స్వేచ్ఛావాయువుల మధ్య సొంత రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్ని తాకాయి. తొమ్మిది రోజుల పాటు ఉయ్యాల పాటలతో ఊయలలూగిన సద్దుల బతుకమ్మ పండుగ బతుకమ్మ నిమజ్జన పర్వం జయ్యత్‌గా జరిగింది. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ పండుగ ఉత్సవాలతో హూస్సేన్‌సాగర్ తీరం ఒక్కసారిగా పులకించిపోయింది. బుద్ద భగ వానుడి సాక్షిగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల పాటలతో పుష్పశోభి తమైంది. వివిధ కళారూపాల్లో బతుకమ్మ శకటాల ప్రదర్శన కన్నుల పండువగా సాగింది. మిరుమిట్లు గొలిపే లేజర్‌షో ఆకాశవీధిలో రంగుల హరివిల్లును ఆవిష్కృతం చేసి అబ్బురపరిచింది. పేరిణీ శివతాండవం, చిందు యక్షగానం, ఒగ్గుటోళ్ల కళారూపాలు, కోయ కళాకారులు, డోలు కళాకారులు ప్రదర్శనలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించాయి. చిన్నపిల్లలు సైతం బంగారు బతుకమ్మ నెత్తిన పెట్టుకొని రావడంతో పాటు వేలాది బతుకమ్మలతో సాగిన ఊరేగింపు, కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా సాగింది. తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పాటు చేసిన శకటంతో పాటు తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని పోలిన శకటం, సమ్మక్క సారలమ్మ శకటాలు, ఇటీవల ఎవరెస్ట్‌ను ఆధిరోహించిన పూర్ణ్ణతోపాటు గుత్తాజ్వాల పీవీ సింధూ, నైనా, సైనా, యెండల సౌందర్య తదితరుల అధిరోహించిన శకటాలు ఎంతో ఆకర్షణగా నిలిచాయి. ఆట పాటలతో ట్యాంక్‌బండ్ ప్రాంతం హోరెత్తగా, హుస్సేన్‌సాగర్ మొత్తం బతుకమ్మల నిమజ్జనంతో పూలసరస్సుగా మారిపోయింది.
ఆరోజు నగరంలోని అన్ని దారులు సాగర తీరానికే చేరాయి. ట్యాంక్ బండ్ బతుకమ్మలతో పుష్ప శోభితమైంది. ఎక్కడ చూసినా బతుకమ్మలను ఎత్తుకుని ముందుకు సాగుతున్న వనితలే దర్శనమిచ్చారు. నింగీనేలా ఏకమైన చందంగా మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగులో సాగరతీరం దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్మింది. ఆరోజే అక్టోబర్ తేదీ సద్దుల బతుకమ్మ పండగ రోజు. ప్రభుత్వ పండుగగా ప్రకటించి నిర్వహించిన బతుకమ్మ పండుగ చివరిరోజు అక్టోబరు 2వ తేదీ సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కనీవినీ ఎరుగని రీతిలో సంబురాలు జరిగాయి. సంబురాల చివరన ఏర్పాటు చేసిన లేజర్ షో చూపరులను మంత్రముగ్దు లను చేసింది.
ట్యాంక్‌బండ్ ఈచివర నుంచి ఆచివర వరకు అంబేద్కర్ విగ్రహం నుంచి బోట్స్ క్లబ్ దాకా స్వాగత తోరణాలతో, మహిళలకు ఆహ్వానం పలుకుతున్న కటౌట్‌లతో, ఫ్లోరోసెంట్ బల్బుల తో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. తెలంగాణ సంస్కృతిని తెలిపే గంగి రెద్దులు, గిరిజన నృత్యాలు, చిందు బాగోతం, థింసా, గుస్సాడి, యక్షగానం తదితరకళారూపాలను ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శించారు. మహిళలు బతుకమ్మలను ఎత్తుకుని వస్తుంటే వారిపై పూల వర్షం కురిపించే విధంగా ట్యాంక్‌బండ్ రోడ్‌కు పక్కగా యం త్రపరికరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా బంతిపూల వర్షాన్ని మహిళలపై కురిపించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వ హించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలోని పది జిల్లాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబురాలను పల్లె నుంచి పట్నం దాకా అన్ని ప్రాంతాల ప్రజలు ఎంతో ఆనందో త్సాహాలతో నిర్వహించుకున్నారు. సంబురాల చివరి రోజు రాష్ట్ర రాజధాని నగరమైన భాగ్యనగరంలో ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన వేడుకలు తొమ్మిది రోజుల వేడుకలకు హైలైట్‌గా నిలిచాయి. దేశస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. విదేశీ పర్యాటకులు సైతం ఈ సంబురాల పట్ల ఉత్సుకతను ప్రదర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ ప్రజలు ఉన్న దేశాల్లోని అన్ని ప్రాంతాలలోను, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోను ప్రజలు సంబురాలను ఎంతో ఆనందోత్సా హాల మధ్య జరుపుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం బతు కమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళల నుంచి ఎంతో స్పందన