– వి. ప్రకాశ్
జాతిపిత మహాత్మా గాంధీ నినాదమైన గ్రామ స్వరాజ్యం ఇక ఎప్పటికీ నెరవేరని స్వప్నంగానే మిగిలిపోతుందని నిరాశ చెందే వారికి, దిగజారుతున్న గ్రామసీమల దుస్థితి చూసి కృంగిపోయే వారికి భవిష్యత్తుపై ఆశలను చిగురింపజేసే ఒక అద్భుత గ్రామం… హివ్రే బజార్.
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు పశ్చిమ దిశలో 15కి.మీ. దూరంలో సహ్యాద్రి పర్వత పాదాల్లో వెలసిన హివ్రే బజార్ ఈనాడు భారతావనికే గొప్ప ఆదర్శ గ్రామం.
1989లో హివ్రే బజార్ ఎలా ఉండేది?
సరిగ్గా ముప్పయేళ్ళ క్రితం హివ్రే బజార్ చుట్టూ వున్న భూములు, గుట్టలు ఎడారిని తలపించే విధంగా వుండేవి. 1970-80వ దశకంలో వరుస కరువుల కారణంగా గ్రామంలోని సుమారు 182 కుటుంబాల్లో 168 కుటుంబాలు బొంబాయి, పూనే, థానె పట్టణాలకు వలసపోయిన పరిస్థితి. 200మి.మీ. నుండి 300మి.మీ వర్షపాతం… కేవలం ఖరీఫ్‌లోనే అతి కొద్ది విస్తీర్ణంలో సుమారు 100 టన్నుల ఆహార ధాన్యాలను పండించేవారు. సుమారు 90 దాకా వున్న వ్యవసాయ బావుల్లో 80-120 అడుగుల లోతున వర్షాకాలంలో మాత్రమే నీరుండేది. జనవరి, ఫిబ్రవరి నాటికి బావులన్నీ ఎండిపోయి త్రాగునీటికే ఇంబ్బంది వుండేది. హివ్రే బజార్‌లో మిగిలిన కుటుంబాల్లో ఎక్కువ శాతం గుడంబా తయారీ ద్వారా ఆదాయాన్ని పొందేవారు.
1989లో 22 లిక్కర్ అమ్మే దుకాణాలున్న హివ్రే బజార్‌లో ఎక్కువ మంది పురుషులకు మద్యం ఒక వ్యసనంగా మారడం వలన తరచూ నేరాలు జరిగేవి. కొట్లాటలు, హింస నిత్యకృత్యంగా మారి మహారాష్ట్ర ప్రభుత్వం హివ్రే బజార్‌ను నేర స్వభావం గల గ్రామాల జాబితాలో (బ్లాక్ లిస్ట్)లో చేర్చింది. దీనితో ఈ గ్రామంలో ఉద్యోగులు ‘పనిష్మెంట్ పోస్టింగ్’తో వచ్చేవారు. ఉపాధ్యాయుడు గానీ, ఏ ఉద్యోగి కానీ గ్రామంలో ఉండేవారు కాదు. దీనితో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశుధ్యం, పర్యావరణం… ఇలా అన్నీ గాలికి వదిలేయబడినాయి. అడవి ధ్వంసమైంది. గుడంబా తయారీకై చెట్లను నరికి పోయిల కర్రగా వాడేవారు. జల సంరక్షణ అంటే ఏమిటో ఆ గ్రామంలో ఏ ఒక్కరికీ అవగాహన లేక వర్షపు నీరు వరదగా మారి క్రిందికి తరలిపోయేది. ఈ వరదలో సారవంతమైన మట్టి కొట్టుకుపోయి పొలాలన్నీ నిస్సారమైన బీళ్ళుగా మారిపోయినవి. ఇండ్లన్నీ పాడుబడ్డ కూలిన గోడలతో, వీధులన్నీ చెత్తా చెదారంతో, కనుచూపు మేరలో ఎక్కడా పచ్చదనం కానరాక, జనం సందడి లేక హివ్రే బజార్ కళ తప్పిన వూరుగా వుండేది.
హివ్రే బజార్‌లో ప్రైమరీ స్కూల్ మాత్రమే ఉండేది. అక్షరాస్యుల సంఖ్య 1989లో 30 శాతం మాత్రమే. దేశ రాజధాని సగటుకన్న ఇది ఎంతో తక్కువ.
