రాజకీయ అవినీతిని పారద్రోలడం ద్వారా బంగారు తెలంగాణ సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకతతో పనిచేస్తోందని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ లభించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలోని పరేడ్‌ గ్రౌండ్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు, అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ కోటి రతణాల వీణ అంటూ కొద్ది సేపు తెలుగులో ప్రసంగించిన గవర్నర్‌ అనంతరం ఆంగ్లంలో కొనసాగించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

పారిశ్రామిక రంగాలకు పెద్దపీట వేయడం, వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో భారీ పెట్టుబడులు ఆహ్వానించడం తద్వారా ఆర్ధికాభివృద్ధి సాధించడం ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించే ఏక గవాక్ష పారిశ్రామిక విధానాన్ని ప్రకటించినట్లు తెలిపారు. దీనితో పెట్టుబడులకు అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వేత్తలు తరలి వస్తున్నారన్నారు. కార్పోరేట్‌ కంపెనీలు క్యూ కట్టాయని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణలో మౌలిక వసతుల కల్పనలో అగ్రస్థానంలో ఉంటామని రాష్ట్రం, సర్వతోముఖాభివృద్ది చెందడం ఖాయమని అన్నారు. రాబోయే మూడు సంవత్సరాల కాలంలో 20వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రెండు సంవత్సరాలలో హరితహారం కార్యక్రమాన్ని పూర్తి చేసి రాష్ట్రాన్ని పచ్చదనంతో కళకళలాడి స్తామన్నారు. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి యుద్ధ ప్రాతిపధికన చర్యలు చేపడతామని గవర్నర్‌ ప్రకటించారు. 24గంటలు పనిచేసేలా సిసి కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేసి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాజధాని నలువైపులా ఎక్స్‌ప్రెస్‌ హైవేలను అభివృద్ధి పరిచి ట్రాఫిక్‌ సమస్యలను అధిగమిస్తామన్నారు. నగరాన్ని 4జీ వైఫై నగరంగా తీర్చిదిద్దుతా మన్నారు. మహిళాభివృద్దికి పెద్దపీట వేసి ఆరోగ్యలక్ష్మి, కళ్యాణలక్ష్మిలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పోలీసు ఉద్యోగాల్లో మూడో వంతు మహిళలకు కేటాయించా మన్నారు. నగరంలో షీ టీమ్స్‌ ఏర్పాటు చేసి ఆకతాయిలకు చెక్‌ పెట్టడం జరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా వ్యవసాయానికి తోడ్పాటు నందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం లో కోయల్‌ సాగర్‌, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా తదితర ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీటి ని అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాకతీయ మిషన్‌ కింద వేలాది ఎకరాలు సాగులోకి తెచ్చేవిధంగా చెరువుల పునరుద్దరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం 23వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామన్నారు. ఇంటింటికీ నల్లాల ద్వారా నీరందించే వాటర్‌ గ్రిడ్‌ పథకానికి 25వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, పేదలకు డబుల్‌ బెడ్రూం
ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. హాస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యం, రైతులకు రుణమాఫీ తదితర పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఆకట్టుకున్న కవాతు :
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎయిర్‌ఫోర్స్‌, సిఆర్‌పిఎఫ్‌ బలగాలు నిర్వహించిన కవాతు ప్రజలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన గుర్రపు స్వారీ విన్యాసాలు, టెంట్‌ పెగ్గింగ్‌ క్రీడ సభికులను ఆనందాశ్చర్యాలకు గురిచేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌, సిఎస్‌ రాజీవ్‌ శర్మ, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అమర జవాన్లకు సి.ఎం. శ్రద్ధాంజలి
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. పరేడ్‌ గ్రౌండ్స్‌ వద్ద పోలీస్‌ అమర వీరుల స్థూపం వద్దకు వెళ్లి అక్కడ పుష్పగుచ్చాన్ని ఉంచారు. అనంతరం సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన ‘ఎట్‌హోమ్‌’ కార్యక్రమంలో గవర్నర్‌ ఇచ్చిన తేనీటివిందుకు హాజరయ్యారు.

Other Updates