తెలంగాణ రాష్ట్ర 2016-17 వార్షిక బడ్జెట్ ‘కొత్త సీసాలో పాత సారా’ కానేకాదు. ఇది ప్రజల బడ్జెట్. రొటీన్‌గా రూపొందించే బడ్జెట్‌లకు భిన్నంగా, తెలంగాణ దశను మార్చే బడ్జెట్‌గా ఈ బడ్జెట్‌ను పేర్కొనవచ్చును.
2016 మార్చి 14న ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి.సుమారు ఒకటిన్నర దశాబ్దకాలం సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో, తెరాస ప్రస్థానంలో ప్రజలం కావాలి? వారేం కోరుతున్నారు? అనేది ప్రతి ఉద్యమ కార్యకర్తకు క్షుణ్ణంగా అర్థమైంది. ‘నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష’ అని ప్రొ|| జయశంకర్ ఇచ్చిన నినాదాన్ని తెలంగాణ సమాజం ఉద్యమ లక్ష్యంగా మలచుకున్నది. ‘గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి’ అంటూ తెలంగాణ గాయకులు గళమెత్తితే లక్షలాది మంది తమ గొంతు కలిపారు.
మూడున్నర కోట్ల ప్రజల చిరకాల స్వప్నం ఫలించింది. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రం కె.సి.ఆర్. అద్భుత వ్యూహంతో సాధ్య మైంది. ఉద్యమనేతలే పరిపాలకులుగా కొలువుదీరిన అపురూప దృశ్యం. 2014 జూన్ 2న పాలనా బాధ్యతలు చేపట్టిన టి.ఆర్.ఎస్. నేతలు గడిచిన 20 నెలల కాలంలో ఆర్ధిక రంగంతో సహా వివిధ రంగాలపై, అధికార యంత్రాంగంపై పట్టుసాధించారు. ‘తెలంగాణ వారికి పరిపాలన, చేతకాద’ని తూలనాడిన సీమాంధ్ర నేతలకు ప్రజలు మెచ్చే పాలన అంటే ఎలా ఉంటుందో, శాసనసభను ఎలా నిర్వహించాలో, నిజమైన ‘విజన్’ ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిలా, పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా శ్రమించి రూపొందించారు. సమైక్య రాష్ట్రంలో 1956 నవంబర్ ఒకటి నుండి 2014 జూన్ 2 దాకా తెలంగాణ ఆదాయాన్ని, కృష్ణా, గోదావరి నదుల్లో ఈ ప్రాంతానికి దక్కాల్సిన నీళ్ళను, తెలంగాణ యువతకు లభించాల్సిన ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఆంధ్ర నేతలు యధేచ్ఛగా దోచుకున్నారు. తెలంగాణ హక్కులను కాలరాచి తమ ప్రాంత అభివృద్ధికి మళ్ళించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంత ఆదాయాన్ని ఇక్కడే వినియోగించే అవకాశం లభించింది. నీళ్ళు ఎప్పటికీ రాని సాగునీటి ప్రాజెక్టులను, అందుబాటులో వున్న జలవనరులను వినియోగించుకోవడానికి వీలుగా రీ-డిజైనింగ్ చేసుకునే వీలు కలిగింది. తెలంగాణ ప్రాంతంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాలు ఈ ప్రాంతం వారి అత్యధికంగా దక్కే అవకాశం లభించింది. తెలంగాణ సమగ్రాభివృద్ధికై స్వల్పకాల, దీర్ఘకాల ప్రణాళికలను రూపొందించే స్వేచ్ఛ తొలిసారి తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులకు, పాలకులకు, నిపుణులకు లభించింది. ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు, అధికారులు, నిపుణులు, ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకుంటున్నారనడానికి 2016-17 బడ్జెట్‌ను ఉదాహరణగా తీసుకొనవచ్చును.
ప్రత్యేకతలు:
ఈ బడ్జెట్ ప్రత్యేకతల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రణాళికేతర వ్యయం కన్న ప్రణాలికా వ్యయం ఎక్కువగా ఉండడం. ప్రణాళికేతర వ్యయం 62,785 కోట్ల రూపాయలైతే ప్రణాళికా వ్యయం 67,630 కోట్లుగా నిర్ణయించారు. ప్రణాళికా వ్యయం పెరగడం వలన ఆస్తులు పెరుగుతాయి. తద్వారా ఉత్పాదక శక్తి, మౌలిక వసతులు పెరిగి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) పెరుగుతుంది. గతంలో ప్రణాళితేర పెట్టుబడి నాల్గింట మూడువంతులు, మూడింట రెండు వంతులుగా ఉండేది. ఇప్పుడిది సగానికి లోపే ఉండడం శుభసూచకంగా భావించవచ్చు. 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో రాష్ట్రం మొత్తంపై ఒక్క ఆర్ధిక సంవత్సరంలో చేయునంత ప్రణాళికా వ్యయాన్ని ఈ ఆర్ధిక సంవత్సరం తెలంగాణ పది జిల్లాలపై చేయాలని ప్రభుత్వం సంకల్పించడం అభినందనీయం.
