art

బహుప్రక్రియలలో చిత్రకళా సాధన చేయడం ఆమె నైజం. రెల్లు కాగితంపై, క్యాన్వాస్‌పై తైలవర్ణ చిత్రాలు గీయడంతోపాటు లోహపు పలకలపై చిత్రాలువేసి ప్రతులు రూపొందించడంలో కుట్టుతో, అల్లికతో, కత్తిరింపులతో, కోయడం ద్వారాను చాక్‌పీస్‌తో, కూరగాయలతో సూక్ష్మ శిల్పాలు రూపొందించడంలో, కంప్యూటర్‌పై గ్రాఫిక్‌ చిత్రాలు వేయడంలోనూ-ఆమెకు మంచి అనుభవం ఉంది. అయితే-ఏ చిత్రాన్నైనా ఆమె విచిత్రంగా మడత రీతిలో రూపుదిద్దడం ఆమె శైలి. తదేక దృష్టితో ఎంతో గాంభీర్యంగా చిత్రాలు వేయడం ఒక పార్శ్వం కాగా, వ్యంగ్యంతో, హాస్యంతో రంగరించి కార్టూనులు వేయడం-ఆమెలోని మరో పార్శ్వం.

ఇంతకు ఆమె అసలు పేరు-సువర్ణ భార్గవి. కానీ భార్గవిగానే అందరికీ సుపరిచితురాలు. ఖమ్మం జిల్లా పోలంపల్లికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు- కొమరగిరి వెంకట అప్పారావు, చిత్రకారిణి-సుగుణ దంపతుల కూతురు ఆమె. అర్థశతాబ్దిక్రితం సుగుణ వేసే రకరకాల ముగ్గులు, కుట్లు, అల్లికలు, చిత్రాలు చూసి మూడో యేటనే భార్గవి ప్రభావితురాలైంది. మహిళా మండలి వారికి సుగుణ చిత్ర లేఖనం తరగతులు నిర్వహించేది. ఆమెను చూసి భార్గవి ఏదో బొమ్మ వేసే ప్రయత్నం చేసేది.

అట్లా బొమ్మలు వేయడం బాగా అలవాటై పోయిన భార్గవి 1984లో సాంకేతిక విద్యా శాఖనుంచి డ్రాయింగ్‌-పెయింటింగ్‌ డిప్లొమాకు కూర్చొని ప్రథమశ్రేణిలో కృతార్థురాలైంది. మరోవంక బి.ఎస్‌.సి. డిగ్రీ సాధించింది. ఇంగ్లీషు సాహిత్యంలో ఎం.ఏ. పూర్తి చేసింది. 2012లో మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎఫ్‌.ఏ. సాధించింది. ఆ తర్వాత మల్టీమీడియా, పుస్తక ప్రచురణ కళలో శిక్షణ పొందింది. డిజిటల్‌ గ్రాఫిక్‌ ఆర్ట్స్‌, యానిమేషన్‌ కోర్సులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైంది.

ఈ నేపథ్యంలో తనలోని ఆలోచనలు కాగితంపై సరిగా ప్రతిబింబించని ఒక రోజు-ఆ కాగితం మలచి-చించి వేసిన తరుణంలో-మలచిన బొమ్మలో స్ఫురించిన సృజన ఆమెను మడత పద్ధతి చిత్రాలు వేయడానికి, ఆ పద్ధతిలో కొనసాగుతూ, తన ముద్ర వేయడానికి దోహదం చేసింది.

