బడ్జెట్ మొత్తం రూ. 1,49,646 కోట్లు
ప్రగతి పద్దు 88,038.80 కోట్లు
నిర్వహణ వ్యయం 61, 607.20 కోట్లు
రెవెన్యూ మిగులు రూ. 4,571.30 కోట్లు
సంపూర్ణంగా రుణ మాఫీ
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. వ్యవసాయ రంగాన్ని కరవును అధిగమించేదిగా మలచి, రైతుల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందుకే ఈ రంగానికి ఈ బడ్జెట్లో రూ. 5942.97 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం హామీ ఇచ్చినవిధంగా రైతుల పంట రుణాల మాఫీ ఈ ఏడాదితో వంద శాతం పూర్తవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే మూడు విడతల రుణమాఫీ చేసింది. ప్రస్తుతం ఈ ఏడాది నాలుగోది, చివరిదీ అయిన కిస్తును కూడా చెల్లించేందుకు ఈ బడ్జెట్లో రూ. 4,000 కోట్ల రూపాయలు కేటాయించింది. 2017లో బ్యాంకుల ద్వారా వ్యవసాయ రంగానికి రుణాల వితరణ లక్ష్యాన్ని రూ. 46,946.98 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. తోటల పెపంకాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా, ఇప్పటికే పంటల సేకరణ, నిలువ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు పెంచడానికి హార్టికల్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ప్రభుత్వం నెలకొల్పింది. పాలి హౌజ్, మైక్రో ఇరిగేషన్ పథకాలకు సబ్సిడీ ఇచ్చి మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మైక్రో ఇరిగేషన్ పథకాలకు చేసే వ్యయాన్ని బడ్జెటేతర వనరుల ద్వారా ఖర్చుపెట్టాలని ప్రతిపాదించింది.
వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకోసం రాష్ట్రంలో 17.07 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంగల 330 అదనపు గోదాములను 1024.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరుగుతోంది. వీటిలో 321 గోదాముల నిర్మాణం మొదలుపెట్టి 9.8 లక్షల మెట్రిక్ టన్నుల సమామర్ధ్యం గలిగిన 202 గోదాముల నిర్మాణం ఇప్పటికే పూర్తిచేయడం జరిగింది.
కోటి ఎకరాలకు నీరే లక్ష్యంగా…
తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది దానికి అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది. గోదావరి, కృష్ణా నదులపై 23 మేజర్, 13 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో 7 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. మరో 14 పాక్షికంగా పూర్తయ్యాయి.ఖమ్మం జిల్లాలో కరవుపీడిత ప్రాంతమైన పాలేరులో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తిచేసి, ఇటీవలె ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం కూడా శరవేగంగా పూర్తిచేసి నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ఏడాది సాగునీరు అందించడం జరిగింది. ఇదే స్పూర్తితో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేయడానికి రాష్ట్రప్రభుత్వం సన్నద్ధగా వుంది.
మరో వైపు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం నడుస్తోంది. ఇప్పటికే రెండుదశల పనులు పూర్తయ్యాయి. త్వరలో మూడోదశ ప్రారంభం కానుంది. సాగునీటి రంగానికి వున్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్లో దీనికి రూ. 25, 000 కోట్లు కేటాయించారు.
అలాగే అహ్మదాబాద్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నమూనాలో కరీంనగర్‌లో లోయర్ మానేరు డ్యామ్ దిగువన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును రూ. 506 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ బడ్జెట్‌కు నిధులు నీటిపారుదల శాఖ ద్వారా కేటాయి స్తున్నారు. ఇందుకుగాను, ఈ సంవత్సరంలో రూ. 193 కోట్లు కేటాయించారు.
నీటిపారుదల రంగం రూ. 25,000 కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది దానికి అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది. గోదావరి, కృష్ణా నదులపై 23 మేజర్, 13 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి
తెలంగాణది ఒక ప్రత్యేక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడి వనరుల ఆధారంగా గ్రామీణ ప్రాంతాలలో నివసించే వివిధ సామాజిక వర్గాలకు ప్రత్యేకమైన జీవిక ఏర్పడింది. వ్యవసా యంతోపాటు అనేక అనుబంధ వృత్తులను ఆశ్రయించి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఉత్పత్తి కేంద్రంగా వుండే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పదిలంగా వున్నంతవరకూ తెలంగాణ పల్లెలు స్వయం పోషకత్వంతో , సమృద్ధితో ఉన్నాయి. కానీ, సమైక్యపాలనలో తెలంగాణ జీవన పరిస్థితులు విచ్ఛిన్నమయ్యాయి. వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం, కుల వృత్తులపట్ల అనాదరణ కారణంగా గ్రామీణ జీవితం అల్లకల్లోల మైంది. వృత్తినైపుణ్యం కలిగిన తెలంగాణ బిడ్డలు పొట్టచేతపట్టుకొని పట్టణాలు, పరదేశాలకు వలసవెళ్ళి బతకాల్సిన దుస్థితిలోకి నెట్టివేయబడ్డారు.
ఈ రోజు ప్రత్యేక రాష్ట్రంలో ఈ ప్రభుత్వం బ్యాలెట్ బాక్స్ బడ్జెట్‌గా కాకుండా బతుకును నిలబెట్టే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయటం ద్వారానే తెలంగాణ అభివృద్ధి ఎదుగుదల దిశగా పయనిస్తుందని ప్రభుత్వం ప్రగాఢంగా విశ్వసిస్తోంది. ఇందుకు అనుగుణంగానే గ్రామీణ వృత్తులకు ఆర్థిక ప్రేరణనిచ్చే పథకాలను ప్రభుత్వం రూపొందించింది.తెలంగాణలో అపారమైన మానవ సంపద వుంది. కులవృత్తులు ఆధారంగా జీవనం గడుపుతూ, అనువంశి కంగా విశేషమైన వృత్తినైపుణ్యం పొందిన సామాజిక వర్గాలు ఉండడం తెలంగాణకు గొప్పవరం. వారినైపుణ్యానికి తగిన పనిని, ఆదరణను, ప్రేరణను ఇస్తే వారు తెలంగాణకు తరగని సంపదను సృష్టించి ఇస్తారు. ఇన్నాళ్ళూ వీళ్ళ సామర్థ్యాన్ని వినియోగించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఎండమావులను లక్ష్యం చేసుకున్న గత పాలకులు తమ విధానాలతో చేతివృత్తుల చేతులు విరిచేశారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. గ్రామాలు మొండిగోడలమీద మొలచిన చెట్లతో బీడుబడిన భూములతో బావురుమనేటట్లు చేశారు. గ్రామీణ జీవితంమీద అలుముకున్న ఈ విషాదాన్ని తొలగించి పల్లెల ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని సుందరతరంగా, సుసంపన్నంగా మార్చే విధానానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నాందిపలికింది.
