maga

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా ముగిసింది. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా పోలీస్‌ యంత్రాంగం డేగ కళ్లతో పర్యవేక్షించింది. పోలీసు యంత్రాంగంతో పాటు జిహెచ్‌ఎంసి, ఇతర ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. ప్రతి కదలికను పోలీసు ఉన్నతాధికారులు కమాండ్‌ కంట్రోల్‌ నిఘా నేత్రంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏమాత్రం సమస్య తలెత్తినా వెంటనే పోలీసులు అక్కడవాలిపోయి పరిష్కరిస్తూ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరగడానికి కృషిచేసిన పోలీసు సిబ్బందిని ప్రజలే కాకుండా ప్రభుత్వ పెద్దలు కూడా మెచ్చుకున్నారు.

పోలీస్‌ శాఖ

వినాయక చవితి పండుగ ముందు నుంచే పోలీస్‌ శాఖ సిబ్బంది విధులలో భాగంగా, ప్రతి స్టేషన్‌ పరిధిలో వినాయక మంటపాల ఏర్పాటు, నిర్వాహకుల వివరాలను సేకరించి ప్రతి రోజు పర్యవేక్షించారు.

నిమజ్జనం సాగే దారులలో సున్నిత ప్రాంతాలలో ఫొటొగ్రఫీ ఇన్వెస్టిగేషన్‌ కెమెరాలతో పాటు అత్యాధునిక ఫేస్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలను, వివిధ ప్రాంతాలలో మౌంటెడ్‌ పోలీసుల గస్తీ ఏర్పాటు చేయడం జరిగింది.

360 డిగ్రీల కోణం లో 5 కిలో మీటర్ల పరిధి ని కవర్‌ చేసే విధంగా 16 మెగా పిక్సెల్‌తో పి.టి.జెడ్‌ (ప్యాన్‌ టిల్ట్‌ జూమ్‌), 70 కిలోల బరువున్న జంబో కెమెరాతో ట్యాంక్‌ బండ్‌, ఎన్‌టిఆర్‌ మార్గ్‌ పరిసరాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌ ప్రాంతాలలో 15,000 సిసి టివి కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానించి అనునిత్యం పర్యవేక్షించారు.

నిమజ్జనం ఊరేగింపు దృశ్యాలను పరిశీలించేందుకు అధికారులు, సిబ్బంది తమ ట్యాబ్స్‌, సెల్‌ ఫోన్‌లలో ఎప్పటికపుడు చూసుకునేందుకు ”కాప్‌ యాప్‌” యాప్‌ తో అనుసంధానం చేశారు.

హైదరాబద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి లో విగ్రహాల సంఖ్య, ఎత్తు, మండపం అనుమతి తీసుకునే వారి వివరాలను అన్‌ లైన్‌ లో పొందుపరచడమే కాకుండా జియో ట్యాగ్‌ ద్వారా మండపం 50 మీటర్ల దూరంలో ఉండగానే హైదరాబాద్‌ ”కాప్‌ యాప్‌” ద్వారా కమాండ్‌ సెంటర్‌ లో వివరాలు ప్రత్యక్షంయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు.

క్యూ ఆర్‌ కోడ్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) బార్‌ కోడ్‌ ద్వారా పోలీస్‌ సిబ్బంది ట్యాబ్‌/ ఫోన్‌లో స్కాన్‌ చేయగానే విగ్రహం ఎత్తు, మండప నిర్వాహకులు వంటి వివరాలే కాకుండా నిమజ్జనం సమయంలో విగ్రహం ఎంత వరకు వచ్చింది, ఎపుడు నిమజ్జనం అవుతుంది వంటి వివరాలు కూడా ఆధునిక పరిజ్ఞానంతో పరిశీలించారు.

షీ టీమ్స్‌

నిమజ్జనం ఊరేగింపును తిలకించేందుకు మహిళలు, పిల్లలకు రక్షణగా షీ టీమ్స్‌ బృందాలు వివిధ ప్రాంతాలలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశాయి. పోకిరీల వెకిలి చేష్టలు, మహిళల పై పూలు, కాగితాలు విసరడం, నీళ్లు చల్లడం తో పాటు ఈలలు వేయడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, అనుసరించడం, తెలియకుండా చిత్రాలు తీయడం లాంటి వికృత చేష్టలను షీ టీమ్స్‌ రికార్డు చేసి 30 మందిని అదుపులోకి తీసుకొని, నిందితుల పై కేసులు నమోదు చేసి కోర్ట్‌కి అప్పగించి శిక్షపడేలా చేశారు. షీ టీమ్స్‌ చేసిన కృషిని మహిళలు అభినందిచారు.

నిరంతర పర్యవేక్షణ

నిమజ్జనం రోజున సాయంత్రం హోమ్‌ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తో పాటు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమీషనర్‌ ఎం. మహేందర్‌ రెడ్డి, లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డి జి అంజనీ కుమార్‌, జి హెచ్‌ ఏం సి కమీషనర్‌ జనార్దన్‌ రెడ్డి గణేష్‌ నిమజ్జనం శోభా యాత్ర ను ఏరియల్‌ సర్వే ద్వారా పర్యవేక్షించారు. అనంతరం సిటీ పోలీస్‌ కమీషనర్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుండి నిమజ్జనం యాత్రను పరిశీలించారు.

