magaమానవాళికి సుఖశాంతులతో కూడిన బ్రతుకును ఇచ్చే తల్లి బతుకమ్మ. పేరులోనే జీవన మాధుర్యాన్ని దాచుకొన్న ఈ తల్లి జగదారాధ్య దేవత. ఈమెను కొలువని వారు లేరు. తల్లికి నమస్కరించని తనయుడుకానీ, తనయకానీ లోకంలో ఉంటారా? ఉండనే ఉండరు. బతుకమ్మ గౌరీదేవిగా, లక్ష్మిగా, పలుకులతల్లిగా అనేక రూపాలలో కనబడుతుంది. మహాశక్తి లలితా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. సృష్టి, స్థితి, లయకారిణిగా తన విశ్వరూపాలను ఆవిష్కరిస్తుంది. ఆమె ఆరాధన జగత్తుకు క్షేమదాయకం. పూలతో అలంకరిస్తే పొంగిపోయే మెత్తని మనస్సు ఆమెది. రంగురంగుల పూలు ఆమెకు ఎంతో ఇష్టమైనవి. పూలకొండలలోనే ఆమె నివసిస్తుంది. పూలగుండెలలోనే ఆమె నిదురిస్తుంది. పూలవంటి వికాసమయ జీవితాన్ని మానవాళికి ప్రసాదిస్తుంది. అందుకే బతుకమ్మ అంటే ఆబాలగోపాలానికి భక్తి. పల్లెలు మొదలుకొని మహానగరాలదాకా మాతృదేశంలోనే కాక, పాశ్చాత్య దేశాలలోనూ, ప్రపంచవ్యాప్తంగా పూజలను అందుకొంటున్న చల్లని తల్లి బతుకమ్మ.

ఆశ్వీయుజమాసం నిర్మల ప్రకృతికి నెలవు. ఇది శరదృతువులో సంభవిస్తుంది. ‘శరత్తు’ అంటే సంవత్సరం అని ఒక అర్థం. తెల్లనిది అని మరొక అర్థం. అంటే ఈ ఒక్కమాసంలోనే సంవత్సరంలో జరిగేంత ఉత్సవాల సందోహం జరుగుతుందని అర్థం. తెల్లని ప్రకృతి నిర్మలత్వానికి గుర్తు. వర్షర్తువులో దండిగా వానలు కురిసి జలాశయాలన్నీ నిండుకుండలుగా మారిన తరువాత సమస్త ప్రకృతిలోని కల్మషాలన్నీ దూరమైపోతాయి. ఆకాశమూ, భూతలమూ ఏ మలినాలూ అంటని అద్దంలా భాసిస్తుంది. అలాంటి వేళలో బతుకుకు మూలాధారమైన బతుకమ్మను అర్చించడం సముచితమని ప్రాచీనులు భావించారు. దానికి అనుగుణంగానే వేదకాలం నుంచి బతుకమ్మను పూలతో పేర్చి ఆటపాటలతో జీవనకేళివలె కొనసాగించడం జరుగుతోంది.

వందలకొలది రూపాలతో బతుకమ్మలను పేర్చడం, ఆ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా అడుగులువేసి, పాటలు పాడడం చూస్తుంటే జీవితం ఆనందానికి సంకేతం అనే పరమార్థం తాండవిస్తుంది. స్త్రీశక్తి సర్వశక్తులకూ మూలమనీ, ప్రకృతికి ప్రతిరూపమైన తల్లిలేనిదే ఈ ప్రపంచమేలేదని తాత్త్వికభావన అంతర్గర్భితంగా దాగి ఉంది.

బతుకమ్మల ఆటపాటలకు తెలంగాణ జనపదాలు నిలయాలు. ఇల్లు ఇల్లూ ఒక ఆలయంగా, వీధి వీధి దేవాలయంగా, చౌరస్తాలే ఆరామాలుగా, విశాలమైదానాలే పూజా స్థలాలుగా, అణువణువునా ఆవహించిన మాతృశక్తికి ప్రతిరూపాలై బతుకమ్మను ఆరాధించడం తెలంగాణలో కనబడే రమణీయ దృశ్యం.

