గణతంత్ర దినోత్సవ సభలో గవర్నర్
”భూ గర్భమున గనులు, పొంగి పారే నదులు
శృంగార వనతతుల సింగారముల పంట
నా తల్లి తెలంగాణ రా
వెలలేని నందనోద్యానమ్మురా!
అని తెలంగాణ గొప్పతనాన్ని ఓ కవి చాటి చెప్పాడు.
ఆ గీతాన్ని నేడు సగర్వంగా స్మరించుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
భారతీయులందరికీ నేడు గొప్ప శుభదినం.
ఎందరో మహనీయుల త్యాగఫలంగా మనందరం ఈ వేడుకలను జరుపుకుంటున్నాం.
భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తరువాత రెండవసారి మనం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం.
ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వారి కలలను సాకారం చేసేలా నా ప్రభుత్వం అనేక సంక్షేమ ా అభివృద్ధి పథకాలు అమలు చేస్తోంది. ప్రజలకు జవాబుదారీగా పారదర్శకంగా వుండేలా సుపరిపాలన అందించడానికి నా ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది.” అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చెప్పారు.
ఈ సందర్భంగా గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరిగిన అనేక సంక్షేమ – అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వారి కలలను సాకారంచేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, అన్ని అవాంతరాలను అధిగమిస్తూ, వివిధ రంగాలలో ప్రగతి సాధించిందని రాష్ట్ర ప్రభుత్వానికి కితాబు నిచ్చారు. సంక్షేమ రంగానికి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం పేదల పక్షపాతిగా ప్రశంసలు అందుకుంటోందని, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాల వల్ల రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధిస్తూ, ప్రపంచ దేశాల పెట్టుబడులను ఆకర్షిస్తోందని అన్నారు.
కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన గత 19 నెలల అత్యల్ప కాలంలోనే ప్రజలకు ఏది అవసరం? ఆర్ధికాభి వృద్ధికి ఏం చర్యలు తీసుకోవాలి? అనే విషయంలో ప్రభత్వం స్పష్టమైన విధానంతో ముందుకు పోతోంది. ఆ దిశగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పేదల కోసం రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం వంటి పలు వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. సుపరిపాలన, పారదర్శక విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారానే అన్ని సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో ప్రజానీకానికి అందించగలమని ప్రభుత్వం ప్రగాఢంగా విశ్వసిస్తోంది. పేదరిక నిర్నూలన, బలహీనవర్గాలవారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందిస్తోంది. సమాజంలో అవినీతిని అంతమొందించి, తన వాగ్దానాలన్నింటినీ అమలు పరచేందుకు పారదర్శక పాలనను అందిస్తోంది.
తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు, బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు, వంటి వినూత్న పథకాలను అమలుపరుస్తోంది. నీటిపారుదల, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, మౌలిక సదుపాయాల కల్పనా రంగాలలో భారీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం తన విధానాలను రూపొందించి అమలుచేస్తోంది.రాష్ట్ర ఆదాయ వనరులు పెంచడానికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, మహిళా స్వయంప్రతిపత్తి కల్పించడానికి , ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తోంది.
సంక్షేమానికి, అభివ ద్ధికి భారీ కేటాయింపులు
2015-16 వార్షిక బడ్జెట్ లక్షా 15 వేల కోట్ల రూపాయలు కాగా, అందులో ప్రణాళికా వ్యయం రూ.52 వేల కోట్లుగా వుంది.ఉమ్మడి రాష్టంలో 2013-14 బడ్జెట్ తో పోల్చుకుంటే, తలసరి ప్రణాళికా కేటాయింపులు రెండింతలు పెరిగాయి. ప్రత్యేకంగా ఒక్క సంక్షేమ రంగానికే రాష్ట్ర ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయలు వ్యయపరుస్తోంది. ప్రజా సంక్షేమానికి, అభివ ద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా అణగారిన వర్గాలవారికి అభివృద్ధిఫలాలు సమానంగా అందే విధంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అన్ని అవరోధాలను అధిగమించి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
విద్యుత్ రంగంలో ప్రగతి
విద్యుత్ ఉత్పత్తి పెంచి, సరఫరాను మెరుగుపరచాడానికి ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యూహాలు, విధానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెంకించి, కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది.2018 నాటికి రాష్ట్రంలో 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మరో 5 వేల మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి తేవాలని కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
తాజాగా వరంగల్ జిల్లా భూపాలపల్లి సమీపంలోని చెల్‌పూర్లో 600 మెగావాట్ల సామర్థ్యం గల ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. విద్యుత్ కొనుగోలు, హైపవర్ ట్రాన్స్ మిషన్ కారిడార్ ఏర్పాటుకోసం చత్తీస్‌గడ్ రాష్ట్రంతో ఇటీవలె పరస్పర అవగాహనా ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది.
