సంకేపల్లి నాగేంద్రశర్మ
తెలుగు భాషకు
పట్టుగొమ్మ తెలంగాణా ప్రాంతం. ఈ విషయం పౌరాణికంగా, చారిత్రికంగా రుజువైంది. త్రిలింగ క్షేత్రాలుగా పిలువబడే కాళేశ్వర-ముక్తేశ్వర క్షేత్రం తెలంగాణాలోని పవిత్ర గోదావరి త్రివేణి సంగమ తీరంలో వుంది. తెలంగాణా ప్రాంతంలో శాతవాహన రాజుల కాలంలోనే తెలుగుభాష వాడుక భాషగా అమలులో వుండేదన్న విషయం క్రీ.పూ. 12 శతాబ్దాల నాటిదైన హాలుని గాధాసప్తశతి, బృహత్కథవంటి గ్రంథాలు నిరూపిస్తున్నాయి. ఇవి నాటి ప్రాకృతం, పైశాచీ భాషలో రాయబడినా ఇందులో పలు తెలుగు వ్యవహారిక భాషా పదాలున్నాయని, తెలుగు భాషా పరిశోధకులు తిరుమల రామచంద్ర నిరూపించారు.
తెలుగు భాషకి సుమారు 2వేల 5వందల సంవత్సరాల ఘన చరిత్ర వున్నట్లు విదితమవుతోంది. తమిళ సంగమ చరిత్రతో సమానంగా మన తెలుగుకి చరిత్ర వుంది. క్రీ.పూ. 4వందల ఏళ్లనుండే తెలుగు భాష తెలంగాణా ప్రాంతంలో వాడుకలో వుంది. ఇది ఎవ్వరూ ఖండించలేని విషయమే. తొలి శాతవాహన రాజులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం జగిత్యా జిల్లా కోటిలింగాల నుండే తమ తొలి పరిపాలనను ప్రారంభించినట్లు, ఇక్కడ 1978-80లో జరిగిన పురావస్తు తవ్వకాలు నిరూపించాయి. ధర్మపురికి చెందిన కీ.శే. సంగనభట్ల నరహరిశాస్త్రికి కోటిలింగాల గ్రామంలోని పొలాలలో దొరికిన దుబ్బనాణాలను సేకరించి, పురావస్తుశాఖ వారికి ఇవ్వగా వారు వాటిని పరిశీలించి, ఇవి శాతవాహన వంశస్థాపకుడైన చిముకుడివేకాక, మరికొన్ని నాణాలు పూర్వశాత వాహనులవి, మరికొన్ని మలి శాతవాహన రాజులవని తేల్చారు. శాతవాహన వంశస్థాపకుడైన శ్రీముఖుడు అనగా చిముకుడి నాణాలు భారతదేశంలోని ఒక్క కోటిలింగాలలో తప్ప మరెక్కడా దొరకలేదని పురావస్తు పండితులు అంటున్నారు. గుంటూరు జిల్లా ధాన్యకటకం, అమరావతిగా ఇన్నాళ్ళు శాతవాహన రాజుల తొలి పాలనగా చెప్పుకుంటున్న ఆంధ్రులకి, తొలి శాతవాహనులు తెలంగాణాలోని కోటిలింగానుండే ప్రారంభించి, అటు ఆంధ్రకి, తదుపరి మహారాష్ట్రలోని పైఠాన్‌కు, ఉత్తరోత్తరా ఉత్తర భారతానికి విస్తరించినట్లు తేల్చడంతో, తెలంగాణ చరిత్రలో తొలి శాతవాహనుల పాలన ఒక మలుపుతిప్పినట్లయింది.
తెలంగాణాలోని మూడున్నరకోట్ల మంది ప్రజలు మాట్లాడే తెలుగుభాషే స్వచ్ఛమైన తెలుగు భాషయని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఇటాలియన్ భాష లాగా తెలుగు భాష కూడా ఆంగ్ల భాషలోని అచ్చులతో ముగుస్తాయి. మన తెలుగుభాషలోని పదాలు అన్ని కూడా అచ్చులతో పూర్తవుతాయి. తూర్పు దేశాలలో ఇది ఒక్కటే అజంత భాషగా మిగిలింది. అందుకే తెలుగు భాషని అజంత భాషని మన భాషావేత్తలు అంటారు. మన దేశంలో ఎక్కువ శాతం మంది మాట్లాడే భాషలలో తెలుగు భాష మూడవ స్థానంలో వుంది. అలాగే ప్రపంచంలో 15వ స్థానంలో వుంది.
