magaభద్రాచలం ఆలయానికున్న ప్రాశస్త్య్రం, ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామ చంద్రుడికున్న భక్తితత్పరత దృష్ట్యా భద్రాద్రి ఆలయాన్ని దేశంలోనే ఓ అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. గోదావరి నది సరిగ్గా భద్రాచలం ఆలయం దగ్గరే మలుపు తిరిగి తూర్పుకు ప్రవహిస్తుందని, కొద్ది దూరం పోయిన తర్వాత ఉత్తర వాహినిగా మారుతుందని, రామచంద్రుడు కూడా పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కుకు వచ్చి ఇదే ప్రాంతంలో నడయాడాడని సీఎం చెప్పారు. ఈ కారణాల వల్ల భద్రాద్రి ఆలయానికి ఎంతో స్థల మహత్యం, పౌరాణిక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని సీఎం వెల్లడించారు. కాబట్టి భద్రాద్రి ఆలయాన్ని ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి దేవాలయాల అభివృద్ధిపై ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ రావు, నాయిని నర్సింహరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్‌, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి, భద్రాచలం ఆలయ ఇవో కె. ప్రభాకర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. చినజీయర్‌ స్వామి సూచనలకు అనుగుణంగా ఆలయ శిల్పి ఆనంద్‌ సాయి బృందం రూపొందించిన దేవాలయ అభివృద్ధి నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ నమూనాలకు మరికొన్ని సూచనలు చేశారు. ప్రస్తుతమున్న దేవాలయానికి ఉత్తరం, పడమర దిక్కున ఉన్న స్థలాలను కూడా కలుపుకుని దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. దేవాలయ ప్రాంగణంలోనే కళ్యాణ మండపం, షాపింగ్‌ కాంప్లెక్స్‌, భక్తుల సేదతీరే ప్రాంతాలను అభివద్ది చేయాలని చెప్పారు. ప్రస్తుతమున్న దేవాలయంలోని గర్భగుడి, ఇతర ప్రధాన కట్టడాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఇతర నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

”శ్రీరామ చంద్రుడిని కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా పూజిస్తారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో భక్తులున్నారు. రాముడు అందరి దేవుడు. రాముడు కొలువై ఉన్నభద్రాచలాన్ని పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. సీతారామ కళ్యాణం సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ పరిస్థితిని దష్టిలో పెట్టుకుని లక్షలాది మంది తరలివచ్చినా ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా భగవంతుడి దర్శనం, గోదావరిలో పుణ్యస్నానం ఆచరించడానికి అనువుగా ఏర్పాట్లుండాలి. భక్తులు ఇక్కడికి రావడానికి అనుగుణంగా రవాణా సౌకర్యాలను కూడా ప్రభుత్వం మెరుగుపరుస్తున్నది. కొత్తగూడెం-భద్రాచలం మధ్యన విమానాశ్రయం నిర్మిస్తున్నాం. కొత్తగూడెం వరకున్న రైలుమార్గాన్ని భద్రాచలం వరకు పొడిగించే ప్రతిపాదనలు ఇప్పటికే రైల్వేశాఖకు పంపాం. గోదావరి, ప్రాణహిత నదుల వెంట రహదారిని నిర్మించడం వల్ల మహారాష్ట్ర వరకు రోడ్డు సౌకర్యం కలుగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి, అటు ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రాలను కలిపే రహదారులు నిర్మిస్తున్నాం. గోదావరి నదిపై ప్రస్తుతమున్న బ్రిడ్జితో పాటు మరో వంతెన నిర్మిస్తున్నాం. గోదావరి నదిలో కూడా ఎప్పుడూ నీరు నిల్వ ఉండే విధంగా ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. యాత్రికులు పడవ ప్రయాణం కూడ చేయవచ్చు. అన్ని విధాలా భద్రాద్రి ఆలయాభివద్ధికి చర్యలు తీసుకుంటాం” అని ముఖ్యమంత్రి చెప్పారు.

Other Updates