యాదవులకు 84 లక్షల గ్రొర్రెల పంపిణీ
కాలపరీక్షకు తట్టుకొని నిలబడటమేగాక, ఎంతో లాభ సాటిగా ఉన్న కుల వత్తులను రాష్ట్రప్రభుత్వం గుర్తించింది. పశుసంవర్థక రంగం, చేపల పెంపకం పట్ల ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రొర్రెల పెంపకాన్ని అభివృద్ధిచేసి, గొల్లకురుమలకు ఆదాయాన్ని సమకూర్చే పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా వున్న నాలుగు లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెలను పంపిణీచేయాలని ప్రభుత్వం నిరయించింది. గ్రొర్రెల అభివృద్ధి సహకార సంఘంలో నమోదుచేసుకున్న ప్రతి అర్హతగల కుటుంబానికి 20 గొర్రెలు, ఒక పొట్టెలును 75 శాతం సబ్సిడీతో సరఫరాచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం నాలుగు లక్షల యాదవ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. గ్రొర్రె మాంసానికి రాష్ట్రంలో, దేశంలో, విదేశాలలో మంచి డిమాండ్ వుంది. ఈ పథకం అమలు పూర్తయ్యాక రాష్ట్రం మాంసం ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడమేగాక, ఎగుమతిచేసే దశకు చేరుతుంది.
వ్యవసాయ రంగం రూ . 5,942 కోట్లు
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. వ్యవసాయ రంగాన్ని కరవును అధిగమించేదిగా మలచి, రైతుల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.
చేపలపెంపకం
తెలంగాణ రాష్ట్రంలో గంగపుత్ర, ముదిరాజ్ కులాలవారితోపాటు బోయకులస్తులు కూడా చేపలు పట్టడంపై జీవనం సాగిస్తున్నారు. వారిని ప్రోత్సహించడం ద్వారా వారివారి ఆదాయ వనరులను పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే, రాష్ట్రంలోని జలాశయాలలో మత్స్యకారుల ద్వారా చేపల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చేపల విత్తనాన్ని ప్రభుత్వమే సరఫరాచేస్తుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో చేపపిల్ల ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధిచేస్తుంది. చేపల పెంపకంతోపాటు ఇతర నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. మార్కెటింగ్ సౌకర్యాలను పెద్దఎత్తున కల్పిస్తుంది. చేపల అమ్మకానికి పెద్ద ఎత్తున రిటేల్ మార్కెట్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ చర్యల వల్ల చేపల పెపంకం పరిశ్రమస్థాయికి ఎదిగి, చేపల పెంపకంపై ఆధారపడిన లక్షలాది మత్స్యకారుల బతుకులు మారిపోయి, ఆర్థికంగా బలపడతారు.
నవీన క్షౌరశాలలు, వాషింగ్ మిషన్లు
తమ వృత్తిద్వారా ప్రజలకు విశేష సేవలందిస్తూ జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులకు, రజకులకు ప్రభుత్వం ప్రత్యేక సహకారం అందించేందుకు పథకాలను రూపొందిస్తోంది. ఇందుకు గాను ఈ బడ్జెట్లో రూ. 500 కోట్ల రూపాయలు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాలలో పరుశుభ్రమైన, ఆరోగ్యకరమైన, ఆధునిక క్షౌరశాలలు ఏర్పాటుచేసుకోవడానికి నాయీ బ్రాహ్మణు లకు ప్రభుత్వం పెట్టుబడిని సమకూరుస్తుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలలో వీరిద్వారా ఆరోగ్యతరమైన సేవలు అందుబాటులోకి వస్తాయి. రజకులకు అవసరమైన వసతుల కల్పనకు కూడా ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తోంది.వారు తమ వృత్తిని ఆదునికీకరించు కొనేందుక వీలుగా వాషింగ్ మిషన్లు, డ్రయర్లు, ఐరన్ బాక్సులు పంపిణీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా దోభీఘాట్లు నిర్మించి ఇస్తుంది.విశ్వకర్మలుగా పిలవబడే ఔసల, కమ్మరి, కంచరి, శిల్పకారులకు, బట్టలు కుట్టి జీవించే మేర కులస్తులకు, కల్లుగీత ఆధారంగా జీవిస్తున్న గౌడులకు, కుమ్మరి పనివారలకు , తదితర కులవృత్తులవారందరికీ అవసరమైన ఆర్థిక సహకారం, పరికరాలు పంపిణీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం నిర్దిష్ట పథకాలను రూపొందిస్తోంది.
చేనేత కార్మికుల సంక్షేమం
రాష్ట్రంలో చేనేత కార్మికులను కష్టాలకడలినుంచి శాశ్వతంగా గట్టెక్కించేందుకు ప్రభుత్వం త్రిముఖ వ్యూహం రూపొందించింది. నేతన్నలు ఉత్పత్తిచేసిన చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలుచేయడం, నూలు, రసాయనాలు సబ్సిడీపై అందిస్తుంది. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తుంది. పెద్ద సంఖ్యలో ఉన్న పవర్ లూమ్ లను ఆధునికీకరించి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. కార్మికులకు ప్రతీనెలా 15 వేల రూపాయలకు తగ్గకుండా వేతనం ఇచ్చేవిధంగా పవర్ లూమ్ యాజమాన్యాలను ప్రభుత్వం ఒప్పించింది. వరంగల్ లో టెక్స్ టైల్స్ పార్కు, సిరిసిల్లలో అపరెల్ పార్కు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది,ఈ బడ్జెట్ లో నేత కార్మికులకోసం రూ, 1200 కోట్లు కేటాయించారు. గతంతో పోలిస్తే ఇది భారీ పెంపుదల.
