sureshబహుజన వైతాళికుడు పైడి తెరేష్‌ బాబు

”ఉలికి పాటెందుకు

విడిపోవడం అంటే విముక్తమై విస్తృతం కావడం

విడి విడి విడిపోవడమంటే

ఎవరి భవిష్యత్తుకు వాళ్ళు జవాబుదారీ కావడం

గంపగుత్త పోగేసినంత మటుకు చాలు

కొత్త నీటి ఆనవాళ్ళను పసిగట్టడమే

అసలైన ప్రవాహ స్పృహ” (నాలుగో ప్రపంచం)

అంటూ దళిత, బహుజన సాహిత్య చైతన్యాన్ని దశదిశలా ప్రసరించి, ‘కోటిరత్నాలవీణ’ విముక్తి గీతానికి కోరస్‌ పాడిన అసాధారణ కవి పైడి తెరేష్‌బాబు. అగ్నిపర్వతం భాషించినట్లు, అల్ప పీడనం ఘోషించినట్లు, ఆకాశం పిడుగులు వర్షించి నట్లు కవిత్వం వ్రాసి, వర్తమాన కాలం నరాల్లోకి పిడికెడు కొత్త కాంతిని ఎగుమతి చేసిన అసామాన్య కళాకారుడు పైడిశ్రీ. పూల నుండి పరిమళాల్ని తుంచేసిన మతోన్మాద కుతంత్రాలను ధిక్కరించి, ఊరు నుండి ఉనికిని తుడిచేసిన మనుధర్మ కుట్రదారులపై అక్షర యుద్ధం ప్రకటించి అంబేద్కర్‌ పల్లవైన పాటకు ఆపకుండా చిందేసిన బహుజన వైతాళికుడు తెరేష్‌బాబు. దళిత సాహిత్యంలో కసిత్వం తప్ప కవిత్వం లేదని సోకాల్డు విమర్శకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పుడు, దళిత కవులకు వచన కవిత్వమెందుకని ఘనత వహించిన కవి పుంగవులు నోరు పారేసుకుంటున్నప్పుడు, రెప్ప పాటులోనే దళిత వాదంపై సవాలక్ష దాడులు జరుగుతున్నప్పుడు వెల్లువెత్తిన పెను సవాళ్ళకు తెరేష్‌బాబు సరైన జవాబుగా నిలబడ్డాడు. ”మట్టి నవ్వితే పరమాన్నం / నిప్పు నవ్వితే వెలుతురు / నీరు నవ్వితే చైతన్యం / నింగి నవ్వితే తొలకరి / గాలి నవ్వితే ఊపిరి” అంటూ దూదిపింజల్లాంటి సాంద్రతరమైన,తాత్విక సమన్వితమైన కవిత్వానికి తెరేష్‌బాబు సంకేతంగా భాసిల్లాడు. తెలుగు సాహిత్యంలో పీఠాల కింద, వీర ముఠాల పిడికిళ్ళ కింద మాటు వేసిన శతాబ్దాల నిశ్శబ్దాన్ని పరమసుతారంగా బద్దలు కొట్టాడు. ఒకే రక్తాన్ని పంచరంగుల వర్ణచిత్రంగా వక్రీకరించిన వంచనా వాదాలను శ్రుతి పక్వంగా, శ్రవణ సుభగంగా తెరేష్‌బాబు ధ్వంసం చేశాడు. ఒక మహానది అనేక పంట కాలువల ద్వారా పరీవాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినట్లుగా బహుముఖీన ప్రక్రియల ద్వారా పైడి తెరేష్‌బాబు సమకాలీన సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. సంగీత, సాహిత్య, కళారంగాల్లోను, టి.వి. రేడియో వంటి దృశ్య శ్రవణ మాధ్యమాల్లోను తెరేష్‌బాబు పట్టిందల్లా బంగారమయింది. కవిత, కథ, నాటకం, పాట, గజల్‌ వంటి ప్రక్రియల్లో ఆయన రాసింది రత్నమయింది. ”నీ చేతికి ఆయుధాన్నివ్వడం కోసం రాలేదు నేను / నువ్వే ఒక ఆయుధానివన్న స్పృహను నీ చేతిలో పెట్టడానికొచ్చాను” అని అక్షరాలా ప్రమాణం చేసిన పైడిశ్రీ మహోన్నతమైన ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చి సెప్టెంబర్‌ 29 సాయంత్రం భస్మ సింహాసనాన్ని అధిరోహించాడు కవన నక్షత్రమై గగనమెక్కాడు. మూడు దశాబ్దాల పాటు తెలుగు నేలపై సృజన సునామిలాగా పరవళ్ళు తొక్కిన పైడి తెరేష్‌ బాబు బతుకుపుటలను విప్పి చూస్తే కొండంత స్ఫూర్తి కలుగుతుంది.