ఒక వ్యక్తి గొప్ప నిర్ణయం
ఈ గ్రామం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ చదివిన ఒకే ఒక్క యువకుడు పోపట్ రావు బాగూజీ పవార్. 1989లో గ్రామానికి వచ్చినపుడు ఆ వూరి దుస్థితికి కలత చెంది హివ్రీ బజార్‌లో పరిస్థితులు మార్చాలని అనుకున్నాడు. పోపట్‌రావు పవార్ క్రికెట్ ఆటలో పూనె యూనివర్సిటీ నుండి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పాల్గొన్న గొప్ప క్రీడాకారుడు. ఎం.కామ్ పాసై తన కోసం మంచి భవిష్యత్తు వేచి వుంది. క్రీడాకారులకు మంచి ఉద్యోగాలను ప్రైవేట్ కంపెనీలు, బ్యాంకులు ఇస్తుంటాయి. హివ్రే బజార్ పరిస్థితుల్లో మార్పుతేవడానికి తాను గ్రామంలోనే వుండాలనుకుంటున్నానని కుటుంబ సభ్యులకు తెలిపాడు పోపట్‌రావు. తల్లి వద్దన్నా ఆమెకు నచ్చ చెప్పి తాను ఎంచుకున్న దారిలో ముందుకు సాగాడు.
ప్రారంభంలో యువకులు, మహిళల నుండి పోపట్ రావుకు మద్దతు లభించింది. వీరంతా గ్రామం బాగుకోసం మంచి పనులు చేయడం చూసి గ్రామ పెద్దలు ఒక్కొక్కరుగా వీరితో జత కలిసారు. గ్రామస్థులు కొందరు పోపట్ రావును అనుమానంగా చూశారు. ”లీడర్ కావాలనే ఇతనీ పనులు మొదలు పెట్టాడు” అంటూ వ్యతిరేక ప్రచారం చేశారు.
1982, 84 సంవత్సరాల్లో రెండు హత్యలు ఈ గ్రామంలో జరిగినవి. గుడంబాను తయారు చేయకుండా, త్రాగుడు మాన్పించకుండా హివ్రే బజార్ బాగుపడదని గ్రహించాడు పోపట్ రావు. మార్పనేది ఒక్కరోజులోనో, నెలలోనో రాదని అతనికి తెలుసు. పక్కా ప్రణాళికతో ముందుకు కదిలాడు. తనపై ముందు నమ్మకాన్ని యువకుల్లో, మహిళల్లో పెంపొందించాడు. హివ్రే బజార్‌లోనే అందరికన్నా పెద్ద చదువులు చదివిన వ్యక్తి, క్రికెట్‌లో రాష్ట్ర స్థాయి అవార్డులు పొంది మంచి భవిష్యత్తు వున్న పోపట్‌రావు గ్రామ బాగు కోసం త్యాగం చేయడాన్ని అర్థం చేసుకున్న వారంతా ఆయన మాటే వేదంగా అనుసరించారు. 1990వ సంవత్సరంలో హివ్రే బజార్‌ను ఆదర్శ గ్రామంగా మలచడానికి ఆచరణ మొదలైంది. గ్రామస్థులు పోపట్‌రావును హివ్రే బజార్ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. కేవలం ఐదేళ్ళలోనే హివ్రే బజార్ దేశ ప్రజలను ఆకర్షించేలా అనేక విషయాల్లో అగ్రగామిగా నిలిచింది. 1991 నాటికి ఇంటింటా మరుగు దొడ్లు నిర్మించుకుని బహిరంగ విసర్జన లేని తొలి భారతీయ గ్రామంగా పేరు తెచ్చుకున్నది.
జల సంరక్షణ చర్యలు
సుమారు 70 శాతం కుటుంబాలు హివ్రే బజార్ నుండి వలస పోవడానికి ముఖ్యకారణం కరువు పరిస్థితులని పోపట్ రావు గ్రహించారు. వలస పోయిన వారిలో చాలా మందికి ఎంతో కొంత వ్యవసాయ భూమి వుంది. కానీ నీటి వసతి లేదు. భూగర్భ జలాలు అడుగంటి బావులెండి పోయినవి. రెండు వేల ఎకరాలకు పైగా పంటలకు అనువైన భూములున్నా ఖరీఫ్ (వర్షాకాలం)లో దాదాపు ఒక వంద టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే పండించేవారు. గ్రామంలోని 90 వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరగాలంటే జల సంరక్షణ (వాటర్ షెడ్) పనులు చేపట్టాలని పోపట్ రావు గ్రామస్థులకు నచ్చచెప్పారు. వర్షపాతం సుమారు 200 మి.మీ. నుండి 400 మి.మీ. మధ్య వుండేది. కురిసే ఆ కొద్ది చినుకులను కూడా వృధాగా దిగువకు పోనివ్వకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించుకున్నారు. వృధాగా పోతున్న వరద నీటితో భూమి కోతకు గురై అత్యంత విలువైన భూసారం కొట్టుకు పోవడాన్ని గమనించారు పోపట్‌రావు. మీటర్ వెడల్పు, మీటర్ లోతుతో ఎక్కడికక్కడ ఆవకాశం వున్న దగ్గర పొలాల్లో, బంజరు భూముల్లో, కొండల్లో స్వచ్ఛందంగా శ్రమదానంతో గ్రామస్థులంతా పాల్గొని కందకాలు తవ్వారు. పరిగెత్తే నీటిని భూగర్భంలో ఇంకే విధంగా పనులు చేపట్టారు. కొన్నేళ్ళలోనే హివ్రే బజార్ శివారులో 40 వేలకు పైగా కందకాల త్రవ్వకం పూర్తి చేశారు.
