kcrచదువుకున్న నేలను స్పృశించిన మనసు పరవశించింది. ఆడుకున్న ఆటలలో భాగమైన మట్టిపైన మమకారం మెరిసినట్లయ్యింది. చెరువు నీళ్ళల్ల ఈత కొట్టినప్పటి శక్తి మళ్లీ అందివచ్చినట్టయ్యింది. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిన్నప్పుడు చదువుకున్న నేల (మెదక్‌ జిల్లా దుబ్బాక)ను తాకినప్పుడు ఆయనలో కలిగిన అనుభూతి. తాను చదువుకున్న బడి మోడల్‌ భవన నిర్మాణానికి జనవరి 11న శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈ సందర్భంగా ఏర్పాటయిన ఆత్మీయ సమ్మేళనంలో అలనాటి జ్ఞాపకాలను ఒక్కసారి రిఫ్రెష్‌ చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు. దాంతోపాటే దుబ్బాక ప్రజలందరు ఆనంద పరవశులయ్యే విధంగా వరాలు ప్రకటించారు.

దుబ్బాక నియోజకవర్గంలో 128 గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు ఒక్కో పంచాయతీకి 25 లక్షల రూపాయలను మంజూరు చేశారు కేసీఆర్‌. ఈ నియోజకవర్గంలో గల 5 మండల కేంద్రాలకు 50 లక్షల వంతున, దుబ్బాక నగర పంచాయతీకి 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. టౌన్‌హాల్‌ నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్ర శేఖరరావు. పనులు గొప్పగా వేగవంతంగా చేసుకున్న పంచాయతీలకు మరో 25 లక్షల రూపాయలను కూడా మంజూరు చేస్తానని ప్రకటించారు.

దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని నల్లా ద్వారా వచ్చే ఏప్రిల్‌ 30 నుండి అందిస్తున్నామని ముఖ్యమంత్రి హామీనిచ్చారు. నల్లాల ద్వారా నీటిని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత, ఏ ఊళ్ళో కూడా ఆడబిడ్డ బిందె పట్టుకొని బయట కనిపించడానికి అవకాశం వుండదన్నారు. ఒకవేళ అలా కనిపిస్తే ఆ ఊరి సర్పంచ్‌ ఎంపీటీసీలు రాజీనామా చేయాల్సి వుంటుందని నవ్వుతూనే కేసీఆర్‌ హెచ్చరించారు. అదే విధంగా మండలంలో ఆడబిడ్డలు బిందెలతో కనిపిస్తే జడ్పీటీసీ, ఎంపీపీలు మొత్తం నియోజకవర్గంలో ఎక్కువమంది ఆడబిడ్డలు బిందెలతో కనబడితే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సి వుంటుందని సుతిమెత్తగా సూచించారు.

ఇలా కచ్చితమైన నిబంధనలు పెట్టుకొని ప్రతి పనిని సవాల్‌గా తీసుకొని చేస్తూ వెళితే అనుకున్నది అనుకున్నట్టుగా కచ్చితంగా సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులందరూ పైపులైన్ల నిర్మాణ పనుల సమయంలో దగ్గరుండి పర్యవేక్షించాలని అన్నారు.

పైపులైను ఎక్కడినుంచి పోతే బాగుంటది, ముందు ముందు ఇబ్బందులు ఏమైనా వుంటాయా? అనే విషయాలన్నింటిని ఆయా గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులందరితో చర్చించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

గజ్వేల్‌, దుబ్బాక, సిద్ధిపేట ప్రజలందరూ అదృష్టం చేసుకున్నారని వీళ్లందరికీ ఏప్రిల్‌ 30 నుండి మంచినీళ్ళు నల్లా ద్వారా అందుతాయని తెలియజేశారు.

తాను ఇక్కడి పాఠశాలలో ఐదేండ్లు చదువుకున్నానని పేర్కొంటూ అప్పుడు ఈ బడి బాగుండేదని, ఇప్పుడా పరిస్థితులు లేవని అన్నారు. ప్రస్తుతం 4.67 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న ఈ భవనానికి అదనంగా మరో 10 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. హైస్కూల్లోనే జూనియర్‌ కళాశాలలను కూడా కలిపి కట్టేవిధంగా, అద్భుత భవనాలను నిర్మింపజేయాలని మంత్రి హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రాస్‌లకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సూచించారు.

వంద పడకల ప్రభుత్వాసుపత్రితో పాటుగా ఫైర్‌ స్టేషన్‌ను, దుబ్బాక ఆర్టీసీ బస్‌ డిపోకు 15 కొత్త బస్సులను కూడా మంజూరు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. మున్సిపల్‌ భవన నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు అడిగారు కాని ఆ నిధులు సరిపోవు, భవన నిర్మాణానికి అవసరమైనంతమేర నిధులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. దుబ్బాకకు ఏడీఈ (విద్యుత్‌) కార్యాలయం, ఎస్సీ రెసిడెన్షియల్‌ స్కూలు, దీపం పథకంలో భాగంగా దుబ్బాక నియోజకవర్గానికి 10 వేల గ్యాస్‌ కనెక్షన్లను కేసీఆర్‌ మంజూరు చేశారు.

అవసరమైనన్ని విద్యుత్‌ సబ్‌స్టేషన్లు వెంటనే మంజూరు చేస్తామని అన్నారు. అందరికీ పనికొచ్చేవిధంగా షాదీఖానాలను నిర్మించుకోవాలని ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సూచించారు. వచ్చే సంవత్సరం దుబ్బాకకు ప్రత్యేకంగా 2500 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అదనంగా కేటాయించనున్నట్లు ప్రకటించారు.

ఈ జిల్లా (మెతుకు సీమ)కు మరో రెండున్నరేండ్లలో గోదావరి జలాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఆ నీళ్ళు వస్తే ఈ ప్రాంతమంతా కూడా బంగారు తునకగా మారుతుందని, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మీ జిల్లా వారేకావడం మీరు చేసుకున్న అదృష్టం అని ముఖ్యమంత్రి చెప్పారు. నీళ్ళు జిల్లాకు చేరితే ఇక్కడి కరువు శాశ్వతంగా దూరం అవుతుందని కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ గడ్డమీద జన్మించినందుకు దీన్ని, గోదావరి జలాలతో తడిపితే, పండిన పంటలను కండ్లనిండా జూస్తే నా జన్మకు అంతకంటే గొప్ప ఇంకా ఏముంటుందని కేసీఆర్‌ ప్రశ్నించారు.

తాంబాలాలన్ని తలాబులవుతాయి

కాకతీయ, రెడ్డి రాజులు 1100 ఏండ్లనాడు నిర్మించిన చెరువులు సమైక్య రాష్ట్రంలో పాలకులు సర్వనాశనం చేశారని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కొత్త చెరువులు కట్టలేకపోయాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎన్నివేల కోట్లయినా చెరువులను బాగుచేసుకోవాలనే తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్‌ కాకతీయ’ను తెచ్చిందని, రానున్న నాలుగేండ్లలో అన్ని చెరువులు బాగుపడతాయని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చెప్పారు.

మా సార్లు గొప్పవాళ్ళు

నేను చదువుకునే రోజుల్లో గురువులు అంకితభావంతో పనిచేసేవాళ్ళని, వాళ్ళందరూ గొప్ప వాళ్ళని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మా సారు మృత్యుంజయశర్మ చాలా గొప్పవారు. ఆ సారు కాళ్ళు మొక్కిన తర్వాతనే నేను ఏ పనైనా మొదలుపెడతా అని కేసీఆర్‌ చెప్పారు. అప్పట్లో లచ్చపేటలో అంగడి సాగేది. ఆ అంగడికి మాతోపాటు మా గురువులు కూడా కలిసి వచ్చేవాళ్ళు. టీచర్లు వాళ్ళకు అవసరమైన సామాన్లు కొనుక్కొని మా నెత్తిమీద పెడితే, వాటిని ఇంటి దగ్గర పెట్టేటోళ్ళం. గురువులంటే విద్యార్థులకు అంతగా భక్తిభావం వుండేది. అలాగే సార్లు కూడా అంతే అంకితభావంతో వుండేవాళ్ళు.