ఆమె చిత్రకళా యాత్రలో అనేక సంఘటనలకు సాక్షిగా ఆమె తీర్చిదిద్దిన చిత్రాలున్నాయి. ఒక చిత్రం చెడు చూడకు, వినకు, మాట్లాడకుమని గాంధీ చెప్పిన సూత్రాన్ని మూడు కోతుల ద్వారా ప్రతిబింబించగా, మరో మహాకవి చెప్పినట్టుగా మరో చిత్రం నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే కారుతాయని చూపుతుంది. రక్షణలేని అమ్మాయిల కథను వేరొక చిత్రం విప్పిచెప్పగా, పిండ దశలోని విచ్ఛిత్తికి గురవుతున్న బాలికల కథకు ఇంకొక చిత్రం అద్దం పడు తుంది. వరకట్న బాధితురాలు, తల్లీ, పిల్ల, అంధబాలిక, పూల మ్మ, పఠనశీలి, స్నానం, అలం కరణ, బతుకమ్మ, వీణాపా ణులు, లక్ష్మీదేవి ఇత్యాది చిత్రా లన్నీ మహిళలకు సంబంధిం చినవే. ఆడపిల్ల అనుకోవద్దు- ఆడపిల్లే ఇంటికిముద్దు అని ఆమె వేసిన చిత్రాల్లో చెప్పకనే చెబుతుంది.

అంతేకాదు ఆమె ఎంతో పరిశోధన చేసి, అధ్యయనం చేసి, భారత, భాగవతాలు పఠించి, తనదైన పద్ధతిలో దశావతారాలు, గీతోపదేశం చిత్రించారు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కలికి అవతారాల చిత్రాలంటే ఆమెకు ప్రీతి. గణేష్‌, సాయి, హనుమాన్‌ చిత్రాలు కూడా ఆమె పద్ధతిలో వేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన-పాలపిట్ట, తంగేడుపూలు, జమ్మిచెట్టు, జింక చిత్రాలను ఆమె వేసింది. అంతేకాదు నెమలి, హంస, చేప, తులిప్‌ పుష్పం, సునామిలాంటి చిత్రాలు వేయడంలోనూ ఆమె ఆసక్తి చూపారు. కొన్ని చిత్రాల్లో గుండీలవలె

ఉబ్బెత్తు చిత్రాలు, టిక్లీతో చిత్రాలు, మూడు ఆయతనాల చిత్రాలు వేశారు. ఏ చిత్రమైనా ఏదో కొత్త తరహాలో వేయాలనేదే ఆమె తహతహ. సహజ ఆకృతులను చిత్ర రచనా అవసరాలకు అనుగుణంగా మార్చి నిర్ధిష్టరీతిలో సౌందర్య సారాన్ని రంగులలో, రేఖలలో చూపే-వివకర్త చిత్రాలు కూడా ఆమె వేశారు. రంగోలిలా రాళ్ళను అమర్చడంలోనూ ఆమెది అందెవేసిన చేయి. సాధారణంగా ఆమె ప్రాథ మిక వర్ణాలే వాడతారు. ప్రేక్షకులకు తన చిత్రాలు అర్థం కావాలనే లక్ష్యం పెట్టుకుని ఏ చిత్రమైనా వేస్తుంది.

లోగడ అంతర్జాతీయ నిపుణులు, ఆభరణాల ఉత్తమ డిజైనర్‌గా భార్గవిని ఎంపిక చేశారు. సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఆర్ట్స్‌ సొసైటీ దశమ వార్షికోత్సవాల్లో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనలో ఆమె గీసిన చిత్రానికి ప్రథమ బహుమతి వచ్చింది. అట్లాగే ఆమె గీసిన కార్టూనుకు ఆర్‌.కె. లక్ష్మణ్‌ స్మారక బహుమానం లభించింది. 2001లో స్పాట్‌ పెయింటింగ్‌ పోటీలో ఉత్తమ చిత్రకారిణిగా అవార్డు వచ్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా 2002లో ‘నిసెట్‌’ నిర్వహించిన చిత్రకళా పోటీల్లో ప్రశంసాపత్రం ప్రదానం చేశారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ నిర్వహించిన సిగ్నేచర్‌ పెయింటింగ్‌లో పాల్గొని సత్కారం పొందారు. 2007లో ఆదర్శ ఉపాధ్యాయిని అవార్డు, 2010లో ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు, 2012లో ప్రతిభా పురస్కారం, కృషిరత్న పురస్కారం, 2013లో విశిష్ట సేవామిత్ర పురస్కారం, 2016లో కళారత్న పురస్కారం, మరెన్నో సంస్థల అవార్డులు పొందారు.