వాటిలో ఏడాది పొడవునా నీరుండటం, ఎండిన బావుల్లోకి నీరు చేరడంతో రైతుల్లో క్రొత్త ఆశలు చిగురించాయి. వలస పోతున్న వారిలో కొందరు మళ్ళీ వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. పదేళ్ళ కాలంలో వలసలు పూర్తిగా ఆగిపోయినాయి. గతంలో బొంబాయి, పూనె, థానే నగరాల్లో స్థిరపడిన కుటుంబాలు కూడా హివ్రే బజార్‌కు మరలి వచ్చాయి.
జల సంరక్షణలో భాగంగా వూరిలోవున్న చిన్న వాగుపై ఎక్కడికక్కడ అడ్డుకట్టలు (చెక్ డ్యాంలు) కట్టి పరిగెత్తే నీటిని వాగులో నిలిచే ఏర్పాటు చేశారు. వరద నీటిని నిలిపే కుంటలు నిర్మించారు.
వన సంరక్షణ :
హివ్రే బజార్ 1990కి పూర్వం ఎటు చూసినా ఒక్క చెట్టు కూడా లేక ఎడారిని తలపించేది. కొన్నేళ్ళలోనే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ పథకం సహాయంతో సుమారు 4 లక్షల మొక్కలను నాటి వాటిలో 90 శాతం మొక్కలను సంరక్షించుకున్నారు. భూగర్భ జలాల పెరుగుదలకు అడవుల పెంపకం బాగా ఉపకరిస్తుంది. పొయ్యిలోకి కట్టెల కోసం అడవి నరికే వారికి ఎల్.పి.జీ గ్యాస్‌ను ఇప్పించారు. ఆ కట్టెలమ్ముకొని బ్రతికేవారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించారు.
గ్రామంలో భూగర్భ జలాలు కేవలం 20-30 అడుగుల్లో అందుబాటులోకి రావడంతో హివ్రే బజార్ రైతులు తమ పొలాల్లో వ్యవసాయ బావుల త్రవ్వకం మొదలు పెట్టారు. రాజస్థాన్ నుండి రాళ్ళు పగులగొట్టే, త్రవ్వే యంత్రాలు, నిపుణులైన పనివాళ్ళు ఆ గ్రామానికి వచ్చారు. సుమారు 300 బావులు త్రవ్వుకుని రెండు వేల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారు. వంద టన్నులకు మించి పండని ఆహార ధాన్యాలు ఇప్పుడు ఆరువేల టన్నులు దాటడం హివ్రే బజార్‌లో మెరుగైన ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నది.
సప్త సూత్రాలు
హివ్రే బజార్‌ను గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్‌గా తీర్చి దిద్దడానికి పోపట్‌రావు పవార్ ఏడు సూత్రాలను ఎంచుకున్నారు. అవి :
1. శ్రమదానం
2. బహిరంగ విజసర్జన నిషేధం
3. భూగర్భ జలాల నిర్వహణ
4. కుటుంబ నియంత్రణ
5. మద్యపాన నిషేధం
6. పంటల నియంత్రణ
7. చెట్లు నరకడంపై నిషేధం
ఈ విధానాలను గ్రామస్తులు ఆహ్వానించారు. ఎంతో పట్టుదలతో వీటిని అమలు చేశారు. ఫలితంగా గ్రామ తలసరి ఆదాయం 1989లో రూ. 842 వుండగా ఇప్పుడది రూ. 30 వేలకు పెరిగింది. గ్రామంలో 60 కుటుంబాలు ఏడాదికి 10 లక్షలకు మించి సంపాదిస్తున్నారు. పూరి గుడిసెలు, కూలిన ఇండ్లను విడిచి పక్కా భవనాలను గ్రామస్తులంతా నిర్మించుకున్నారు. 1989లో భూమి లేని కుటుంబాలు 22 వుండగా 2019లో ఇప్పుడు కేవలం 4 మాత్రమే
ఉన్నాయి. తమ భూములను అమ్మాలనుకునే వారు హివ్రే బజార్ గ్రామంలోని వారికే అమ్మాలనే నిబంధన పెట్టుకున్నారు గ్రామస్తులు.
