bathukammaబతుకమ్మా! బతుకమ్మా! / బతుకిచ్చింది బతుకమ్మ

బతుకు నేర్పింది బతుకమ్మ / నేను బతుకుతా! నీవు బతుకు అన్నది బతుకమ్మ

ఇది బతుకమ్మ ప్రకృతి / ఇది తెలంగాణ సంస్కృతి

ధరచోళ దేశాన ఉయ్యాలో / ధర్మాంగుడనురాజు ఉయ్యాలో

అనే బతుకమ్మ పాటలో బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాలున్నాయి. శ్రీలక్ష్మియే బతుకమ్మ అనీ, ప్రతియింటా శ్రీలక్ష్మి (వైభవం, సంపద, ధనం, ధాన్యం, సంతానం, సౌభాగ్యం) ఉండాలనీ ఈ పాట పరమార్థం. ఆ ఉయ్యాల పాటలోని కథనం చూద్దాం!

”చోళదేశాన్ని ధర్మాంగుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య సత్యవతి. వారికి నూరుమంది సంతానం. వారందరూ రాజ్య రక్షణలో శత్రువుల చేతిలో మరణించారు. దేశం పోయింది; రాజ్యం పోయింది; ఆ దంపతులు చింతించారు; విచార సాగరంలో మునిగిపోయారు. దు:ఖంలో ఉన్నా చివరికొక నిర్ణయం తీసుకున్నారు.

లక్ష్మీదేవిని గురించి సత్యవతి తపస్సు చేసింది. ఆ తల్లి ప్రత్యక్షమయి వరం కోరుకొమ్మన్నది. సత్యవతి లక్ష్మీదేవికి దండంపెట్టి తన గర్భాన జన్మించుమని కోరుకొన్నది. ఇంకేం ఆ తల్లి దయదలిచింది; వరమిచ్చింది; సత్యవతి గర్భాన జన్మించింది. ఆ తల్లిని చూడ్డానికి మునులు వచ్చారు. కవులు, గాయకులు వచ్చారు ఆ పాపను చూచి ”బ్రతుకుగనె ఈ తల్లీ చందమామ బ్రతుకమ్మ” అన్నారు. ఇక అప్పటినుండి ఆ పేరుతోనే తల్లిదండ్రులు పిలిచారు, అలాగే అందరూ పిలిచారు.

శ్రీమహావిష్ణువు చక్రాంకుడనే పేర జన్మించాడు. ఆ రాజు ఇంటికి ఇల్లరికం వచ్చాడు. బతుకమ్మను పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఆరువేలమంది సుందరాంగులు జన్మించారు. సత్యవతీ ధర్మాంగులు సంతసించారు”

శ్రీమహాలక్ష్మే బ్రతుకమ్మ అన్నా, దానికి ఆధారంపై కథ (పాట) అయినా, పసుపు ముద్దను గౌరమ్మగా భావించి (గౌరమ్మగాచేసి), బతుకమ్మ పూల గోపురంలోపెట్టి, బతుకమ్మయే గౌరీదేవిగా పార్వతిగా సంభావించి పండుగ జరుపుకొనే సంప్రదాయముంది. అందువల్ల బ్రతుకమ్మ అంటే జగజ్జనని పార్వతి అమ్మవారనే నమ్మమూ ఉంది.

అంతేగాక లక్ష్మీపార్వతీ దేవతల త్రిమూర్త్యాత్మక స్వరూప బ్రతుకమ్మ అనీ తెలంగాణలో బహుళ ప్రచారంలో ఉన్నఈ క్రింది పాట ద్వారా తెలుస్తున్నది.

శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ

చిత్రమై తోచునమ్మా

భారతీ సతివయ్యు బ్రహ్మకిల్లాలివై

పార్వతీ దేవివై పరమేశు రాణివై

పరగ శ్రీలక్ష్మివయ్యూ గౌరమ్మ

భార్యవైతివి హరికినీ…

శ్రీలక్ష్మీ పార్వతులే కాక సరస్వతి కూడా బతుకమ్మే అనే విశ్వాసం పెంచింది ఈ పాటనే. ఆ జగన్మాతే బతుకమ్మ. ముగురమ్మల మూలపుటమ్మ అనే భావన ఏర్పడింది.