నిమజ్జనానికి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఏర్పాట్ల పై రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అనురాగ్‌ శర్మ ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు వివిధ రోజులలో విగ్రహాల తరలింపు పై అధికారులకు సూచనలు చేశారు. భద్రత ఏర్పాట్ల కోసం దాదాపు 27,000 మంది పోలీస్‌, పారా మిలిటరీ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం లోని సున్నితమైన ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకున్నారు. నిమజ్జనం ఏర్పాట్ల పై ఎప్పటికపుడు సమాచారం తీసుకోవడమే కాకుండా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ నుండి నగరంలో జరుగుతున్న నిమజ్జనాన్ని పర్యవేక్షించి పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన జరిపారు.

జి హెచ్‌ ఏం సి, ఇతర శాఖల పాత్ర

పోలీస్‌ శాఖ తరవాత నిమజ్జనం ప్రక్రియ లో కీలక పాత్ర వహించింది జి హెచ్‌ ఏం సి , వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని ఏర్పాట్లను సాఫీగా చేసేందుకు బృందాలుగా ఏర్పడడం జరిగింది. 2016 లో గంటకు 10 నుంచి 12 విగ్రహాలు నిమజ్జం అయ్యేవి, ఈ ఏడాది గంటకు 30 విగ్రహాలు నిమజ్జనం అయ్యే విధంగా క్రేన్లను క్విక్‌ రెస్పాన్స్‌ డివైస్‌తో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన హుక్కులను వాడారు. చిన్న విగ్రహాల నిమజ్జనం కోసం బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహాల నిమజ్జనం కోసం నెక్లెస్‌ రోడ్‌లోని ఎన్టీఆర్‌ మార్గ్‌లో 16, ట్యాంక్‌ బండ్‌ వద్ద 25, మినిస్టర్‌ రోడ్‌లో 3, రాజన్న బౌలి లో 3, మీరాలం చెరువులో 2 , ఎర్రకుంటలో 2 క్రేన్లను ఉపయోగించారు.

వివిధ ప్రాంతాల నుండి హుస్సేన్‌ సాగర్‌, ఇతర చెరువులకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసి 16 రూట్ల లో 500 ప్రత్యేక బస్సులను నడిపింది. నిమజ్జనం నిర్వహించే చెరువులు, ఊరేగింపు ప్రధాన మార్గాల్లో విద్యుత్‌ శాఖ అదనంగా విద్యుత్‌ ద్దీపాలను అమర్చింది. శోభా యాత్రలో పాల్గొన్న భక్తుల కోసం హెచ్‌ ఏం డి ఏ 109 మంచి నీటి కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిమజ్జనం సందర్భంగా వచ్చిన ప్రజలు, భక్తుల కోసం జి హెచ్‌ ఏం సి ఆధ్వర్యం లో 101 ప్రాంతాల్లో కౌంటర్లు, టెంట్లు, 30 లక్షల మంచి నీటి ప్యాకెట్ల ను సిద్ధం చేసింది. 168 ప్రత్యేక ”గణేష్‌ ఆక్షన్‌ టీమ్స్‌” ను ఏర్పాటు చేసి, ఈ బృందాలలో సానిటరీ సూపర్‌ వైజర్‌, సానిటరీ జవాన్‌, ముగ్గురు సానిటరీ ఫీల్డ్‌ అస్సిస్టెంట్లతో పాటు 21మంది వర్కర్స్‌ షిఫ్ట్‌ లో విధులు నిర్వహించి చెత్త, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించారు.

భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ్‌ కమిటీ

గణేష్‌ పండుగ, నిమజ్జనం ప్రశాంతంగా జరగడంలో ప్రభుత్వంతో పాటు భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ్‌ కమిటీ సభ్యులు, వాలంటీర్స్‌ కూడా సహకరించారు. గణేష్‌ వేదికల నమోదు మొదలుకొని నిమజ్జనం చేసేంతవరకు పూర్తి సహకారం అందించారు. ముఖ్యంగా ఖైరతాబాద్‌ గణేషుణ్ణి నిమజ్జనం చేసేందుకు ముందు రోజు నుండే ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. ఈ సంవత్సరం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన శోభా యాత్ర మధ్యాహ్నం 1 గంటకు బాలాపూర్‌ గణేష్‌ నిమజ్జనం సాయంత్రం 5. 50 గంటలకు పూర్తికావడం విశేషం.

పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా వచ్చే ఏడాది నుండి మట్టి వినాయకుణ్ణి ప్రతిష్టిస్తామని ఖైరతాబాద్‌ ఉత్సవ సమితి తెలిపింది.

పి . హర్ష భార్గవి

Other Updates