సమగ్ర వ్యవసాయ విధానం
పంటలు : ఒక రైతు తనకున్న భూమిలో ఒకే పంట వేయకుండా పలు భిన్నమైన పంటలు పండిస్తాడు. దీని వలన ఒక పంటకు ధర తక్కువ వచ్చినా మరో పంటకు ఎక్కువ ధర వచ్చే అవకాశం వుంటుంది. రోగాల వ్యాప్తిని అదుపు చేయడం వీలవుతుంది. సాగు నీటి నిర్వహణకు ఈ పద్ధతిలో ఎంతో మేలు.
చెరుకు పంట నిషేధం :
కిలో చక్కెర తయారీకి సుమారు 28వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. కనుక రైతులందరికీ లభ్యమయ్యే సాగునీరు సరిపోవాలనే సంకల్పంతో చెరుకు పంటపై నిషేధాన్ని విధించుకున్నారు గ్రామస్తులు. ఉల్లి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, కంది, కూరగాయలు, వాణిజ్య పంటలు, పండ్ల తోటలు, పూల తోటలు మొదలైన వాటికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు గ్రామస్తులు. కిలో బియ్యానికి సుమారు ఐదువేల లీటర్లు వినియోగమయ్యే వరి పంట పట్ల అంత ఆసక్తి రైతుల్లో కనిపించదు.
కందకాల త్రవ్వకానికి, గ్రామ సమష్టి అవసరాలైన రోడ్లు, స్కూలు మొదలైన వాటికి గ్రామస్తులు ఉచితంగా తమ భూములనిచ్చారు. 18 మంది కొంత తమ ఇంటి స్థలాలను, కొంత భూమిని స్కూలుకు గ్రౌండ్‌కు ఇచ్చారు. వీరు తమ ఇండ్లను పడగొట్టి లభ్యమైన రాయితో స్కూలు గోడ (కాంపౌండ్) నిర్మించారు. ఇండ్లు మిచ్చిన వారికి ఇందిరా ఆవాస్ యోజన పథకం క్రింద రూ. 12 వేలతో శ్రమదానం చేసి మళ్ళీ ఇళ్ళను నిర్మించారు గ్రామస్తులు.
పెరిగిన పాల ఉత్పత్తి
1989-90లో 150 లీటర్ల పాలు ఈ గ్రామంలో ఉత్పత్తి కాగా 2018లో నాలుగు వేల లీటర్లకు పెరిగింది. సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా ప్రతి కుటుంబం ఆవులు, బర్రెలు కొనుక్కొని పాల ఉత్పత్తిని పెంచుకున్నారు. పాల అమ్మకం ద్వారా వారానికి వెయ్యి రూపాయల నుండి 30 వేల రూపాయల దాకా సంపాదిస్తున్నారు. తమ చేనులో పండే మొక్కజొన్న, జొన్న తదితర పంటల కర్రలు, దంట్లు, గడ్డి, వగైరాలను పసుగ్రాసంగా ఉపయోగి స్తున్నారు. పాల ఉత్పత్తి బాగా పెరగడంతో గ్రామంలో పాలకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చాలా కుటుంబాలు నాటుకోళ్లు, గొర్రెలను కూడా పెంచుకుని అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.
1990లో కేవలం 100 మాత్రమే వున్న పాలిచ్చే ఆవులు, బర్రెల సంఖ్య ఇప్పుడు 650కి చేరినవి. పాలను చేతితో పిండే బదులు యంత్రాలను వినియోగిస్తున్నారు. పశువుల పేడను బయోగ్యాస్‌గా, తదనంతరం పొలాల్లో ఎరువుగా వినియోగిస్తున్నారు.