ఎం.బి.సిలకు రూ.1,000 కోట్లు
సమాజానికి మూలాధారాలుగా నిలచిన మరెన్నో కులాలు నేడు అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నాయి.ఎం.బి.సి లుగా భావిస్తున్న ఈ కులాలవారి స్థితిగతులను అర్థంచేసుకుని వారి సమస్యల పరిష్కారంకోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ను ఏర్పాటుచేసింది. ఎం.బి.సిల అభివృద్ధి, సంక్షేమంకోసం ఈ బడ్జెట్ లో రూ. 1, 000 కోట్లు కేటాయించారు. ఈ ప్రయత్నం అణగారినవర్గాలు అభ్యున్నతి సాధించే దిశలో గొప్పమైలురాయిలా నిలువనుంది.ఈ బడ్జెట్ లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ. 5,070.36 కోట్లు కేటాయించారు. దీనికితోడు బియ్యం సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ, రుణమాఫీ, విద్యా, వైద్య సదుపాయాలు, తదితర అంశాలలో బి.సి లబ్ధిదారుల వ్యయాన్ని జోడిస్తే, బి.సి సంక్షేమానికి భారీనిధులు ఖర్చవుతాయి.
మిషన్ భగీరథ రూ. 3,000 కోట్లు
ప్రతి ఇంటికీ నల్లాద్వారా ప్రతిరోజు సురక్షిత మంచినీరు అందివ్వాలనే బహత్తర లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం అనుకున్న వేగంతో పూర్తవుతోంది. డిసెంబరు 2017 నాటికి అన్ని గ్రామాలకు నదీజలాలు చేరే విధంగా కార్యాచరణ అమలవుతోంది.
బడ్జెట్‌లో అమ్మకు చోటు…
మాతృమూర్తులైన మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మానవీయ నిర్ణయాలు తీసుకుంది. గర్భిణులు, బాలింతలకు, శిశువులకు సరిపడేంత పోషకాహారం లభించాలనే ఉదాత్త భావనతో అంగన్ వాడీ కేంద్రాలలో ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం ద్వారా ప్రతీరోజు గుడ్లు, పాలు, పోషకాహారం అందిస్తోంది. ఇప్పుడు అంగన్ వాడీ కేంద్రాలకు సన్నబియ్యం కూడా సరఫరాచేయాలని నిర్ణయించింది. బిడ్డకు జన్మనివ్వబోయే దశలో స్త్రీలకు పూర్తి విశ్రాంతి నిచ్చి, వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. కానీ, నిరుపేద మహిళలెందరో గర్భిణిగా వుండికూడా కూలీ పనులకు పోవాల్సి రావడం అత్యంత దయనీయం. ఈ దుస్థితి తల్లికే కాకుండా గర్భస్థ శిశువుకు కూడా ఎంతో ప్రమాదం. ఈ సమస్యను ఎంతో గంభీరంగా అర్థంచేసుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, గర్భిణీ దశలో ఉపాధి కోల్పోయే స్త్రీలకు అవసరమయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే అందించాలని నిర్ణయించారు. రాష్ట్రప్రభుత్వం మహిళా సమస్యలపట్ల స్పందించిన తీరుకు ఇది నిదర్శనం.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, గర్భిణీ అయిన స్త్రీలు ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన వెంటనే వారి జీవన అవసరాల కోసం మొదటి విడతగా రూ. 4,000 ప్రభుత్వం అందిస్తుంది. ప్రసూతి తర్వాత ఆస్పత్రినుంచి ఇంటికి వెళ్ళే సమయంలో మరో రూ.4,000, పుట్టిన బిడ్డకు పోలియో టీకా వేయించడానికి వచ్చినప్పుడు మరో రూ. 4, 000 అందిస్తారు. అంటే, మూడు విడతల్లో మొత్తం రూ. 12,000 అంది స్తారు. ఆడపిల్లను ప్రసవించిన మహిళకు అదనంగా మరో వెయ్యి రూపాయల ప్రోత్సా హకం అందచేస్తారు. పిండదశలో చోటుచేసుకొనే జన్యులోపాలు బిడ్డల్ని జీవితాంతం వేధిస్తాయి. కనుక ప్రసవం ఆస్పత్రిలోనే జరగాలనే శాస్త్రీయ అవగాహనను పెంచే దిశలో, తద్వారా శిశుమరణాలను తగ్గించే దిశలో ఈపథకం ఎంతో దోహదం చేస్తుంది.
కె.సి.ఆర్ కిట్
పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం అవసరమయ్యే 16 వస్తువులతో కె.సి.ఆర్ కిట్ పేరుతో అందించాలని ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. ఈ కిట్ నవజాత శిశువుకు మూడు నెలలు వచ్చే వరకూ ఉపయోగపడుతుంది. ఈ కిట్లో తల్లికి, బిడ్డకు ఉపయోగపడే సబ్బులు, బేబి ఆయిల్, చిన్నపిల్లల పరుపు, దోమతెర, డ్రెస్సులు, చీరలు, హ్యాండ్ బ్యాంగు, టవల్స్ , నాప్కిన్స్, పౌడరు, డైపర్లు, షాంపు, పిల్లల ఆటవస్తువులు ఉంటాయి. ఈ పధకానికి రూ. 605 కోట్లు కేటాయించారు.
క్షేత్రస్థాయిలో అట్టడుగు వర్గాలలోని మహిళలకు వివిధ సేవలు అందించే అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు ప్రభుత్వం జీతాలు పెంచింది, అంగన్ వాడీ కార్యకర్తల జీతాన్ని ఏడువేల నుంచి పదిన్నర వేల రూపాయలకు పెంచడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచడం ఇది రెండవసారి. వారి విధినిర్వహణకు మరింత గౌరవం తీసుకురావడానికి వారి ఉద్యోగాన్ని అంగన్ వాడీ టీచర్లుగా మార్పు చేశారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల జీతాలను కూడా నాలుగున్నర వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచడం జరిగింది. మహిళా శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్ లో మొత్తం రూ. 1731.50 కోట్లు కేటాయించారు.
