మార్చి 24, 1970న శాసనసభలో ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన ఆర్థిక ప్రకటన (బడ్జెట్)ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ తెలంగాణ నాయకులు, శాసనసభ్యులు కొండా లక్ష్మణ్, బద్రీ విశాల్ పిట్టీ రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ప్రాంతీయ కమిటీ అధికారాలు విస్తృతం చేస్తూ, రాష్ట్రపతి జారీచేసిన సవరణ ఉత్తర్వు మార్చి 9నుంచి అమల్లోకి వచ్చిన కారణంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆదాయ, వ్యయాల వివరాలను ప్రత్యేకంగా చూపించే ఆర్థిక ప్రకటన జారీ చేయాలని పిటీషనర్లు న్యాయస్థానాన్ని కోరినారు. ఇదే విషయమై 24న సభలో తెలంగాణ ఐక్య సంఘటన, సంయుక్త సోషలిస్ట్ పార్టీలకు చెందిన శాసనసభ్యులు ముప్పావుగంటసేపు ఆందోళన చేశారు. ఆర్థికమంత్రి విజయభాస్కరరెడ్డి రూ. 29.78 కోట్ల అదనపు ఖర్చు అంచనాలు (అనుబంధ పద్దులు) ప్రతిపాదిస్తున్నప్పుడు కొండా లక్ష్మణ్, బద్రీ విశాల్ పిట్టీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్ర-తెలంగాణలకు అంచనాలు వేర్వేరుగా సమర్పించాలని పట్టుబట్టినారు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వు జారీ కావడానికి ముందు ఉన్న కాలానికి అనగా 1969-70 సంవత్సరానికి సంబంధించిన అంచనాలకు ఉత్తర్వు వర్తించదని సభాపతి బి.వి. సుబ్బారెడ్డి తీర్పునిచ్చారు. ఈ తీర్పుతో విభేదించిన కొండా లక్ష్మణ్ ‘అడ్వొకేట్ జనరల్‌ను శాసనసభకు పిలిపించి ఆయన అభిప్రాయం తెలుసుకోవాల’ని సూచన చేయగా’ స్పీకర్ దాన్ని త్రోసిపుచ్చుతూ ‘అడ్వొకేట్ జనరల్‌ను పిలవవలసినంతటి అవసరం లేద’ని అన్నారు. దీనితో శాసనసభలోని తెలంగాణ ఐక్య సంఘటన, ఎస్.ఎస్.పి., రిపబ్లికన్‌పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు.
స్పీకర్ బి.వి. సుబ్బారెడ్డి బహుశా అడ్వొకేట్ జనరల్‌ను సంప్రదించిన ట్లున్నారు. ఆర్థికమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి ‘ఆంధ్ర-తెలంగాణకు విడివిడిగా బడ్జెట్ లెక్కలను చూపాల’ని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆర్థికమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ త్వరలోనే రెండు ప్రాంతాల పద్దులను వేర్వేరుగా సభకు సమర్పిస్తానని మార్చి 28న శాసనసభలో తెలిపారు. అనుబంధ పద్దులను ఓటింగ్‌కు ప్రతిపాదించినపుడు ఆర్థికమంత్రి నుంచి సభ్యులు ఈ హామీని పొందినారు. చర్చ లేకుండానే సభ అనుబంధ పద్దులను ఆమోదించింది.
