు. అవసరమైన చోట్ల తమ స్వీయానుభవాల్నీ ప్రస్తావించారు.
‘భాష నిత్యచలన శీలంగా ఉన్నది. పత్రికలు-ప్రసార మాధ్యమాల్లోనే. అవసరార్థం ఎప్పటికప్పుడు కొత్త పదాలను కనిపెట్టి ప్రయోగిస్తున్నదీవారే. భాషా వినియోగం అన్న పుస్తకం సంపాదకులు డాక్టర్ చెన్నయ్య అభిప్రాయం వందశాతం సత్యం. భాషా ప్రయోగంలో అపసవ్య ధోరణుల్ని తగ్గించేందుకు దోహదపడే రీతిలో వ్యాస సంకలనాన్ని ప్రచురించిన సారస్వత పరిషత్తు చక్కని వాజ్మయ బాధ్యతను నిర్వహించిందని ప్రశంసించాలి.
(తెలుగు పత్రికలు ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం – వ్యాస సంకలనం, పుటలు 240, వెల : 100 రూపాయలు, ప్రతులకు : తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్‌రోడ్, హైదరాబాద్.)
-డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి