tsmagazine

గద్య పద్య హృద్యమై విలసిల్లే
తెలుగు సాహిత్యంలో శతక రచన సముచిత స్థానాన్ని పొంది నేటికీ నిలిచి ఉన్నది. సంస్కృత సాహితీ మూలాలు కలిగిన ఈ శతక సాహిత్యం పద్య భాగానికి చెందిన రచనా ప్రక్రియ. ”శతేన ప్రోక్తం శతకం’- నూరు శ్లోకాలు లేదా పద్యాల కూర్పును శతకం అంటాం. రాసే కవి ప్రతిభనుబట్టి అంతకంటే ఎక్కువ శ్లోకాలు లేదా పద్యాలు ఉండవచ్చు. విన్నకోట పెద్దన తన ”కావ్యాలంకార చూడామణి”లో ”శతకమున నొప్పు మరి పద్య శతకము కూడ” అని శతక పద్య సంఖ్యనుద్దేశించి తెలియజేశాడు.

రచనా విధానంలో సంఖ్యా నియమం, మకుట నియమం, ఛందో వృత్త నియమం రసనియమం మొదలైన లక్షణాలు కలిగి నీతి, శృంగార, హాస్య, భక్తి, జ్ఞాన, వైరాగ్య, కథాత్మక, వేదాంత, అధిక్షేప, వ్యాజస్తుతి, అనువాదక చారిత్రక ప్రక్రియల్లో తెలుగు శతకాలు రచించబడ్డాయి.

”మకుటాత్మకమైన శతముక్తక సముచ్చయమే శతకము”అనే హేతుబద్ధ నిర్వచనం ఉన్నా ఈ శతకాలు ”మకుట సహిత శతకాలు” మరియు ”మకుట రహిత శతకాలు” అని రెండు రకాలు.మకుట శబ్దం సంస్కృతంలో ఉన్నప్పటికీ నిజానికి అది ద్రవిడ శబ్ధమని కొందరు పాశ్చాత్య పండితుల అభిప్రాయం.

విషయ ప్రాధాన్యాన్నిబట్టి రాసిన శ్లోకాలుగాని, పద్యాలుగాని పరస్పర సంబంధం లేకుండా స్వతంత్ర భావాన్నిచ్చేవి ”ముక్తకాలు” అంటారు.వీటిని కలిగిన శతకాలు ముక్తక శతకాలు. అలాకాక ధారావాహిక విషయ వివరణాత్మకమైన పద్యాలను కలిగిన శతకాలను ”అముక్తక” శతకాలంటారు.అలాగే స్తుతియుక్తమైన శతకాలను ”ధార్మిక” శతకాలని ప్రాపంచిక విషయయుక్తమైన శతకాలను ”లౌకిక” శతకాలని విభజించవచ్చు.

ఇతర భాషలలో శతక రచనలు ఉన్నప్ప టికీ ఛందోబద్ధమై, వృత్త ప్రాధాన్యం కలిగి,అలంకారయుక్తమై,మకుట నియమాన్ని కలిగిన ప్రత్యేక రచనాశైలి తెలుగువారి సొంతం.సుమారుగా 12వ శతాబ్దంలో ప్రారంభమైన తెలుగు శతక రచనా విధానంలో నేటి వరకు పదివేలకుపైగా శతకాలున్నాయని పరిశోధకుల అంచనా. ఇందులో తెలంగాణా ప్రాంత కవుల,పండితుల తోడ్పాటు హర్షించదగిన స్థాయిలో ఉన్నది.

తెలుగులో మొదటి శతకంగా ప్రసిద్ధమైంది ”శ్రీగిరి మల్లికార్జున శతకం”. దీన్ని రచించిన మల్లికార్జున పండితారాధ్యుడు క్రీ.శ. 1025-1100 మధ్య కాలంలో జీవించాడు.
ఎట్టి కడు ఁగీడు కులమున
బుట్టియు శివ నిన్ను గొలిచి పూజ్యుడ మనుజుం
డట్టి ద ధర్మపు, రొంపిం
బుట్టియుఁబద్మంబు వోలె ఁబూజ్యము కాదే

మనుష్యుల్లో ఎక్కువ తక్కువలు లేవన్న బసవేశ్వరుని సిద్ధాంతాన్ని కవి ఇలా రచించాడు. సంపూర్ణ శతక లక్షణాలు కలిగిన తొలి తెలుగు శతకంగా పరిశోధకులు నిర్ణయించిన శతకం ”వృషాధిప శతకం”. దీన్ని క్రీ.శ. 1170-1240 మధ్యన వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో నివసించిన పాల్కురికి సోమనాథుడు రచించాడు. నాటి ప్రజల సద్గుణాలను బసవేశ్వరునిలో ఆరోపించి బసవా! బసవా! బసవా వృషాధిపా! అనే మకుటంతో కవి రమ్యంగా వర్ణించాడు.