అప్పట్లో కాపువాడలోనే పాలు దొరికేవి. నా వంతుగా రోజు నలుగురు సార్ల ఇంటికి పోయి పాలు ఇచ్చి వచ్చేవాణ్ణి. ఇట్లా తలా కొందరు విద్యార్థులు అందరు టీచర్ల ఇంటి వద్ద పాలు ఇచ్చేవాళ్ళు. మృత్యుంజయ సార్‌ మాకు తెలుగు పండితుడు. ఆయన పాఠం, పద్యం, దాని తాత్పర్యం చెప్పేవారు. కంఠస్థం చేసి, భాషాదోషం, ఉచ్ఛారణ దోషం లేకుండా తెల్లారి ఎవరు అప్పజెప్తే వాళ్ళకు 100 పేజీల నోటు బుక్కు ఫ్రైజ్‌గా ఇస్తానని చెప్పిండు. ఆ రోజుల్ల ఉపాధ్యాయులకు జీతాలు తక్కువ అయినా సొంత డబ్బులతో విద్యార్థులను ప్రోత్సహించడానికి బహుమతులు ఇచ్చారు. అంత గొప్ప టీచర్లు ఇప్పుడున్నరా? అయితే అలా ఉత్తర గోగ్రహణం పాఠంలోని పద్యాన్ని ఎవరు అప్పజెప్తే వాళ్ళకు 200 పేజీల నోట్‌బుక్‌ బహుమానంగా ఇస్తానని మృత్యుంజయ సార్‌ చెప్పిండు. వెంటనే నేను లేచిన. ఏంరా చంద్రశేఖర రాయుడా అన్నడు మృత్యుంజయ సార్‌. మీరు అవకాశం ఇస్తే ఇప్పుడే ఐదు సార్లు కంఠస్థం చేసి అప్పజెప్త అన్నా, ఆ చెప్పినవ్‌ కూసో అన్నడు. ఎందుకో ఏమో ఆయనే మళ్ళీ ఆలోచించుకొని చెప్పమన్నడు. ఐదు సార్లు అక్కణ్ణే చదివి అప్పజెప్పిన ‘శబాష్‌ బిడ్డా’ అని మెచ్చుకుని అప్పటికప్పుడు దానయ్య అనే ఫ్యూన్‌తో నోట్‌ బుక్కు తెప్పించి హెడ్‌మాస్టర్‌ సార్‌తోని నాకు ఇప్పించిండు.

ఆ రోజు సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళకుండా నేను ట్యూషన్‌ చదువుకునే రాఘవరెడ్డి సార్‌ ఇంటికి వచ్చాడు సార్‌. వీడికి (కేసీఆర్‌) అమ్మవారి దయ ఉన్నట్లుంది. వీన్ని వేరే టీచర్ల ఇంటికి పాలు ఇవ్వడానికి పంపకు. ఒక్క నా ఇంటికే పంపు నేనే ట్యూషన్‌ చెప్తా. వాణ్ణి బ్రహ్మాండంగా తయారు చేస్తా అన్నాడు. ట్యూషన్‌ ఫీజు కూడా అవసరం లేదని చెప్పడంతో రోజు పొద్దున్నే 5.30 గంటలకు లేచి స్నానం చేసి పాలు తీసుకుని మృత్యుంజయ సార్‌ ఇంటికి వెళ్ళే వాణ్ణి. సరస్వతి తల్లికి దండం పెట్టి చదువు మొదలు పెట్టే వాళ్ళం. అప్పటి టీచర్లకు అంత అంకితభావం ఉండేది. ట్యూషన్‌ ఫీజు తీసుకోకుండా బహుమతులిచ్చి చదువు చెప్పారు. ఈ రోజు అటువంటి సంస్కారం లేదు అని అంటూ, ఆ తరువాత ఎన్నో పుస్తకాలు చదువుకున్నా. తెలుగు సాహిత్యాన్ని నేర్పించిన మృత్యుంజయసార్‌ దయవల్ల నేను ఇంతవాణ్ణయ్యాను అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

వన్‌రైస్‌ సొసైటీ మనకు ఆదర్శం

మనం మనుషులుగా బతుకుతున్నాం, కులాల గబ్బును మనకు అంటించి పోయిండ్రు. ఎప్పుడో ఒకప్పుడు అందరం చనిపోక తప్పదు. చచ్చినవాళ్ళను మర్యాదగా సాగనంపాలంటే ఊళ్ళల్ల సరయిన దహన వాటికలు లేవు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ మధ్య మహారాష్ట్రకు వెళ్ళినప్పుడు అక్కడ చూశాను. మోహన్‌ ధారియా అనే పుణ్యాత్ముడు అక్కడ ‘వన్‌రైస్‌’ అనే సొసైటీని ఏర్పాటు చేశాడు. ఈ సొసైటీ వాళ్ళు ప్రతి ఊరిలో వైకుంఠ ధామం పేరుతో స్మశాన వాటికలను నిర్మించారు. దాదాపు 300 గ్రామాల్లో స్మశాన వాటికలను నిర్మించారు. కులమతాలకతీతంగా ఒకే చోట అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నిబంధనను పెట్టుకున్నామని అక్కడి వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళ మాటలు గొప్ప స్ఫూర్తినిచ్చాయి. ఇక్కడ కూడా మనం అటువంటి ఆదర్శాన్నే ప్రదర్శించాల్సిన అవసరం వుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అన్నారు.