మిషన్ కాకతీయ
కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన వేలాది చెరువులు నిర్లక్ష్యానికి గురై నిరుపయోగంగా తయారయ్యాయి. ఆ చెరువుల పునరుద్ధరణకు రాష్ట్రప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో భారీకార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.వచ్చే ఐదేళ్ళలో 22,500 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 45,300 నీటిపారుదల చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకొని, మొదటి దశలో 9600 చెరువుల పనులు చేపట్టింది. ‘మన ఊరు- మన చెరువు’ కార్యక్రమం కింద ప్రజలను ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం జరిగింది.
కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యం
రాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అవసరాలకు క ష్ణా, గోదావరి నదులలో లభ్యమయ్యే ప్రతి చుక్కనీటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ప్రాజెక్టుల రీ డిజైనింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం రూ.1,31,988 కోట్ల అంచనాతో 34 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టింది. సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ వల్ల కనీసం కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రతియేటా రూ. 25,000 కోట్లు వ్యయపరచాలని నిర్ణయించింది.
ఇంటింటికీ నల్లా నీరు
తెలంగాణలో ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ భగీరథ’ అనే వినూత్న కార్యక్రమం చేపట్టింది. 1.26 లక్షల కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు వేసి, రాష్ట్రంలో ప్రతి పౌరునికి రోజుకు వంద లీటర్ల మంచినీరు అందిచే ఈ కార్యక్రమానికి రూ. 40,000 కోట్లు వ్యయపరుస్తోంది. మున్సిపాలిటీలలో ఒక్కో వ్యక్తికి 135 లీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల లో 150 లీటర్ల వంతున మంచినీటి సరఫరా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
‘మిషన్ భగీరథ’కు అవసరమైన 160 టి.ఎం.సి ల నీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి 80 టి.ఎం.సిల చొప్పున సేకరిస్తున్నాం. దశాబ్దాలుగా ప్రజలను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ బాధనుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికి నల్లగొండ జిల్లాపై ప్రత్యేక ద ష్టి సారించాం.మునుగోడులో పైలాన్ ను నిర్మించాం. దశల వారీగా ఈ పథకాన్ని మూడేళ్ళలో పూర్తిచేయాలని ప్రభుత్వ కృతనిశ్ఛయంతో వుంది.
గ్రామజ్యోతి
గ్రామ స్వరాజ్యం అనే మాటను నిజంచేసేందుకు, స్థానిక సంస్థలను బలోపేతంచేసి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
రెండు పడక గదుల ఇళ్ళు
రాష్ట్రంలోని నిరుపేదలు, తక్కువ ఆదాయ వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేందుకు వీలుగా వారికి రెండు పడకల గదుల ఇళ్ళను ఉచితంగా నిర్మించి ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని ఇళ్ళు నిర్మించి లబ్దిదారులకు అప్పగించడంతోపాటు, మరో 66 వేల గ హాలను మంజూరు చేసింది. రానున్న సంవత్సరాలలో ఈ సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
స్టార్టప్ హబ్‌గా హైదరాబాద్
హైదరాబాద్ ను విశ్వనగరంగా అబివృద్ధిచేసే దిశలో ఐ.సి.టి పాలసీ చేపట్టింది. సాంకేతిక రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి హైదరాబాద్‌ను అనుకూలమైన ప్రాంతం గా మలచేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాం.స్టార్టప్ హబ్ గా హైదరాబాద్ రూపుదాల్చింది. ప్రస్తుతం నగరంలో 1300 ఐ.టి పరిశ్రమలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇందులో 500 గ్లోబల్ కంపెనీలు ఉన్నాయి. కేంద్రప్రభుత్వ సహకారంతో చేపడుతున్న ఐ.టి.ఐ.ఆర్ ప్రాజెక్టువల్ల దాదాపు రూ.2,35,000 కోట్ల విలువైన ఐ.టి ఉత్పత్తులు ఎగుమతి కావడంతోపాటు, 15 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 53 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. దీనివల్ల రాష్ట్రప్రభుత్వానికి రూ.30 వేల కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆదాయం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం టీ – హబ్ మొదటి దశను ప్రారంభించింది. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యూబేటర్‌ను గచ్చిబౌలీలో ఏర్పాటుచేసింది.70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం ఏర్పాటుచేశారు.ఈ ఏడాది ఆఖరునాటికి రూ. 150 కోట్ల రూపాయల వ్యయంతో మరో 3 లక్షల చదరపు అడుగులలో రెండవ దశ టి- హబ్ ఏర్పాటుచేయడం జరుగుతుంది.
