ennela-eluguఅన్నవరం దేవేందర్

పెద్దగై నాలుగు పైసలు సంపాయించే మనిషి మనసున పట్టాల్నంటే ఆయన నేపథ్యం ఎరుకుండాలె. ఎన్నికోట్లు సంపాదించినా ఎంటరావన్నది ఒక ఫిలాసఫి. అయితె ఆయన పుట్టి పెరిగి, తిరిగిన ఊరు, ఆలోచించిన తీరు మనసుకు ఎక్కిచ్చుకోవచ్చు.

‘ఊర్లల్ల పుట్టిన మనుషులకు సాటి మానవులపట్ల ప్రేమనేకాదు, పిల్లి, కుక్క, ఆవు, ఎద్దు ల్యాగాలపట్ల సుత ఇంత ప్రేమతోని ఉంటరు. అసలు పల్లెటూల్లల్ల పిల్లిలేని ఇల్లు ఉండది. వాడు పిల్లికె బిచ్చం ఎయ్యడు అంటం. ఆ పిసినాసివాళ్ల మనస్తత్వం గురించి చెప్పే ముచ్చట అది. ఇండ్లల్ల పిల్లులు మనసులతో పాటే ఉంటయి. కాళ్లల్ల కల్సే తిరుగుతయి. మనం తిన్నప్పుడే అవి తింటయి. పెరుగుపోసుకొని అన్నం తినే యాల్లకు వాసన నాసుపట్టి ఉరికివస్తయి పల్లెం సుట్టు తిరుగుతయి. తినేవాల్లు దానికో రెండు బుక్కలు పెట్టి తింటరు. పొద్దుగాల లేవంగనే పిల్లికి పాలుపోస్తరు.

పిల్లులపట్లనే కాదు, కుక్కల పట్ల ప్రేమ సుత మస్తుగుంటది. ఇంటికి ఒక కుక్క ఉంటది. దానికి రోజూ గట్క అన్నంపెట్టి సాదుకుంటరు. పట్నంల కుక్కల లెక్క కట్టేసి ఉంచరు. సాదుకం కుక్కలు ఎప్పుడు ఇల్లు వాకిలి కలె తిరుగుతయి. ఎవ్వలను ఏమనయి. కొత్త వాళ్లు వస్తే మాత్రం మొరుగుతయి. అవి బాయికాడికి పోతయి, వస్తయి కుటుంబంతోనే కల్సి ఉంటయి. ఇగ సంచార జాతుల వాళ్ల దగ్గర కనీసం 5, 6 కుక్కలు ఉంటయి. వాటన్నిటినీ వాళ్లు సాదుతరు. గొర్లుకాసే వాళ్ల దగ్గర కూడ మంద కావలిపోయేటప్పుడు కుక్కలను ఎంబడి పట్టుక పోతరు. కుక్క, తోడేలు వస్తే మొరుగుతయి. ఇండ్లళ్ల కుక్కలను సుత ఎక్కువగ అవి చేసే పనుల కన్న వాటిమీద ప్రేమతోనే సాదుకుంటరు.

ఊరు అంటేనే ప్రేమకు ప్రతిరూపం. కొందరి ఇండ్లడ్ల పిల్లులు పిల్లలను పెట్టిన తర్వాత 4,5 ఇండ్లకు తింపుతది. ఆ తర్వాత ఎవలి ఇంట్లనో సెటిల్‌ అయితది. జంతువులకు మనుషులపట్ల వాత్సల్యం కన్పిస్తది. కుక్కలు, పిల్లులను పెంచడమేకాదు. ఇండ్లల్ల దుడ్డెలు ల్యాగలు, కోడి పిల్లలకు కూడా ఇల్లు ఆసరా ఇస్తది. దుడ్డెలకు ఎన్నాద్రి పెడుతరు. ఎన్నాద్రి అంటే తొందరగా జీర్ణం అయ్యే ఆకులు ఇప్పటి పిల్లలకు ‘ఫారెక్స్‌’ అటువంటిది. చిన్నచిన్న దుడ్డెలకు ల్యాగలకు పిల్లలతోనే ఎన్నాద్రి ఆకులను మూతికి అందించి తినిపిస్తరు. పిల్లలకు, ఇతరులకు పెట్టడం, తినిపించడంవల్ల కలిగే ఆనందాన్ని పొందడం నేర్పిస్తరు అట్లనే తల్లికోడి వాకిట్ల తన పిల్లలను ఏసుకొని తిరుగుతది. దానికి ఇంట్లకేల్లి నూకలు తెచ్చిపోస్తరు. చిన్న కోడిపిల్లలు నూకలు మాత్రమే బుక్కుతయి.