పర్యాటక, సాంస్కృతికశాఖకు రూ.198.03 కోట్లు
తెలంగాణలోని పర్యాటక కేంద్రాలు, యాత్రాస్థలాలు సమైక్య రాష్ట్రంలో ఎంతో అలక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత పర్యాటక కేంద్రాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయి. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నది.
కల్యాణ లక్ష్మి ఇకపై రూ. 75,116
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మానసపుత్రిక అయిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తోంది. పేద ప్రజల కుటుంబాల్లో ఎనలేని ఆనందాన్ని పంచుతున్న ఈ పథకంలో భాగంగా పేదింటి ఆడపిల్ల పెళ్ళికి ప్రభుత్వం ఇప్పటివరకూ రూ, 51,000 అందజేస్తోంది. అయితే, ప్రజల విన్నపాలు, పెరుగుతున్న ధరలను దష్టిలో వుంచుకొని ఈ పథకం క్రింద అందిస్తున్న ఆర్థిక సహాయం మొత్తాన్ని 75,116 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది.
షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల సంక్షేమం
బడ్జెట్ స్వరూపం మారిన నేపధ్యంలో రాష్ట్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి నిధుల కేటాయింపునకు మరింత పటిష్టమైన చట్టబద్ధతను కల్పిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు బదులుగా ఆయావర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలనే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎస్సీల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలుచేస్తోంది. మూడెకరాల సాగుభూమి, యువతకు నైపుణ్యాభివృద్ధి, కల్యాణ లక్ష్మి, విదేశాలలో విద్యాభ్యాసానికి తోడ్పాటు, ఇంటికి 50 యూనిట్ల ఉచిత కరెంటు మొదలైన ఎన్నో పథకాలు అమలుచేస్తోంది.
ఎస్సీల అభ్యున్నతికి విద్యావకాశాలు పెంచడం కీలకం. ప్రభుత్వం ఎస్సీల కోసం 130 గురుకుల విద్యాలయాలను మంజూరు చేసింది. ఇప్పటివరకూ 103 గురుకులాలను ప్రారంభించింది. ఎస్సీ విద్యార్ధినుల కోసం 2016-17లో 23 గురుకుల కళాశాలలు ప్రారంభించింది. వచ్చే ఏడాది మరో ఏడు ఇటువంటి కళాశాలలను ప్రభుత్వం ప్రారంభించనుంది. తొమ్మిది స్టడీ సర్కిళ్ళను కూడా మంజూరుచేసింది. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో సన్న బియ్యం సరఫరా చూస్తోంది. విదేశీ విద్యకోసం అందించే స్కాలర్ షిప్ ను కూడా రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచడం జరిగింది.ఈ సంక్షేమ పథకాలన్నింటి నిమిత్తం ఈ బడ్జెట్లో రూ. 14,375.12 కోట్లు కేటాయించారు.
షెడ్యూల్డు తెగల సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటిగా వుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రభుత్వం 51 గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు ఎస్టీ స్టడీ సర్కిళ్ళు పనిచేస్తున్నాయి. ఎస్టీ జనాభాకు అనుగుణంగా జిల్లాలలో కొత్త స్టడీ సర్కిళ్ళను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.వచ్చే పంచాయితీ ఎన్నికల నాటికి గిరిజన తండాలను, గూడాలను గ్రామపంచాయితీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్టీ సంక్షేమానికి ఈ బడ్జెట్ లో రూ. 8,156.88 కోట్లు కేటాయించింది.
బి.సి సంక్షేమం
రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతుల జనాభానే అధికం. బి.సిల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుచేస్తోంది. విదేశాలలో చదువుకొనే బీసి విద్యార్థులకు తోడ్పాటునందించేందుకు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్ సీస్ విద్యానిధి పేరిట ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. బీసీ విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తోంది. ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల వంతున 119 బీసీ గురుకుల పాఠశాలలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తారు. ఈ పాఠశాలల్లో ఐదవ తరగతి నుంచి ఇంటర్ వరకూ 76,160 మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలుగల విద్య అందుబాటులో వుంటుంది. మౌలిక వసతులు, పోషకాహారం, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ తదితర వసతులకు ఒక్కో విద్యార్థిపై రూ. 1.05 నుంచి రూ. 1.25 లక్షల వరకూ వ్యయం అవుతుందని అంచనా. బీసీ విద్యార్థుల కోసం ఇంత పెద్ద ఎత్తున గురుకుల విద్యాలయాలను దేశంలో మరేరాష్ట్రం స్థాపించ లేదు. గొర్రెలు, చేపల పెంపకం, ఎం.బి.సి.లకు ప్రత్యేక పథకాలు, రజక, నాయీబ్రాహ్మణులకు పథకాలు, చేనేత కార్మికులకు , పవర్ లూమ్ వారికి పథకాలు అన్నీ బీసీ సంక్షేమ కార్యక్రమాలే. బీసీల సంక్షేమానికి ఈ బడ్జెట్ లో మొత్తం రూ. 5070.36 కోట్లు కేటాయించారు.
మైనారిటీల సంక్షేమం
తెలంగాణ మత సామరస్యానికి, సమరసభావానికి పేరుగాంచింది. తెలంగాణ జీవన రీతిని మహాత్మా గాంధీ గంగా జమున తహజీబ్ గా అభివర్ణించారు. రాష్ట్ర జనాభాలో మైనారిటీలు 14.2 శాతంగా వున్నారు. రాష్ట్ర అవతరణ నాటినుంచి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టింది.ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులతో సమానంగా మైనారిటీ వర్గానికి చెందిన 1.08 లక్షల మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు ఇస్తోంది. మైనారిటీల కోసం 201 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 71 ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మిగతావాటిని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తారు.
