ఫ్లోరైడ్‌-పీడ-నుంచి-విముక్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండు బృహత్తర కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జూన్‌ 8వ తేదీన నల్లగొండ జిల్లాలో శ్రీకారం చుట్టారు. 2019 నాటికి దేశంలోనే అత్యంత మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా దామరచర్ల మండం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. అలాగే, రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీరిచ్చే వాటర్‌ గ్రిడ్‌ పథకానికి సంబంధించి నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో ఏర్పాటుచేసిన పైలాన్‌ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

అనంతరం, నల్లగొండ పట్టణంలోని ఎన్‌.జి.కళాశాల ఆవరణలో జరిగిన ‘తెలంగాణ ప్రగతిపథం’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాట్లాడుతూ, తెలంగాణలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఖర్చుతో పైపులైన్లు వేసి నల్లా ద్వారా నీరందించి తీరుతామని చెప్పారు. ప్లోరైడ్‌ రక్కసిని తరిమికొట్టేందుకే ఈ కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభించామని చెప్పారు. రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు, ఇంటింటికి విద్యుత్‌ వెలుగులు అందించే రెండు బృహత్తర కార్యక్రమాలకు నల్లగొండ జిల్లానుంచే శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందంగా వున్నదని ముఖ్యమంత్రి తెలిపారు.

‘‘ఫ్లోరైడ్‌ సమస్యను తెలుసుకొనేందుకు నల్లగొండ జిల్లాలో 8 రోజులపాటు వూరూరా తిరిగాను. ప్రజలు పడుతున్న బాధలు విని కన్నీరు పెట్టాను. అప్పుడే, దేశపతి శ్రీనివాస్‌ తో కసి ‘చూడుచూడు నల్లగొండ..గుండెనిండా ఫ్లోరైడ్‌ బండ’ అనే పాటను రాశాను. ఫ్లోరైడ్‌ రక్కసి బారినపడిన నల్లగొండ జిల్లా దయనీయ స్థితిని తెలంగాణ అంతటా చాటి చెప్పాను. అలాంటి ఫ్లోరిన్‌ నీటి బారినుంచి జిల్లా ప్రజలను విముక్తి చేసేందుకు వాటర్‌ గ్రిడ్‌ పథకం చేపట్టాం,’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

తెలంగాణలోని అన్ని జిల్లాలలో ప్రతి ఇంటికీ తాగునీరందించే ఈ పథకాన్ని మెచ్చుకొని హడ్కో 10,000 కోట్ల రూపాయల రుణం అందించిందని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా వచ్చే నాలుగేళ్ళలో ఈ పథకాన్ని పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. చెప్పారు.

2019 నాటికి మిగులు విద్యుత్‌

2019 నాటికి దేశంలోనే అత్యంత మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. 91,500 కోట్ల రూపాయలతో 25,000 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఆరు నెలల్లో రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యను పరిష్కరించాం. ఇక నుంచి తెలంగాణలో కరెంటు కోతలుండవు. రైతులు బాగా పంటలు పండించాలి. పరిశ్రమలు ఉత్పత్తిని పెంచాలని ముఖ్యమంత్రి అన్నారు.

నల్లగొండకే తొలి ప్రాధాన్యం

రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐ.టి. శాఖ మంత్రి కె.తారక రామారావు మాట్లాడుతూ, తలాపున పారే నది ఉన్నా సమైక్యపాలనలో నల్లగొండ జిల్లా వెనకబడ్డది. ఆంధ్రప్రదేశ్‌ లో అప్పుడు వుండటమే ఈ జిల్లా ప్రజలు చేసుకున్న తప్పా? అని ప్రశ్నించారు. అంగట్లో అన్నీ వున్నా అల్లుడినోట్లో శని అన్న చందంగా, కనీసం తాగునీరు ఇవ్వలేక పోయారని, ఆ పని తాము చేస్తున్నామని మంత్రి చెప్పారు. జిల్లాలో లక్షా 50 వేల మంది ఫ్లోరోసిస్‌ బారినపడి జీవచ్ఛవాలుగా మారారని, అప్పట్లో ఉద్యమ నాయకునిగా ఈ ప్రాంతంలో పర్యటించిన కె.సి.ఆర్‌ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఫ్లోరోసిస్‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు వాటర్‌ గ్రిడ్‌ పథకం చేపట్టారని అన్నారు. ఈ పథకం క్రింద ముందుగా నల్లగొండ జిల్లాకే నీరందిస్తామన్నారు.

అధికారంలోకి వస్తే సంవత్సరంలోగా కరెంటు కష్టాలు తీరుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆరు నెలలలోనే తన వాగ్దానాన్ని నిలుపుకున్నారని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి జి.జగదీశ్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవే కాకుండా, చెప్పని ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ముఖ్యమంత్రి ప్రజల పక్షపాతిగా నిలిచారని భువనగిరి ఎం.పి. బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి వరాలు ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు.

Other Updates