పేదలు లేని గ్రామం : 1300 జనాభా గల హివ్రే బజార్‌లో ఒక్కరు కూడా పేదరికంలో లేరు. 1991లో 168 కుటుంబాలు దారిద్య్ర రేఖ (బిపిఎల్)కు దిగువన వుండడం గమనార్హం. దేశమంతా 7 లక్షల గ్రామాల్లో అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గ్రామస్తులు తొలినాటి నుండే ఈ గ్రామంలో అవసరం లేదని భావించి అమలు చేయడం లేదు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వ ఉపాధి పథకాన్ని హివ్రే బజార్ అభివృద్ధి పనులకోసం పూర్తిగా ఉపయోగించుకున్నారు. దీనితో బాటు ఆదర్శ్ గ్రామీణ యోజన, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్, బి.ఆర్‌జి.ఎఫ్. తదితర పథకాలన్నీ ప్రారంభంలో సమర్ధవంతంగా హివ్రే బజార్ సమగ్రాభివృద్ధి కోసం వినియోగించుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుకు అదనంగా గ్రామస్తులు కొంత డబ్బు సమకూర్చి, శ్రమదానం కూడా చేస్తూ నాణ్యమైన ప్రమాణాలను పాటిస్తూ అభివృద్ధి పనులు పూర్తి చేశారు.
దోమను పట్టిస్తే వంద రూపాయలిస్తాం
అన్నీ సిమెంట్ రోడ్లే : గ్రామంలోని ప్రతి వాడలో సిమెంట్ రోడ్డు వేసుకున్నారు. చెత్తను తడి చెత్తగా, పొడి చెత్తగా, విభజిస్తూ వాటిని వేయడానికి రెండు రంగుల్లో చెత్త డబ్బాలు ఊరంతా పెట్టారు. రోడ్లను స్వచ్ఛందంగా శుభ్రపరుస్తారు. ఎక్కడా చిత్తు కాగితం కూడా కన్పించదు. ఊరిలో ఎవ్వరూ ప్లాస్టిక్ వాడరు. ఈ ఊరికి వచ్చే సందర్శకులెవరైనా ప్లాస్టిక్ బాటిళ్ళు, కవర్లు వీధుల్లో వేస్తే విద్యార్థులు వాటిని సేకరించి స్కూళ్ళో వున్న డబ్బాలో వేస్తారు. కిచెన్ వేస్ట్ మొదలైనవి ప్రతి ఇంటి ఆవరణలో వుండే కంపోస్ట్ పిట్‌లో వేసి ఎరువుగా వినియోగిస్తున్నారు. స్నానపు నీటిని భూగర్భ జలాల
రీ ఛార్జీకి ఇంకుడు గుంతలోకి పంపిస్తారు. ఊర్లో ఎక్కడా మురుగు నీరు కనిపించదు. ఒక్క దోమను పట్టిస్తే వంద రూపాయలిస్తామని గ్రామ సభ బహుమతిని ప్రకటించింది.
నాణ్యమైన విద్య :
1990లో హివ్రే బజార్‌లో అక్షరాస్యత కేవలం 30 శాతం మాత్రమే. ఇప్పుడు 95 శాతం అ్ష్యరాస్యులున్నారు. నిరక్షరాస్యులు వ్రేళ్ళ పై లెక్క బెట్టేంతమంది వృద్ధులే ఉన్నారు. ఈ వూళ్ళో చదివిన 79 శాతం మంది ఉన్నత విద్యా వంతులు, ప్రభుత్వ
ఉద్యోగాలు పొందినారు. 1989లో ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరూ లేరు. 1989లో ప్రాథమిక పాఠశాలగా వున్న హివ్రే బజార్ స్కూలు పోపట్ రావు కృషితో ఇప్పుడు హై స్కూల్ అయ్యింది. ఉపాధ్యాయులంతా గ్రామంలోనేఉంటారు. గ్రామసభ నిర్ణయం ప్రకారం హివ్రే బజార్ ఉద్యోగులంతా గ్రామంలోనే ఉండాలి. అందరి పిల్లలూ వూరి బడిలోనే చదవాలి. పోపట్‌రావు కొడుకు, బిడ్డ ఇదే స్కూళ్ళో పదవ తరగతి వరకూ చదివారు. పొరుగు గ్రామాల నుండి సుమారు 40 మంది విద్యార్థులు ఈ హైస్కూల్‌లో విద్యనభ్యసించడానికి ప్రతి రోజూ వస్తుంటారు. గంట ముందే విద్యార్థులంతా స్కూలుకు వచ్చి గదులను, ఆవరణను శుభ్రపరుస్తారు.