మే నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం: చెన్నారెడ్డి
దేవరకొండలో తెలంగాణ ప్రజాసమితి ఏప్రిల్ 30న ఏర్పాటు చేసిన సదుస్సులో ‘మే మొదటివారంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాల’ని డా|| చెన్నారెడ్డి అన్నారు. ఆంధ్ర పాలకుల బానిసత్వం నుంచి విమోచనకు అహింసాయుత పద్ధతులద్వారా పోరాడటానికి సిద్ధంగా ఉండాలని, సెక్రటేరియట్ నుంచి గ్రామస్థాయి వరకు పరిపాలన స్థంభింపజేయగలరని డా|| చెన్నారెడ్డి ఆశాభా వాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల దుశ్చర్యలను ఆయన నిశితంగా విమర్శించారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు నూకల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని 150 లక్షలమంది ప్రజల శ్రేయస్సుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలికాని, ప్రజా వ్యతిరేకి, ప్రజాస్వామ్య వ్యతిరేకి అయిన బ్రహ్మానందరెడ్డిపై ఆధారపడరాదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినారు. ఈ సభలో జీవీ సుధాకర్‌రావు, వి.బి. రాజు, దేవరకొండ టి.పి.ఎస్ అధ్యక్షులు పి. దామోదర్‌రెడ్డి, కొండలరావు ప్రసంగించారు.
భార్గవ కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చ
తెలంగాణ మిగులు నిధులను నిర్ధారించడానికి నియ మింపబడిన భార్గవ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై శాసనసభ 3 గంటలసేపు చర్చించి అసం పూర్తిగా ముగించింది. తెలంగాణ నిధులు ఆంధ్రకు తరలించు కుపోయారనే వాదాన్ని విరమించుకుంటే తెలంగాణ అభివృద్ధికి ఉదారంగా వెచ్చించడానికి తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రాంత సభ్యులు అన్నారు.
ప్రతిపక్షనేత నూకల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, భార్గవసంఘం నియామకాన్ని తాము ఖాతరు చేయబోమని, అది అశాస్త్రీయమని, అది చేసిన నిర్ణయాలు తమను ఎంతమాత్రం బాధించవని అన్నారు. సీపీఐ నాయకుడు సీహెచ్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటువల్ల నిధుల సమస్య తేలదని, తెలంగాణా అభ్యుదయం ఎంతమాత్రం సాధ్యపడదని స్వార్థ, సంకుచిత దృష్టిగల నాయకులే తెలంగాణ విడిపోవాలని కోరుతున్నారని అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణే తెలంగాణ సమస్యకు పరిష్కారమని రామచంద్రారెడ్డి అన్నారు. తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ… భార్గవ సంఘం విచారణాంశాలు మార్చాలని చాలాకాలం పోరాడినా ప్రాంతీయ సంఘం అధ్యక్షులు చొక్కారావు వాటిని మార్చకపోయినా ఎలా ఊరుకున్నారో అర్థం కాలేదని, ఈ చర్చ జరిగేటప్పుడు అస్వస్థతకులోనై సభలో లేకపోవడం విచారకరమని, తెలంగాణా ప్రాంతీయులైన ఉపముఖ్యమంత్రి యిప్పుడు సంకటస్థితిని ఎదుర్కొనవలసి వచ్చిందని అన్నారు.
తెలంగాణా మిగులు నిధులు 107 కోట్ల రూపాయలు వున్నవని ప్రాంతీయ సంఘం మంత్రుల సహితంగా ఏకగ్రీవంగా ఆమోదించినపుడు భార్గవ సంఘం సిఫారసులను ఎలా అంగీకరిస్తారని నూకల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. భార్గవ సంఘం న్యాయంగా తెలంగాణ మిగులు నిధులను తేల్చలేదని, భిన్న సమస్యలకు భిన్న సూత్రాలు అనువర్తించారని, అదొక చిత్తు కాగితంవంటిదని, దానికి చట్టబద్ధమైనటువంటి స్థాయి లేదని ఖండించారు. ఈ నివేదిక వృధా అని, దీనిని చర్చించి లాభం లేదని అన్నారు. స్వతంత్ర పార్టీ నాయకుడు గౌతు లచ్చన్న మాట్లాడుతూ, శాసనసభ, గవర్నరు ప్రమేయం వున్నచోట రాజ్యాంగం సరిగా నడుస్తున్నప్పుడు ముఖ్యమంత్రి, ప్రాంతీయ సంఘం అధ్యక్షులు మిగులు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయాన్ని తెచ్చిపెట్టి శాసనసభ ప్రతిష్టను , లలిత్, భార్గవా కమిటీల నియామకం ద్వారా మంటకలిపారని తన విచారాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయల మిగులు నిధులంటే, లలిత్ కమిటీ 34 కోట్లుగా పేర్కొన్నదని, ఇప్పుడు భార్గవసంఘం 28 కోట్లే అంటున్నదని, ప్రాంతీయసంఘం దీనికి అంగీకరించపోవడంవల్ల ఈ కమిటీల నివేదికలు నిరర్థకమైనాయన్నారు. ఇదంతా అపసవ్యమైన విషవలయంగా పరిణమించిందన్నారు.