మహాలయ అమావాస్యతో ప్రారంభమై దుర్గాష్టమితో ముగిసే నవరాత్రుల పండుగ బతుకమ్మ. ఒక్కొక్క దినాన ఒక్కొక్క రూపంలో బతుకమ్మను అర్చిస్తారు. తెలంగాణ ప్రాంతానికే విశిష్టతను తెచ్చిపెట్టిన ఈ మహాపర్వం అశేష జనవాహినికి ఎంతో ప్రీతిపాత్రం. తెలంగాణ ప్రాంత సంస్కృతి, ఆచార వ్యవహారాలు, జనజీవన విధానాలను ఈ పండుగ తెలియ పరుస్తుంది. సాంస్కృతికంగా ఈ పండుగ తెలంగాణకు ‘కుంభమేళా’ వంటిది.

నవరాత్రుల ప్రత్యేకత వర్ణనాతీతం. నవశబ్దం నిత్యనూతనత్వానికి గుర్తు. జీవితం ఎప్పుడూ ఆనందోత్సాహాలతో నిత్యనూతనంగా ఉండాలనే భావన ఈ బతుకమ్మ నవరాత్రు లలో కనబడుతుంది. అంతేగాక లోకంలో శక్తి ఆరాధనలన్నీ నవరాత్రు లుగానే కొనసాగడం సంప్రదాయం. ఇలా సంప్ర దాయాన్నీ, సంస్కృతినీ తనలో రంగరించుకొన్న బతుకమ్మ పండుగ అంటే అందరికీ ఆనందదాయకమే. బతుకమ్మ పండుగ తొమ్మిది దినాలు సాగే విధానం ఇలా ఉంటుంది…

జనవ్యవహారంలో ‘సద్దుల బతుకమ్మ’, ‘చద్దుల బతుకమ్మ’ అని రెండు విధాలుగా ఉచ్చరించే ఈ చివరి పండుగదినాన బతుకమ్మలను సమీప జలాశయాలలో నిమజ్జనం చేయడం సంప్రదాయం. ప్రతినిత్యం బతుకమ్మను జల నిమజ్జనం చేస్తారు. చివరి రోజైన చద్దుల బతుకమ్మ పండుగ మాత్రం విశేష సేవలతో అలరారుతుంది. శక్తి పూజలన్నీ నవరాత్రులుగానే జరుపుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఉంది.

ప్రకృతిలో లభించే పూవులూ, ఆకులే బతుకమ్మకు ప్రీతిదాయకాలు. బతుకమ్మలను పేర్చడానికి తంగేడుపూలనూ, గునుకపూలనూ ఉపయోగిస్తారు. ఈ రెండు పూలకు నీటిలోని కల్మషాలను తొలగించి, పరిశుభ్రంగా ఉంచే గుణం ఉంది. ఈ గుణమే ఈ పూలను బ్రతుకమ్మ రూపంలో పేర్చడానికి మూలం. అంటే ఒక విధంగా ఈ పండుగ ద్వారా ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరుల సంరక్షణ ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది. అందుకే బతుకమ్మ పండుగ అంటే జనబాహుళ్యానికి అమితమైన ఉత్సాహం.

ప్రతినిత్యం మహిళలు బ్రతుకమ్మలను పేర్చిన పళ్లాలను తలపైకెత్తుకొని ఊరిపొలిమేరలలో ఉన్న చెరువులలోగానీ, తటాకాలలో గానీ నిమజ్జనం చేయడానికి ఊరేగింపుగా వెళ్తారు. ఆటపాటలతో బ్రతుకమ్మలను నీటిలో జారవిడిచి, నమస్కరిస్తారు. ఆ తరువాత చద్దులను ఆరగిస్తారు. ఈ బతుకమ్మ పండుగలలో ఉయ్యాల పాటలు ప్రధానమైనవి. ‘బతకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ మొదలై కొనసాగే ఈ పాటలలో స్థానిక విశేషాలూ, పర్వదినాల ప్రశస్తులూ, ఆచార వ్యవహారాలూ చోటు చేసుకొంటాయి. బతుకమ్మ పండుగ తెలంగాణ గర్వించదగిన జనమహాపర్వం!

