దశాబ్దాల పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం విజయవంతంగా తన మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నది. తొలి రాష్ట్ర అవతరణోత్సవాలను జరుపుకొంటోంది. ఎన్నో ఆకాంక్షల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దార్శని కతతో ‘బంగారు తెలంగాణ’ వైపు అడుగులు వేస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే అనేక సమస్యలు చుట్టుముట్టాయి. అధికారుల విభజన జరగక పోవడం, ఆస్తుల పంపకాలు పూర్తి కాకపోవడం, ప్రభుత్వ సంస్థలపై స్పష్టత లేకపోవడం లాంటి సమస్యలతో పాటు ప్రక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా పెట్టే ఇబ్బందులు కూడా తెలంగాణ రాష్ట్రానికి తలనొప్పిగా మారాయి.
దాదాపు 60 ఏళ్ల పాటు సాగిన సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి వారసత్వంగా వచ్చిన విద్యుత్ సంక్షోభం, మౌలిక సదుపాయాల లేమి, మంచినీటి సమస్య, సాగునీటి ఇబ్బందులు కొత్త రాష్ట్రానికి పెద్ద శాపంగా మారాయి. ఓ వైపు చుట్టూ ముసురుకున్న సమస్యలను పరిష్కరించుకుంటూనే మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి తక్షణ, మధ్య కాలిక, దీర్ఘకాలిక కార్యక్రమాలను రూపొందించుకోవలసిన అవసరం ఏర్పడిరది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖర రావు తన అపార రాజకీయ అనుభవాన్ని, ఉద్యమ నేపథ్యాన్ని, ప్రజాప్రతినిధిగా పలు సమస్యల పరిష్కారంలో చూపించిన చొరవను, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో సాధించిన స్వీయ ఫలితాలనన్నింటిని మేళవించి రాష్ట్రానికి కొత్త దశను, దిశను నిర్దేశించారు.
2014 జూన్ 2న ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఏడాది తిరిగే సరికి అనేక అంశాల్లో ఎంతో పురోగతి సాధించింది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటిని అమలు చేసే విషయంలో కూడా ఓ ఖచ్చితమైన, పారదర్శకమైన పద్దతి పాటించడం వల్ల ఫలితాలు సాధ్యం అయ్యాయి. రాష్ట్రంలో చేపట్టాల్సిన పనులను 4 భాగాలుగా విభజించుకొని ముఖ్యమంత్రి విధానాలు రూపొందించి అమలు చేస్తున్నారు.
1. అభివృద్ది, 2. పరిశ్రమలు – మౌలిక సదుపాయాలు, 3. సంక్షేమం, 4. సాంస్కృతిక పునర్వికాసం. పాలనను ఈ నాలుగు భాగాల కింద విభజించుకుని పథకాలు రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
పౌరులకు కనీస సదుపాయాలు కల్పించడం, ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందించడం, ప్రతి గ్రామానికి సాగునీరు అందేలా చూడడం, అన్ని రహదారులను అభివృద్ధ్ది చేయడం, రాష్ట్రాన్ని హరిత నందనంగా తీర్చిదిద్దడం, మహిళలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించడం, సరికొత్త పారిశ్రామిక విధానం, విద్యుత్‌లో స్వయం సమృద్ధి సాధించడం, స్వచ్ఛ తెలంగాణ, కల్యాణలక్ష్మి, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ది, బలహీన వర్గాల సంక్షేమం, పేదలకు గృహ నిర్మాణం, దళితులకు భూ పంపిణీ, ఆసరా పెన్షన్ల లాంటి కార్యక్రమాలెన్నింటినో ప్రభుత్వం ప్రారంభించి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నది.
కేవలం విధానాలు రూపొందించడంలోనే కాకుండా అవి ప్రజలకు నేరుగా చేరే కార్యాచరణను కూడా ముందుగానే పక్కాగా నిర్ణయించడం కేసిఆర్ పరిపాలనలోని ముఖ్య అంశం. దాదాపు ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పథకాన్ని ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించి, అందరితో చర్చించి రూపొందిస్తున్నారు. సమీక్షలను కేవలం మంత్రులు, సీనియర్ అధికారులకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులను కూడా పిలిపించి మాట్లాడుతున్నారు. వారందరి అభిప్రాయంతో కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. దీనివల్ల పథకం లేదా కార్యక్రమం అమలులో వచ్చే ఇబ్బందులు, సమస్యలు ముందుగానే ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి. ఫలితంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం కూడా సాధ్యమవుతున్నది.
సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినప్పుడు ఎంఆర్‌ఓలు, ఎంపిడిఓలతో, మిషన్ కాకతీయ రూపొందించినప్పుడు నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లతో, ‘వాటర్ గ్రిడ్’ రూపకల్పన చేసేటప్పుడు ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇలతో, హరిత హారం తీసుకున్నప్పుడు ఫారెస్ట్ రేంజర్లతో, ఐసిడిఎస్‌ను సమీక్షించినప్పుడు అంగన్‌వాడి వర్కర్లతో ముఖ్యమంత్రి నేరుగా సమావేశమయ్యారు. కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా ఎస్పీతో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన అధికారులందరిని కూడా ఆహ్వానించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో వారందరిని భాగస్వామ్యులను చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులతో మాట్లాడడం వల్ల అమూల్యమైన సూచనలు, సలహాలు కూడా అందుతున్నాయి. ఇవి పరిపాలనలో పారదర్శకతకు, వేగానికి కారణమవుతున్నాయి. సరికొత్త పథకాలను రూపొందించి, వాటిని నేరుగా ప్రజలకు చేరువ చేసి ఏడాది కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం దేశానికే దారిచూపింది.
ఉద్యమంలా మిషన్‌కాకతీయ:
రాష్ట్రంలో ‘మిషన్‌కాకతీయ’ పనులు ఉద్యమంలా కొనసాగుతున్నాయి. ఏ జిల్లాలో చూసినా చెరువుల్లో పూడికతీత నిరాటంకంగా జరుగుతున్నది. వచ్చే వర్షాకాలం నాటికి చెరువులు సాగునీటితో కళకళలాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ‘మిషన్‌కాకతీయ’ అనుకున్న ఫలితాలను సాధించేదిశగా ముందుకు సాగుతున్నది. గ్రామగ్రామాన ప్రజలు పలుగు,పారలతో, ఆటాపాటలతో ఉత్సాహంగా పనులలో పాల్గొంటున్నారు.
రాష్ట్రంలో చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేకంగా ‘మిషన్ కాకతీయ’ పథకానికి రూపకల్పన చేశారు. కాకతీయ రాజుల కాలంలో ఉన్న గొలుసుకట్టు చెరువులను పునరుద్ధ రించి చెరువుల్లో నీటినిలువ సామ ర్థ్యాన్ని పెంచాలనే తలంపుతో ఈ పథకాన్ని రూపొందించారు. దీనిద్వారా గ్రామాలలోని భూమి చాలావరకు సాగులోకి వచ్చే పరిస్థితులు ఏర్పడ తాయి. చెరువుల్లో ఉన్న వొండ్రుమట్టిని రైతులే ముందుకు వచ్చి పొలాలకు తోలుకుంటున్నారు.
దీనివల్ల రెండు ఫలితాలు వస్తున్నాయి. ఒకటి చెరువులు పూడిక తీయబడి, నీటి నిలువ సామర్ధ్యం పెరిగి నీటితో కళకళలాడడమే కాకుండా భూగర్భజలమట్టం కూడా పెరగడానికి ఉపయోగ పడుతుంది. ఇక వొండ్రుమట్టి పొలాల్లో వేయడం వల్ల పొలాలు సారవంతమై అధికదిగుబడి సాధించడానికి ఉపయోగ పడు తుంది. ఇలా రెండు విధాల ఉపయోగపడుతున్న మిషన్ కాకతీయ పనులు నీటిపారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వయంగా పలుగు,పారా చేతపట్టి, మట్టితట్ట నెత్తిన మోసి ఈ కార్య క్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో గల సుమారు 45వేల చెరువులను రాగల నాలుగేళ్ళ కాలంలో పునరుద్ధరించాలన్నది ఈ మిషన్ కాకతీయ లక్ష్యం.