ప్రణాళికా వ్యయంలో కొంత మొత్తం వేతనాలు, ఇతర వ్యయాలు (అప్పు చెల్లింపులు) కలిసి ఉన్నందున ఆస్తుల కల్పనపై పెట్టుబడి సుమారు రూ.33,209 కోట్లు వుండగలదని నిపుణుల అంచనా.
నీటి పారుదల రంగానికి అత్యంత ప్రాధాన్యత
ప్రణాళికా వ్యయం రూ. 67,630 కోట్లలో నీటి పారుదల రంగానికి కేటాయింపులు రూ. 26,652.35 కోట్లు.
మలిదశ తెలంగాణ ఉద్యమం ముందుకు తెచ్చిన ప్రధాన అంశం సాగునీటి రంగం యెడ ఆంధ్రపాలకులు అనుసరించుతున్న వివక్ష. తెలంగాణ ఉద్యమ రథసారథి కెసిఆర్ ఉపన్యాసాలలో సాగునీటి రంగానికి జరిగిన అన్యాయమే ప్రధానంగా చోటు చేసుకునేది. ఏ పల్లెకు తెలంగాణ ఉద్యమ నేతలు వెళ్ళినా ‘తెలంగాణ వస్తె మా పొలాలకు నీళ్ళు వస్తయా’, ‘మా బిడ్డలకు కొలువులస్తయా?’ అని అడిగేవారు రైతులు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత పార్టీ చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం, భారీ జనసమీకరణ కూడా సాగునీటి అంశంపైనే. 2002 నవంబర్ 25 నుండి 2003 జనవరి 6 వరకు తెలంగాణ జలసాధన ఉద్యమాన్ని 40 రోజుల పాటు పల్లె పల్లెనా నిర్వహించి ముగింపు సభను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ లో సుమారు పది లక్షల మందితో నిర్వహించింది టిఆర్‌ఎస్. ఈ ఉద్యమ సన్నాహక కృషిలో భాగంగా తెలంగాణ నీటిగోసను, మన చేలు తడుపకుండానే ఆంధ్రకు తరలిపోతున్న కృష్ణా, గోదావరి నదుల నీటిపై కెసిఆర్ మాటలు, తెలంగాణ కవులు రాసని పాటలతో వేలాది ఆడియో క్యాసెట్లు ప్రజల్లోకి వెళ్ళాయి. మొదటిసారి సాగునీటిలో జరిగిన కుట్రలు, అన్యాయాలు ఈ జలసాధన ఉద్యమం ద్వారానే బహుళ ప్రచారంలోకి వచ్చాయి.
2014 ఎన్నికల ప్రణాళికలో కూడా ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించడం లక్ష్యంగా పెట్టుకున్నది టిఆర్‌ఎస్ పార్టీ. చెరువులపునరుదర్ధణ, నదీ జలాలతో చెరువుల అనుసంధానాన్ని లక్ష్యాలుగా పేర్కొన్నది లక్ష్య సాధన కోసమే. ఈ బడ్జెట్‌లో సింహ భాగాన్ని నీటి పారుదల ప్రాజెక్టులకు, మిషన్ కాకతీయ పనులకు కేటాయించింది కెసిఆర్ ప్రభుత్వం.