2001 జనాభా లెక్కల సమయంలో హిందీ తర్వాత దేశంలో మన తెలుగుభాషే ద్వితీయ భాషగా వుండేది. ఆ స్థానంలో బెంగాలీ వచ్చి చేరింది. తెలుగు ద్వితీయ భాషగా కొనసాగకపోవడానికి కారణం మన తెలుగువాళ్లే తాము మాట్లాడే భాష గూర్చి సరిగా తెలుపకపోవడమేనని, తెలుగుభాషా సమాఖ్య అధ్యక్షులు డా|| సామల రమేష్‌బాబు వ్యాఖ్యా నించారు. ఇప్పటికినీ హిందీ తర్వాత తెలుగే ద్వితీయస్థానంలో అనధికారికంగా కొనసాగుతున్నట్లే కాగలదని అంటున్నారు. దేశవ్యాప్తంగా నేకాక, ప్రపంచవ్యాప్తంగా, తెలుగుభాష మాట్లాడేవారు సుమారు 18 కోట్లమంది వుంటారని అంచనా. తెలుగు భాష మాట్లాడినప్పుడు మన శరీరంలో 72వేల నూర్యాన్లు యాక్టివేట్ అవుతాయట. మిగతా అన్ని భాషలకన్నా ఇదే ఎక్కువని సైంటిస్టులు నిర్ధారించారు. 2012లో ఇంటర్నేషనల్ అల్ఫాబేట్ అసోసియేషన్ వారిచే తెలుగుభాష ప్రపంచంలోకెల్లా రెండవ బెస్ట్ స్క్రిప్టుగా ఎన్నికైంది. మొదటి స్థానంలో కొరియన్ భాష నిలిచింది. పై వివరాన్నింటిని పరిశీలిస్తే, తెలంగాణాలో తెలుగు మాట్లాడడం గత రెండువేల సంవత్సరాలకుపైనుండే వున్నట్లు తగిన ఆధారాలతో స్పష్టమవుతోంది. ఇటీవల మద్రాస్ హైకోర్టులో తెలుగు ప్రాచీన భాష కాదని, తమిళమే ప్రాచీన భాషగా ప్రకటించాలని కోరుతూ, తమిళులు వేసిన వ్యాజ్యాలను మన తెలంగాణా రాష్ట్రమే తగిన సమర్థులైన న్యాయవాదులను నియమించి, తెలంగాణాలోని ప్రాచీన, చారిత్రిక ఆధారాలను హైకోర్టు ముందుంచి, ఈ కేసులో ఎట్టకేలకు విజయం సాధించింది. ఇందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణా సాంస్కృతిక శాఖ తీసుకున్న చొరవేనన్న ప్రశంసలు దక్కాయి. క్రీ.శ. 10వ శతాబ్దంలో రాయబడిన మహాభారతం తొలి తెలుగు కావ్యం కాదని, ఇది మూల సంస్కృత వ్యాసభారతానికి అనువాదమేనని, నన్నయ తెలుగు ఆదికవి కాదని తమిళులు యుక్తితో వాదించినపుడు, ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు చేతులెత్తేసి, తమ వాదనలనుండి తప్పుకున్నట్లు తెలిసింది. రెండవ పార్టీగా అప్పీలు చేసుకున్న, తెలంగాణా ప్రభుత్వం సమయస్ఫూర్తితో వ్యవహరించి ఈ న్యాయపరమైన చిక్కును తమ వాదనలతో గెలిపించింది. ఈ కేసు పరిష్కరింపజేసేలా కృషి చేసి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల తెలుగు భాషా ప్రియులను అలరింపజేసింది. తెలంగాణ ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించడంవల్లే, ఇది సాధ్యమైంది.
ఏది ఏమైనా తెలుగు, కన్నడం, ఒరియా,
మళయాళ, తమిళం, సంస్కృతంవంటి భాషలకి కేంద్రం ప్రాచీన హోదా ఇచ్చింది. ఎనిమిదేళ్లపాటు నడిచిన ఈ కోర్టు కేసు, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పరిష్కృతమైందన్న సత్యం ఎవ్వరూ మరువరాదు. ప్రస్తుతం ప్రపంచ తెలుగు మహాసభలకి వేదికగా నిలుస్తున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కి, నిర్వహణకు ముందుకు వస్తున్న తెలంగాణా ప్రభుత్వానికి ఈ సందర్భంగా అభినందనలు చెప్పి తీరాలి.
తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా రావడానికి, మద్రాస్ హైకోర్టులో వేసిన వ్యాజ్యంలో క్రీ.శ. 945 వేములవాడ చాళుక్యుల కాలంనాటి కురిక్యాల బొమ్మలమ్మగుట్ట శాసనంతోపాటు, కోటిలింగాల తొలిశాతవాహనుల కాలపు నాణాలు, శాసనాలు, ధూళికట్టబౌద్ధ స్థూపం, ఇక్కడి పలకల్లో లభించిన ఆధారాలు ముఖ్య భూమికను పోషించాయి. ఇవి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోవి కావడం ఉమ్మడి కరీంనగర్‌కే గర్వకారణం. 2008 అక్టోబర్ 31న తెలుగుతోసహా, కన్నడ భాషలకు ప్రాచీన హోదాను కట్టబెడుతూ తొలిసారిగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల అనంతరం యూపీఏ ప్రభుత్వం తమిళం,సంస్కృతానికి ప్రాచీన భాషా హోదాను కట్టబెడుతున్నట్లు మొట్టమొదటి సారిగా ప్రకటించింది. కొంతకాలానికి మళయాళానికి, ఒరియా భాషలకు కూడా కేంద్రం ప్రాచీన హోదాను కట్టబెట్టింది. ప్రస్తుతానికి జాతీయ భాషల్లో 22లో, ఆరు భాషలకి కేంద్రం ప్రాచీన హోదా కట్టబెట్టింది. ఇదే అదనుగా తీసుకున్న తమిళులు తమిళమే ప్రాచీన భాష హోదా కలిగి వుందని అంటూ, తెలుగుతోసహా ఇతర భాషలకు ఈ హోదా దక్కే అవకాశాలు లేవని ఛాలెంజ్ చేసింది. 2009లో మద్రాస్ హైకోర్టులో తెలుగుకి ప్రాచీన హోదాను కట్టబెట్టిన కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఒక రిట్ పిటీషన్‌ను ఆర్. గాంధీ అనే తమిళ న్యాయవాది దాఖలు చేశారు. దాదాపు ఎనిమిదేళ్లు నడిచిన ఈ కేసును 2016 ఆగస్టు 8న కొట్టివేయడంతో ఫుల్‌స్టాప్ పడింది. అంటే కేసు 7 ఏళ్ళు నడిచింది.
ఈ కేసు నడుస్తున్న కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌నుండి తెలంగాణ అధికారికంగా విడిపోయింది. 2014 జూన్ 2న, తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించింది. మద్రాసు హైకోర్టు వ్యాజ్యంలో తెలం గాణ ప్రభుత్వం ఏడాదిక్రితం తమ వంతుగా స్పెషల్ అఫిడవిట్ దాఖలు చేసి ఈవ్యాజ్యంలో వాదించడానికి ముందుకువచ్చింది. తెలంగాణా ప్రాంతంలో సుమారు వెయ్యేళ్లకు పూర్వం సాహిత్యం వర్ధిల్లిందని, ఇక్కడి శాసనాలు, పలు గ్రంథ రచనలు తెలుపుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. తాము సేకరించిన పలు ఆధారాల్ని హైకోర్టు ముందు వుంచింది. తెలంగాణాలో తెలుగు ప్రాచీన చరిత్ర మూలాలు, ప్రాచీన కవుల సాహిత్యం తగినంతగా వుందంటూ 2016, జూలై నెలలో మరో అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కేసును సరిగా పట్టించుకోకపోవడం, ప్రస్తుత విభక్త ఏపీ సర్కారు చేసిన వాదనలు నిలువక పోవడంవల్ల తెలుగుకు ప్రాచీన హోదా దక్కే విషయంలో తెలం గాణా ప్రభుత్వమే తన ముఖ్య భూమికను మరో మాటలో చెప్పాలంటే, హీరోయిజాన్ని పోషించి, ఎట్టకేలకు ఘనం విజయం సాధించింది.
