tsmagazine
ఆదిలాబాదు జిల్లాలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయస్థాయి ప్రమాణాల గుర్తింపు లభించింది. ఆదిలాబాదు జిల్లా అంటేనే మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలతో సతమతమయిన గిరిజన జిల్లాగా పేరుండేది. నేడు ఆనాటి చరిత్రను తిరగరాశారు. జిల్లాలోని వైద్య సిబ్బంది, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారం, ముఖ్యంగా అప్పటి జిల్లా కలెక్టర్‌ బుద్ధ ప్రకాశ్‌ యం. జ్యోతి మార్గదర్శకత్వంలో భీంపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గత సంవత్సరం, అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం ఇచ్చోడ, ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రస్తుత జిల్లా కలెక్టర్‌, దివ్యదేవరాజన్‌ నేతృత్వంలో జాతీయ గుర్తింపు రావడం జరిగింది.

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొదట వైద్యాధికారుల పోస్టులను, వైద్య సిబ్బందిని భర్తీ చేయడం, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించి, అక్కడి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగించే విధంగా సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, మెడికల్‌ క్యాంపులు నిర్వహించడం జరిగింది. అలాగే మారుమూల గ్రామాలకు 104, 108, అమ్మఒడి వాహనాల ద్వారా వైద్య సేవలు విస్తృత పరిచి, మెరుగైన వైద్యం అందించడంతో ఆయా ప్రాంత గిరిజన ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి వైద్య సేవలు పొంది వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. అంతేగాకుండా కేసీఆర్‌ కిట్‌ల పథకం ప్రారంభమయినప్పటినుండి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2016- 17లో 8896, 2017-18లో మార్చి వరకు 11,394 కాన్పులు జరిగాయి. వారందరికీ కేసీఆర్‌ కిట్‌లను అందించారు. ఇందులో ఆదిలాబాదు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలోనే నిలిచింది.
tsmagazine

జిల్లాలోని భీంపర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2017 సంవత్సరంలో 94 శాతం ర్యాంకు రాగా, 2018 సంవత్సరంలో ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 95, ఇంద్రవెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 87 ర్యాంకులు జాతీయ స్థాయి వైద్య ప్రమాణాల కమిటీ ప్రకటించింది. మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గుర్తింపు రావడం తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ జిల్లా మొట్ట మొదటిది.

భీంపూర్‌, ఇచ్చోడ, ఇంద్రవెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవుట్‌ పేషంట్స్‌, ఇన్‌ పేషంట్లకు మెరుగైన వైద్య సేవలు, వైద్య పరీక్షల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, కల్పించి రోజుకు 250 మందికిపైగా సేవలు అందించడం జరుగుతున్నవి. న్యూఢిల్లీలో భారత ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖమంత్రి అశ్విన్‌కుమార్‌ చౌహ్వీ చేతులమీదుగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డా|| రాజీవ్‌రాజ్‌, డిప్యూటీ వైద్య, ఆరోగ్యశాఖాధికారులు డా|| సాధన, డా|| వసంత్‌రావు, జిల్లా మలేరియా అధికారి డా|| ప్రభాకర్‌రెడ్డి అవార్డులు స్వీకరించారు.

యన్‌. భీమ్‌కుమార్‌, ఆదిలాబాద్‌

Other Updates