విద్యార్థులు కళాశాలలకు హాజరు కావడం గురించి చర్చిండానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ ప్రజాసమితి విద్యార్థి సంఘాల ప్రతినిధులు సమష్టిగా సమావేశాన్నొకదాన్ని జరపాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ రావాడ సత్యనారాయణ చేసిన సూచనను 1969 సెప్టెంబర్ 8న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ సూచన చేసేముందు ప్రజాసమితి ప్రతినిధులను సంప్రదించి వుండవలసిందని, అలా చేయకుండా ప్రకటన చేయడం ఏకపక్షవాదమవుతుందని డా|| చెన్నారెడ్డి అన్నారు. తెలంగాణ పత్రికా రచయితల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ ఈ సమావేశంలో తాము పాల్గ్గొనబోవడంలేదని డా|| చెన్నారెడ్డి అన్నారు. ఆందోళన ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలోను, పార్లమెంట్‌లోను కొనసాగించబడగలదని ఆయన తెలిపారు. తాము, ఇతర నాయకులు రేపటి (సెప్టెంబర్ 10) నుండి తెలంగాణ జిల్లాల్లో పర్యటించి వచ్చిన తర్వాత పరిస్థితినిబట్టి తెలంగాణకోసం తుది పోరాటాన్ని ఆరంభిస్తామని డా|| చెన్నారెడ్డి అన్నారు.
భార్గవ కమిటీ నివేదికపై..
తెలంగాణ పత్రికా రచయితల సభలో జస్టిస్ భార్గవ కమిటీ నివేదికపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, తెలంగాణ మిగులు నిధుల గురించి భార్గవసంఘం నివేదికను సమితి కార్యనిర్వాహకులు చదివారని, ఈ సంఘంతో తమట్టిె నిమిత్తం లేదని అన్నారు. మిగులు నిధుల విషయంలో అనుసరించవలసిన పద్ధతి ఈ వర నిర్ణయం చేయబడిందని, తెలంగాణ ప్రాంతీయ సంఘం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిని అంగీక రించి వున్నవని, అందువల్ల భార్గవ సంఘం నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరపెట్టి ఉండవలసిందని డా|| చెన్నారెడ్డి అన్నారు.
సెప్టెంబర్ 10న ఓయూలో రౌండ్ టేబుల్
తెలంగాణ ప్రజాసమితి, విద్యార్థి సంఘాలను సంప్రదించకుండానే ఏకపక్షంగా ఉస్మానియా యూనివర్సిటీలో వైస్‌ఛాన్సలర్ డా|| రావాడ సత్యనారాయణ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని సెప్టెంబర్ 10న నిర్వహిస్తున్నట్లు ప్రతికా ప్రకటన చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఒక సంవత్సరం విద్యాభ్యాసాన్ని కోల్పోకుండా చూసే మార్గాలను అన్వేషించడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజాసమితి నాయకులు, విద్యావేత్తలు, విద్యార్థి నాయకులు, అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఈ సభకు ఆహ్వానించామని రావాడ తెలిపారు. విశ్వవిద్యాలయంలోని వివిధ శాఖాధిపతులతో, ప్రిన్సిపాల్స్‌తో సెప్టెంబర్ 7న సమాలోచనలు జరిపి ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరపాలని నిర్ణయించామని తెలిపారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కళాశాలలను (సుమారు 8 నెలల తర్వాత) తిరిగి ప్రారంభింస్తున్నామని, తరగతులు సెప్టెంబర్ 5నుండి మొదలవుతాయని సెప్టెంబర్ ఒకటిన డా|| రావాడ పత్రికా ప్రకటన చేశారు. తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలను సెప్టెంబర్ ఒకటిన ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వం ముందే ప్రకటించింది. అయినా తరగతులకు విద్యార్థులు హాజరుకాకపోవడం, పలు విద్యాసంస్థలపై కొందరు (సదాలక్ష్మి నేతృత్వంలో) నాటుబాంబులు విసిరి భయానక పరిస్థితులు సృష్టించడంతో డా|| రావాడ రౌండ్ టేబుల్ సమావేశానికి నిర్ణయించారు.
రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేమన్న శ్రీధర్‌రెడ్డి
తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ¬దా లభించేవరకు ఈ ఆందోళన కొనసాగగలదని, ఉస్మానియా వైస్‌ఛాన్సలర్ డా|| రావాడ ఏర్పాటు చేసిన సభకు తన నాయకత్వంలోని తెలంగాణ ప్రజాసమితి నాయకులెవ్వరూ హాజరుకారని ఎం. శ్రీధర్‌రెడ్డి విలేకరులతో అన్నారు. విద్యార్థులు తరగతులకు హాజరు కావడమా, కాకపోవడమా అనే విషయంపై ఆయన వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాలకోసం ఆందోళన సాగించవలసిన తరుణం ఆసన్నమైందని శ్రీధర్‌రెడ్డి చెప్తూ, తెలంగాణ, విదర్భవంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఒరేకపు చర్యలు రూపొందించేందుకు త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
విద్యార్థి నేతలు మల్లికార్జున్, పుల్లారెడ్డిల అరెస్ట్
పాఠశాలల, కళాశాలల బహిష్కరణోద్యమం నడుపుతున్న విద్యార్థి నాయకులు మల్లికార్జున్, పుల్లారెడ్డిలను సెప్టెంబర్ 9 ఉదయం కోఠిలోని ఉస్మానియా వైద్యకళాశాలవద్ద పోలీసులు 151వ సెక్షన్ కింద అరెస్టు చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై ఇటీవలే వీరు జైలునుండి విడుదలైనారు. ఈ నాయకుల అరెస్టుపై శాసనసభలో మాణిక్‌రావు మాట్లాడుతూ, హైకోర్టు ఉత్తర్వులపై డిటెన్యూలను విడుదల చేసిన తర్వాత మరెవ్వరినీ అరెస్టు చేయడం జరుగదని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించిన హామీకి భిన్నంగా నేడు అరెస్టు చేశారని అన్నారు. ఈ అరెస్టులపై ముఖ్యమంత్రి వెంటనే ఒక ప్రకటన చేయాలని మరో సభ్యుడు జి. రాజారాం పట్టుబట్టి నారు. పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కూడా ప్రకటనకై సభలో ఒత్తిడి తెచ్చారు. టి.పురుషోత్తమరావు, ఎం.ఎం. హషీం, కోదాటి రాజమల్లు, కొండా లక్ష్మణ్ బాపూజీ, సుమిత్రాదేవి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంతలో మంత్రి జలగం వెంగళరావు సభలో ప్రవేశించి మల్లికార్జున్, పుల్లారెడ్డిలను అరెస్టు చేసినట్లు ధృవీకరిస్తూ ప్రకటన చేశారు. ఈ నాయకులిద్దరూ ఉస్మానియా వైద్యకళాశాలకు వెళ్ళి ప్రిన్సిపాల్‌ను, సిబ్బందిని, హాజరవుతున్న విద్యార్థులను బెదిరించారని ¬ంమంత్రి అన్నారు. ప్రిన్సిపాల్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా పోలీసులు వెళ్లి ఇద్దరినీ అరెస్టు చేయడం జరిగిందన్నారు.
ఇద్దరు ఉస్మానియా వైద్యకళాశాల అధ్యాపకులకు, ప్రిన్సిపాల్‌కు ఈ విద్యార్థి నాయకులు వ్రాసిన బెదిరింపు లేఖలను, ప్రిన్సిపాల్ కమిషనర్‌కు వ్రాసిన ఫిర్యాదును వెంగళరావు సభలో చదివారు. వివిధ కళాశాలల్లో, పాఠశాలల్లో, ఇటీవల పడవేసిన నాటుబాంబుల దృష్ట్యా, వారి బెదిరింపుల దృష్ట్యా ఈ విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకోవలసిన అవసరం కలిగిందని ¬ంమంత్రి సభకు తెలిపారు.
వెంగళరావు ప్రకటన చేస్తున్నప్పుడు తెలంగాణవాదులైన కొందరు శాసనసభ్యులు సుమారు గంటసేపు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వీరి మాటలను స్పీకరు బి.వి. సుబ్బారెడ్డి రికార్డులనుంచి తొలగించారు. ఈ విషయమై చర్చించాలని తెలంగాణ శాసనసభ్యులు పట్టుబట్టగా సభాపతి నిరాకరించారు.