10వ శతాబ్దం నాటి తెలుగు ఆదికవి నన్నయ్య రాసిన మహాభారతాన్ని అనువాద గ్రంథమని తమిళనాడు పిటీషనర్ వాదించారు. దీనివల్ల ఆంధ్రాకు ప్రాచీన భాషా హోదా విషయమై చేసిన వాదనలకు పసలేకుండా పోయింది. ప్రాచీన భాషా హోదాకు వెయ్యేళ్ళ సాహిత్య చరిత్ర వుండాలి. అరువు భాష (కొని తెచ్చుకున్న భాష) కాకుండా వుండాలి, 1500 సంవత్సరాల భాషా చరిత్ర కలిగి వుండాలి. సవరించిన ఈ నిబంధనలకు లోబడి వుంటేనే తెలుగుభాషకి ప్రాచీన హోదా దక్కుతుంది. ఈ రెండు అంశాలకు ఆధారంగా, పెద్దగా ఏపీనుండి తగిన స్పందన రాకవపోడం, చివరకు నోటీసులు ఇచ్చినా స్పందించక పోవడంతో, తెలంగాణా ప్రభుత్వం తరఫున మన న్యాయవాదులు నెరపిన వాదనలు తెలుగుకు ప్రాచీన భాషా హోదా రావడానికి సరైన ఆధారభూతాలుగా నిలిచాయి.
వేములవాడ చాళుక్యుల కాలంలో రెండవ అరిసకేసరి క్రీ.శ. 945లో కన్నడ ఆదికవియైన పంపకవి సోదరుడైన జైన మతాచార్యుడు, కవి జిన వల్లభుడు వేయించిన కురిక్యాల శాసనంలోని మూడు తెలుగు కందపద్యాలు, తెలంగాణ ఆదికవిగా పిలువబడుతున్న పాల్కురికి సోమన రాసిన రచనలు, ఇతర ప్రాచీన కవుల రచనలు, క్రీ.శ. మొదటి శతా బ్దంలో శాతవాహనుల కాలంనాటి కోటిలింగాల, ధూలికట్టబౌద్ధస్థూపం ప్రాంతంలో దొరికిన ప్రాచీన తెలుగు నాణాలను, లఘు, ఇతర శాసనాలను, ఇతర ఆధారాలను తెలంగాణా ప్రభుత్వం మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తుల ముందువుంచి, తన వాదనలు పక్కాగా సాగించి న్యాయమూర్తులను సంతృప్తి పరచగలిగింది. తెలుగు ఆదికవి 10వ శతాబ్దం రాజమహేంద్రవర నివాసి నన్నయకంటే వందేళ్లకు ముందే
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కుడిక్యాల బొమ్మలమ్మగుట్ట శాసనంలోని తెలుగు కంద పద్యాలు మూడు వున్నాయని రూఢిగా చూపించింది. ఆదికవిగా పిలువబడుతున్న నన్నయను వేంగీచాళుక్యాధీశుడు రాజరాజనరేంద్రుడు మహాభారతాన్ని తెలుగులో రాయమని కోరాడు. (వెయ్యేళ్ళ కరీంనగర్ జిల్లా సాహిత్యంపై కరీంనగర్ సాహితీవేత్త డా. మలయశ్రీ గత ఇరవై ఏళ్ళ కిందటే ఉస్మానియాలో పీహెచ్‌డీ చేసి, తన థీసిస్‌ను గ్రంథరూపంలో వేశాడు. అందులో కురిక్యాల శాసనంగూర్చి గొప్పగా చర్చించారు) ఇందుకు సంబంధించిన ఆధారప్రతులను అందజేసింది.