కొద్దిపాటి వ్యయంతో పూర్తి కానున్న మహబూబ్ నగర్ ఎత్తిపోతల ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పథకాలకు అవసరమైన నిధులను కేటాయిస్తూనే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ. 7,860.88 కోట్లు, కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ. 6,286 కోట్లు కేటాయించడం జరిగింది. చెరువుల పూడికతీత, పునరుద్ధరణ లక్ష్యంగా కొనసాగుతున్న మిషన్ కాకతీయకు రూ. 2264.36 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఇవి కాకుండా ఖమ్మం జిల్లా ఆయకట్టుకు నీరందించే సీతారామ, భక్తరామదాసు ఎత్తిపోతలకు రూ. 1152 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ తమ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి 2009లో శంకుస్థాపన చేసినా 2014 దాకా పైసా కర్చు చేయని కంతన పెల్లి ఎత్తిపోతల పథకానికి రూ. 200 కోట్లు, 18 నెలల్లో పూర్తి చేస్తామని చంద్రబాబు 2001 లో శంకుస్థాపన చేసి 16 ఏళ్ళయినా పూర్తికాని దేవాదుల ఎత్తిపోతలకు రూ. 700 కోట్లు, ఆదిలాబాద్‌లో సుమారు 2 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో రీ డిజైనింగ్ చేసిన ప్రాణహిత ప్రాజెక్టుకు రూ. 685 కోట్లు, 1985 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు మొదలు పెట్టిన శ్రీశైలం ఎడుమ గాట్టు కాలువ (ఎఎంఆర్ ప్రాజెక్టు) ముప్పయేళ్ళు దాటినా పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టుకు (దిండి ఎత్తిపోతలతో కలిపి) ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 1418 కోట్లు వ్యయం చేయాలని ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయింపులు చేసింది.
కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా 1250 టిఎంసిలకు పైగా నీటిని వినియోగించుకుని సుమారు కోటి ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంలో భాగంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో సాగు నీటి రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఒకవైపు నదీ జలాలను వినియోగంలోకి తేవడం, మరోవైపు మిషన్ కాకతీయ పథకం అమలు ద్వారా భవిష్యత్తులో రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించవచ్చు.
సాగు నీరు, వ్యవసాయరంగానికి ప్రాధాన్యత నివ్వడం, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి మార్కెటింగ్ సదుపాయాల కల్పన, ఫుడ్ పార్క్‌ల ఏర్పాటు వంటివి ఏర్పాటు చేయడం, పాలీ హౌజ్‌లపై, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ ఇవ్వడం వంటి చర్యల ద్వారా నిరుద్యోగ యువతకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాల సంఖ్య స్వల్పంగా ఉంటున్నందున లక్షలాది మంది నిరుద్యోగ పట్టభద్రులు వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై, స్వయం ఉపాధి కల్పన అవకాశాలపై దృష్టి పెట్టడం నేటి అవసరం.
”సమైక్య పాలనలో ప్రతి రూపాయికీ తెలంగాణ భిక్షమెత్తుకునే దుస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చరిత్రను తిరగరాసుకుంటున్నాం.”
వైద్యం – ఆరోగ్యం
తెలంగాణ ప్రజలెదుర్కొంటున్న మరో ముఖ్య సమస్య వైద్యం. ప్రతి చిన్న జబ్బుూ ప్రైవేట్ ఆసుపత్రులనే ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. కార్పొరేట్ వైద్యం ఖర్చులను ప్రజలు భరించే స్థితిలో లేరు. మరోవైపు డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ మొదలైనవి పెరుగుతున్నయి. ఈ ప్రమాదాన్ని గుర్తించి, వైద్యం – ఆరోగ్యం’ పై ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 5,967 కోట్లు ప్రతిపాదించారు. మొదటిసారి 40 డయాలసిస్, 40 డయాగ్నాస్టిక్ (వైద్య పరీక్షాలు) కేంద్రాలను నెలకొల్పుతున్నారు. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు తగినట్లుగా మరో 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి నిమ్స్ వరకు ఆసుపత్రులలో సమూల మార్పులు తీసుకురావాలని సంకల్పించారు.
సంక్షేమం
తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళికలో సంక్షేమరంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. దానిలో భాగంగానే అధికారంలోకి రాగానే పెన్షన్ మొత్తాన్ని పెంచింది. షెడ్యూల్ కులాలు, తెగలు, మైనారిటీలు, వెనుకబడిన కులాలు, మహిళలు, శిశువులు, బీడీ కార్మికులు, అమరుల కుటుంబాలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, బ్రాహ్మణుల్లో వెనుకబడిన వారు తదితర రంగాల ప్రజల సంక్షేమానికి 2016- 17 బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రాధాన్యత నివ్వడం జరిగింది. ఎస్సీ సంక్షేమానికి రూ. 7,122 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ. 3,752 కోట్లు, బి.సి. సంక్షేమానికి రూ. 2,538 కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ. 1,204 కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ.4693 కోట్లు, కల్యాణ లక్మి పథకానికి రూ. 738 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ. 100 కోట్లు ప్రతిపాదించారు. షాదీ ముబారక్ కు రూ. 150 కోట్లు ప్రతిపాదించారు.