మైనారిటీ వ్యాపారస్తులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం టి.ఎస్- ప్రైమ్ పథకాన్ని ప్రారంభిస్తోంది. మొదటిసారిగా ప్రభుత్వం ఇమామ్స్ కు, మౌజామ్స్ కు నెలకు వెయ్యి రూపాయల గౌరవ వేతనం ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ గౌరవ వేతనాన్నిరూ.1500 కు పెంచుతోంది. దీనిద్వారా 10 వేల మందికి లబ్ధిచేకూరుతుంది. రాష్ట్రప్రభుత్వం రంజాన్, క్రిస్మస్ లను రాష్ట్ర పండుగలుగా గుర్తించి పేదలకు విందులు ఏర్పాటు చేయడంతోపాటు దుస్తులు పంపిణీచేస్తోంది. మైనారిటీ సంక్షేమం కోసం ఈ బడ్జెట్ లో రూ. 1249.66 కోట్లు కేటాయించారు.
బ్రాహ్మణ సంక్షేమానికి రూ. 100 కోట్లు
బ్రాహ్మణులు ఉన్నత సామాజిక వర్గానికి చెందినవారైనప్పటికీ వీరిలో ఎక్కువ మంది తక్కువ ఆదాయం గలవారే వున్నారు. ఈ సామాజిక వర్గంలోని పేదల ఇక్కట్లు తీర్చేవిధంగా వివిధ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ఏర్పాటుచేసింది. ఇందుకోసం ఈ బడ్జెట్ లో రూ. 100 కోట్లు కేటాయించింది. హ్రాహ్మాణ సదనం నిర్మాణానికి ప్రభుత్వం ఇంతకుముందే భూమిని కేటాయించి, రూ. 100 కోట్లు నిధులు కూడా కేటాయించింది.
జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 30 కోట్లు
దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నది. జర్నలిస్టుల కుటుంబాల ఆరోగ్య పరిరక్షణకు హెల్త్ కార్డులు మంజూరుచేసింది. వారికి ప్రభుత్వ ఖర్చులతో మంచి వైద్యం అందించడం జరుగుతోంది. మరణించిన జర్నలిస్టుల కుటుంబానికి లక్ష రూపాయల వంతున ఆర్థిక సహాయం అందించడంతోపాటు, ప్రతీనెలా రూ.3,000 పెన్షన్ కూడా ప్రభుత్వం అందిస్తోంది. పదవతరగతి లోపు విద్యార్థులున్న కుటుంబాలకు ఒక్కో విద్యార్థికి వెయ్యి రూపాయల చొప్పున అదనంగా సహాయం అందిస్తోంది. ఈ విధంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాల కోసం ఓ పథకాన్ని అమలుచేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. ఈ ఏడాది బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 30 కోట్లు కేటాయించారు.
రెండు పడక గదుల ఇళ్ళు
పేదలకు గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించాలనే గొప్ప ఉద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వం రూపొందించి అమలుచేస్తున్న పధకం రెండు పడక గదుల ఇళ్ళ పథకం. ఈ పథకం అమలును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలుచేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో 2.60 లక్షల రెండు పడక గదుల ఇళ్ళను మంజూరుచేసింది. ఇందులో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి 1, 426
గృహాల నిర్మాణంపూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించడం జరిగింది. 16, 068 గృహాలు వివిధ దశలలో వున్నాయి. టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.
రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరాచేయడంతోపాటు, బహిరంగ మార్కెట్ లో సిమెంట్ బస్తా ధర రూ. 320 ఉండగా, కేవలం రూ. 230 లకే సరఫరాచేసే విధంగా 31 సిమెంటు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. జిల్లా కలెక్టర్లు వీటి నిర్మాణానికి తగిన స్థలాలను గుర్తించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటి నిర్మాణం మరింత వేగం పుంజుకుంటుంది. హైదరాబాద్ మహానగరంలో లక్ష ఇళ్ళు, జిల్లాలలో మరో లక్ష ఇళ్లను ఈ ఏడాదిలోనే పూర్తిచేయాలని, పనులు శరవేగంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన నిధులను బడ్జెటేతర వనరులనుంచి సమీకరించడం జరుగుతుంది.
విద్యుత్ రంగం రూ. 4,203.21 కోట్లు
రాష్ట్ర అవతరణ తరువాత, ప్రభుత్వం ఏర్పడిన కేవలం ఆరు నెలల లోనే విద్యుత్ పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. అనతికాలంలోనే అద్భుతాలు ఆవిష్కరించింది. గతంలో కరెంటు ఉంటే వార్త. ఇప్పుడు కరెంటుపోతే వార్త. కరెంటు కోతలకు కాలం చెల్లింది.
రాష్ట్ర ప్రగతికి దోహదపడే బడ్జెట్: సీఎం
ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి ఉప యోగపడేవిధంగా, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహద పడేవిధంగా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. సంప్రదాయ బడ్జెట్‌కు భిన్నంగా వాస్తవికకోణంలో, తెలం గాణ రాష్ట్రానికి అతికినట్లు బడ్జెట్ ఉందని సీఎం చెప్పారు.రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నిరంగాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారని, పూర్తి సమతుల్యతతో బడ్జెట్ రూపొందించారని సీఎం ప్రశంసించారు. నిరుపేదలు, మహిళలు, చిన్న ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెంచే విధంగా బడ్జెట్లో కేటాయింపు లున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల అభ్యున్నతికి, కులవృత్తులను ప్రోత్సహించడానికి అత్యధిక నిధులు కేటాయించడంపట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో విస్మరణకు గురైన అనేకరంగాలు, వర్గాలకు ఈసారి బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేశారని అభినందించారు.
తెలంగాణ ఆర్థిక వనరులను సరిగ్గా అంచనావేసి, తెలంగాణ రాష్ట్ర అవసరాలను సరిగ్గా అర్థం చేసుకుని, తెలంగాణలోని మానవ వనరులను సంపూర్ణంగా వినియో గించుకునే విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని చెప్పారు. బడ్జెట్ రూపకల్పన విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసినప్పటికీ, రాష్ట్ర ఆర్థికశాఖ అత్యంత సమర్థవంతంగా నిర్వహణ, ప్రగతి పద్దుల కింద నిధులు కేటాయించిందన్నారు. నిర్వహణా వ్యయాన్ని తక్కువ చేసుకుని ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగపడే ప్రగతి వ్యయాన్ని ఎక్కువగా పెట్టాలని నిర్ణయించడం మంచి పరిణామమన్నారు. బడ్జెట్ రూపకల్పనలో విశేష కృషి చేసిన అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.