వాటర్ గ్రిడ్‌తో ఇంటింటికి నల్లా నీళ్లు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందివ్వాలని ‘తెలంగాణ డ్రిరకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్’ (వాటర్ గ్రిడ్) కార్యక్రమాన్ని పభుత్వం చేపట్టింది. ప్రతి ఇంటి లోపల నల్లా ద్వారా నీరు ఇవ్వాలని ప్రభుత్వ సంకల్పం. వచ్చే ఎన్నికల నాటికి ఇలా నీళ్లివ్వకుంటే ఓట్లు కూడా అడగమని ముఖ్యమంత్రి శపథం చేసి ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్లు, మున్సిపాలిటీలలో 135 లీటర్లు, కార్పొరేషన్లలో 150 లీటర్లు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా, గోదావరి లాంటి పెద్ద నదులతో పాటు వాటి ఉప నదుల నుండి గ్రామాలకు నీరు తరలించడానికి పైపులైను నిర్మిస్తారు. నదుల నుండి ఇంటేక్‌వెల్స్ ద్వారా తీసిన నీటిని ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ది చేసి గ్రామాలకు సరఫరా చేస్తారు. అడ్డంకులన్నింటిని దాటుకుని వాటర్‌గ్రిడ్ పనులు ప్రారంభం అయ్యాయి. రోడ్లు, హైవేలు, కాలువలు, రైల్వే ట్రాకులను దాటాల్సిన చోట్ల అనుమతులు కూడా వచ్చాయి. హడ్కో, నాబార్డ్ నుండి దాదాపు రూ.13,000 కోట్ల రుణం కూడా వస్తున్నది. రాబోయే మూడేళ్లలో పథకాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నది.
తెలంగాణకు హరిత హారం :
తెలంగాణలో గ్రీన్ కవర్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘తెలంగాణకు హరితహారం’ అనే పథకానికి ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు రూపకల్పన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 40 లక్షల మొక్కలు పెంచు తున్నారు. ఇందుకోసం గ్రామాలలోనే నర్సరీలు ఏర్పాటు చేశారు. ఈ జూలై రెండవవారంలో నాటడానికి నర్సరిలో మొక్కలు సిద్ధమయ్యాయి. వచ్చే రెండేళ్ల ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం మొక్కల పెంపకం చేపడుతున్నారు. జూలై రెండవ వారంలో ‘హరితహారం వారోత్సవం’ నిర్వహిస్తారు.
2015-16 బడ్జెట్ లో హరితహారానికి రూ.325 కోట్లు కేటాయించారు. ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమం నిర్వహించాలని, దీనికోసం విస్తృత ప్రచారం నిర్వహించాలని, విద్యార్థులను భాగస్వాములను చేయాలని, సాంస్కృతిక సారథి కళాకారులను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వచ్చే నాలుగేళ్ల పాటు హరిత హారం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఏడాది వర్షాలు పడిన తరువాత 40 కోట్ల మొక్కలు నాటాలి. హరిత హారం కార్యక్రమానికి నిధుల కొరతలేదు. కాంపా నిధులు వాడుతారు. ఇజిఎస్ తో అనుసంధానం చేస్తారు. ఈ ఏడాది మొక్కలు నాటడంతో పాటు వచ్చే ఏడాది 60-70 కోట్ల వరకు మొక్కలు పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వాటర్ గ్రిడ్ కార్యక్రమంతో నీటికి కూడా కొరత ఉండదు. రిజర్వాయర్ల దగ్గర ఎక్కువ విస్తీర్ణంలో నర్సరీలు పెడుతున్నారు. జిల్లాల్లో ఉండే డ్యామ్‌ల నీటిని మొక్కలకు వాడతారు.
రోడ్లకు మహర్దశ :
తెలంగాణ రాష్ట్రంలో రహదారులను మెరుగు పరచాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు పరిపాలన అనుమతులు, పనులు ప్రారంభమయ్యాయి.
