bapureddyనా తెలంగాణ కోటి రతనాల వీణ అని జగతికి చాటిచెప్పిన కవి దాశరథి కృష్ణమాచార్య. ప్రతి యేటా దాశరథి జన్మదిన వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. దాశరథి కృష్ణమాచార్య జయంతిని రవీంద్ర భారతిలో ప్రభుత్వం పక్షాన నిర్వహించారు. దాశరథి సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీ వేత్త డా. జె. బాపురెడ్డికి అందజేశారు.

ఈ సభా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ కవులకు, సాహిత్యానికి, తెలంగాణ వైతాళికులకు గౌరవప్రతిష్టలు లభిస్తున్నాయని, వారు చేసిన త్యాగాలను స్మరించుకోగలుగుతున్నామని అన్నారు.

తెలంగాణ వైతాళికులను గౌరవించే సంప్రదాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని తెలిపారు. సభాధ్యక్షత వహించిన మంత్రి అజ్మీరా చందూలాల్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య సంప్రదాయాలపైన గొప్ప గౌరవం ఉన్న కవి దాశరథి అని, ఆయన తన సాహిత్య జీవనయాత్రలో తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని చాటిచెప్పారని పేర్కొన్నారు. జైలు గోడల మీద పద్యాలు రాసి నిజాం రాచరికాన్ని ప్రశ్నించిన ధైర్యం ఆయన సొంతమని చెప్పారు. ఆయన రాసిన సినిమా పాటలు చాలా ప్రజాదరణ పొందాయన్నారు. ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం దాశరథి పేరిట పురస్కారాన్ని ఏర్పాటుచేసి అందజేస్తున్నామని, ఈ సారి కవి బాపురెడ్డిని లక్షా వేయినూటపదహార్లతో సత్కరిస్తున్నామని తెలిపారు. మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ దాశరథి సాహిత్యం ప్రతి ఇంటిలో కొలువుదీరి ఉంటుందని అన్నారు. రత్నం కోసం వెతకడం మనకర్తవ్యమని, కోటి రత్నాల వీణను మోగించిన తెలంగాణ కవిగా దాశరథిని స్మరించుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చెప్పారు. పురస్కార గ్రహీత డాక్టర్‌ జె. బాపురెడ్డి ఉద్విగ్న భరితంగా మాట్లాడుతూ దాశరథితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సభలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, శాసనమండలి సభ్యులు సుధాకర్‌రెడ్డి, తెలుగు యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌ ఎల్లూరి శివారెడ్డి, ఎస్‌సీ, ఎస్‌టీ కమిటీ సభ్యులు చెల్లప్ప, దాశరథి కష్ణమాచార్య కుమారుడు దాశరథి లక్ష్మణాచార్య, కార్పోరేటర్‌ విజయారెడ్డి, భాషా సాంస్క తికశాఖ సంచాలకులు మామిడి హరికష్ణ తదితరులు పాల్గొన్నారు.

Other Updates