హివ్రే బజార్ హైస్కూల్‌కు ఆ ప్రాంతంలోనే గొప్పపేరు రావడానికి విద్యార్థుల క్రమశిక్షణ, నాణ్యమైన విద్య, పాఠాలతో బాటు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, పోషకాహారం తదితర అంశాలతో జీవిత పాఠాలను కూడా బోధించడం, ఎన్.సి.సి. ఎన్.ఎస్.ఎస్‌లలో విద్యార్థులను పెద్ద సంఖ్యలో పొల్గొనేలా చేయడం, స్కూళ్ళో మంచి సౌకర్యాలు (టాయిలెట్స్, ఆట స్థలం మొ||న) ఉండడం, నిరంతర సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వంటివి కారణం. చాలా కుటుంబాల్లో సాంస్కృతిక మార్పుకు, వ్యసనాలను మాన్పించడంలో విద్యార్థులనే సాధనంగా ఉపయోగించుకున్నారు పోపట్ రావు. ప్రతి విద్యార్థి గ్రామంలో వున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచిలో ఎకౌంట్‌ను తెరిచారు. విద్యార్థి దశలోనే ఆర్థికాంశాలు, డబ్బు పై ఒక అవగాహన, పొదుపు బాట విద్యార్థులకు అలవడుతుంది. విద్యార్థుల పుట్టిన రోజును స్కూళ్ళో అందరి సమక్షంలో జరుపుకుంటారు.
రోగాల్లేవు – రోగులు లేరు :
హివ్రే బజార్‌లోని ప్రజలంతా ఆరోగ్యవంతులే. గ్రామస్తులు అవలంబిస్తున్న చక్కని పారిశుద్ధ్య కార్యక్రమాల వలన, మద్యపాన నిషేధం, గుట్కా తంబాకు వంటివి నిషేధించడం, పోషక విలువలున్న ఆహారాన్ని తినడం, దోమలను లేకుండా చేయడం తదితర విలువలను పాటించడం వలన ఈ గ్రామ ప్రజలు అనారోగ్యాన్ని జయించారు. ఈ గ్రామం ‘ఆక్సీజన్ టూరిజం’కు కేంద్రమైంది. 4 లక్షల చెట్లున్న కొండలు, జలాశయాలు, పచ్చటి పంటపొలాలు, చుట్టూ నెమళ్ళు, పక్షులు వున్న ఈ గ్రామానికి పర్యాటకులు తరచూ వస్తుంటారు. ఇక్కడి ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో అన్ని సదుపాయాలతో బాటు గ్రామంలోని గర్భిణులు ప్రసవించడానికి డాక్టర్లు, సిబ్బంది, మందులు, వైద్య పరికరాలు ఎప్పుడూ అందుబాటులో వుంచారు. విధులకు హాజరుకాని వారిపై గ్రామ సభలో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరికైనా తక్కువ రేషన్ ఇస్తే గ్రామ సభ చర్య తీసుకుంటుంది. రేషన్ వస్తువులు మిగిలితే ఏం చేయాలో కూడా గ్రామ సభే నిర్ణయిస్తుంది.
గ్రామ సభ : హివ్రే బజార్‌లో ప్రతి రెండు నెలలకోసారి క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీ కార్యాలయం బయట గ్రామ సభ నిర్వహిస్తారు. గ్రామాభివృద్ధి పనుల కోసం వివిధ కమిటీలను గ్రామ సభ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటి పనితీరును సమీక్షిస్తుంది. పారిశుధ్యం, త్రాగు నీటి సౌకర్యం తదితర కమిటీలు మహిళల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. భారత దేశ పంచవర్ష ప్రణాళికల వలెనే హివ్రే బజార్ గ్రామ సభ కూడా పోపట్ రావు పవార్ మార్గదర్శకత్వంలో ఆ గ్రామాభివృద్ధికి పంచవర్ష ప్రణాళికను రూపొందించుకుంటుంది. 1995-2000 నుండి ఈ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. గ్రామస్తులు చదువుకోవడానికి చక్కని గ్రంథాలయం ఏర్పాటు చేసి దిన, వార పత్రికలు, మంచి పుస్తకాలు అందుబాటులో వుంచారు.