పంతుళ్ళకు పాదాభివందనం

దుబ్బాకలోని బాలాజీ వెంకటేశ్వరాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు మృత్యుంజయశర్మ, గన్నె బాల్‌రెడ్డి, సి.నారాయణలను కలుసుకొని వాళ్ళ పాదాలకు నమస్కరించారు. తనతో సన్నిహితంగా మెలిగిన అప్పటి వ్యక్తులను పేరు పేరునా పలుకరించి, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తన గురువు మృత్యుంజయశర్మను. చదువు నేర్చుకున్న ఈ దుబ్బాకను తాను ఎన్నటికీ మరువనని అన్నారు.

ఇక్కడి వెంకటేశ్వరాలయ నిర్మాణానికి ఈ పాటికే కామన్‌ గుడ్‌ ఫండ్‌ నుండి ఇచ్చిన 2.50 కోట్ల రూపాయలకు అదనంగా మరో 3 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తాను హెలికాప్టర్‌ నుంచి చూసినపుడు దుబ్బాక అభివృద్ధి గొప్పగా జరగలేదని అనిపించిందన్నారు. అందుకొరకే 25 కోట్ల రూపాయలను దుబ్బాక అభివృద్ధి కోసం కేటాయించానని కేసీఆర్‌ అన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ వేసుకుని నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సన్నిహితులకు, గురువులకు సూచించారు. అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని గొన్నె బాల్‌రెడ్డి, రిటైర్డ్‌ గ్రామ పంచాయతీ ఈవో శ్రీరాం కాశీనాథ్‌లను కోరారు.

తన సహోధ్యాయులను, బాల్య మిత్రులను అందరినీ పేరుపేరునా ఎలా వున్నారు. బాగున్నారా? అంతా మంచిదేనా? అని కేసీఆర్‌ పలుకరించారు. దుబ్బాకలో 60 ఎకరాల విస్తీర్ణంలో పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సిద్ధిపేట కోమటి చెరువు తరహాలో దుబ్బాక రామసముద్రం చెరువును సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. వెంకటేశ్వరాలయం పూజా కార్యక్రమాలకు మళ్ళీ వస్తానని అప్పుడు ఒక రోజంతా ఇక్కడే వుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఒక రోజు దుబ్బాక మిత్రులు, గురువులు అందరం కలుసుకుని భోజనం చేస్తూ యోగక్షేమాలు మాట్లాడుకుందా మంటూ, తాను చెప్పిన రోజు అందరూ రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

కోట్లాది రూపాయలతో అటు సంక్షేమ పథకాలను ఇటు అభివృద్ధిని అదుపు లేకుండా కొనసాగిస్తున్న కేసీఆర్‌, వీటన్నింటికి డబ్బులు దొంగతనం చేసి తెస్తున్నడా అని తెల్వనోళ్ళు అనుకుంటున్నరు అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. నేను ఉద్యమమప్పుడే చెప్పిన, మా రాష్ట్రం, మా వనరులు మాకే అయితే అవన్నీ మా ప్రజలకు మేం పెట్టుకుంటం, మా అభివృద్ధి మేమే చేసుకుంటం అని, ఆ రోజే చెప్పిన అని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుకునే బడ్జెట్‌లో తెలంగాణ అభివృద్ధి కోసం జీతాలు, పెన్షన్లు కాకుండా 62 వేల కోట్ల రూపాయలు వుంటుందని తెలియజేశారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలకు పెట్టిన బడ్జెట్‌ కంటే తెలంగాణ బడ్జెట్‌ ఎక్కువ వుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ వేసవి కాలం ఏప్రిల్‌ నుంచే వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట విద్యుత్‌ సరఫరా చేస్తామని, 2018 నుంచి 24 గంటల త్రీఫేజ్‌ విద్యుత్‌ను సరఫరా చేయబోతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Other Updates