ఒంగోలు గద్దలగుంటలో పేద దళిత కుటుంబానికి చెందిన పైడి శాంతయ్య, సకుబ్బులమ్మ దంపతుల కు 1963 నవంబరు 3న జన్మించిన తెరేష్‌బాబు స్థానిక సి.యస్‌.ఆర్‌. శర్మ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, సికింద్రాబాద్‌ పి.జి. కళాశాలలో ఎం.ఏ. (తెలుగు) పట్టా పుచ్చుకున్నాడు. అమృతవాణి దృశ్య శ్రవణ విబాగంలో కొంతకాలం ఎడిటోరియల్‌ అసిస్టెంటుగా విధులు నిర్వహించాడు. ఆ తరువాత కొత్తగూడెం, హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రాల్లో 20 సం|| పైగా వ్యాఖ్యాతగా ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించాడు. జానపద గాయకుడైన తండ్రి శాంతయ్య ప్రేరణతో, ఒంగోలులోని కళావాతావరణ ప్రభావంతో బాల్యం నుండే సంగీత సాధనచేసి 14 సం|| వయస్సులోనే తెరేష్‌ బాబు సమర్థవంతమైన తబలిస్టుగా పేరు ప్రఖ్యాతకులందుకున్నాడు. సాంఘిక, పౌరాణిక నాటకాలకు, పాట కచేరీలకు వాద్య సహకారమందిస్తూ ఆ చిరు సంపాదనతోనే తన నిరుపేద కుటుంబానికి చేయూత నందించాడు. ధారా రామనాథశాస్త్రి, పింగళి పాండు రంగారావు, ఈమని దయానంద లాంటి సాహితీవేత్తల ప్రోత్సాహంతో వర్థమాన సమితి, ఎఱ్ణనపీఠం లాంటి సాహితీ సంస్థల వెలుగు జాడల్లో తెరేష్‌ బాబు తన సృజనాత్మక ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు. ఇంటర్‌ మీడియట్‌ నుండే పైడిశ్రీ కలం పేరుతో భారతి లాంటి పత్రికల్లో రచనలు వెలువరిస్తూ కవిగా, నాటక కర్తగా, ప్రయోక్తగా అతి చిన్న వయస్సులోనే పండితోత్తముల అభినందన లందుకున్నాడు. ”చీకటి శక్తుల పతనం కోసం / చేస్తున్నా శరసంధానం / ఈ చైతన్య యుగంలో అయితేకాని ప్రాణంపతనం” అంటూ తన సృజన లక్ష్యాన్ని ప్రకటిస్తూ తెరేష్‌బాబు శరసంధానం (1985) కవితా సంపుటి ప్రకటించి ‘పెన్ను’ తిరిగిన సాహితీవేత్తల ప్రశంసలందుకున్నాడు. శరసం ధానం అడుగడుగున నిత్య నూతనత్వం తొణికిసలాడే కావ్యమని నిర్థారించటంతో పాటు ”పైడిశ్రీ కవిత్వంలో సంవిధానం, రచనాచాతుర్యం పాఠకుల్ని అబ్బురపరుస్తుంద”ని (శరసంధానం పీఠిక) అని సుప్రసిద్ధ కవి దాశరథి పైడి ప్రతిభా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. ”సముజ్జ్వల కాంతిమతి, ‘చిరంతన గీతికాస్మృతి’, ”ఊహ విచరచిత రసానందకృతి’, ‘గ్రీష్మ నిక్షిప్తాంగ ఘర్మధార’, ‘చక్రి డోలా విహారం’ లాంటి సంస్క ృత సమాజ భూయిష్ఠ పద ప్రయోగశైలి శరసంధానంలో ఆద్యంతం తొణికిసలాడుతుంది.