ఐ.పి.సి. 448, 506 నేర నిబంధనలక్రింద ఈ విద్యార్థి నాయకులను అరెస్టు చేశామని, వీరిని కోర్టు రిమాండుకు పంపుతుందని ¬ంమంత్రి అన్నారు. గట్టి పోలీసు బందోబస్తు వున్నప్పటికీ సెప్టెంబరు 5న ఉస్మానియా వైద్యకళాశాలలో, సెప్టెంబరు 8న సుల్తాన్‌బజార్ మహిళా కళాశాలలో, కొద్ది రోజులుగా సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూల్‌లో, రోజరీ కాన్వెంట్‌లో నాటు బాంబులు పడినట్లు ¬ంమంత్రి సభకు తెలిపారు.
సెప్టెంబరు 9 మధ్యాహ్నం మల్లికార్జున్, పుల్లారెడ్డిలు వైద్య కళాశాల క్లాసు రూంలలోకి ప్రవేశించి విద్యార్థులను తరగతులకు హాజరు కావద్దని బెదిరించారని ఆరోపించారు.
సెప్టెంబరు 19వరకు ఇద్దరు నేతలను కోర్టు రిమాండుకు పంపింది. మల్లికార్జున్, పుల్లారెడ్డిల అరెస్టుకు నిరసనగా విద్యార్థులు తెలంగాణలోని పలు పట్టణాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సెప్టెంబరు 11న వరంగల్‌లో బంద్ జరిగింది.
విఫలమైన ఉస్మానియా రౌండ్ టేబుల్ సమావేశం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సెప్టెంబరు 11న వైస్‌ఛాన్సలర్ డా|| రావాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించబడిన రౌండ్ టేబుల్ సమావేశానికి వేలం 17మంది మాత్రమే హాజరవడంతో ఈ సమావేశం విఫలమైంది. ఈ 17 గురిలో ఇద్దరు మాత్రమే విద్యార్థి నాయకులు కాగా మిగిలినవారు విద్యాశాఖ డైరెక్టర్, విద్యావేత్తలు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు. డా|| చెన్నారెడ్డి, శ్రీధర్‌రెడ్డిల నాయకత్వంలోని తెలంగాణ ప్రజాసమితిలకు చెందిన వారెవ్వరూ హాజరుకాలేదు. డా|| మల్లికార్జున్, పుల్లారెడ్డిల అరెస్టుతో విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాజరుకాలేదు. హాజరైన ఇద్దరు విద్యార్థి నాయకులు ూడా తెలంగాణ సమస్యపై నిర్మాణాత్మక చర్యలు తీసుకోనిదే విద్యార్థులు తరగతులకు హాజరు కాబోరని, తాము భవిష్యత్తరం వారిని మోసగించజాలమని అన్నట్లు పత్రికలు తెలిపాయి.
హాజరైన ఇద్దరు ఎంపీలు అక్బర్ అలీఖాన్, బాకరలీ మీర్జాలు ”విద్యార్థులు తరగతులకు హాజరయ్యేందుకు సంపూర్ణ కృషి జరగాలి” అని అన్నారు. చదువుకోవడానికి కళాశాలలకు, పాఠశాలలకు హాజరు కావాలంటూ విద్యార్థులకు చేసే విజ్ఞప్తి ప్రతంపై సంతకం చేయడానికి బాకరలీ మీర్జా నిరాకరించారు. చదువుకోదల్చినవారికి విద్యా సౌకర్యాలు, రక్షణ కల్పిస్తామని డా|| రావాడ సత్యనారాయణ విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఆందోళనకారులచే బస్సుల దగ్ధ్దం, నాటుబాంబుల దాడులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ విద్యార్థుల ఆందోళన సెప్టెంబర్ నెలలో ూడా కొనసాగింది. విద్యాసంస్థలను తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పలు స్కూళ్ళపై, కాలేజీలపై ఆందోళనాకారులు నాటుబాంబులు విసిరారు. సెప్టెంబర్ 5న ఉస్మానియా వైద్యకళాశాలలో, 9న సికింద్రాబాద్ కీస్ హైస్కూల్‌లో, కోఠీలోని గుజరాత్ గల్లీలోని స్కూలుపై, 11న రాజబహదూర్ వెంకట్రాంరెడ్డి మహిళా కళాశాలపై, 20న నవజీవన్ పాఠశాల సమీపంలోని పోలీసుక్యాంపుపై, 27న సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీ హైస్కూల్‌పై, నయాబజార్, సుల్తాన్‌బజార్, నాంపల్లి బాలికల పాఠశాలలపై నాటు బాంబులు పడినవి. ఈ దాడులలో ఒక పోలీస్ కానిస్టేబుల్, ఉపాధ్యాయుడు గాయపడ్డారు. ఎవ్వరూ మరణించలేదు.