పెట్టుబడులకు అనుకూలంగా…
ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం, టి.ఎస్.ఐపాస్ ల వల్ల దేశ విదేశాల నుంచి భారీ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు.ఇప్పటికే దాదాపు రూ. 25 వేల కోట్ల పెట్టుబడులతో 1013 పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. దీనిద్వారా నైపుణ్యం కలిగిన75 వేల మందికి ఉపాధి లభిస్తుంది.ఎస్.సి, ఎస్.టి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం టి.ఎస్ ప్రైడ్ కార్యక్రమాన్ని అమలుచేస్తోంది.
మహిళా సంక్షేమం
ఐ.సి.డి.ఎస్ కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం తన సహకారాన్ని తగ్గించినప్పటికీ మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుంది. అంగన్ వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం రూ.4200 నుంచి రూ. 7.000 కు పెంచింది. అంగన్ వాడీ హెల్పర్లకు రూ. 2200 నుంచి రూ. 4500 లకు పెంచడం జరిగింది. గర్భిణులు, తల్లులకు అవసరమైన పోషకాహారాన్ని అందించే లక్ష్యంతో ‘ఆరోగ్య లక్ష్మి’ పేరిట 2015 జనవరి నుంచి సమగ్ర పోషకాహార పథకాన్ని అమలుచేస్తున్నాం. మహిళ రక్షణ కోసం షీ టీములు, టాక్స్ ఫోర్స్‌ను ఏర్పాటుచేయడం జరిగింది.
మైనారిటీల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.1100 కోట్లు కేటాయించారు.షాదీ ముబారక్ కింద 2015-16 బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు వ్యయపరిచారు. మైనారిటీల పిల్లల కోసం పెద్దసంఖ్యలో మదరసాలు ప్రారంభించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వం ఎస్.సి, ఎస్.టి సబ్‌ప్లాన్ కింద బడ్జెట్లో 22 శాతం నిధులను కేటాయించింది. ఎస్.సి.లకు రూ.8,000 కోట్లు, ఎస్.టి లకు రూ.5,000 కోట్లు కేటాయించారు. భూమిలేని దళితులకు 3 ఎకరాల చొప్పున వ్యవసాయ యోగ్య భూమిని కేటాయించే కార్యక్రమం అమలుకు బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు. ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ లో కొమురం భీం స్మారకార్థం స్మారక చిహ్నాన్ని, గిరిజన మ్యూజియాన్ని నిర్మిస్తోంది.
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రూ.5424 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి రూ. 2,421 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు నాలుగు లేన్ల రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు రెండు లేన్ల్ల రోడ్ల నిర్మాణానికి కార్యక్రమం రూపొందించింది. వీటితోపాటుగా ప్రతి సంవత్సరం 40 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఆహార భద్రతాచర్యలలో భాగంగా నిరుపేదలందరికీ కిలో రూపాయి బియ్యం పథకం క్రింద కోటాను పెంచడంతోపాటు, ఈ పథకం అమలుకు ఆదాయ పరిమితిని కూడా ప్రభుత్వం పెంచింది. ఈ పథకం కింద రాష్ట్రంలో 2 కోట్ల 80 లక్షల మందికి లభ్దిచేకూరుతోంది.
19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాన్ని ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది.రాష్ట్ర పండుగలుగా ప్రకటించిన బోనాలు, బతుకమ్మల పండుగలతోపాటు, గత ఏడాది వచ్చిన గోదావరి పుష్కరాలను కూడా గతంలో ఎన్నడూలేని విధంగా అద్భుతంగా నిర్వహించింది. అలాగే సంస్క తీ పరిరక్షణకోసం తెలంగాణ సాంస్క తిక సారథిని ఏర్పాటుచేసింది.
ప్రజా రక్షణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా పోలీసు బలగాలను పటిష్ట పరచడానికి, నిఘావ్యవస్థను పటిష్ట పరచడానికి ప్రభుత్వం పలుచర్యలు చేపట్టింది. అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు విభాగం వివిధ కార్యక్రమాలు అమలుపరుస్తోంది.
చివరిగా, గోదావరి కృష్ణా జీవనదుల జలాలతో తెలంగాణ భూములు తడవాలని, పచ్చని పంటలతో ఈ నేల పరవశించా లనీ, సుఖం, శాంతి ప్రజలకు చేకూరాలనీ, స్వరాష్ట్రంలో ప్రజలు కన్న కలలు నెరవేరాలనీ, మన:స్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ లక్ష్య సాధనలో యువతరం ముందుకు రావాలి. ప్రభుత్వ పథకాల అమలులో యువత భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. బాధ్యత గల పౌరులుగా మనందరం సమిష్టిగా శ్రమించుదాం. మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ఉజ్వల భారతాన్ని నిర్మించుకుందాం. యావన్మంది రాష్ట్ర ప్రజానీకం ఆశించే బంగారు తెలంగాణ సాధన లక్ష్యంతో అహర్నిశం, అనుక్షణం కృషి చేద్దాం. అందరికీ మరోమారు శుభాభివందనాలు.
జై హింద్.