కవిత్వం పేనినట్లు, కుటుంబం కలిసినట్లు

గతుకుల బాటదాటి, గమనం సరిజేసుకుంటరు ఆడోళ్ళు

అనుభవాల ప్రతిధ్వనులను పాటలు పాటలుగ పాడగ

బతుకమ్మలు పేర్చి మనసంత గుమ్మరిస్తరు ఆడోళ్ళు

ఐదుగట్ల బొడ్డెమ్మల అమాయక ఈడుదాటి

ఏడు గద్దెల బొడ్డెమ్మల చలాకి ఆటలాడి

తొమ్మిది అంతస్తుల బొడ్డెమ్మలాటకు అమ్మఅయ్యలకుంపట్లైతరు

పెత్రమాస. పూలపండుగకు శుభాలను మోసుకొస్తరు

బతుకుదీపాలుగద, బతుకమ్మ ఆడ్తరు బతుకు పాటలు పాడ్తరు

పొద్దున పూజించే గౌరమ్మకు ఆరగింపుల్ల

ఆరుతీర్లన్న నైవేద్యం జేసిపెట్టి ఆరిందలైతరు

పండుగలొస్తే, పనుల లిబ్బు లెత్తినట్లె!

చుట్ల చుట్ల పూలపేర్పుల రూపునివ్వ పొట్టనింప

గుత్తుల సాయం దీసుకున్నట్లు ఇంటోళ్ళ సాయం దీసుకుంటరుగాని,

కనిపించని జలపుష్పాలు ఈదే చెలిమెల సంగతి జెప్పరు, ఆడోళ్ళు!

బిందెలెత్తినట్లె ఒంటలొండినట్లె

ఆకళ్ళు దీర్చే కడుపు పండినట్లె

స్థాంబాళమంత నవ్వై ఎత్తుకెత్తిస్తరు

కడుపుల నొప్పి తెలిసిన కడగండ్ల విలువ దెలిసినోళ్ళుగద

ముసలిదగ్గులు, మురికి వాసనలు

ముతు గుడ్డలు, వెతల మర్మాలెరిగినట్లె

పొద్దూమూకంగనె జంటసోపతుల గొంతుగలుపుతరు

దీపాల మెరుపులెనుక కరిగిన మైనమోలె

పీల్చే వొత్తికింద ఇగిరిన నూనెవోలె

ఎత్తుకెత్తి పడేస్తే ఇరిగిన ప్రమిదలోలె

చీకటిని తిట్టలేని అభాగ్యులు కొందరాడోళ్ళు

తమస్సు ఉషస్సుల తేడాదెలిసిన కొందరాడోళ్ళు

సీతమ్మ వొన వాసకథ పాటలైనట్లు

ఊర్మిళ నిద్ర తీగరాగాలు దీసినట్లు

గంగగౌరిల సంవాదనల మౌనముద్రల శివుని దిట్టినట్లు

ఉయ్యాల్లరాగం దీస్తరు ఆడోళ్ళు

చప్పట్లు మెప్పులకుగాదు

సయ్యాటల పొంగులకుగాదు

గుండెల తడి పిండిపోయడానికో

కండ్లల్ల నీళ్ళుదోడి ఒలకబొయ్యడానికో

పనులన్ని పక్కనబెట్టి, సిబ్బిదుల్పిసిత్రల

వర్ణవికాసాలైతరు ఆడోళ్ళు

కాలం కనిపించని దాడిజేస్తే మెరుపుల మరకలు మోసుకొస్తరు

తతిమ్మముచ్చట్లల్ల తన తదనంతర తీరు జెప్తరు ఆడోళ్ళు!

బతుకమ్మ పండుగొస్తె పాల్‌చీరల జోలికిబోరు

బతుకమ్మ పండగొస్తె ప్రణయకలహాల జాడబట్టరు

తల్లిగారి మాటజెప్తె చంగునెగిరి లేడిపిల్లలైతరు

నూనెరాసి చిక్కదీసిన జడల మల్లెపూలమాలలైతరు ఆడోళ్ళు

ఇంకిన దు:ఖపు జాడలు ఇగురంగదిప్పుకుంటు

పక్కపొంటిదిరిగె ఆటలల్ల ఒంగిలేసినప్పుడు

చప్పట్ల చేతుల్ల జంటగలిపి రాగపల్లవులెత్తుకున్నప్పుడు

భావాల మూటలనందుకొంటు బనాయించుకొంటరు ఆడోళ్ళు

ఒదినెల చేతుల్ల హతమైన ఆడబిడ్డ

బొందగడ్డమీద మాట్లాడె పువ్వుపూసే చెట్టుగనో,

అన్నల కండ్లు దెరిపించె ఇంటిబిడ్డ

అడవంత బెరిగే తంగెళ్ళ వనాల పచ్చదనంగనో

తొమ్మిదిరోజుల నమ్మికల కథలు పాడ్తరు ఆడోళ్ళు

పరువాల పట్నాల మాటల్లనైన

పండ్లురాలినట్లుండు పల్లెటూర్ల పండుగల్లనైన

పరమ పవిత్ర ప్రతిరూపులై

ఊరి గుడి ముంగట్లనో, ఎండిన చెరువుల్లనో

గుట్టగుట్టలు పడేసే బతుకమ్మ లైతరు ఆడోళ్ళు

నొసిటిమీది ఎర్రబొట్టు, పాదాల పసుపురంగు

తలనతురిమిన పూలదండలు

రామసక్కని పడుచుపిల్లలు

ముచ్చట్లు చిలకరించినట్లు పాటలేడపాడ్తరు?

గుడ్లుమిటకరించినట్లు ఆటలేడ ఆడ్తరు?

కోలాటాల కొత్త ఫ్యాషన్‌ స్టైల్‌

టీవీ ఆంకర్ల కల్తీ మాటల లైఫ్‌

సినిమా షోకుల మిఠాయిపొట్లాల

అధునాతన అంతరంగ

గాలిపటాలెగిరినట్లు మనసులెగురితే

మాంజాబట్టిన మొగ చేతుల్లో దారాలైతరు ఆడోళ్ళు

ఏది ఏమైనా, ఏదెట్లొచ్చినా

నీది నాదైనా, నాది నీదైనా

బత్కమ్మ ఆడేటోళ్ళు

బతుకు అర్థం తెలియగోర తెగ ఆరాటపడ్తున్నరు

తెలంగాణ ఇప్పుడు

నిశిరాత్రి చుక్కల మెరుపుల జలతారు

తెలంగాణ ఇప్పుడు

పున్నమి వెలుగుల తెల్లని చందురుడు

ఎప్పటికప్పుడు కొత్త వెలుగులు పంచే ఎర్రని సూరీడు

బతుకమ్మ సంబురాల్లో నవ్వుల తెల్లని

పలు వరుసల గునుగుపూలు ఆడోళ్ళు

బతుకమ్మ దూపులలో మనసులొక వాసనలు

వీచె తంగేడు పూలు ఆడోళ్ళు

ఆడోళ్ళంటేనే బత్కమ్మ! బతుకమ్మంటేనే ఆడోళ్ళు

బ్రతుకు చిత్రానికి తీర్చిదిద్దిన

సమరసతాభావనల రంగులు ఆడోళ్ళు!!

– డా|| కొండపల్లి నీహారిణి

Other Updates