శ్రీగురు లింగమూర్తి, సువివేష మహోజ్జ్వల కీర్తి, సత్క్రియో
ద్యోగ కళా ప్రపూర్తి, యవధూత పునర్భవ జార్తి పాలితా
భ్యాగత సమ్మ్రితార్థి కవి పండిత గాయక చక్రవర్తి దే
వా! గతి నీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా!

శైవ శతక సాహిత్య కవిత్రయంలో ఒకడుగా ప్రసిద్ధి పొందినవాడు. క్రీ.శ. 1242 ప్రాంతంలో జీవించిన యథావాక్కుల అన్నమయ్య ”సర్వే శ్వరా” అనే మకుటంతో ప్రసిద్ధమైన ”సర్వేశ్వర శతకాన్ని” రచించాడు. ఇందులో 142 పద్యాలున్నాయి. మానవుడు తన జీవితంలో పాటించవలసిన విలువలను ఒక భక్తునిలో ఆపాదించి కవి ఇలా అంటున్నాడు.

సత్యం బెప్పుడు దప్పడే మహి దురాచారుండుగాఁ డేని యౌ
చిత్యంబేమరడేని దుర్జనుల గోష్ఠిం బొందడే భక్త సాం
గత్యం బాదట బాయడేని మదన గ్రస్తుండు గాడేని నీ
భృత్యుండాతడు మూడు లోకములలో పూజ్యుండు సర్వేశ్వరా!

”బద్దెన”గా ప్రసిద్ధుడు. కమలాసన బిరుదాంకితుడైన భద్ర భూపాలుడు ”సుమతి శతక” కర్త. 13వ శతాబ్దికి చెందిన ఈయన ”సుమతీ” మకుటంలో నీతిని ప్రబోధించే శతకాన్ని 108 పద్యాలతో రచించాడు. సుఖ నివాసానికి ఎక్కడ ఉండాలన్న విషయంలో కవి మనలను ఇలా జాగృతపరుస్తున్నాడు.

అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడ తెగకబాఱునేఱును, ద్విజుడున్‌
జొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూరు జొఱకుము సుమతీ!

భద్రాచల రామాలయ నిర్మాత, ”రామదాసు”గా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న ”దాశరథి శతకాన్ని” రచించాడు. ఆదర్శ పురుషుడైన శ్రీరామ చంద్రుని ఇలా కీర్తిస్తున్నాడు.
శ్రీరఘురామ చారు తులసీ దళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దు
ర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధీ!

కరీంనగర్‌ జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని కీర్తిస్తూ బమ్మెర పోతన ”నారాయణ శతకాన్ని రచించాడు. అలాగే ధర్మపురిలోనే జన్మించి న తాతా మనుమలు-”నరసింహ శతక”కర్త శేషాచలదాసు (శేషప్ప), ”కృష్ణశతక” కర్త కాకుత్థ్సం నరసింహదాసు.”భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస, దుష్టసంహార నరసింహ దురిత దూర” అనే మకుటంతో ”నరసింహ శతకాన్ని” రాసి శేషాచలదాసు ఖ్యాతిని పొందాడు.”నరహరి శతకం”,”నృకేసరి శతకం” కూడా ఈయన రచించాడు. ఇతని మనుమడు కాకుత్థ్సం నరసింహదాసు ”కృష్ణశతకాన్ని” రచించాడు.