కారంచేడు, చుండూరు సంఘటనల అనంతరం బలోపేతమైన ఆత్మ గౌరవ పోరాటాలతో దళిత వాద చైతన్యం పురుడు పోసుకుంది. దళిత సాహిత్య ఉధృతి వేగవంతమయింది. ఈ నేపథ్యంలో పైడిశ్రీ ఉధృతి వేగవంతమయింది. ఈ నేపథ్యంలో పైడిశ్రీ సాహిత్య ప్రస్థానం ఒక గుణాత్మకమైన మలుపు తిరిగింది. అప్పటి వరకూ శ్రీశ్రీ శాబ్దిక మహేంద్ర జాలంలో, తిలక్‌ అనుభూతివాదంలో మునిగితేలుతున్న పైడిశ్రీ నిర్దిష్టమైన ఎరుకతో తన సామాజిక, సాంస్క ృతిక అస్తిత్వ మూలాలను తడుముకోవడం ప్రారంభించాడు. లౌకిక వాస్తవాల్ని అలౌకిక స్వప్నాలుగా తారుమారుచేసే సాహిత్య నైజాన్ని తెరేష్‌ బాబు సమూలంగా తిరస్కరించాడు. ఇలాంటి సామాజిక విప్లవ దృక్కోణంతో ఆయన ‘నిశానీ’ అనే కవిత రాశాడు.మద్దూరి నగేష్‌బాబు, జి లక్ష్మీనరసయ్య, ఖాజా వంటి తాత్విక బంధువులతో కలిసి తెరేష్‌ బాబు వెలువరించిన ‘నిశానీ’ కవితా సంకలనం దళిత వాద చర్చోపచర్చలకు కేంద్ర బిందువై వర్తమాన సాహిత్యాన్ని దిపి కుదిపి వేసింది. కేవలం దళిత కవిత్వంలోనే కాకుండా, మొత్తం వచన కవిత్వంలోనే తెరేష్‌ బాబు అల్పపీడనం (1996) అనే సంకలనం అత్యంత విశిష్టమైనదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అల్పపీడనంలోని ‘ఏడుకట్ల సవారీ’, బండి చక్రం మీద ఈగ లాంటి కవితల ద్వారా తెరేష్‌ బాబు దళిత ఉద్యమ నిశ్శబ్ద్దాన్ని ఎత్తిచూపాడు. ”శస్త్ర చికిత్స చేయడం ఉద్యమం/ కాకుల్ని కొట్టి గద్దల కేసే ఫార్ములాల్ని ధ్వంసం చేయడం ఉద్యమం/ పార్లమెంటును గురి చూడడం ఉద్యమం/” అంటూ ఉద్యమానికి కొత్త భాష్యం చెప్పాడు. ”ఐదోతనం’, ‘కుక్క కరచిన వార్త’; ‘మట్టి బలపం’ వంటి కవితల్లో తెరేష్‌ స్త్రీ వాద చైతన్యాన్ని కూడా అద్భుతంగా కవిత్వీకరించాడు. ”పొద్దు పొడవటం ఆలస్యం / వంటిళ్ళ మీద వర్షించి ఆహారపంట లౌతూ / పొద్దు గూకటం ఆలస్యం కండరపు నాగళ్ళు దిగమింగి కడుపు పంట లౌతూ” ఆ అంటూ స్త్రీలెదుర్కొంటున్న రోజూవారి కుటుంబ హింసను అపురూపంగా అక్షరబద్ధం చేశాడు. ఉత్పత్తిని, పునరుత్పత్తిని ఇంత ఆర్ద్రంగా కవిత్వీకరించిన దాఖలాలు స్త్రీ వాద సాహిత్యంలో మృగ్యం.