ప్రభుత్వ దవాఖానాలకు చికిత్స
రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోంది. ప్రజారోగ్య వ్యవస్థను విస్తృత పరచడానికి, సౌకర్యాలను మెరుగుపరచడానికి సమగ్ర ప్రణాళికలు సిద్ధంచేసింది. ప్రభుత్వ వైద్యంమీద ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ దవాఖానాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం పూనుకున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకూ నేరుగా నిధులను అందిస్తోంది. పడకల సంఖ్యను బట్టి నిధులు కేటాయిస్తోంది.
హాస్పిటళ్లలో మందుల కొనుగోలుకు నిధులు రెట్టింపు చేసింది. పాడైపోయిన బెడ్ షీట్లు, బెడ్లు, సైలెన్ స్టాడ్లు, ఇతర పరికరాల స్థానే కొత్తవాటిని అందిస్తోంది. హైదరాబాద్‌లో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోంది. కరీంనగర్లో కూడా ఇటువంటి ఆస్పత్రిని నిర్మించే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 108 సేవలను విస్తరించేందుకు కొత్తగా 145వాహనాలు కొనుగోలుచేశారు. ప్రభుత్వ ఆస్పత్రులలో మరణించిన వారి మతదేహాలను ఇండ్లకు తరలించేందుకు పేదలు పడుతున్న ఇబ్బందులను గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం, మృతదేహాలను ఉచితంగా తరలించడానికి గత ఏడాది 50 వాహనా లను సమకూర్చింది. ఈ ఏడాది మరో 50 వాహనాలు సమకూర్చనుంది. వైద్యసౌకర్యాలకు దూరంగా జీవిస్తున్న గిరిజన ప్రాంతాలు, ఆదివాసీ గూడేలలో వైద్యసేవలు విస్తరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే 39 వాహనాలు కొనుగోలుచేసి ఈ ప్రాంతాలలోని పేదలను ఆస్పత్రులకు తరలిస్తోంది. రాష్ట్రప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా, మన రాష్ట్రానికి ఎయిమ్స్ మంజూరుచేసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ లో ఆరోగ్య శాఖరు రూ. 5,976.17 కోట్లు కేటాయించింది.
విద్యారంగం
విద్య మనిషికి మూండో కన్ను.సమాజం సాధించిన నాగరికత విలువలు, విజ్ఞానం కొత్త తరానికి అందించడానికి విద్య ఒకటే సాధనం. విద్యకున్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత పటిష్టపరుస్తోంది.
వివిధ శాఖలకు కేటాయించిన నిధులద్వారా పెద్దఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్ళను స్థాపిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలుచేస్తోంది. ఉస్మానియా సెంటినరీ బ్లాక్ నిర్మాణానికి , ఉత్సవ నిర్వహణకు బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలలో మౌలిక వసతులను మెరుగుపరచేందుకు మరో రూ. 200 కోట్లు కేటాయించారు.విద్యాశాఖ కోసం ఈ బడ్జెట్లో రూ. 12, 705.72 కోట్లు కేటాయించారు. కేవలం విద్యాశాఖ ద్వారానే కాకుండా వివిధ శాఖల ద్వారా కూడా విద్యారంగానికి ఖర్చుపెడుతున్న విషయం గమనార్హం.
పంచాయితీ రాజ్ వ్యవస్థ రూ. 14,723 కోట్లు
స్థానిక సంస్థలను బలోపేతంచేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా రాష్ట్రంలోని పంచాయితీల ద్వారా పన్నుల వసూలు మెరుగయ్యాయి. దీనివల్ల గ్రామపంచాయితీలు గ్రామాల్లో ప్రజలకు మెరుగైనసేవలు అందించగలుగుతున్నాయి.
మిషన్ భగీరథ
ప్రతి ఇంటికీ నల్లాద్వారా ప్రతిరోజు సురక్షిత మంచినీరు అందివ్వాలనే బృహత్తర లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం అనుకున్న వేగంతో పూర్తవుతోంది. డిసెంబరు 2017 నాటికి అన్ని గ్రామాలకు నదీజలాలు చేరే విధంగా కార్యాచరణ అమలవుతోంది. ఆపై ప్రతి ఇంటికీ నల్లా ద్వారా గోదావరి, కృష్ణా జలాలు అందుతాయి. రాష్ట్రంలోని 24,248 గ్రామీణ ఆవాస ప్రాంతాలలోని 52,18,225 కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు లభ్యమవుతుంది. 65 మున్సిపాలిటీలలోని 12.52 లక్షల కుటుంబాలకు, ఓ.ఆర్.ఆర్ లోపలవున్న గ్రామాలకు ఇదే పథకం ద్వారా మంచినీరు లభిస్తుంది. ప్రతి ఇంటికి ప్రతిరోజు మనిషికి గ్రామీణ ప్రాంతాలలో వందలీటర్లు, మున్సిపాలిటీలలో 135 లీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్లలో 150 లీటర్ల నీరు అందిస్తారు.బడ్జెట్ పై పెద్దగా భారం పడకుండానే బడ్జెటేతర నిధులతో ఈ పథకాన్ని ప్రభుత్వం పూర్తిచేస్తోంది. ఈ పథకానికి బడ్జెట్ సపోర్టు కింద రూ. 3,000 కోట్లు కేటాయించారు.
చీకట్లను ప్రారదోలిన విద్యుత్ వెలుగులు
యాభై ఎనిమిదేళ్ళ సమైక్యపాలన చీకట్లను తొలగిస్తూ ఉదయించిన తెలంగాణ వెలుగులవైపు ప్రయాణిస్తున్నది. విద్యుత్ సరఫరాలో సాధించిన అపూర్వమైన ప్రగతే అందుకు తార్కాణం. గతంలో ఏ ప్రభుత్వం కూడా నేడు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నట్టు విద్యుత్ ను ప్రజలకు అందించలేదు. సమైక్య రాష్ట్రంలో కోతలులేని కరెంటు ఒక తీరని కల. నేడది ప్రజల నిత్య అనుభవం.
