“గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః”

దేవుడు లేని గుడి, మాష్టారు లేని బడి ఊహించుకోవడం కష్టం. అదే మాష్టారు బడిలో పాఠాలు మాత్రమే చెప్పి వదిలేయకుండా పాఠశాల గురించి, గ్రామం గురించి శ్రద్ధ తీసుకుంటే ఎలా ఉంటుంది. ప్రతీ రోజు సమయానికి పాఠశాలకు రాకుండా నిత్యం సెలవులతో గడిపే ఉపాధ్యాయులు ఉన్న ఈ కాలంలో తాను ఒక్కరోజు బడికి ఆలస్యంగా వచ్చినా తన జీతంలోని ఆరోజు డబ్బులను గ్రామాభివద్ధికి అందచేస్తాను అనే ఉపాధ్యాయులు ఎక్కడుంటారు చెప్పండి… లేరనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అలాంటి ఉపాధ్యాయుని గురించి మనం ఇప్పడు తెలుసుకుందాం.

ప్రక్కనే కష్ణమ్మ గలా గలా శబ్దం. మరో వైపు రాళ్ళ శబ్దంతో మారు మ్రోగుతుండే అతి మారు మూల పల్లె ఆ గ్రామం… ఇటు నల్గొండ అటు కష్ణ సరిహద్దులో ఉన్న ఆ గ్రామం నిరంతరం బాంబులతో దద్దరిల్లుతుండేది. ఫ్యాక్షన్‌ కు ప్రతి రూపం కూడా ఆ గ్రామం.. అది ఒక్క నాటి మాట.. ఇప్పుడు అన్ని మారిపోయాయి. బాంబుల చిట్యాలగా పేరుపొందిన ఆ గ్రామం ఇప్పడు బంగారు పాఠశాల కలిగిన చిట్యాలగా పేరుతెచ్చుకుంది. దీనికి కారణం అక్కడ పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన ప్రధానోపాధ్యాయుడు సతీష్‌ తనదైన శైలిలో పాఠశాల అభివద్ధితో పాటు గ్రామాభివద్ధికి కూడా తోడ్పాటును అందిస్తున్నాడు.

నల్లగొండ జిల్లా మాడ్గులపల్లికి చెందిన సతీష్‌ విద్యాభ్యాసం అంతా ప్రవేటు పాఠశాలలోనే జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉంటాయో కూడా తనకు తెలియదు. తన 22వ ఏట ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కొలువు దొరికింది. ఏదో సాధించాలనే తపనతో ఉద్యోగంలో చేరాడు. 2010 నుండి ఇదే పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. తాను వచ్చినప్పుడు కేవలం 20మంది విద్యార్థులు కూడా సరిగా స్కూలుకు వచ్చే వారు కాదు. ఎదో సాధించాలనే తాపత్రయంతో ఉద్యోగంలో చేరిన సతీష్‌ కు పాఠశాల దుస్థితి చూసి బాధ కలిగింది. కొన్ని సంవత్సరాల పాటు ఏకోపాధ్యాయుడిగా ఉంటూ ఎలాంటి ఎదుగుబొదుగు లేకుండానే గడిచిపోయింది. ఇక లాభం లేదు ఏదో ఒక్కటి చేసి గ్రామస్తుల్లో మార్పు తీసుకురావడంతో పాటు సర్కారు బడుల పట్ల ప్రజలలో నమ్మకాన్ని పెంచాలనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా ఈ గ్రామంలో నివసించి తర్వాత ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డ వారితో ఒక మీటింగ్‌ ఏర్పాటు చేశాడు. వారందరితో గ్రామాభివద్ధి, పాఠశాల అభివద్ధిపై చర్చించాడు. దీనితో పాటు గ్రామంలో ఉన్న ప్రతీ ఒక్క పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని కోరుతూ బడిబాట కార్యక్రమాలను నిర్వహించాడు. క్రమంగా విద్యార్థుల సంఖ్య 63కి చేరింది. ఎంతో కషి చేసి విద్యార్థుల సంఖ్య అరవైకి పెంచడంతో ఎంఈఓ బాలూ నాయక్‌ తన కషిని గుర్తించి విద్యార్థి సంఖ్య దామాషా ప్రకారం ఒక విద్యావలంటీర్‌ను పాఠశాలకు కేటాయించారు. 2018లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడంతో తన బాధ్యత మరింత పెరిగినట్టయింది. గ్రామంలోని 80శాతం విద్యార్థులు ఈ పాఠశాలకు వస్తున్నప్పటికి 20శాతం మంది మాత్రం బయట ప్రవేటు పాఠశాలలకు వెళుతుండటం గమనించాడు. వారందరికీ భరోసా కల్పించడం ద్వారా నూటికి నూరు శాతం పిల్లలను ఇదే పాఠశాలలో చదివే విధంగా చేయవచ్చని భావించాడు. దీనితో వారికి భరోసా కల్పించడం కోసం పాఠశాల గేట్‌ వద్ద ఒక బోర్డును ఏర్పాటు చేయించాడు. ‘మీ పిల్లల చదువు మా బాధ్యత’ అంటూ నమ్మకం కలిగిస్తున్నాడు. మీ పిల్లల చదువు మా బాధ్యత అనే హెడ్డింగ్‌తో స్కూల్‌ ఆవరణలో బ్యానర్‌ను ఏర్పాటు చేశాడు. ”నెలలో ఏ ఒక్కరోజైనా ఒక్క నిమిషం పాఠశాల సమయం కన్నా లేటుగా వచ్చినా లేదా సాయంత్రం పాఠశాల సమయం కన్నా ఒక్క నిమిషం ముందుగా వెళ్లినా నా నెలజీతంలో ఆ రోజు జీతం గ్రామ పంచాయతీ వారు, విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకొని పాఠశాల అభివద్ధికి వినియోగించుకోవచ్చు” అని బహిరంగ ప్రకటన ఇస్తున్నాను అని సారాంశం అందులో ఉంది. బస్సులు కూడా సమయానికి రాని ఆ గ్రామానికి తాను సమయానికే వస్తానని, పిల్లలకు పాఠాలు చెప్పడానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని గ్రామస్తుల కు భరోసా కల్పించారు. ప్రతీ విద్యార్థి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడి వారిని ఒప్పించాడు. దీనితో పాటు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రతీ నెల సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పడికప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులతో పిల్లల భవిష్యత్తుపై సలహాలు సూచనలు అందిస్తున్నాడు. ఈ 8 సంవత్సరాల కాలంలో గ్రామస్తులతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. మూడు సార్లు ట్రాన్స్‌ఫర్‌ అవడానికి అవకాశం వచ్చినా దరఖాస్తు పెట్టకోకుండా ఇక్కడే పనిచేస్తూవస్తున్నాడు.

ప్రైవేటు పాఠశాల బస్సు మా ఊరుకు వచ్చినా ఏ ఒక్కరు ఎక్కకుండా స్వచ్ఛందంగా ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే వచ్చేలా చేయడం తన లక్ష్యం అని దానిని ఈ సంవత్సరం తప్పకుండా సాధిస్తానని సతీష్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. చిత్తశుద్ధితో చేసే ఏ మంచి పని అయినా తప్పకుండా విజయం సాధిస్తుందని ప్రధానోపాధ్యాయుడు సతీష్‌ ఆలోచనలు నిజం కావాలని కోరుకుందాం.
– చకిలం మంజుల

Other Updates