కానవచ్చింది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మను పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని ప్రజలంతా కంకణ బద్దులై బతుకమ్మ వేడుకలను జయప్రదం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షురాలు, నిజామాబాద్‌పార్లమెంటు సభ్యురాలు కవిత ప్రతి జిల్లాలోను జరిగిన బతుకమ్మ సంబురాలకు హాజరై ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, మెదక్ జిల్లా సిద్దిపేట, ఖమ్మం జిల్లా కొత్తగూడెం, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, వికారాబాద్, నిజామాబాద్, నల్లగొండ తదితర ప్రాంతాలలో జరిగిన సంబురాలలో ఎం.పి. కవిత పాల్గొని స్వయంగా బతుకమ్మను పేర్చడమే కాకుండా బతుకమ్మను ఎత్తుకుని ఊరేగింపులలో పాల్గొన్నారు. నిమజ్జనం చేసే వరకు ప్రతి జిల్లాలోనూ మహిళలతో పాల్గొని ఆటాపాటలను నిర్వహించారు. ఈ సంబురాలలో ఆమెతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. భాగ్యనగరంలో జరిగిన వేడుకలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎల్.బి.స్టేడియంలో
నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో సుమారు 25 వేల మంది మహిళలు బతుకమ్మలను పేర్చి, అక్కడే బతుకమ్మ ఆట ఆడారు. ఆటలు, పాటలు, కోలాటాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. మెట్రో రైలు బ్రిడ్జిలు పల్లెల్లో వెలసాయా..! అనిపించింది. పట్నమంతా పల్లెటూరును తలపించింది. లాల్ బహద్దూర్ స్టేడియమంతా టన్నులకొద్ది రంగురంగుల పూలతో నిండిపోయింది. తెలంగాణ నారీమణులెందరో సంబురంగా స్వంత రాష్ట్రం సాక్షిగా ఆకాశాన్నంటే ఆనందపు డోలికల్లో తేలియాడుతూ పదివేల బతుకమ్మలను పేర్చుకుని హుస్సేన్ సాగర్‌కు కదిలారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎం.పి. కల్వకుంట్ల కవిత, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిలు అందరిలో ఒకరుగా మారి బతుకమ్మలను తీర్చి దిద్దుకుని, భక్తి శ్రద్దలతో గౌరీపూజను నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను ఎత్తుకుని ఊరేగింపుగా ట్యాంక్‌బండ్ వైపు కదలి వచ్చారు. బతుకమ్మలను తలకెత్తుకుని ముందుకు కదిలారు. వీళ్ళను వెన్నంటి తీర్చి దిద్దిన పదివేల బతుకమ్మలను తలకెత్తుకుని కదిలిన తరుణులందరూ ట్యాంకుబండ్ వైపుకు కదిలి తరలిన దృశ్యం పుష్పాయమానం.
తెలంగాణ ప్రతి జిల్లా నుంచి ఒక శకటాన్ని ప్రదర్శించారు. సమాచారశాఖ వారు ప్రదర్శించిన శకటం చూపరులను ఆకట్టుకుంది. పలువురి ప్రశంసలను అందుకుంది. ఒక శకటంలో ఎవరెస్టును అధిరోహించిన ఆనంద్, పూర్ణిమలతో పాటు, క్రీడాకారులు గుత్తాజ్వాల, సింధు తదితరులు బతుకమ్మలను ఎత్తుకుని ప్రదర్శనలో పాల్గొని హైలైట్‌గా నిలిచారు. పేరిణి శివతాండవం, గంగిరెద్దుల ప్రదర్శన, ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల సాంప్రదాయ వేషధారణ, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించే కళా ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి.
నిత్యం రణగొణ ధ్వనులతో నిండిన ప్రధాన దారులు సైతం ఉయ్యాల పాటలలో ఊగిసలాడాయి. తీరొక్కపూల పరిమళాలతో పరవశించి పోయాయి. రోడ్లు, కూడళ్ళే కాదు కులమతాలకు అతీతంగా చిన్నా పెద్దా అందరూ బతుకమ్మ వనంలో పాటలు పాడుతూ ఆనంద పారవశ్యంలో తేలియాడారు. బతుకమ్మను నెత్తినెత్తుకున్న ప్రతి ఆడబిడ్డా కదిలి వస్తున్న తెలంగాణ తల్లులను తలపించారు.
ప్రదర్శనను తిలకించిన గవర్నర్, సి.ఎం.
బతుకమ్మ సంబురాల చివరిరోజు భాగ్యనగరంలో నిర్వహించిన వేడుకలను రాష్ట్ర గవర్నర్, నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన సతీమణి శోభ, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎక్సైజ్‌శాఖా మంత్రి త్రిగుళ్ళ పద్మారావు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, సికింద్రాబాద్ ఎం.పి. బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ఎమ్మెల్యేలు లక్ష్మణ్‌్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సమాచారశాఖ కమీషనర్ ఆర్.వి.చంద్రవదన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ సోమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగిన ఈ సంబురాలను గవర్నర్, ముఖ్యమంత్రి ఎంతో ఆసక్తితో తిలకించారు.