సింగిల్‌విండో పారిశ్రామిక విధానం:
తెలంగాణ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడానికి పరిశ్రమలు రావలసిన అవసరం వుంది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్‌కు, తెలంగాణకు పరుగులు పెట్టె విధంగా దేశంలో మరెక్కడా లేనటువంటి అద్భుత పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం సిద్దం చేసింది. పరిశ్రమలకు అనుమతులిచ్చేందుకు పూర్తి పారదర్శక, సరళమైన, అవినీతి రహితమైన విధానాలను ప్రభుత్వం అనుసరిస్తోంది. సింగిల్‌విండో సిస్టం ద్వారా 15రోజుల్లోనే అన్ని రకాల అనుమతులిస్తోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే స్పెషల్ చేజింగ్ సెల్ ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్తలు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వారికి భూమి, నీరు విద్యుత్ ఇతర మౌలిక సదుపాయలను సిద్ధంచేసి టిఎస్‌ఐఐసి ద్వారా అనుమతులు తీసుకొని పరిశ్రమలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రభుత్వమే చేస్తుంది.
రాచకొండలో సినిమా సిటీ
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల మధ్యనున్న రాచకొండ గుట్టలు, పరిసర ప్రాంతాల్లో రెండువేల ఎకరాల విస్తీర్ణంలో భారీ సినిమాసిటీ ఏర్పాటు చేయాలని పభుత్వం భావిస్తున్నది. రాచకొండ గుట్టలు, పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేశారు. తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి పెద్ద పీట వేస్తోంది. రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధిలో భాగంగా హాలీవుడ్ స్థాయిలో, గ్లోబల్ టెక్నాలజీతో సినిమాసిటీ నిర్మిస్తారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించే స్థాయిలో రెండువేల ఎకరాల్లో ఈ సినిమాసిటీ ఉంటుంది. ఈ సిటీ నిర్మాణం వల్ల పెద్దగా పరిశ్రమలు లేని ఈ ప్రాంతానికి ఆ లోటు తీరడంతోపాటు పర్యాటక ప్రాంతంగానూ తీర్చిదిద్దేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సీఎం స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రాజధాని హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలోనే పరుచుకున్న ఈ అడవులు, కొండలు ఎక్కువ భాగం నల్లగొండ జిల్లాలో, కొంత భాగం రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లోనూ విస్తరించి ఉన్నాయి.
అలాగే ఫార్మాసిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు.
ప్రజా సమస్యల విన్నపానికి ‘టోల్ ఫ్రీ నంబర్’
ప్రజలు తమ విజ్ఞప్తులు, ఫిర్యాదులు చెప్పడానికి, సమస్యలు విన్నవించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. వరంగల్ పర్యటన సందర్బంగా ముఖ్యమంత్రి జనవరి 10, 2015న ప్రభుత్వం తరపున 040-23454071 నంబర్‌ను ప్రకటించారు. అదే రోజు సాయంత్రం వరకు వివిధ జిల్లాల నుండి ఈ నంబర్‌కు 2534 మంది తమ సమస్యలు చెప్పుకున్నారు. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లయ్ మెసెజ్ కూడా అందింది. ఈ నంబర్ ద్వారా ప్రస్తుతం 30 లైన్లు పనిచేస్తున్నాయి. అయినప్పటికి సరిపోవడం లేదు. లైన్లు బిజిగా ఉంటున్నాయి. దీంతో మరో 30 లైన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకేసారి 60 మంది ఫోన్ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించే వెసులుబాటు కలుగుతుంది.
క్రీడాకారులకు రూ.10 వేల పెన్షన్
క్రీడారంగంలో రాణించిన ప్రముఖులకు నెలకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా గతంలో క్రీడారంగానికి సేవలు అందించిన వారికి ఏడాది పాటు నెల నెలా సహాయం అందిస్తున్నారు.