మిషన్ భగీరథ
తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని మిషన్ భగీరథ ద్వారా అందించాలని సంకల్పించింది. ఈ పథకాన్ని సుమారు రూ.40,000 కోట్ల వ్యయంతో 2018 లోపు పూర్తి చేయాలని సంకల్పించింది. ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. హడ్కో, నాబార్డ్, ఇతర బ్యాంకుల ద్వారా ఆర్థిక వనరులను సమూర్చుకుంటామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
”ఇంటింటికీ తాగునీరు అందించలేకపోతే 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులెవారూ ప్రజల వద్దకు వచ్చి ఓట్లడగరు” అని ఎంతో ఆత్మవిశ్వాసంతో సిఎం కెసిఆర్ శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. 2016 చివరినాటికి 6,100 గ్రామాలకు, 12 పట్టణాలకు తాగునీరు అందుతుందని తమ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టును 26 సెగ్మెంటులుగా విభజించి నదుల నీటిని (42.27 టిఎంసిలు) ప్రధాన రిజర్వాయర్ల నుండి అందించాలనే కెసిఆర్ ఆలోచన దేశంలోని అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకమవుతుంది. మిషన్ భగీరథ, రెండు బెడ్ రూంల ఇల్లు, మిషన్ కాకతీయ పథకాలను రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అనుసరించాల్సివస్తుంది.
ఈ బడ్జెట్‌లో మరో ప్రత్యేకత – ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్.డి.ఎఫ్) ఏర్పాటు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా భవిష్యత్తులో కొన్ని ప్రభుత్వశాఖల్లో ఆకస్మికంగా వచ్చే అవసరాలు, వాటికయ్యే వ్యయాలను దృష్టిలో పెట్టుకొని 2016-17 బడ్జెట్ లో రూ. 4,675 కోట్లు ప్రతిపాదించారు. ఈ నిధిని ఏ పద్దుకూ కేటాయించలేదు. ఇది దూరదృష్టితో చేసిన మంచి ఆలోచన.
ఇప్పటి రెండేళ్ళుగా రాష్ట్రంలో వర్షాలు సాధారణ స్థాయి కన్నా ఎంతో తక్కువ కురుస్తాయి. దారుణమైన కరువు పరిస్థితులేర్పడినాయి. ఈ సంవత్సరం కూడా వర్షాలు పడకుంటే దారుణమైన దుర్భిక్ష పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఈ ప్రత్యేక అభివృద్ధి నిధి ఉపయోగపడుతుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యుత్, విద్యారంగాలకు ప్రణాళికా పెట్టుబడులు తక్కువగా ప్రతిపాదించినా బడ్జెటేతర పద్ధతుల్లో విద్యుత్ రంగ అభివృద్ధిని సాధించే ప్రణాళిక ప్రభుత్వానికి ఉన్నది. సుమారు 5 వేల మెగావట్ల సోలార్ (సౌరశక్తి) పవర్ ను 2018 లోపు ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులన్నీ ప్రైవేట్ రంగంలోనే నెలకొల్పనున్నారు.
విద్యావ్యవస్థ పనితీరు సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా తయారైంది. ఈ రంగంపై మేథావులు, విద్యా వేత్తలతో చర్చించి ప్రక్షాళన చేయాలని తెలంగాణ విద్యా విధానాన్ని సరికొత్తగా రూపొందించాలనే సంకల్పం ఇటీవల శాసనసభలో సి.ఎం. ప్రసంగంలో స్పష్టమైంది. బహుశా వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి, కేజీ టు పిజీ’ విధానాన్ని అమలు చేసే అవకాశం వున్నది. తెలంగాణ స్థూల ఉత్పత్తి రూ. 6,70,756 కోట్లుగా నిర్ధారించింది ప్రభుత్వం. సవరించిన అంచనాలకన్న ఇది 11 శాతం ఎక్కువ. వ్యవసాయంలో అనుబంధ రంగాలలో వృద్ధిరేటు తగ్గినా స్థూల ఉత్పత్తిలో ప్రస్తుత ధరల ప్రకారం 11.67 శాతం వృద్ధి సాధించడం గొప్ప విషయం. ఇది జాతీయ సగటు వృద్ధిరేటు (8.6 శాతం) కన్నా చాలా ఎక్కువ. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2015- 16 లో 10.7 శాతం పెరిగి రూ. 1,43,023 గా ఉంటుందని అంచనావేసింది ఆర్థికశాఖ. ఇది జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.93,231 కంటే ఎక్కువ.