మరొక విషయం కూడా జతపడింది. అది కాకతీయ రాజుల ఇలవేల్పునకు సంబంధించినది. కాకతీయ రాజుల పూర్వీకుల్లో గుండన ఒకరు. ఆ గుండన పొలం దున్నుతుంటే ఓ దేవతా విగ్రహం లభించింది. గుమ్మడితోటలో దొరికిన ఆ దివ్యమాతయే కాకతి. సంస్కృతంలో గుమ్మడిని కాకతి అంటారు. బతుకమ్మను గుమ్మడి పువ్వులతో పూజిస్తారు. కాళిరూపంలో ఉన్న కాకతిని కూడా గుమ్మడి పువ్వులతో పూజిస్తారు. ఈ బంధంతో కాకతే బతుకమ్మగా పూజింపబడుతూ వచ్చింది.

ఇలా శ్రీమహాలక్ష్మి, పార్వతి, సరస్వతి, కాకతి దేవతల సమాహార స్వరూపంగా బతుకమ్మ స్థిరపడి తెలంగాణలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమికి ఒకరోజు ముందునుండి నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నది.

దేశమంతటా దేవీనవరాత్రి ఉత్సవాలు జరుపుకొంటుంటే, వాటితోపాటు దేవీ ఉత్సవాలలో అంతర్భాగంగా బతుకమ్మ పండుగ దివ్యంగా, భవ్యంగా, సుందరంగా, శోభాయమానంగా తెలంగాణలో జరుగుతున్నది.

బతుకమ్మ ఉత్సవాలను పరిశీలించిన సామాజికశాస్త్రవేత్తలు ఇది మాత్రారాధనంలో అంతర్భాగమే అంటున్నారు. అనంతమైన భారతీయ ఆరాధనా వ్యవస్థను పరిశీలించినప్పుడు ఆత్మారాధనం, భూతారాధనం, ప్రాజాఙనవ దేవతారాధనం, మాత్రారాధనం, చివరిదైన సర్వదేవతారాధనం తదితర అంశాలెన్నో చర్చించబడినట్లు తెలుస్తుంది. దేవతల విషయంలో కూడా ఈ శాస్త్రవేత్తలు మాతృస్వామ్య పితృస్వామ్య వ్యవస్థను పరిశీలనలోకి తీసుకొన్నారు.

కాని నేనొక్కడినే కాని బహురూపాలతో కనిపిస్తాను అన్న గీతాచార్యుల వాక్కే సమాదరణీయమైంది. అంతటా భగవంతుణ్ణి చూడాలన్న వేదాంతుల మాటననుసరిస్తూనే తెలంగాణ ప్రజలు బ్రతుకమ్మలో దైవాన్ని దర్శించారు.

ఈ దర్శనం కారణంగానే ఎన్నో బతుకమ్మ పాటలు ప్రాదుర్భవించాయి. నిత్యజీవితంలోని సంఘటనలూ పాటల్లో కనిపిస్తాయి. పౌరాణికాంశాల్లోనూ ప్రస్తుత కుటుంబ జీవన సంఘటనలూ చొచ్చుకొని వచ్చాయి. పౌరాణిక, చారిత్రక, స్థానిక, సామాజికాంశాలనెన్నో ఈ పాటలు ప్రతిబింబించాయి.