ఇరుగుపొరుగుతో సఖ్యత
ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కె.సి.ఆర్. చొరవ చూపుతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 7 ఫిబ్రవరి, 2015న ముంబయి లోని రాజ్‌భవన్‌లో బేటీ అయ్యారు. ఈ భేటిలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నిర్మించ తలపెట్టిన అంతరాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకొని రెండు రాష్ట్రాల్లోని రైతులకు సాగునీరు అందించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. గోదావరి జలాలను సమర్ధవంతంగా ఉపయోగించు కోవాలని తీర్మానించారు. భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు, కోర్టు కేసుల పరిష్కారం, ముంపు ప్రాంత ప్రజల అభ్యంతరాలు తదితర అంశాలను చర్చించి ఎప్పటికప్పపుడు నిర్ణయం తీసుకోవడానికి వీలుగా రెండు రాష్ట్రాల నిపుణుల కమిటీని నియమించుకోవాలని నిర్ణయించారు.
బీబీనగర్‌లో ఎయిమ్స్ :
నల్గొండ జిల్లా బీబీ నగర్ గ్రామ పరిధిలో నిర్మిస్తున్న నిమ్స్ స్థానంలో ఏయిమ్స్‌ను నెలకొల్పాలని కె.సి.ఆర్. నిర్ణయించారు. ప్రస్తుతానికి 400 ఎకరాల భూమి అందుబాటులో వుంది, మరికొంత భూమి సేకరించే అవకాశం వుంది. హైదరాబాద్ కు సమీపంలో వుండటం, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి ప్రక్కనే ఉండటం, రింగురోడ్డు కూడా దగ్గరే ఉండటం తదితర సానుకూలతలు బీబీనగర్‌కు ఉన్నయి. ఏయిమ్స్ ఏర్పాటు కానుండటం తెలంగాణ లోని అన్ని జిల్లాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ స్థలం రోగులకు, వైద్యులకు కూడా అనుకూలం. వైద్య శాలతో పాటు వైద్య కళాశాల, నర్సింగ్ లాంటి కళాశాలకు వినోద, వ్యాపార, విద్యా సంస్థలు కూడా ఎర్పాటు చేస్తారు. అద్భుతమైన టౌన్ షిప్ అభివృద్ది చెందుతుంది, హెల్త్ ఫార్మా సిటీ కూడా వస్తాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనం, స్థలం ఏయిమ్స్ కు అప్పగిస్తారు. అలాగే, తెలంగాణలో హెల్త్ యూనివర్సిటి స్థాపించనున్నారు. కాళోజి యూనివర్సిటి ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో యూనివర్సిటిని వరంగల్‌లో స్థాపించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో పాటు తెలంగాణకు ప్రత్యేక మెడికల్ కౌన్సిల్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం :
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మొదటి దశ పనులు చేయడానికి రూ.14,350 కోట్ల మేర పరిపాలన అనుమతులు ఇస్తూ ఫిబ్రవరి 6, 2015న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సంబందిత ఫైళ్లపై సంతకం చేసి పరిపాలనా అనుమతులు ఇచ్చారు. జూరాల రిజర్వాయర్ నుండి కోయిల్ కొండ వరకు 70 టిఎంసిల నీటిని ఎత్తిపోయడానికి మొదటి దశ పనులు చేపడతారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 3 జిల్లాల్లో 10 లక్షల ఎకరాలను సాగులోకి తేవడంతో పాటు చాలా ప్రాంతాలకు మంచినీరు కూడా అందిస్తారు.
క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం :
రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందిస్తోంది. క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడలలో పాల్గొనడానికి ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తున్నాయి. కాబట్టి అంతర్జాతీయ క్రీడలలో పాల్గొనే వారికి మూడు లక్షల రూపాయలు ఖర్చుల కోసం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ పోటీలలో స్వర్ణ పథకం సాధించిన వారికి 50 లక్షల రూపాయలు, రజత పథకం సాధించిన వారికి 25 లక్షల రూపాయలు, కాంస్య పథకం సాధించిన వారికి 25 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. పథకాలు సాధించిన క్రీడాకారుల కోచ్‌లకు కూడా క్రీడాకారులతో సమానంగా నగదు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరెస్ట్ శిఖరం అధిరో హించి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన గిరిజన, దళిత బిడ్డలు పూర్ణ, ఆనంద్‌లకు చెరో 25 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహం కూడా ప్రభుత్వం అందించింది.