”రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేస్తాం… ఒకవేళ ఈ లక్ష్యాన్ని కార్యరూపంలోకి తీసుకురాలేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలను వోట్లు అడగం…” అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతిన బూని చేపట్టిన బృహత్తర పథకం, ”మిషన్ భగీరథ”. ఈ పథకం రూపకల్పన, కార్యాచరణ తీరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమై సబ్బండ వర్గాల ప్రశంసలు చూరగొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘మిషన్ భగీరథ’ తొలిదశను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య పథకంగా నిర్వచించిన ఈ కార్యక్రమం కింద స్వచ్ఛమైన మంచినీరు సామాన్యుల ఇళ్ళలోకి ప్రవహించనున్నాయి.
వాస్తవానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిపోతున్నా స్వచ్ఛమైన మంచినీటిమాట అటుంచి కనీసం దప్పి తీర్చుకోవడానికి గుక్కెడు నీళ్ళు లభించని దయనీయ పరిస్థితులు అనేక చోట్ల దర్శనమివ్వడం దురదృష్టకరం కాక మరేమిటి? ఈ దుస్థితిని శాశ్వతంగా నివారించే ఉదాత్త ధ్యేయంతో ముఖ్యమంత్రి రూపొందించిన పథకం రికార్డు సమయంలో ప్రజలకు సేవలు అందించేలా నిర్దేశించారు. ఎక్కడా ఏ విధమైన లోటుపాట్లు, అస్పష్టతకు తావులేకుండా నిర్దిష్టంగా రూపుదిద్దుకున్న ఈ పథకం ఇన్నాళ్ళకు చరిత్రలో ఎవరికీ ఊహకందని స్థాయిదనడంలో ఏమాత్రమూ అతిశయోక్తిలేదు.
ఇక పర్యావరణ పరిరక్షణ, పచ్చదనాన్ని పెంచిపోషించే ధ్యేయంతో చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ ప్రజా ఉద్యమంగా ముందుకు సాగుతున్నది. పదేళ్ళ చిన్నారి నుంచి పండు ముదుసలి వరకు ఇందులో స్వచ్ఛందంగా భాగస్వాములై మొక్కలు నాటుతూ వాటిని రక్షిస్తామని ప్రకటిస్తున్నారు. సమస్య తీవ్రతను స్పష్టంగా ప్రజలకు వివరించగలిగితే ఉద్యమస్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ చైతన్య వంతులై కర్తవ్యాన్ని నిర్వహిస్తారనడానికి ఇది తిరుగులేని ఉదా హరణ. పచ్చదనం ఆశించిన స్థాయిలో పెరిగి వానలు వాపస్ రావాలని, కోతులు అడవికి తిరిగి పోవాలని ఆశిద్దాం!