magaప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో తెలంగాణ సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌లు ప్రారంభించారు. ఛాయాగ్రాహకుడు తీసే ఒక్కో ఫొటో ఎన్నో రకాల భావాలను వ్యక్తపరుస్తుందని, ఫొటోలు చరిత్రకు నిదర్శంగా నిలుస్తాయని, ఎన్నో ఏండ్ల మన సంస్కృతి, సంప్రదాయాలు ఫొటో రూపంలో నిలిచి ఉంటాయని అల్లం నారాయణ అన్నారు. మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులకు త్వరలోనే జేఎన్‌యూలో స్వల్ప వ్యవధి కోర్సులను అందించేందుకు ప్రభుత్వం తరఫున కృషిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఫొటోలను ‘బంగారు తెలంగాణా, తెలంగాణ పండుగలు, వార్తా చిత్రాలు’ మూడు క్యాటగిరీలుగా విభజించినట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. మూడు క్యాటగిరీలలో 93 మంది ఫోటోగ్రాఫర్లు 820 ఫోటోలు పోటీలకు పంపారని బంగారు తెలంగాణా క్యాటగిరీలో 369 ఫోటోలు, తెలంగాణ పండుగల క్యాటగిరీలో 236 ఫోటోలు, వార్తా చిత్రాల క్యాటగిరీలో 195 ఫోటోలు పరిశీలనకు వచ్చాయని అన్నారు. ప్రతి క్యాటగిరీలో మొదటి బహుమతిగా రూ. 15,000లు, రెండవ బహుమతిగా రూ. 10,000లు, మూడవ బహుమతిగా రూ. 6,000లు, 5 కన్‌ సోలేషన్‌ బహుమతుల క్రింద ప్రతి ఒక్కరికి 5 వేల రూపాయలను అందచేసినట్లు తెలిపారు.

‘బంగారు తెలంగాణ’ విభాగంలో – మొదటి బహుమతి హరితహారం చిత్రానికి – సీహెచ్‌ నరేందర్‌, ద్వితీయ బహుమతి తెలంగాణ సంస్కృతి చిత్రానికి – ఆర్‌కే కుమారస్వామి, మూడవ బహుమతి మిషన్‌ భగీరథ చిత్రానికి – కే శ్రీనివాస్‌ ఎంపికయ్యారు. ‘తెలంగాణ పండుగలు’ విభాగంలో – మొదటి బహుమతి వనం శరత్‌బాబు, ద్వితీయ బహుమతి రాజశేఖర్‌, తృతీయ బహుమతి వేణుగోపాల్‌ ఎంపిక కాగా, ‘ఇతర న్యూస్‌’ విభాగంలో మొదటి బహుమతి – వై. శ్రీకాంత్‌, ద్వితీయ బహుమతి – పీ. పద్మావతి, తృతీయ బహుమతి ఏ. సురేశ్‌ విజేతలుగా నిలిచారు.

వీరితోపాటు పలువురికి ప్రోత్సాహక బహుమతులను మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌యూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ రిజిస్ట్రార్‌ ప్రదీప్‌, ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ లక్ష్మి, వెంకటేశం ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

Other Updates