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమినుండి విజయదశమి పర్వదినం వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. ‘శక్తి’లేనిదే ఈ ప్రపంచం అణుమాత్రమైనా కదలజాలదు. ఆ శక్తికి మూలం త్రిమాతలు. వారే సరస్వతి, లక్ష్మి, పార్వతులు. సరస్వతి సృష్టిశక్తికీ, లక్ష్మీదేవి సౌఖ్యజీవనశక్తికీ, పార్వతీదేవి సకల మంగళాలకూ ప్రతీకలు. ఈ ముగ్గురినీ ఏకరూపంలో చూడడమే ‘దేవీ’ తత్త్వం. నిరంతరం ప్రకాశానికి మూలకారణమైన శక్తిని ఆరాధించడానికి శరదృతువే అనుకూలం అని ప్రాచీనకాలం నుండి జనుల విశ్వాసం. అంతేగాక వేదాలు మొదలుకొని సమస్త ప్రాచీన గ్రంథాలన్నీ శక్తి పూజను శరదృతువులో, ఆశ్వీయుజమాసంలోనే చేయాలని చెబుతున్నాయి. శరదృతువులో చంద్రుడు నిర్మలుడై అమితంగా ప్రకాశిస్తాడు. చంద్రుని పదహారు కళలే మానవాళి మనుగడ సాగిస్తున్న ఈ భూమిపై విశేష ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే అందరూ చాంద్రమానాన్ని కాలగణనలో ముఖ్యంగా గ్రహిస్తారు. రోజుకొక్క కళగా వర్ధిల్లే చంద్రునివలెనే తమ జీవితాలుసైతం రోజుకొక్క కళగా వర్ధిల్లాలని భావించే మానవులు శరదృతువులో శక్తిని ఆరాధిస్తారు.

చంద్రునిలోని కళలను శక్తి స్వరూపాలుగా భావించే సంప్రదాయం భారతదేశంలో ఉంది. అందుకే శక్తికి ‘చంద్రకళ’ అని పేరు. చంద్రునిలోని కళలే భూగోళం పైన గల మానవులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. చంద్రుని కళలలోని హెచ్చుతగ్గుల వలననే సముద్రాలు ఆటుపోట్లకు గురి అవుతున్నాయి. చంద్రుని గురుత్వాకర్షణ కారణంగానే ఆయా ఋతువులలో ఆయా ఓషధులూ, వృక్షజాతులూ వికాసాన్ని పొందుతూ మానవాళికి ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. చంద్రుని ఉదయాస్తమయాలు మనుష్యుల మనోభావాలను సైతం ప్రభావితం చేస్తాయని ప్రాచీన గ్రంథాలూ, వైజ్ఞానిక శాస్త్రాలూ ప్రవచిస్తున్నాయి.

చంద్రుడు మన: కారకుడని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది. అంటే మనస్సులో ఉద్భవించే అనుకూల, ప్రతికూల భావాలకు చంద్రుని కళలే మూల కారణాలు. కనుక ఆ చంద్రకళల రూపంలో విరాజిల్లే శక్తి స్వరూపాన్ని లలితాపరమేశ్వరిగా, దుర్గాదేవిగా, అపరాజితగా, కాళికగా, పార్వతిగా, శైలపుత్రిక హైమవతిగా, శాకంబరిగా, శ్యామలగా, త్రిపురసుందరిగా భావించడం ప్రారంభమైంది.

దేవీ నవరాత్రోత్సవాలలో ఉదయ, సాయంకాలాలలో శక్తి పూజలు యథాశక్తిగా చేయడం పరిపాటి. ఈ పూజలలో షోడశోపచారాలతో చేసేవీ, చతు:షష్ట్యుపచారాలతో చేసేవీ అయిన పూజలున్నాయి. ఎవరి శక్తిని అనుసరించి, వారు శక్తిని పూజిస్తారు. శక్తిపూజలో శ్రీచక్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రీచక్రం అంటే శక్తికి నివాసస్థానం. ఆమె అరవైనాలుగు కోట్ల యోగినీ దేవతల మధ్యలో ఉన్నతమైన త్రికోణ సింహాసనంపై కూర్చొని ప్రపంచాన్ని శాసిస్తుందని సంప్రదాయం చెబుతోంది. నవరాత్రోత్సవాలలో దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ప్రధానాలు. దుర్గాష్టమినాడు దుర్గాదేవి మానవాళి దుర్గతులను పోగొట్టి, సుఖశాంతులను అందిస్తుందని నమ్మకం. మహర్నవమినాడు ఉజ్జ్వలంగా ప్రకాశించే శక్తి మానవాళికి ఉజ్జ్వల భవిష్యత్తును చేకూరుస్తుందని విశ్వాసం. విజయదశమినాడు శక్తి ‘అపరాజిత’ అనే పేరుతో ఎదురులేని శక్తినీ, తిరుగులేని విజయాలనూ జీవితంలో ప్రసాదిస్తుందని ప్రగాఢమైన నమ్మకం. ఈ విశ్వాసమే శక్తిపూజలకు ఆలంబం!