పైడి తెరేష్‌బాబు అత్యుత్తమ ప్రయోగవాది. ముందు క్యాసెట్‌ రూపంలో ఆ తరువాత పుస్తక రూపంలో ఆయన వెలువరించిన ‘హిందూ మహాసముద్రం’ తెలుగు దీర్ఘకవితల్లో అగ్రభాగాన నిలుస్తుంది. ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వంలో తెరేష్‌బాబు రచించిన ”నేను – నా వింత మారి ప్రపంచం” అనే దృశ్యకావ్యం ఎంతో ప్రామాణికమైనది. ఈ దీర్ఘకవితలో తెరేష్‌ బాబు మనం కనీవినీ ఎరుగని ఏడు వింతల్ని దర్శింపజేస్తాడు. ‘తాజ్‌మహల్‌’ చైనావాల్‌, పిరమిడ్స్‌ లాంటి వింతల్ని చూసి పరవశించి పోతున్న ప్రపంచానికి తెరేష్‌ బాబు షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చి జీవితపు సన్నని సందుల్లో కొలువు తీరిన మరో ఏడు వింతల్ని మన కళ్ళ లోగిళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తాడు. తెరేష్‌ బాబు. ”కట్టడం నీకు వింత / కట్టేవాడు నాకు వింత” అంటూ ప్రపంచానికి శ్రమైక జీవన సౌందర్యతత్వాన్ని ప్రబోధిస్తాడు తెరేష్‌. ‘వ్యవసాయరంగం’, పేదరికం, బానిస విద్యావ్యవస్థ, వస్తు నిలువ శాల, నయా సామ్రాజ్యవాదం, పరాయీకరణ కులవ్యవస్థ లాంటి అసలైన ఏడు వింతలు మన సామాజిక, సాంస్క ృతిక పరిస్థితుల్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయని ప్రతిపాదిస్తూ నవకాలజ్ఞానాన్ని ప్రబోధించాడు.. ”యుద్ధం కన్నా యుద్ధ భయం దుర్భరం/ సైనిక దాడి కన్నా సాంస్కృతిక దాడి ప్రమాదకరం” అంటూ ప్రపంచీకరణ ప్రభంజనంతో కొట్టుకుపోతున్న గొర్రెల మందల్ని హెచ్చరించాడు పైడి. అస్తిత్వ ఉద్యమాల ఉమ్మడి చైతన్యాన్ని అడ్డుకట్ట వేస్తున్న హిందూ సామ్రాజ్యవాదం, అమెరి కన్‌ సామ్రాజ్యవాదాల పెను ప్రమాదాల తీరుతెన్నుల్ని నాలుగో ప్రపంచం (2010) కవితా సంకలనం ద్వారా తెరేష్‌ బాబు శిల్ప సుందరంగా చిత్రించాడు.

పైడి తెరేష్‌బాబు విశాలమైన ప్రాపంచిక దృక్పథం కలిగిన కవి అత్యంత ప్రతిభావంతంగా దళిత సాహిత్య పరిణామక్రమాన్ని వేగవంతం చేసిన తెరేష్‌, ఆత్మబంధువులా అస్తిత్వ ఉద్యమాలకు సాంస్క ృతిక ఆలంబనగా వర్థిల్లాడు. దండోరా, తెలంగాణ ఉద్యమాలకు మనసారా మద్దతు ప్రకటించాడు.

”ఏక పక్ష దోపిడీకి / ఏకైక సూత్రం

కలిసి ఉంటు కలదు సుఖం / దగాపడ్డ బిడ్డలకు తారక మంత్రం

వేరు పడితే ప్రగతి సులభం” అంటూ నాలుగు దశాబ్దాల తెలంగాణా ప్రజల జీవన పోరాట సారాంశాన్ని నాలుగు పాదాల్లో తెరేష్‌ అద్భుతంగా సూత్రీకరించాడు. ఐక్యతకు విభజనకు మధ్య ఉన్న దోపిడీ వ్యూహాన్ని, రాజకీయ రహస్యాల్ని బట్టబయలు చేశాడు.

