తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మా సిటికి పెద్ద ఎత్తున అర్థిక సహాయం చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫార్మా సిటీని జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్ (చీIవ్గీ) గా సూత్రప్రాయంగా గుర్తించిన నేపథ్యంలో కేంద్రం, నిమ్జ్ పాలసీ మార్గదర్శకాల మేరకు ఆర్థిక సాయంతో పాటు ఇతర సౌకర్యాలను కూడా కల్పించాలని కేంద్ర మంత్రులకు రాసిన లేఖల్లో పేర్కొన్నారు.
ఈ మేరకు మౌలిక సదుపాయాల కల్పన కోసం గ్రాంట్ రూపంలో అర్థిక సహాయం ప్రకటించాలని కోరుతూ కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో పాటు, ఫార్మాసిటీకి అవసరమైన సహజ వాయువు (నాచురల్ గ్యాస్)ను ప్రిఫరెన్సియల్ టారిఫ్ ప్రాతిపదికన కేటాయించాల్సిందిగా కోరుతూ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరొక లేఖ వ్రాశారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద సమీకత ఫార్మా పార్క్ అని తెలిపిన కేటీఆర్, దేశంలోని ఫార్మా రంగ అభివద్ధికి ఈ పార్క్ దోహదం చేస్తుందని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా ఫార్మాసిటీని గుర్తించిందని తన లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు జాతీయ పెట్టుబడి, తయారీ జోన్ (NIMZ) గా సూత్రప్రాయంగా గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మా సిటీకి దేశీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల నుంచి మంచి స్పందన లభిస్తోందని, హైదరాబాద్ ఫార్మా సిటీ లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమ స్ఫూర్తి మేరకు హైదరాబాద్ ఫార్మాసిటీ అంతర్జాతీయ ఫార్మా రంగంలో భారతదేశం లీడర్ పొజిషన్ మరింత బలోపేతం చేస్తుందని, దేశీయ ఫార్మా తయారీ రంగానికి కీలకం అవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ సవివరంగా లేఖ రాశారు.
కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి పీయూక్ గోయల్ కు రాసిన లేఖలో, హైదరాబాద్ ఫార్మా సిటీ పురోగతిపైన వివరాలు అందించారు. హైదరాబాద్ ఫార్మాసిటీ జీరో లిక్విడ్ డిస్‌చార్జ్ (శూన్య ద్రవ వ్యర్దాల) పద్ధతిలో కాలుష్య రహితంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నట్లు తెలిపిన కేటీఆర్, ఫార్మాసిటీ ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ఫార్మా యూనివర్సిటీ, లాజిస్టిక్స్ పార్క్, ఫార్మా ట్రైయినింగ్, టెస్టింగ్ పరిశోధనాశాలలు, కామన్ డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ వంటి సౌకర్యాలతో పాటు ఫార్మా రంగంలోని స్టార్టప్‌లకు ప్రత్యేక హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మొత్తం 19,333 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ పూర్తయిందని మొదటి దశలో భాగంగా 8,400 ఎకరాలకు డిటైల్డ్ డిజైన్లు కూడా
పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు కూడా ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుచేసి మొదటి దశ పనులను ప్రారంభించిందని తెలిపారు.
ఫార్మాసిటీ ద్వారా సుమారు 64000 కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం ఉన్నదని, ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 5 లక్షల 60 వేల మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇంత విశేష ప్రాధాన్యం ఉన్న ఫార్మాసిటీకి నిమ్జ్ పాలసీ మార్గదర్శకాల మేరకు బహిరంగ మౌలిక వసతుల కల్పన కోసం 1318 కోట్ల రూపాయల గ్రాంట్ ఇన్ ఏయిడ్ అందించాలని కోరారు. దీంతోపాటు అంతర్గత మౌలిక వసతుల కల్పన, కామన్ ఎప్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వంటి సాంకేతిక మౌళిక వసతుల సదుపాయాల కోసం మరో 50 శాతం ఖర్చు (సూమారు 2100)కోట్ల సహాయం అందించాలని కోరారు.
సహజవాయువు కేటాయించాలి
ఫార్మా సిటీలో ఏర్పాటు చేయనున్న కంపెనీల ఇంధన అవసరాలకోసం సహజవాయువును ప్రిఫరెన్సియల్ టారిఫ్ ప్రాతిపదికన కేటాయించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి కె.టి.ఆర్ కోరారు. ప్రస్తుతం ఫార్మా కంపెనీలు బొగ్గును ఇంధనంగా వాడుతున్నాయని, అయితే గ్రీన్ ఇండస్ట్రియల్ కాన్సెప్ట్ (కాలుష్య రహిత పద్ధతిన) ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ కోసం సహజ వాయువు వాడాల్సి ఉంటుందని, అయితే ప్రస్తుతం ఉన్న పద్ధతితో పోల్చుకుంటే ఇది కొంత ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో ఫార్మారంగ అభివద్ధిని దష్టిలో ఉంచుకొని తక్కువ ధరకు సహజ వాయువు సరఫరా చేయాల్సిందిగా కెటిఆర్ తన లేఖలో కోరారు. ఫార్మాసిటీలోని యూనిట్లకు అవసరం అయిన 3.4యం.యం.యస్. సి.యం.డి (Million Metric Standard Cubic Meter Per Day) కేటాయించాలని కోరారు.