దక్షిణభారతదేశంలో 1967 ఎన్నికల్లో తోకచుక్క రాలింది. సినీ ‘ఉదయ భానుడు’ లేచాడు. ఈ ఎన్నికల్లో ద్రవిడ మునేట్ర కజగమ్ మద్రాసు రాష్ట్రంలో ఇరవైఏళ్ల కాంగ్రెస్ పాలనను అంతమొందించింది. ఆ పార్టీ నాయకుడు అన్నాదొరై రాష్ట్రంలో మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ పార్టీ ఎన్ని ముక్కలైనా కాంగ్రెస్‌కు రాష్ట్రంలో అధికారం దక్కనీయకుండా చేయగలిగింది.
అన్నాదొరై జస్టిస్ పార్టీలో ఉన్నప్పుడు రాజాజీ ప్రభుత్వం ఆయనను అనేకసార్లు అరెస్టు చేసింది. తనకు నిత్య విరోధి అయిన రాజాజీ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి స్వతంత్ర పార్టీ స్థాపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అన్నాదొరై స్వతంత్ర పార్టీతో చేతులు కలపడానికి వెనుకాడలేదు. మతపరంగా ఏర్పడిన ముస్లింలీగ్‌తో పొంతనను నిరాకరించలేదు. దేవుళ్లతో, గ్రహాలతో, అదృష్ట, దురదృష్టాలతో నమ్మకం పెట్టుకోరాదన్నది డి.ఎం.కె. మతం. అలాంటి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ‘అది భగవత్ సంకల్పం’ అన్నారు రాజాజీ. మంత్రివర్గ ప్రమాణస్వీకారానంతరం రాజాజీ ముందునిలబడి తలలువంచి ఆశీర్వదించమని డి.ఎం.కె. మంత్రులు అడిగితే ‘శుభం’ అని దీవించారు రాజాజీ. హిందీ వ్యతిరేకభావం డి.ఎం.కె. స్వతంత్రపార్టీలని అలా సన్నిహితం చేసింది.
అన్నాదొరై మహావక్త. ఆయన ఉపన్యాసం వినడానికి ప్రజలు టికెట్టుకొని వెళ్ళేవారు. అంతటి గొప్ప వ్యక్తి. అన్నామలై విశ్వవిద్యాలయం, డాక్టరేట్, డిగ్రీ, అమెరికాలోని యేల్ యూనివర్సిటీ ‘ఫెలోషిప్’ బహూకరించడం పెద్ద గొప్ప విషయమేమీకాదు. ఆయనకు తమిళభాషపై ఎనలేని అభిమానం. ‘నా భాషకు రెండువేల సంవత్సరాల చరిత్ర ఉంది. నా భాష మాధుర్యం మీకు తెలిస్తే దాన్ని మీరు జాతీయ భాషగా చేయడానికి వెనుకాడరు’ అని జబ్బచరిచి పార్లమెంటులో ప్రకటించిన ధీరుడు.
అన్నా పరిపాలనా దక్షుడు. కాంగ్రెస్‌ని దుయ్యబట్టడం ఒక్కటే తన కర్తవ్యంగా ఆయన భావించలేదు. అన్నాదొరై ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ కార్యాలయాల భవనాలపైన, వాహనాలపైన ఉన్న ఇంగ్లీషు బోర్డులను తొలగించి తమిళ బోర్డులను తగిలించింది. మంత్రులు చిన్నకార్లని ఉపయోగించాలని అన్నా ఆదేశించారు. మద్రాసు నగరంలో స్వంత ఇండ్లు ఉన్న మంత్రులకు ప్రభుత్వ గృహాల కేటాయింపు జరుగలేదు. మంత్రులు అయిదువందలు వేతనంగా మాత్రమే తీసుకునేవారు. ప్రపంచ తమిళ మహాసభలను జరిపించి అన్నా తమిళ భాష ఔన్నత్యాన్ని ప్రపంచం నలుదిశలకు చాటారు. మద్య నిషేధం విధించారు. ఆయన ప్రాంతీయాభిమానం వెర్రితలలు వేయలేదు. ఈనాటి ప్రాంతీయ నాయకులు ‘అన్నా’ను ఆదర్శంగా తీసుకోవాలి. అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ‘ఎన్ని విభేదాలున్నా బయట మేమంతా ఒక్కటే’ అని ప్రసంగించేవారు.
అన్నాదొరై పరిపాలన రెండు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. 1969 ఫిబ్రవరిలో ఆయన క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. ప్రాంతీయాభిమానం దేశ ప్రయోజనాలకు హాని కలిగించదని చెప్పిన మొదటి ప్రాంతీయాభిమానిగా అన్నాదొరై చరిత్రలో నిలిచిపోయారు.
జి. వెంకటరామారావు