మానవులు, అభ్యుదయాలనూ, శ్రేయస్సులనూ, పురోగతులనూ కోరుకొంటారు. వీటిని ప్రసాదించగల శక్తి భగవంతుని రూపంలోనే ఉంటుందనేది యథార్థం. ఆ శక్తినే అనేక రూపాలుగా భావించుకొని పూజించడంతో అనేక పూజా సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఏ పూజ అయినా ఈ ప్రపంచంలోని చరాచరాలకు మేలును కలిగించడానికే. ఏ ధ్యానం అయినా మానవాళికి సుఖశాంతులను అందించడానికే. ఇదే పూజల పరమార్థం. సంస్కృతి, సంబురాల లక్ష్యం. అందరూ సుఖంగా ఉండాలనీ, అందరూ ఆయురారోగ్యాలతో కూడి ఉండాలనీ, అందరూ అభ్యుదయాలను అందుకోవాలనీ, ఏ ఒక్కరికీ దు:ఖం కలుగరాదనీ మన ప్రాచీన మహర్షులు భావించారు. అదే అందరి భావన కావాలి.

మొదటి దినం అయిన మహాలయ అమావాస్యను ‘పెతరమాస’ అని తెలంగాణలో సంబోధిస్తారు. అంటే ఇది పితృదేవతలకు ఎంతో ప్రీతిని కలిగించే రోజు. ‘పెతర’ అనే పదం ‘పితృ’ అనే పదానికి వికృతిగా చెప్పవచ్చు. ఈ దినాన పితృదేవతల ప్రీతికోసం ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి, నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు.

రెండవ దినం అయిన ఆశ్వీయుజ శుద్ధపాడ్యమి దినాన బతుకమ్మ పేర్చి, అటుకులు, చప్పడిపప్పు, బెల్లంతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.

మూడవ దినం అయిన ముద్దపప్పు బతుకమ్మ పండుగనాడు పాలు, బెల్లంతో కలిపిన పదార్థాలను అమ్మవారికి నివేదిస్తారు.

నాల్గవదినాన బతుకమ్మకు నానవేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.

అయిదవ దినాన బతుకమ్మకు అట్లను నివేదన చేస్తారు. కనుక అట్ల బతుకమ్మ అని పిలుస్తారు.

ఆరవ దినాన ‘అలుక’ బూనుతుంది.కనుక ఆమెకు ఈ దినాన నైవేద్యం ఏమీ ఉండదు. ఆమె అలుక తీర్చడమే ఆనాటి అర్చన.

ఏడవ దినాన బతుకమ్మకు బియ్యంపిండితో వేపకాయల ఆకృతిలో వండిన పిండివంటలను నైవేద్యంగా పెడతారు.

ఎనిమిదవ దినాన బతుకమ్మకు నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం కలిపిన పదార్థాన్ని నివేదన చేస్తారు.

తొమ్మిదవ దినం దుర్గాష్టమి. ఇది బతుకమ్మ పండుగకు ముగింపు రోజు. ఈ దినాన బతుకమ్మకు ఎన్నోవిధాలైన చద్దులను నివేదించడం పరిపాటి. ఈ చద్దులలో పెరుగుతో కలిపినవీ, పులిహోరవలె చేసినవీ, నిమ్మరసంతో కలిపినవీ, కొబ్బరితో కలిపి చేసినవీ, నువ్వుల అన్నంతో కలిపినవీ అయిన రకరకాల చద్దులను బతుకమ్మకు సమర్పిస్తారు. మానవాళి ప్రాణధారణకు అవసరమైన అన్నివిధాల శక్తులను అందించే అన్నాన్ని బతుకమ్మకు నివేదించి, దానిని ప్రసాదంగా ఆరగించడమే ఈ చద్దుల బతుకమ్మ పండుగలోని పరమార్థం.

తిగుళ్ల అరుణకుమారి

Other Updates