ఎన్నీల ఎలుగు   – అన్నవరం దేవేందర్‌

ఎన్నికలు ఒక పర్వదినం

బతుకమ్మ, దసర, దీపావళి సంప్రదాయ పండుగలకు తోడు ఊర్లకు కొత్త కొత్త పండుగలు జత అయితన్నయి. బతుకమ్మ అయితె, మనకు పెద్ద పండుగ. ఊరు ఊరంతా పూల జాతర లెక్క కన్పిస్తది. ఆడబిడ్డలు ఇల్లు నిండుతరు. కోడండ్లు అవ్వగారిండ్లకు పోతరు. బతుకమ్మ ఒక మహత్తర పండుగ. అట్లనే దసర పండుగ. దసరకు యాట పిల్లలు తెగుతయి. పల్లెలన్ని జోష్‌ మీద ఉంటయి.

ఏ పండుగ ఎట్ల పుట్టిందో అనే ముచ్చట పక్కన పెడితే, తాగుడు తినుడు కొత్త బట్టలు ఏసుకునుడు, సంబురంగ

ఉండుడు కుటుంబ సభ్యులతో గడపడం అయిపోయింది. అట్లనే రానురాను ఊర్లల్లకు కొత్త కొత్త పండుగలు వస్తన్నయి. బొడ్రాయి పెట్టుకునుడు అందుట్ల ఒకటి. బొడ్రాయి ఊరూరికి ఉండేదే కని యాభై, అరవై ఏండ్లు అయినంక మల్ల బొడ్రయి పండుగ చేసుకోవాలని ఊరంత ఒక్కటై పండుగ చేసికుంటుండ్రు. ఈ పండుగకు ఆ వూరి బిడ్డలు అల్లుండ్లు, కొడుకులు, కోడల్లు అంత ఎక్కడున్న రావాలె వచ్చి ఆ సామూహిక పండుగలో పాల్గొనాలె. అట్లనే బోనాల పండుగ ఇది వరకు ఎనకట ఉండెగని తర్వాత జర కనుమరుగైంది. మల్ల తెలంగాణ ఉద్యమంల మన పండుగలు మన సంస్కృతిని తిరిగి తెచ్చుకునే క్రమంలో బోనాలు జబర్‌ దస్త్‌గా అన్ని ఊర్లల్ల చేసుకుంటండ్రు. ఏ పండుగ అయితేంది పట్నాలల్ల, నగరాలల్ల ఉండే మనుషులకు సేద తీరేతందుకు ఊరే పసందు. బోనాలు అనంగనే ఊరు ఇడిశి పోయినోల్లంత మల్ల ఊర్లల్లకు పోతండ్రు తమ పిల్లలకు మనుమలు, మనుమరాండ్లకు సుత తమ ఊరి బాల్య జ్ఞాపకాలు పరిచయం చేస్తున్నారు.

అట్లనే పెండ్లిలకు, సావులకు సుత ఊర్లల్లకు పోవుడు ఉంటది. అప్పుడు ఊరంత కన్పిస్తది కని, ఆ కార్యం అయిపోగానే మల్ల వచ్చుడు ఉంటది. అయితే అందరి ఇండ్లల్లకెల్లి ఎల్లి పోయిన వాల్లు ఆ సమయాన కన్పిస్తరు.

ఈ సందుల మన సంప్రదాయ పండుగలకు తోడు కొత్త కొత్త పండుగలు వస్తున్నయి అవి ఓట్ల పండుగలు. అవును ఎన్నికలు ఊర్లల్ల ఒక పండుగ వాతావరణమే. ఓట్ల కాలం వచ్చిందంటే కొత్త కొత్త లీడర్లు పుట్టుకస్తరు. నాయకులు తయారైతరు. ఓట్లు ఎట్ల ఏయించాలె ఎన్నికలల నిలబడే పార్టీ గురించి ఎట్ల చెప్పాలె. ఆ అభ్యర్థి గురించి ఎట్ల ప్రచారం చెయ్యాలనే ఆలోచనలనే ఉంటరు. అలాంటి వాల్లు లీడర్లుగ తయారైతరు. ఆయా పార్టీల ప్రతినిధులుగ

ఉంటరు. రాజకీయ పార్టీలకు గ్రామ స్థాయి శాఖలు, మండల స్థాయి శాఖలు ఉంటయి. ఆయా శాఖల ప్రతినిధులు, సర్పంచ్‌లు గ్రామ పంచాయితీ పాలక వర్గం వార్డు సభ్యులు ఉంటరు. వీల్లంత ఊరి అభివృద్ధికి దోహదం చేస్తరు. అట్లనే మండల

స్థాయిలో పరిపాలన అందించే స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటరు. ఎన్నికలు వచ్చినయంటే వీల్లందరికి పండుగోలె పని ఉంటది. ఓటర్‌ లిస్ట్‌ల పేరు నమోదు నుంచి మొదలై పోల్‌ చిట్టీలు పంచేదాక ఎవల మనుషులను వాల్లు కనిపెట్టుకుంట ఉండాలె.

ఎన్నికలు అనగానే అందరికీ పని పండుగ లెక్కనే ఉంటది. ఇదొక ప్రజాస్వామ్య ఎన్నికల వాతావరణం. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు వినియోగానికి ఐదేండ్లకోసారి వస్తున్న సందర్భం. స్థానిక సంస్థలు, శాసన, పార్లమెంట్‌ ఎన్నికల ద్వారా ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడం వల్ల ఊరి బాగోగుల కోసం నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పరిఢవిల్లాలి. ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు పట్నంబాట పట్టిన వాల్లు, ఎక్కడికో బతుకపోయిన కుటుంబాలు, వారం రోజుల ముందే ఊర్లకు చేరుకుంటాయి. ఊరంటే అందరికీ సంబురమే. బతుకమ్మ, దీపావళి, దసర బోనాలు లెక్కనే ఎన్నికలు కూడా సంబురమైన పర్వదినం.

Other Updates