వరంగల్‌లోని చందాకాంతయ్య స్మారక ఆర్ట్స్‌ సైన్స్‌ కళాశాల రజతోత్సవం సందర్భంగా 1994లో ఏర్పాటు చేసిన వ్యష్టి చిత్రకళా ప్రదర్శన విజయవంత మైంది. అదే సంవత్సరం వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయం అంతర్‌కళాశాల సాంస్కృతోత్సవం సందర్భంగానూ వ్యష్టి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. అంతకుముందు 1989లోనే వరంగల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో, 1993లో కాకతీయ నర్సింగ్‌హోం గ్యాలరీ ప్రారంభోత్సవం సందర్భంగా, 1994లో కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలోనూ వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించారు. 2006లో చిత్రమయి ఆర్ట్‌ గ్యాలరీలో, 2009లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సఫ్దారియా బాలికోన్నత పాఠశాలలో, 2011లో ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీలోనూ ఆమె ఏర్పాటు చేసిన వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలలో కళాప్రియుల దృష్టి చూరగొన్నారు. ఇవే కాకుండా 1990నుంచి దాదాపు డజను సమష్టి చిత్రకళా ప్రదర్శనలలోనూ ఆమె పాల్గొన్నారు. పలు చిత్రకళా శిబిరాలలో, చర్చా గోష్టిలలోనూ ఆమె పాల్గొని తన ఉనికిని చాటారు. యాభైదాకా డిజైన్లు రూపొందించారు. ముఖ్యంగా అనేక మ్యాగజైన్‌లకు డిజైన్‌ చేశారు. ఎన్నో పాఠశాలలు, ఆస్పత్రులు, సంస్థల లోగోలు రూపొందించారు. మట్టి బొమ్మలు, కాగితం ముఖోటాలు తయారు చేసే కార్యగోష్టులు నిర్వహించారు. ఎం.ఎఫ్‌.ఏ. విద్యార్థులకు ప్రత్యేక గైడ్‌గా వ్యవహరించారు. చాలా కాలంగా చిత్రకళ బోధించే అధ్యా పకురాలుగా కొనసాగుతున్నారు. ఆమె వేసిన పలు చిత్రాలను స్వదేశీ యంతో పాటు లండన్‌, అమె రికాలల్లోని కొందరు కళాప్రియులు సేకరించారు.

వరంగల్‌లో పబ్లిక్‌ స్కూల్‌నుంచి ప్రారంభించి గచ్చీబౌలి, లంగర్‌హౌజ్‌, గోల్కొండ, శివరాంపల్లి, కేంద్రీయ విద్యాలయాల్లో చిత్రకళ నేర్పించారు. ‘నిసెట్‌’లో ‘ఎక్స్‌-ఇన్‌’ సంస్థలోనూ ఇంటీరియర్‌ డిజైనింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్పించారు. గంభీరమైన వాతావరణంనుంచి సేద తీరడానికి మధ్యమధ్య కార్టూన్లు వేస్తుంటారు.

గాజుపై చిత్రాలు, కుండపై చిత్రాలు, సూక్ష్మ శిల్పాలు చెక్కడంలో, మట్టిబొమ్మలు చేయడంలో, పలు హస్తకళలు రూపొందించడంలో, వాస్తు శిల్పంలో శిక్షణ ఇస్తున్నారు. జ్యూయెలరీ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ విద్యార్థులకు లోయర్‌, హయ్యర్‌ పరీక్షలు వ్రాయడానికి తమ ‘వర్ణఆర్ట్‌ సెంటర్‌’లో ఆమె శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల ఆమె అందమైన ఇంగ్లీషు ఫాంట్‌ రూపొందించారు. ప్రస్తుతం దాని కాపీరైట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

టి. ఉడయవర్లు

Other Updates