జీహెచ్‌ఎంసీకి రూ. 26కోట్ల బహుమతిని ప్రకటించిన కేంద్రం
మున్సిపల్‌ బాండ్ల రూపంలో నిధులను సేకరించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని ప్రశంసిస్తూ రూ. 26కోట్ల ప్రత్యేక ఆర్థిక పురస్కారాన్ని ప్రకటించింది. బాండ్ల రూపంలో వెయ్యి కోట్ల రూపాయలను సేకరించడం ద్వారా జీహెచ్‌ఎంసీ దేశంలోనే మున్సిపల్‌ రంగంలో సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఈ వెయ్యి కోట్లలో మొదటి విడతగా రూ. 200కోట్లను పూణె నగరం తర్వాత బాండ్ల రూపంలో నిధులను సేకరించిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ జీహెచ్‌ఎంసీ మాత్రమే. మున్సిపాలిటీలు బాండ్ల రూపంలో నిధులను సేకరించేలా ప్రోత్సహించేందుకు బాండ్ల ద్వారా నిధులను సేకరించే 20 మున్సిపాలిటీలకు కూడా ఇక నుండి ప్రతి సంవత్సరం ఈ విధమైన ఆర్థిక పురస్కారాన్ని అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగర అవసరాలకు కావాల్సిన నిధుల సేకరణకు మున్సిపల్‌ బాండ్ల మార్కెట్‌ అత్యంత అనుకూలమని, ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ మంచి ఆర్థిక క్రమశిక్షణతో బాండ్ల ద్వారా నిధులను సేకరించడం పట్ల కేంద్రగృహనిర్మాణ, పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ అభినందించింది. ఇందుకుగాను జీహెచ్‌ఎంసీకి 26కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని అందజేస్తూ లేఖను అందజేసింది.

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడి హైదరాబాద్‌ లాంటి మున్సిపల్‌ కార్పొరేషన్లు నిధులను బాండ్ల రూపంలో సేకరించాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కె.టి.రామారావుకు సూచించిన విషయం విదితమే. ప్రధాని సూచనకు అనుగుణంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో చేపడుతున్న భారీ ప్రాజెక్టులను మరింత వేగవంతంగా నిర్మించేందుకు వెయ్యి కోట్లను బాండ్ల రూపంలో సేకరించాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితులు, పన్నుల వసూళ్లు, ఆర్థిక క్రమ శిక్షణను అధ్యయనం చేసిన కేర్‌, ఇండియా రేటింగ్‌ సంస్థలు ఏఏ (స్టేబుల్‌) రేటింగ్‌ను ఇచ్చాయి. ప్రభుత్వ సంస్థలకు ఏఏ స్టేబుల్‌ రేటింగ్‌ రావడం గొప్ప విషయం. జీహెచ్‌ఎంసీ అవలంభిస్తున్న ఆర్థిక క్రమశిక్షణకు ఈ ఏఏ రేటింగ్‌ నిదర్శనం.

బాండ్లపై ఫిబ్రవరి 14వ తేదీన ముంబాయిలో ఎలక్ట్రానిక్‌ బిడ్డింగ్‌ ఆహ్వానించగా అంచనాలకు మించి బిడ్డింగ్‌లో పాల్గొన్నారు. ఈ బిడ్డింగ్‌లో 8.90శాతం రేటు ప్రకారం రూ. 200కోట్లను సేకరించడం జరిగింది. ఈ నిధులను స్ట్రాటెజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ (ఎస్‌.ఆర్‌.డి.పి) పనులను చేపట్టడానికి జీహెచ్‌ఎంసీ వినియోగిస్తోంది. గత యాభై, అరవై సంవత్సరాలుగా దేశంలో మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలు బాండ్ల రూపంలో రూ. 2,000కోట్లు సుమారుగా సేకరించగా వీటిలో పది శాతం మొత్తాన్ని జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం సేకరిస్తోంది. కాగా జీహెచ్‌ఎంసీకి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక పురస్కార స్ఫూర్తితో దేశంలో మరిన్ని మున్సిపాలిటీలు బాండ్ల మార్కెట్‌లో ప్రవేశించడానికి మార్గంగా ఉపయోగపడుతుంది.

Other Updates