ఆంధ్ర, తెలంగాణా ఉద్యోగులను భిన్న సూత్రాలతో చూడడం గర్హనీయమన్నారు. చదరంగపు ఎత్తులు, చీట్లపేక ఎత్తులవల్ల సమస్యలు పరిష్కారం కావని, సరిహద్దులలోవున్న అస్సాంలో 3 రాష్ట్రాలువస్తే తెలుగు ప్రజలు రెండు అయితే వచ్చిన నష్టమేమిటని గౌతు లచ్చన్న ప్రశ్నించారు. 1972లో అయినా ఈ రాష్ట్రం విడిపోక తప్పదన్నారు. కొత్త కాంగ్రెస్ (ఇందిరాగాంధీ)కు చెందిన ఆంధ్ర ప్రాంత నాయకుడు గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ నిధులు, ఉద్యోగాల సమస్య అనంతంగా పరిష్కారం కాకుండా వుండడానికి వీలులేదని, ఇలా ఎంతకాలం గడుపుతారని ప్రశ్నించారు. సంప్రదింపులు ఫలించనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఆజమాయిషీ చేసే అధికారం వున్నదోలేదో తెలంగాణా నాయకులు చెప్పాలన్నారు.
పాత కాంగ్రెస్ (నీలం సంజీవరెడ్డి) నాయకుడు టి.వి.ఎస్. చలపతిరావు మాట్లాడుతూ, ఈ మిగులు నిధుల నివేదికలు పుబ్బలోపుట్టి మఖలో మాడిపోతున్నట్లు అయిందని, సూదిని దూలానికి గుచ్చినట్లు వుందని, గోటితో తీస్తే పరిష్కారమయ్యేవి గొడ్డళ్ళకు కూడా అందకుండా వున్నాయని అన్నారు.
1956 ఒప్పందమే అమలు జరుగరానిది అని ఆర్థికశాఖ అకౌంటెంట్ జనరల్ చెప్పినా ప్రభుత్వం తగు సవరణలు చేయలేదని, బ్రేకులన్నీ ఇటు, సాకులన్నీ అటు చెప్పినట్లయిందన్నారు. చలపతిరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. గోడలపై వ్రాతలు, ఇళ్ళు తగులబెట్టడం, కురుపాండవ యుద్ధం తెలంగాణ నాయకులు విరమించుకుంటే, ఒకచోట కూర్చొని సమాధాన వైఖరితో సమాలోచనలు చేస్తే వెనుకబడిన ప్రాంతానికి ఎంతైనా వెచ్చించుకోవచ్చునని, ఎవరో డబ్బు తినేశారనే ప్రచారం మటుకు సమైక్యతకు ఎంతమాత్రం దోహదం చేయదని హెచ్చరించారు.
జె. చొక్కారావు, ఎన్. రాఘవరెడ్డి, ఈశ్వరీబాయి మాట్లాడడానికి లేవబోగా సభాపతి సభను నిరవధికంగా వాయిదా వేశారు. సమాధానం లేకుండానే అర్థాంతరంగా చర్చ ముగిసింది.
(వచ్చే సంచికలో..)
తెలంగాణ ఉద్యమ తుదిఘట్టం)