అట్లనే ఇండ్లల్ల జాలర్ల దగ్గర కాకులు వస్తయి జాలారికాడ, చిక్కుడు తీగ కాడ, చెట్లమీద ఉండి బోల్లు తోముతుంటే పడే మెతుకులను ఏరుకుంటయి. ప్రత్యేకంగా వాటికోసం కూడా అన్నం మెతుకులను బండమీద పోస్తరు. ఎద్దు, ఎవసం కూడా అంటే పది మందికి సహాయకారిగా ఉండే విధానం అక్కడ రూపు దిద్దుకుంటుంది.

ఎవుసం అంటే ఎవసాయదారులు మాత్రమేకాదు, సకల చేతివృత్తులవాళ్లు కూడా, వ్యవసాయ అనుబంధ పనులవాళ్లే అందరితోని చెట్టుచేమ, పక్షులపట్ల ప్రేమతో పెరిగిన, కల్సి జీవించిన అనుభవంతో వ్యక్తిత్వం పెరుగుతది. సరిగ్గా అదే మనిషి వ్యక్తిత్వం పెరిగి, మనిషి మూర్తిమత్వంమీద ప్రభావం చూపెడుతది. పెద్దగా పెరిగినంక మనిషి ఎంత గొప్పవాడైనా ఆయన బూతదయ లేకుంటే దండుగ వాళ్ల మనస్తత్వమే కృత్రిమంగ కన్పిస్తది.

రోబోలాగ మనిషి ఉండకపోవడానికి కారణం ఆయన పెరిగిన వాతావరణమే ఉంటుంది. ఇవన్నీ ఎన్కట ఊర్లల్ల బాపమ్మలు, అమ్మమ్మలు, తాతల దగ్గర తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలకు ఉండె. కానీ ఇప్పటితరం వేరు పుట్టు పుట్టకతోనే ఇది నాది ఇది నీది ఎవలకు ఇయ్యద్దు, ఇది మనది మనం వాళ్లు అనే వాతావరణం సంపన్నులైన మెట్రో నగర కుటుంబాల్లో కన్పిస్తుంది. కనీసం పక్కపిల్లగానికి చాక్‌లెట్‌ కూడా ఇయ్యని స్వార్థం కొన్ని చోట్ల కన్పిస్తుంది. ఎందుకంటే ఆ బాల్యంలో ల్యాగదూడలకు ఎన్నాద్రి తినిపించిన జ్ఞాపకాలు లేవు ఆ బాల్యంలో కోడి పిల్లలకు నూకలు పోసిన గుర్తులు లేవు. ఆ బాల్యంలో పిల్లికి పెరుగన్నం పెట్టిన యాది లేదు. ఇవన్నీ చూసినతనం అవి తింటాంటే సంబురపడే తత్వం సైతం లేకపోవడం ఒకవిషాదం. అయితె ఇది కావాలని తెచ్చుకున్నది కావాలని పెంచుతున్నదీ కాదు. కాని ఎట్లనో ఆధునిక కాలంవల్ల వస్తున్నది.

ఊరు ఎద్దు, ఎవుసం, పిల్లి, కుక్క, పిల్లి, కోడి పిల్లలు ఆవులు, మ్యాకలు, చెట్లు, చేమలు వీటితో అనుబంధమే మనిషిని ఉన్నత మానవత్వం వ్యక్తిత్వం పెంపొందిస్తుంది.

Other Updates