తెలంగాణా తెలుగు ప్రాచీన భాషా, సాంస్కృతిక వికాసాలకు నిలయమని తెలంగాణా ప్రభుత్వ వాదనలకు మద్రాస్ హైకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఇరువురు సంతృప్తి వ్యక్తం చేస్తూ, తమిళ పిటీషనర్, సీనియర్ న్యాయవాది ఆర్. గాంధీ 2009లో వేసిన పిటీషన్‌ను ఏకపక్షంగా కొట్టివేసింది. ఈ కేసులో తీర్పు ఇచ్చినవారు న్యాయశాస్త్ర రీత్యానేకాకుండా వ్యవహారరీత్యా భాషాదక్షతలు కలిగివున్న మేధావులు కావడం మనకు అనుకూలించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.కె. కౌల్, న్యాయమూర్తి ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
ఈ కేసు సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాచీన భాషా సాంస్కృతిక వికాసానికి స్ఫూర్తినిచ్చేలా వున్నాయి. ఇహముందు ఇలాంటి వివాదపు వ్యాజ్యాలకు తావులేకుండా న్యాయమూర్తుల వ్యాఖ్యలు వున్నాయని న్యాయనిపుణులు, భాషావేత్తలు భావిస్తున్నారు. తెలుగు ప్రాచీన భాషా హోదాపై తాము జోక్యం చేసుకోలేమని, ప్రాచీన హోదా నిబంధనలకు తెలుగుతోపాటు, ఇతర భాషలు తగిన అర్హత కలిగి ఉన్నాయని నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసిందని ధర్మాసనం ఎత్తిచూపుతూ వ్యాఖ్యానించింది. ప్రాచీన భాషా హోదాపై సవాల్ చేస్తూ పిటీషనర్ గాంధీ వేసిన పిటీషన్‌ను కొట్టివేస్తూ, వివిధ భాషలకు హోదా కల్పించే కేంద్రం నిర్ణయం విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ భాషలు ప్రాచీన భాషల అర్హతలకు నిబంధనలకు లోబడి వున్నాయని తాము భావిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఆ నిర్ధారణలు, వాస్తవాలను నిపుణుల కమిటీ తమ ముందు ఉంచిందని పేర్కొన్నది. వాటి పరిశీలనను చేపట్టాలని తాము అనుకోవడంలేదని పేర్కొంది. ప్రాచీన హోదా కల్పించిన ఇతర భాషలతో సమానంగా చూడడంవల్ల ప్రాచీన హోదా దక్కించుకున్న తమిళానికి ప్రాముఖ్యం తగ్గుతుందన్న పిటీషనర్ మొండి వాదనను ధర్మాసనం నిర్ధ్వంధంగా తిరస్కరించింది. ఒక భాషా ప్రాముఖ్యం ఇతర భాషల ఉత్థాన పతనాలపై ఆధారపడి వుంటుందని భావించడంలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. నిజానికి భాషాభివృద్ధి ఆ భాష ఉపయోగం, కళా, సాహిత్య రూపాల ద్వారా జరిగే సృజనాత్మకత కృషిపై ఆధారపడి వుంటుందని వ్యాఖ్యా నించింది. ఇలాంటి వ్యవహారాల్లో వాదోపవాదాలకు న్యాయస్థానాల్ని వేదికగా తీసుకోవాలని కోరడంలేదని ధర్మాసనం వివరణ ఇచ్చింది. పిటీషనర్‌కు ఈ కేసు విషయంలో ఇంకా సంతృప్తి కలగకపోతే సంబం ధిత కేంద్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించవచ్చునని సూచించింది.
తెలంగాణా ప్రభుత్వ వాదనల్లో ఉమ్మడి, ప్రస్తుత కరీంనగర్ జిల్లాకు చెందిన కుడిక్యాల గుట్టపైని బొమ్మలమ్మగుట్ట (కురిక్యాల) శాసనంతో పాటు, తొలి కోటిలింగాల శాతవాహనుల నాణాలు ఆధారభూతంగా నిలిచాయి. కరీంనగర్ జిల్లాలోని తొలి రాజధాని కోటిలింగాల శాతవాహనులకాలంలోనే క్రీ.శ.1వ శతాబ్దంలో, గుణాడ్యుడి బృహత్కథ, హాల చక్రవర్తి రాసిన గాధాసప్తశతివంటి కావ్యాలు రాయబడ్డాయి. ఇవి పైశాచీ, ప్రాకృతంవంటి ఆనాటి ప్రజల వాడుక భాషల్లో రాయబడ్డా, అనేక తెలుగు పదాలు ఇందులో వున్నట్లు మన సుప్రసిద్ధ భాషా పరిశోధకవేత్తలైన డా.తిరుమల రామచంద్రతోసహా, పలువురు ఆధారాలతో నిరూపించారు. భాషావేత్తలైన డా. భద్రిరాజు కృష్ణమూర్తి, డా. పుచ్చా పరబ్రహ్మ వాసుదేవశాస్త్రి, బూదరాజు రాధాక్రిష్ణ, నేలూటూరి వేంకటరమణయ్య, డా. వి.వి. కృష్ణశాస్త్రి, బి.ఎన్. శాస్త్రివంటి భాషా, చారిత్రిక వేత్తలు తెలుగు భాషా పూర్వాపరాలపై అనేక పరిశోధనలు చేసి, పలు వ్యాసాలు రాసిఉన్నారు. అంటే సుమారు రెండువేల ఏళ్ళ భాషా చరిత్ర తెలంగాణా తెలుగుకి సొంతమైపోయిందన్న విషయం, మద్రాసు హైకోర్టు కేసుల్లో స్పష్టమైపోయిందన్నమాట.