రాష్ట్ర అవతరణ తరువాత, ప్రభుత్వం ఏర్పడిన కేవలం ఆరు నెలల లోనే విద్యుత్ పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. అనతికాలంలోనే అద్భుతాలు ఆవిష్కరించింది. గతంలో కరెంటు ఉంటే వార్త. ఇప్పుడు కరెంటుపోతే వార్త. కరెంటు కోతలకు కాలం చెల్లింది. నిరంతర విద్యుత్ తో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతోంది. నేడు ప్రభుత్వం వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగులుగుతోంది.ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ 9,500 నుంచి 10 వేల మెగావాట్లకు చేరుకున్నా సమర్థవంతంగా సరఫరాచేసేందుకు విద్యుత్ శాఖ సంసిద్ధంగా వుంది. మెరుగైన విద్యుత్ సరఫరాతో ప్రగతి దిశగా ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. పల్లెల్లో, పట్టణాలల్లో పరిస్థితి మెరుగై నిస్పృహతొలగి, ఉత్సాహపూరిత వాతావరణం నెలకొన్నది.
విద్యుత్ ఉత్పత్తిలో దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రభుత్వం కార్యాచరణను చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న విద్యుత్ సామర్థ్యం 6,574 మెగావాట్లు.ఈ రెండున్ననరేళ్ళల్లో అదనంగా 4190 మెగావాట్ల విద్యుత్ సమకూరింది. ఈ ఏడాది చివరి వరకూ మరో 4,130 మెగావాట్ల విద్యుత్ అందుతుంది. రాబోయే మూడేళ్ళలో మొత్తం 16,306 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తోంది.పాల్వంచ కె.టి.పి.ఎస్ లో 800 మెగావాట్లు, చత్తీస్ గఢ్ నుంచి వెయ్యి మెగావాట్లు, భద్రాద్రి పవర్ ప్లాంట్ నుంచి 1080 మెగావాట్లు, ఎన్.టి.పి.సి ద్వారా 4 వేల మెగావాట్లు, సి.జీ.ఎస్ ద్వారా 809 మెగావాట్లు, సోలార్ ద్వారా 3727 మెగావాట్లు, 90 మెగావాట్ల హైడల్ విద్యుత్ అందుబాటులోకి రానుంది.
వార్ధా- డిచ్ పల్లి లైను నిర్మాణం పూర్తయింది. దీని ద్వారా రెండువేల మెగావాట్ల విద్యుత్ ను నార్తన్ గ్రిడ్ నుంచి పొందే అవకాశం కలిగింది. దేశంలో ఎక్కడ విద్యుత్ అందుబాటులో వున్నా మనం దాన్ని పొందేందుకు ఈ లైన్ ద్వారా సాధ్యమవుతుంది. లోటు విద్యుత్ తో మొదలైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారబోతోంది.
విద్యుత్ డిస్కంలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి ఆ సంస్థల మొత్తం రూ.11,897 కోట్ల అప్పులో 75 శాతం (రూ. 8,923 కోట్లు) అప్పును కేంద్రప్రభుత్వ ఉదయ్ పథకం కింద రాష్ట్రప్రభుత్వం స్వీకరించింది. దీనివల్ల డిస్కంలకు ప్రతి ఏటా రూ. 890 కోట్ల వడ్డీ భారం తగ్గుతుంది.విద్యుత్ శాఖకు ఈ బడ్జెట్లో రూ. 4,203.21 కోట్లు కేటాయించారు.
పెట్టుబడుల వెల్లువ
రెండున్నరేళ్ల చిన్న వయస్సున్న తెలంగాణ రాష్ట్రం సులభతర వాణిజ్య విధానంలో దేశంలోనే నెంబర్ వన్ ర్యాంకును చేజిక్కించుకుంది.సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన టి.ఎస్ ఐపాస్ చట్టం తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి బంగారుబాటలు వేసింది.
కేవలం 15 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతులు మంజూరు చేయడం జరుగుతోంది. నిర్ణీత వ్యనధిలోపు అనుమతుల ప్రక్రియ పూర్తికాకపోతే స్వీయ ధృవీకరణతో అనుమతిపొందే వీలు కల్పించారు. సెల్ ఫోన్లు ఉత్పత్తిచేసే ఒక విఖ్యాత బహుళజాతి సంస్థ తెలంగాణ రాష్ట్రంలో తమ యూనిట్ స్థాపన విషయంలో ఎక్కడా తమకు అవినీతికానీ, అలసత్వం కానీ, ఏ అడ్డంకులూ ఎదురుకాలేదని, అది తమకెంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించిందని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ సందేశం పంపారంటే, అనుమతులుపొందే ప్రక్రియ ఎంత పారదర్శకంగా, సరళతరంగా, అవినీతి రహితంగా సాగుతోందో అర్ధమవుతుంది.ప్రభుత్వం అనుసరిస్తున విప్లవాత్మక విధానాల ఫలితంగా, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండున్నరేళ్ళకాలంలో 2.20 లక్షల మందికి ఉపాధి కల్పించే విదంగా రూ, 58,341 కోట్ల పెట్టుబడులతో 3,451 పరిశ్రమలకు అనుమతులివ్వడం జరిగింది, వీటిలో 1,097పరిశ్రమలు తమ ఉత్పత్తులు ప్రారంబించి43,075 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఈ పరిశ్రమలలో బోయింగ్, ఐ.టి.సి, టాటా సికోర్సికి, హెచ్.ఎస్.ఐ.ఎల్, తోషిబా, మైక్రోమాక్స్ వంటి సుప్రసిద్ధ సంస్థలు కూడా ఉన్నాయి.పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్ లో రూ. 985.15 కోట్లు కేటాయించారు.