”వేరు పురుగు సమైక్య వేదం వల్లించటం / సహజాతి సహజం

ఆకలి పేగు వేరు కుంపటి కోరడం అద్భుత చారిత్రక సందర్భం అంటూ వేరు పురుగు సమైక్య వాదాన్ని ఖండించి ఆకలి పేగుల ఆత్మ గౌరవ పోరాటానికి చెయ్యెత్తి జైకొట్టాడు. ”కనిపించని విభజన రేఖల్ని/ కలాల కొద్ది రాశారు కదా / కనిపించే ఒక్క విభజన రేఖ గీయడానికి మాత్రం దేశం ఎందుకు గడ గడ వణికిపోతుందని ప్రశ్నల బాంబులను కురిపించాడు. ”కొత్త నింగీ, కొత్తనేల, కొత్త గాలి,కొత్త నిప్పు, కొత్త నీరు / ఏమి అక్కర్లేదు / పాత నేలకు ఒక కొత్త రేఖ కావాలి / హస్త సాముద్రికులారా అర చేతిలో వైకుంఠం కాదు / ఇప్పుడో ప్రత్యేక రాష్ట్రం కావాలి” అంటూ ఢిల్లీ పీఠం గుండెలదిరేలా గర్జించి, రాష్ట్ర విభజనలోని ఔచిత్యాన్ని, న్యాయబద్ధతను తెరేష్‌ బాబు ఏంతో నిజాయితీగా తేటతెల్లం చేశాడు. డా|| కోయి కోటేశ్వరరావు సంపాదకత్వంలో వెలువడిన తెలంగాణా సంఘీభాకవితా సంకలనంలో పైడి తెరేష్‌ బాబు కావడికుండలు అనే శీర్షిక కవిత రాయడంతో పాటు ”కుండల్లా విడిపోతాం” కలిపివుంచే కావడి బద్దను బలోపేతం చేద్దాం” అంటూ సూత్రీకరించి జై తెలంగాణా అంటూ జేజేలు పలికాడు.

తాటాకు మంటలాంటి, సోడాబుడ్డి ఉద్రేకం వంటి సమైక్యవాద ఉద్యమంపై నిప్పులు చెరుగుతూ పైడి తెరేష్‌ బాబు భగవద్గీత రచనా శైలిలో ‘విభజన గీత’ పేరుతో 60కి పైగా పేరడీ శ్లోకాలను రచించాడు. కుహనా సమైక్యఉద్యమంలోని లోగుట్టును బహిరంగ పరిచాడు. సమైక్యవాద మేడిపండును అడ్డంగా పగలగోసి దాని పొట్టలోని రాజకీయ పురుగుల నగ్నత్వాన్ని ‘విభజనగీత’ లోని పేరడీ శ్లోకాలు ఫేస్‌బుక్‌లో సంచలనం సృష్టించాయి. ”చిక్కోసి దావరస్య కిక్కోపి చిన్నమెదడవా ఇదమ్‌ మద్యం కుటిలమ్‌ నీతిః

దారం జాగం మాతృకస్య తెలంగాణం బిల్వాం ప్రెహస్యం ఇతి వధ్యరీతిః

అపార్థా! కిక్కు చిన మెదడుకు, చిక్కు లివరకు. ఇది మద్యనీతి. దారి తెలంగాణది. గోదారి ఆంధ్రది. ఇది కుటిలనీతి. జాగా తెలంగాణది. పాగా సీమాంధ్రది. ఇది వలసనీతి. నేల తెలంగాణది. గోల ఢిల్లీది. ఇది రాజనీతి. అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానం రాసి సమైక్యవాదుల్ని రాచి రంపాన పెట్టాడు.

”చాయస్య వన్నోహి బైటూం డబలస్య బెడ్యాం ధమారోంగరోయసీ

ఇలాంచ గేమాంచ క్రాసింగస్య డబలం ఛీ ఛీ నాదోపి గర్హీయసీక్ష్మ”

అపార్థా! చాయ్‌లందు వనబైటూ ఆచయ్‌, బెడ్ల యందు డబుల్‌ బెడ్డు, ధమాకాల యందు డబల్‌ ధమాకా ఉత్తమములని ప్రజలచే కీర్తించబడుచున్నది. కోళ్ళ యందు డబల్‌రోళ్ళు, గేముల యందు డబల్‌ గేములు, క్రాసింగులయందు డబల్‌ క్రాసింగులు హీనాతిహీన కార్యములని ప్రజలచే గర్హింపబడచున్నవి. కావున సత్యాసత్య నిత్యా నిత్యతత్వమును గుర్తెరుంగుటకు తేనీటిని రెండుగా విభజించి వనబైటూ విధమున ‘టి’ సేవించుతమమ్ము” అంటూ తెరేష్‌బాబు అత్యంత సమర్థవంతంగా విభజన గీతోపదేశం చేశాడు. పదునైన వ్యంగ్య శైలితో శత్రువు ఆయువు పట్టును పసిగట్టి / తదనుగుణంగా కవితాయుద్ధం చేయు తెరేష్‌ బాబుకు చద్దికూటితో పెట్టిన విద్య.