సెప్టెంబర్ 5న నగరంలో 6 బస్సులపై ఆందోళనకారులు రాళ్ళు రువ్వినారు. 8న రాణిగంజ్‌లో ఒక బస్సుకు నిప్పంటించారు. 13న బర్కత్‌పురా, ఇసామియాబజార్‌లలో బస్సులను దగ్ధం చేశారు. ఆబిడ్స్, గన్‌ఫౌండ్రి, మినర్వా టాకీస్ తదితర ప్రాంతాల్లో పలు బస్సులను దగ్ధం చేశారు.
స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులకు ప్రభుత్వ రక్షణ
తెలంగాణ ప్రాంతంలో విద్యాసంస్థల్లోకి పోలీసులు ప్రవేశించి విద్యార్థులపై దౌర్జన్యం చేయడమేమిటని పోలీసు జులుంను ప్రశ్నిస్తూ శాసనభలో .ఎస్. నారాయణ, కొండా లక్ష్మణ్ బాపూజీ, . అచ్యుతరెడ్డి, కోదాటి రాజమల్లు సావధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి స్పందిస్తూ ¬ంమంత్రి జలగం వెంగళరావు ”కాలేజీలకు, పాఠశాలలకు వెళ్ళి చదువుకోదల్చిన విద్యార్థులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందు విద్యా సంస్థలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ ధర్మం” అని సభకు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం కోరుతూ ప్రధానిని కలిసిన మహిళా నేతలు
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన మహిళా నేతలు టి.ఎస్. సదాలక్ష్మి (మాజీ మంత్రి), శాంతాబాయి (ఎమ్మెల్యే), సంగం లక్ష్మీబాయి (ఎంపీ) సెప్టెంబర్ 19న ప్రధాని ఇందిరను కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరినారు. ఆందోళన ప్రారంభమై ఏడాది పూర్తి కావస్తున్నదనీ, లక్షలాది విద్యార్థులు తరగతులకు హాజరుకావడంలేదని, మళ్ళీ ఆందోళన, విధ్వంసం హింసారూపం దాల్చే ప్రమాదముందని వారు ప్రధానికి తెలిపారు.
” బ్రహ్మానందరెడ్డితో సంప్రదించి తెలంగాణ సమస్యలకు ఒక పరిష్కారమేదైనా సాధించడానికి ంద్రం ప్రయత్నిస్తుంద”ని ప్రధాని ఈ నేతలకు చెప్పారు.
చదువుతూ పోరాడాలని నేతల నిర్ణయం
విద్యార్థులు వెంటనే తరగతులకు హాజరై చదువులు పునఃప్రారంభించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి కార్యాచరణ సంఘం, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు, తెలంగాణ ప్రజాసమితి నిర్ణయించింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున్‌లు విలేకరులతో మాట్లాడుతూ ” తెలంగాణలో పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినప్పటికీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం దారుణ అణచివేత విధానాలననుసరించినప్పటికీ ప్రత్యేక తెలంగా ణ ఉద్యమం గొప్పశక్తిని ప్రదర్శించింది. ఎలాంటి త్యాగాలకు లోనైనప్పటికీ తమ అంతిమ లక్ష్యమైన ప్రత్యేక తెలంగాణ సాధించు కునేందుకు తెలంగాణ ప్రజలు కృతనిశ్చయంతో వున్నాడని దేశ ప్రజలకు అర్థమయ్యింది. విద్యార్థులు ఎప్పటికీ ఉద్యమంలో భాగస్వాములే. ఎప్పుడు పిలుపునిచ్చినా వారు ఉద్యమిస్తారు. చదువులు కొనసాగిస్తూనే ఆందోళనల్లో పాల్గొనాలలి” అనిఅన్నారు.
ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కాసు, తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షులు చొక్కారావులు స్వాగతించగా కొన్ని విద్యార్థి బృందాలు వ్యతిరేకించాయి. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు సికింద్రాబాద్‌లో నిరసనకు దిగారు.
(శాసనసభలో తెలంగాణ చర్చ వచ్చే సంచికలో)