ఐ.టి లో దూసుకుపోతున్నాం
తెలంగాణ రాష్ట్రం ఐ.టి. రంగంలో దూసుకుపోతోంది. రాష్ట్రప్రభుత్వం అందిస్తున ప్రోత్సాహం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఎన్నో దిగ్గజ సంస్థలు హైదరాబాద్ నగరంలో తమ యునిట్లు ప్రారంభి స్తున్నాయి. ఐ.టి ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 12 శాతం వాటాకలిగి, రెండవ స్థానాన్ని ఆక్రమించింది.గత ఏడాది ఐ.టి ఎగుమతుల విలువ 75,070 కోట్ల రూపాయలు. తెలంగాణలోని ఐ.టి కంపెనీల ద్వారా దాదాపు నాలుగు లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఐ.టి పరిశ్రమను ప్రోత్సహించడానికి రాష్ట్రప్రభుత్వం ఐ.టి.సి పాలసీని, ఎలక్ట్రానిక్ పాలసీని, రూరల్ టెక్నాలజీపాలసీ, డాటా సెంటర్స్ పాలసీ, ఓపెన్ డాటా పాలసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీలను రూపొందించింది.ఐ.టి శాఖకు ఈ బడ్జెట్లో రూ. 252.89 కోట్లు కేటాయించారు.
శాంతిభద్రతలు భేష్
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రజల జీవితానికి భద్రత కల్పించడంతోపాటు, రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ అంశం దోహదపడుతుంది.రాష్ట్రంలో పోలీసు శాఖ ఆధునికీకరణకు , సిబ్బంది జీవన ప్రమాణాలను పెంచడానికి వారికి సరైన శిక్షణ అందివ్వడానికి , ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందివ్వడానికి, ఆధునిక వాహనాలు కొనుగోలుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వ్యయపరుస్తోంది.
రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షి టీమ్స్ విజయవంతంగా పనిచేస్తున్నాయి. పోలీసు శాఖ సమర్థత పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల నేరాలు తగ్గుముఖం పట్టాయి.రాష్ట్రంలో గుడుంబా నివారణకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. గుడుంబా తయారీ, అమ్మకాలను నిరోధించడంతోపాటు గుడుంబా తయారుచేసేవారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తోంది.ఈ బడ్జెట్‌లో పోలీసు శాఖకు రూ. 4,828.18 కోట్లు కేటాయించడం జరిగింది.
పట్టణాభివృద్ధి
రాష్ట్రంలో పట్టణ జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణ జనాభాలో 40 శాతానికిపైగా జనం పట్టణాలలోనే నివాసం ఉంటున్నారు. వీరిలో 20 శాతం మంది హైదరాబాద్ నగరంలోనే నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోంది.హైదరాబాద్ నగరంతోపాటు ఇతర నగరాలు, పట్టణాల అభివృద్ధికి ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. జి.హెచ్.ఎం.సి కి రూ. 1,000 కోట్లు, గ్రేటర్ వరంగల్ కు రూ. 300 కోట్లు, మిగతా మున్సిపల్ కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించారు. అలాగే, మూసీనదీ తీరప్రాంతం అభివృద్ధికి రూ. 35 కోట్లు కేటాయించారు.మొత్తం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధికి ఈ బడ్జెట్ లో రూ. 5,599 కోట్లు కేటాయించారు.ఇవి గాక, బడ్జెటేతర మార్గాలలో నిధులు సమీకరించి పట్టణ ప్రాంతాలలో ఖర్చుచేస్తారు.
పంచాయితీరాజ్
స్థానిక సంస్థలను బలోపేతంచేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా రాష్ట్రంలోని పంచాయితీల ద్వారా పన్నుల వసూలు మెరుగయ్యాయి. దీనివల్ల గ్రామపంచాయితీలు గ్రామాల్లో ప్రజలకు మరుగైనసేవలు అందించగలుగు తున్నాయి. సర్పంచ్ లు, ఎం.పి.టి.సిలు, జడ్పిటిసిలకు ఇచ్చే గౌరవవేతనాన్ని ప్రభుత్వం గణనీయంగా పెంచింది. పంచాయితీ రాజ్ శాఖ ద్వారా రాష్ట్రంలోని మొరం, మట్టిరోడ్లను బిటి రోడ్లుగా మారుస్తున్నారు. బి.టి రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు.పంచాయితీ రాజ్ శాఖకు బడ్జెట్ లో రూ. 14,723.42 కోట్లు కేటాయించారు.
రహదారులు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్ర భౌగోళిక స్థితిగతులకు అనుగుణంగా రహదారుల నిర్మాణం కోసం సమగ్రవిధానాన్ని రూపొందించింది. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి ఖచ్చితంగా పక్కా రోడ్లు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లేన్ రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి నాలుగు లైన్ల రోడ్డు ఉండేలా ప్రణాళికలు అమలుచేస్తోంది.
పంచాయతీరాజ్ పరిధిలో రూ. 2247.28 కోట్ల వ్యయంతో 14,689 కిలోమీటర్లమేర బి.టి. రోడ్లకు మరమ్మతులు చేయడం జరిగింది.రూ. 4,564 కోట్ల వ్యయంతో 8987 కిలోమీటర్లమేర రహదారుల వెడల్పు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.రూ. 891 కోట్ల వ్యయంతో 460 బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోంది.
ఆర్ అండ్ బి పరిధిలో రూ. 1550 కోట్ల వ్యయంతో 5150 కిలోమీటర్లమేర బి.టి రోడ్లకు మరమ్మతులు జరిగాయి. రూ. 4100 కోట్ల వ్యయంతో 2850 కిలోమీటర్ల మేర రోడ్ల వెడల్పు, అభి
వృద్ధిచేసింది.రూ. 2782 కోట్ల వ్యయంతో 512 బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోంది.
గత ఏడు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో నిర్మించిన జాతీయ రహదారి కేవలం 2,527 కిలోమీటర్లు కాగా, గత రెండున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించింది 2,776 కిలోమీటర్లు. దీంతో రాష్ట్రంలో జాతీయరహదారుల పొడవు 5,303 కిలోమీటర్లకు పెరిగింది. ప్రతి వంద చదరపు కిలోమీటర్లకు జాతీయ సగటు 3.81 కిలోమీటర్లు కాగా, తెలంగాణ సగటు ఇప్పుడు 4.62 కిలోమీటర్లుగా వుంది. రోడ్ల నిర్మాణానికి ఈ బడ్జెట్ లో రూ. 5,033.64 కోట్లు కేటాయించారు.