పెత్రామావాస్యనాడు ఎంగిలి పూవు బతుకమ్మతో ఆరంభమయిన ఆనందహేల, తొమ్మిది రోజుల పాటు రాష్ట్రమంతటా కొనసాగింది. బతుకమ్మ పండుగ రాష్ట్ర వేడుక. ఇందుకోసం అమావాస్య మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు సాయంత్రం రెండు గంటలపాటు మహిళా ఉద్యోగినులందరికీ బతుకమ్మ వేడుకలో పాల్గొనటానికి వెసులుబాటు కల్పించింది.
అమావాస్య నాటి నుండే ప్రధాన రహదారులు, కూడళ్ళ వద్ద బతుకమ్మ నమూనాలను నెలకొల్పి రాష్ట్రేతరులకు కూడా బతుకమ్మ పండుగ ఎంత శోభాయమానంగా వుంటుందో తెలియజెప్పింది.
ఎనిమిది రోజుల పాటు సాగిన వేడుక అంతా ఒక ఎత్తయితే, తొమ్మిదోరోజు, అష్టమినాడు జరిగిన సద్దుల బతుకమ్మ సంబురాలు ఒక ఎత్తని చెప్పాలి.
రాష్ట్రమంతటా అన్ని వీధులూ లక్షలాది బతుకమ్మలతో పూల వాడలను తలపించాయి. ఇక ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అయితే బతుకమ్మ వేడుకలకు ఇబ్బంది కలగొద్దని ఫ్లైఓవర్లు కట్టారా? అనిపించింది.
తీరు తీరు పువ్వులతో తీర్చిదిద్దిన 20 వేల బతుకమ్మలను ఎల్బీస్టేడియంలో అలంకరించారు. ఇదిగాక జిల్లాల నుంచి పది టన్నులకు మించిన పువ్వులతో బతుకమ్మలను పేర్చుకొని వేలాది మంది మహిళలు తరలివచ్చారు. 20వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డిలతో కలిసి పలువురు మహిళలు బతుకమ్మలను పేర్చుకొని ఆడారు. ముఖ్యమంత్రి సతీమణి శోభారాణి ఈ ఉత్సవాలలో ఆనందంగా పాల్గొన్నారు.
రాజధాని నగరంలో ఉదయం నుండే బతుకమ్మల సందడి అట్టహాసంగా కొనసాగింది. వేలాది బతుకమ్మలను పేర్చి సిద్ధం చేసుకున్న మహిళలు, సాయంత్రం నాలుగున్నరకు ఎల్బీ స్టేడియం నుండి బతుకమ్మలను తలకెత్తుకొని ర్యాలీగా ట్యాంక్‌బండ్‌కు బయలుదేరారు. ఈ ర్యాలీ దాదాపు రెండు గంటలకు పైగా శోభాయమానంగా సాగింది. ముందు కళాప్రదర్శనలు చేస్తూ కళాకారులు ముందుకు సాగగా వెనకాల బతుకమ్మలతో మహిళలు, ఆ వెనకాల సాంస్కృతిక శకటాలు కదిలాయి.
ఈ సంబరాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సాగర తీరం సప్తవర్ణ శోభితంగా ముస్తాబ యింది. విద్యుత్ కాంతుల వెలుగుల మధ్య హుస్సేన్‌సాగర్‌లో ఏర్పాటు చేసిన బతుకమ్మల నమూనాలు ప్రత్యేకతను సంతరించుకొని వేలాదిగా తరలివచ్చిన జనాలను ఆకట్టుకు న్నాయి. ట్యాంక్‌బండ్‌తోపాటు ఆ పరిసర ప్రాంతాలలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. బతుకమ్మ ఉత్సవాల ప్రారంభో త్సవానికి పార్లమెంటు సభ్యురాలు కవిత, ఉప సభాపతి పద్మాదేవేందర్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు చందూలాల్, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులు హాజరయ్యారు.
పోయిరా.. బతుకమ్మ
అట్టహాసంగా సాగిన బతుకమ్మ ఆట పాటల తరువాత, బతుకమ్మల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఘాట్ దగ్గర మహిళలు పూజలు చేసి ‘పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ.. మళ్ళిరా బతుకమ్మ మళ్లి రావమ్మా’ అని అప్పటిదాకా మమ్ములను సల్లంగ చూడమ్మా అంటూ భక్తి పారవశ్యంతో బతుకమ్మను సాగనంపారు.
మండల స్థాయి నుండి ఖండాల దాకా..
రాష్ట్రంలో గ్రామ గ్రామాన కోలాహలంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఓరుగల్లులో భద్రకాళి దేవస్థానం, పోతన మందిరం ప్రాంగణంలో సరికొత్తరీతిలో బతుకమ్మలను పేర్చి తనివితీరా ఆడిపాడారు మహిళలు. బహుజన బతుకమ్మ పేరుతో కాశీబుగ్గ ఎస్సార్‌నగర్‌లో బతుకమ్మలను పేర్చి ఆడారు. బతుకమ్మ సంబరాలలో సందడిచేస్తూ ఎంపీ సుధారాణి, ఎమ్మెల్యే కొండా సురేఖలు కనిపించారు. ఖమ్మం పట్టణంలోని నయాబజార్ కళాశాలలో జరిగిన వేడుకలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన మహిళలు ఆనందోత్సాహాలతో బతుకమ్మ పాటలతో అందరినీ అలరించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ, కోదాడ, ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకలకు మంత్రి జగదీష్‌రెడ్డి, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిపిన బతుకమ్మ వేడుకలు బహుజనరంజకంగా సాగాయి.
మెదక్ జిల్లా సిద్ధిపేటలో సద్దుల బతుకమ్మ వేడుక కోమటి చెరువు వద్ద వేలాదిగా తరలివచ్చిన మహిళలతో మనోహరంగా సాగింది. ఈ వేడుకలకు మంత్రి హరీష్‌రావు భార్య శ్రీనిత, కుమార్తె వైష్ణవితో కలిసి పాల్గొన్నారు. సింగరేణి సంస్థ మహిళా ఉద్యోగులందరూ హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ మహిళా ఉద్యోగిను లందరూ రవీంద్రభారతి వేదికగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో కూడా ఈ వేడుకలు నిర్వహించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో, మహారాష్ట్రలోని ముంబయి, పూణె, సోలాపూర్ నగరాలలోనూ, దేశ వ్యాప్తంగా తెలంగాణ వాసులున్న ప్రతిరాష్ట్రంలో తమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన బతుకమ్మ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సద్దుల బతుకమ్మ సంబురాలు సాయంత్రం వేళ సందడిగా జరిగాయి.
తెలంగాణ ప్రజలు ఎక్కడ వున్నా తమ మూలాలు మరువరు అని అనడానికి సంకేతం ప్రవాసంలో కూడా అట్టహాసంగా బతుకమ్మ సంబురాలను జరుపుకోవడమే. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఇన్‌కార్పో రేషన్ అట్టహాసంగా బతుకమ్మ సంబురాలను నిర్వహించింది.
అమెరికా ఫ్లోరిడాలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు వైభవోపేతంగా జరుపుకున్నారు. అలాగే కనెక్టికట్ రాష్ట్రంలో మన రాష్ట్ర పండుగను తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (తేనా) కనెక్టికట్ చాప్టర్ ప్రతి యేడు మాదిరిగానే ఈసారి అబ్బురం అనిపించే రీతిలో సంబురాలను జరుపుకున్నారు.