1. కష్టాలు కడతేర్చే దైవమహిమలు

2. దానధర్మాలు చేసిన వ్యక్తులు

3. పురాణాల్లోని సీత పుట్టుకవంటి సంఘటనలు,

సీతారాములు వనగుంతలు

(వామన గుంతలు), సీతమ్మ బైకలు, పర్ణశాల, సీతాపహరణం,

మాయ లేడి… ఇలా ఎన్నో

4. త్యాగశౌర్యాలు ప్రదర్శించిన వారి జీవితాలు

5. జనగామ/జడ్చర్లవంటి రైలు ప్రమాదాలు

6. అత్యాచారానికి గురైన నక్క అండాలమ్మ వంటి

వారి కథలు

7. అత్త ఆరళ్లకు బలి అయిన బ్రతుకులు

8. వ్రతకథలు; పతి వ్రతల కథలు

9. ఇలవేల్పుల కథలు

10. షణ్మతాలకు సంబంధించిన కథలు

11. దేశ స్వాతంత్య్రంలోని ఘట్టాలు

12. ఇందిరాగాంధీ హత్యవంటి సంఘటనలు

13. నిజాం/రజాకార్ల దురంతాలు

14. దుబాయి-మస్కట్లలో మోసపోయిన వారి కథలు

15. స్థానిక దేవాలయాలకు సంబంధించిన అంశాలు

16. కుటుంబ సంబంధి సరసాలు/విరసాలు

17. స్త్రీల ఆత్మహత్యలు-పురుషుల కష్టాలు

18. దేశభక్తుల జీవితాలు

19. కల్లు సారా త్రాగడంవల్ల పాడైన కుటుంబాల కథలు

20. నైతిక విలువల ప్రబోధాలు

ఇలా ఎన్నో ఇతివృత్తాలను పాటల నిర్మాణానికి జానపదులు స్వీకరించారు. తెలంగాణా ఉదాత్త వైవిధ్యభరిత జీవితాన్ని పాటల్లో నింపారు.

బతుకమ్మ ఉయ్యాల పాటలకు ప్రధానంగా ఖండగతినే స్వీకరించారు. ఒక ద్విపద పాదాన్ని మధ్యకు విరిచి పాడుకొంటే రెండు ఉయ్యాల పదాలవుతాయి.

దీనిని శ్రీరామ జయరామ ఉయ్యాలో/శ్రీ సీతారామ

ఉయ్యాలో అని పాడుకోవాలి. ప్రధానంగా ఈ గతే బ్రతుకమ్మ పాటల్లో కనిపిస్తుంది. ఉయ్యాలోకు మారుగా వలలో, గౌరమ్మ, చందమామ అనే ఆవృత పదాలను పాదపాదానికి చేర్చి చెప్పుకోవడమూ ఉంది. కాని ఉయ్యాలో పదమే ఎక్కువగా

ఉపయోగంలో ఉంది. చివరి అక్షరం హ్రస్వమనుకొంటే

(ఉయ్యాలో = |||| మాత్రలు) ఇది కూడా ఖండగతే అవుతుంది. ఏదియేమైనా జానపదదేశి సాహిత్యానికి ద్విపదమాతృక అయిందనే చెప్పాలి.

బతుకమ్మ ఒకసామూహిక ఉత్సవం. వృత్తివర్ణ వర్గ కులప్రాంత మత సంప్రదాయ భేదాలకతీతంగా జాతిలో సమతాభావాన్ని పెంపొందించింది.

ప్రకృతిలో లభించిన వివిధ పుష్పాలనొక చోటచేర్చి పూలగోపురం నిర్మించిన విధంగానే, రంగు-రూపు-వృత్తి భేదాలతో కనిపించే అందరినీ (ముఖ్యంగా మహిళలను) ఒకచోట చేర్చిన ఘనత ఈ ఉత్సవానికున్నది.

బతుమ్మను ఆయా రోజుల్లో బావిలో వేసినా, లేదా చివరిరోజే అందరూ సామూహికంగా ఆడిన ఆట-పాటల అనంతరం వేసినా, బ్రతుకమ్మ అందించిన సందేశం పచ్చగ బ్రతకాలనే, నిమజ్జనం ఇచ్చే సందేశం కూడా ఎంత పచ్చగ బతికామో, అంత ప్రశాంతంగా వెళ్లిపోవాలనే. జీవితం శాశ్వతం కాదు, పైనుండి పిలుపు వచ్చినప్పుడు అన్నిటినీ తృణప్రాయంగా విసర్జించి వెళ్లిపోవాల్సిందే.

వచ్చే సంవత్సరం మళ్లీ బ్రతుకమ్మ వస్తుంది కదా! అదే పునర్జన్మ ఉందనే ఆశావాదం నింపి పోవడం! బతుకమ్మ పచ్చగా బ్రతుకుమంటుంది. మరి ఏటా ఈ పండుగలో పాల్గొందాం! పచ్చగా బ్రతుకుదాం! పక్కవాడు కూడా పచ్చగా

ఉండాలని జీవిద్దాం!!

బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రమంతా వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గతేడాది ఈ వేడుకల కోసం 10 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది.

Other Updates