వాటర్ బడ్జెట్ :
దేశంలోఎంతో మెరుగైన ప్రభత్వాలనేవి కూడా అమలు చేయని రీతిలో హివ్రే బజార్ గ్రామసభ ప్రతి సంవత్సరం ఖరీఫ్, రబీ పంటలకు ‘జల బడ్జెట్’ను రూపొందించి అమలు చేస్తున్నది. చాలా రాష్ట్రాల్లో మండలానికి ఒక్కటైనా వర్షపాతాన్ని అంచనా వేయడానికి రేయిన్ గేజింగ్ సెంటర్లు లేవు. కానీ ఈ గ్రామంలో మూడు వేర్వేరు ప్రదేశాల్లో రెయిన్ గేజింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకొని తమ గ్రామ శివారులో ఎంత వర్షం కురిసిందీ ఎప్పటికప్పుడు సరిగ్గా అంచనా వేస్తారు. ఈ బాధ్యతను విద్యార్థులు నిర్వహిస్తారు. గుట్టపై సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన వ్యూపాయింట్ వద్ద వాటర్ బడ్జెట్‌కు సంబంధించిన వివరాలతో బోర్డు పెట్టారు.
సీజన్‌లో ఎంత పరిమాణంలో వర్షం కురిసిందో అంచనా వేసి ఉపరితల జలాశయాల్లో, భూగర్భంలో ఎంత నీరు లభ్యమవుతుందో అంచనా వేస్తారు. లభించే మొత్తం నీటిని బంధించరు – కొంత నీటిని పర్యావరణ సంరక్షణకై దిగువకు వదుల్తారు. సాధారణ వర్షపాతం కన్న తక్కువ నమోదైతే రబీ పంట విస్తీర్ణాన్ని 20 లేదా 30 శాతం తగ్గిస్తారు. హివ్రే బజార్‌లో పాటించిన జల సంరక్షణ పద్ధతుల వలన 250 మి.మీ. వర్షపాతం లభించినా ఆ గ్రామంలోని రెండువేల ఎకరాల్లోని సుమారు 335 వ్యవసాయ బావుల ద్వారా రెండు పంటలకు గ్యారంటీ వుంటుంది. హివ్రేబజార్ గ్రామ సభ వ్యవసాయ అవసరాల కోసం బోర్లు వేయడాన్ని ప్రారంభం నుండే నిషేధించింది. గ్రామంలో త్రాగునీటి కోసం వేసుకున్న బోర్లు తప్ప మరేకొత్త బోరు వేసుకోవాలన్నా గ్రామ సభ అనుమతించదు. గ్రామంలోని హ్యాండ్ బోరును ఎవరైనా రెండోసారి చేతితో నొక్కాల్సి వస్తే గ్రామ సభ రూ. 200లు వారికి ఇస్తామని ప్రకటించింది. అంటే అంతపైన భూగర్భ జలాలు ఆవూరిలో లభ్యమవుతున్నాయని భావించాలి.
పట్టణ-గ్రామ సమతుల్యత :
హివ్రే బజార్ నుండి ముంబాయికి వలస పోయిన సుమారు వంద కుటుంబాలు గ్రామానికి తిరిగి రావడం వలన ఒక్కో కుటుంబం రోజుకు 300 లీటర్ల నీటిని వాడుకుంటుందని అంచనాకు వస్తే కనీసం రోజుకు 30 వేల లీటర్ల నీటిని ఆ నగరం ఆదా చేసినట్లు పోపట్ రావు చెప్తుంటారు. పట్టణాలపై వలసల వత్తిడి తగ్గించడానికి హివ్రే బజార్ అనుభవం ఒక చక్కటి నమూనాగా ఈ దేశం స్వీకరించి పల్లెల సౌభాగ్యానికి కృషి చేయాలి.
మత సామరస్యం :
హివ్రే బజార్‌లో హబీబ్ భాయ్‌ది ఒకే ఒక్క ముస్లిం కుటుంబం. ఆ ఒక్కరి కోసం గ్రామస్తులంతా కలిసి మసీదును నిర్మించారు. వినాయక చవితి పండుగను గ్రామస్తులంతా ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. హబీబ్ భాయ్ కుటుంబం కూడా భజనల్లో, హిందూ పండుగ సంబరాల్లో ఎంతో
ఉత్సాహంగా పాల్గొంటుంది. ఇంటికో గణేషుని విగ్రహాన్ని పెట్టకుండా ఊరంతా కలిసి ఒకే దగ్గర గణేశుని ప్రతిమను ఏర్పాటు చేసుకొని ఆ తొమ్మిది రోజులూ అక్కడే ఉత్సవాలను నిర్వహిస్తారు.
గ్రామంలో తరచూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. మహిళలు, యువకులు వీటిలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని సంతోషంగా సాయంత్రాలు గడుపుతుంటారు.
హివ్రే బజార్‌లో బౌద్ధ ధామాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్తులు.