ప్రతాపరుద్రుని మంత్రి శివదేవయ్య రాసిన ”శివ దేవ ధీమణీ శతకం”, శరభాంక కవి రాసిన ”శరభాంక లింగ శతకం”,త్రిపురాంతక కవి రాసిన ”అంబికా శతకం”, వెన్నెలకంటి చంద్రశేఖర కవి రాసిన ”హరిశ్చంద్ర శతకం”, పరశురామ రామ్మూర్తి పంతులు రాసిన ”పరశురామ శతకం”,ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు రాసిన ”ముకుంద శతకం”,సముద్రాల లక్ష్మీనరసింహాచార్యులు రాసిన ”లక్ష్మీ నృసింహ శతకం” శేషాద్రి రమణకవుల ”సూర్య శతకం” తెలంగాణాలో ప్రసిద్ధమైన అనేక శతకాలలో కొన్ని.

ఆధునిక కాలంలో శతక సాహిత్యం తెలం గాణాలో భక్తి, జ్ఞాన, వైరాగ్య, నీతి బోధక మార్గోపదేశకంగా వెల్లివిరిసింది. వానమామలై వరదాచార్యులు రాసిన”స్తవరాజ పంచశతి”, ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యుల ”అంతర్మథనం”,ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు ”శ్రీపాంచాల రాయశతకం”,హరి రాధాకృష్ణ మూర్తి ”శ్రీశ్రీనివాస శతకం”,ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ”శ్రీకర్మన్‌ఘాట్‌ ఆంజనేయ స్వామి శతకం”, ముద్దు రాజయ్య రాసిన”శ్రీకేదారేశ్వర శతకం” తెలంగాణా నుంచి వెలువడిన శతకాలలో కొన్ని.డా|| ఇందారం కిషన్‌రావు రాసిన”శ్రీనివాస శతకం”శ్రీనివాస ప్రభ అనే మకుటంతో వెలువడింది. హరిహర స్తుతిని శ్లేషమూలంగా కవి అద్వైతాన్ని కవి చక్కగా ప్రతిపాదించాడు ఈ పద్యాలలో.
శ్రీపద్మాక్షి వినోది శైలపదవాసీ భోగి రత్నాంగద
వ్యాపారాస్పద శంఖచక్రభరణా భాగీరథీ సేవితా!
పాపౌఘాంతక భాస్వదబ్జనయనా పద్మాసనారాధితౌ
గోపారూఢ విలాసి వందనము నీకున్‌ శ్రీనివాసప్రభో||

గాదె వెంకట మధుసూదనరావు ”మధు శతకం”, ఆచార్య యస్‌. లక్ష్మణమూర్తి ”గోపికా వల్లభా శతకం”, డా|| తిరునగరి ”తిరునగరీయం”, వరిగొండ కాంతారావు ”ఏలికకు ఒక లేఖ” తెలంగాణా ప్రాంతంనుండి వెలువడిన మరికొన్ని శతకాలు.

తెలంగాణా శతక సాహిత్యంలో ఈ మధ్యకాలంలో క్రొత్తగా వచ్చిన ప్రక్రియ సంకలన శతక రచన. ప్రామాణికమైన ఒక మకుటాన్ని తీసుకుని కొంతమంది కవులు, కవయిత్రులు రాసిన (తలకు కొన్ని) పద్యాల సమాహారమే ”సంకలన శతక రచన”.తెలంగాణా ఉద్యమకాలంలో మహాకవి దాశరథి స్ఫూర్తితో ”నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అను మకుటంతో 12మంది కవులు,కవయిత్రులు తెలంగాణ గొప్పదనాన్ని సంస్కృతీ, సంప్రదాయాలను 108 తేటగీతులలో ”తెలంగాణ శకాలు’పేరిట సంకలన శతక రచన చేశారు. ఇందులో కవయిత్రి నిట్టల విజయలక్ష్మీ శర్మ తెలంగాణ గొప్పదనాన్ని ఇలా వర్ణించారు.

కళలు కావ్యాలు తరగని గనులుగాగ
పెంచి పోషించ రాజులు పేర్మి మీర!
దిశల నన్నింట వ్యాపించె దివ్యకీర్తి
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!!

ఛందోబద్ధమై, సాహితీ విలువలతో శుద్ధమై, సంస్కృతీ సంప్రదాయాలకు అద్దమై నిలిచే ఎన్నో శతకాలు ఈ నేలలో పుష్పించి తెలంగాణా సాహితీ సౌరభాలను దశదిశలా వ్యాపింపజేస్తున్నాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

డా|| ఇందారపు శ్రీనివాస్‌రావు

Other Updates