అసాధారణ పోలికలు (కన్సీట్‌) అపూర్వ ఊహ చమత్కారం (విట్‌), కళాత్మక వ్యక్తీకరణలు (కమ్యూనికేషన్‌ హెరిసి) పైడి తెరేష్‌బాబు కవిత్వం నిండా పరుచుకుని పాఠకులకు చక్కిలిగింతలు పెడతాయి. తెరేష్‌ బాబు కవితాశైలిలో ప్రగాఢమైన వేదనా హాస్యం (బ్లాక్‌ హ్యూమర్‌) ఆద్యంతం తళతళా మెరుస్తుంది. అందుకే ప్రసిద్ధ సాహితీవేత్తలు శివసాగర్‌, గద్దర్‌, కె. శ్రీనివాస్‌, గోరటి వెంకన్న, సురేంద్రరాజు, హెచ్చార్కె లాంటి వాళ్ళు తెరేష్‌ కవిత్వానికి ప్రీతిపాత్రులయ్యారు.

జానపద గీతాల్లోని మౌఖిక ఛందోరీ తులను తన కవితా నిర్మాణ పద్ధతులతో మేళవించి సందర్భానుసారంగా తెరేష్‌ బాబు వచన కవితా ప్రక్రియకు కొత్త నడ కలు నేర్పాడు. ఒకొక్కసారి గజల్‌ నడక లను, ముక్తపదగ్రస్త శైలిని గమ్మత్తుగా సమ న్వయ పరచి అపూర్వమైన రచనా శైలితో పాఠకుల్ని వశపరుచుకుంటారు పైడి తెరేష్‌ బాబు అందుకే ఈ కవిత వీరబాహుడి శైలి సిరాల్లోకి ఇంకి పోకుండా, ఆపాదమస్తకం సిరల్లోకి దమనుల్లోకి చొచ్చుకు పోతుంది.

”చీకట్ల కత్తెరలో గొంతకు చిత్రంగా తెగిపోయినా /

నాకేమి కానట్టు / నాదేమి పోనట్లు / నవ్వుతూనే చేస్తాను నవగీతాలాపన”

అని సగర్వంగా ప్రకటించిన పైడి మృత్యువుతో పోరాడుతూ కూడా నొన్న మొన్న ‘చుండూరు తీర్పుకు’ వ్యతిరేకంగా నేతిబీరకాయలాంటి న్యాయస్థానాలపై అక్ష రాల పిడుగులు కురిపించాడు. పైడి తెరేష్‌ బాబు మూడు దశాబ్దాలుగా అప్రతిహతం గా రాస్తూనే ఉన్నాడు. 40కి పైగా కథలు రాశాడు. ‘మైకాసురవధ’ లాంటి రాజకీయ వ్యంగ్య గల్పికలు రాశాడు. టాలివుడ్‌ నుండి హాలివుడ్‌ వరకు విస్తరించిన సిని మాలు రూపురేఖల మీద పదునూన విశ్లేష ణలు రాశాడు. వార్తలకు, భక్తికి, సంగీ తానికి, పర్యావరణానికి ఉన్నట్టో సాహిత్యానికి కూడా ఒక ప్రత్యేక ఛానల్‌ నెలకొల్పిన వాళ్ళ 21వ శతాబ్దాపు వైతాళికులని దార్శ నిక దృష్టితో పిలుపు నిచ్చాడు. అందు కోసం పరితపించాడు. అందుకే పైడి తెరేష్‌బాబు 21వ శతాబ్దాపు వైతాళికుడు

ఒంగోలు కు చెందిన తెరేష్‌బాబు మూడు దశాబ్దాల పాటు తెలంగాణా నేలపై జీవించాడు. తెలంగాణాలో జరిగిన అనేక ఉద్యమాలకు, పోరాటాలకు సజీవంగా ప్రతిస్పందించాడు. తెలంగాణా నేలలో అవిభాజ్యమైన అనుబంధాన్ని పెంచుకున్నాడు. వీలైతే తన శవాన్ని మహత్తరమైన తెలంగాణ మట్టిలో ఖననం చేయమని కుటుంబ సభ్యులను అభ్యర్థించాడు. ఆయన అభ్యర్థనను అర్థంచేసుకున్న పంజాగుట్ట శ్మశానవాటిక ఒంగోలు జాషువ తెరేష్‌బాబు పార్థీవ దేహాన్ని మనసారా ముద్దాడింది.

Other Updates