హివ్రే బజార్‌కు అవార్డుల పంట :
2007లో దేశంలోనే ఉత్తమ గ్రామంగా ఎన్నికైనప్పటి నుండి హివ్రే బజార్‌కు దేశ, విదేశీ సందర్శకుల రద్దీ బాగా పెరిగింది. 112 దేశాల నుండి ప్రభుత్వ అధికారులు, ఎన్.జి.ఓలు, పరిశోధకులు ఈ గ్రామాన్ని ఇప్పటి వరకు సందర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ సిఎం) ఈ గ్రామంలో మూడు రోజులున్నారు. పలుమార్లు సందర్శించారు. ఇంటర్నేషనల్ గ్రౌండ్ వాటర్ మేనేజ్‌మెంట్ అవార్డు, తొలి జాతీయ జల అవార్డు, నేషనల్ ప్రొడక్టివిటీ అవార్డు, నిర్మల్ గ్రామీణ అవార్డు, బెస్ట్ ఎన్.జి.ఓ అవార్డు, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ తదితర అవార్డుల ద్వారా సుమారు రూ. 80 లక్షల నగదు బహుమతి హివ్రే బజార్‌కు లభించింది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ ”మన్ కీ బాత్”లో ఈ గ్రామాన్ని ఎంతో ప్రశంసించారు. గ్రామంలోని విద్యార్థులు, ప్రజలు హివ్రే బజార్‌లో పుట్టినందుకు ఎంతో గర్వపడుతుంటారు. ప్రతి ఇంటికి ఆ గృహిణి పేరు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ గ్రామం విజయం వెనుక మహిళల పాత్ర ఎంత గొప్పదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్ళ క్రితం సునితా శంకర్ పవార్ అనే మహిళను గ్రామస్తులు ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. రిజర్వేషన్ వలన ఇతరులు సర్పంచ్‌గా వుండాల్సి వచ్చినపుడు పోపట్‌రావు పవార్‌ను ఆ గ్రామానికి ఉపసర్పంచ్‌గా ఎన్నుకుంటారు.
పోపట్‌రావు పవార్‌ను ఎం.పి. టికెట్ ఇస్తామని ప్రతి రాజకీయ పార్టీ ఆహ్వానించింది. కానీ ఆయన గ్రామానికే పరిమితమయ్యేందుకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్‌గా కొనసాగేందుకే ప్రాధాన్యతనిచ్చారు. ఇతని ప్రతిభను గుర్తించి ”మహారాష్ట్ర ప్రభుత్వం మోడల్ విలేజ్ ప్రోగ్రాం”కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా గత పదేళ్ళ నుండి కొనసాగిస్తున్నది. పోపట్‌రావు అనుభవాలను ప్రతి సివిల్ సర్వీసెస్ బ్యాచ్ అధికారులతో పంచుకోవడానికి మిస్సోరీకి ఆహ్వానిస్తారు. హైదరాబాద్‌లో వున్న జాతీయ సంస్థ ఎన్.ఐ.ఆర్.డి. దాదాపు నెలకోసారైనా పోపట్‌రావుతో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు శిక్షణను ఇప్పిస్తుంది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు ప్రజా ప్రతినిధులను ముఖ్యంగా సర్పంచ్‌లను హివ్రే బజార్‌కు పంపిస్తుంది. దేశ వ్యాప్తంగా 100 గ్రామాలను మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా 7,500 గ్రామాలను హివ్రే బజార్ వలె ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దాలనే సంకల్పంతో పోపట్ రావు ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటారు.
ఆదర్శ గ్రామాలను ఎలా రూపొందించుకోవాలనే అంశంపై ఈ గ్రామంలోనే శిక్షణనివ్వడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు హివ్రే బజార్‌లో 12 కోట్లతో విశాలమైన పంచాయతీ రాజ్ శిక్షణా కేంద్రాన్ని, వసతి సౌకర్యాన్ని కల్పించింది. మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ చొరవతో ఇది సాధ్యమైంది.
ఎంతో జఠిలమైన సమస్యలని పాలకులు, ప్రణాళికావేత్తలు, నిపుణులు, నాయకులు పరిగణించే అనేక సమస్యలకు పరిష్కారాలు వారికి హేవ్రే బజార్‌లో లభిస్తాయి.
కావల్సిందల్లా సంకల్ప శుద్ధి మాత్రమే. తెలంగాణా ప్రజలు కలలు కంటున్న ‘బంగారు తెలంగాణ’కు చక్కని నమూనా హివ్రే బజార్.