చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 14న జరిగే బాలల దినోత్సవాన్ని ప్రతి యేటా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ యేడాదికూడా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 49వ బాలల దినోత్సవ వేడుకలను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, కేంద్ర కార్మికశాఖమంత్రి బండారు దత్తాత్రేయ, నాయిని నర్సింహారెడ్డి గౌరవ అతిథులుగా హాజరయ్యారు.
ఆడపిల్ల అంటే ఆదిలక్ష్మి వంటిదని అన్నారు కానీ సమాజంలో ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు, రాష్ట్ర హోంశాఖామాత్యులు నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఆడపిల్లలు పుట్టడం అదృష్టంగా భావించాలని అన్నారు. చిన్నపిల్లల హక్కులను కాపాడడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో చొరవ చూపుతున్నదని అన్నారు.
ముఖ్యఅతిథి మహమూద్‌అలీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 36వేల అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం కింద 7 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, ఆరు సంవత్స రాలలోపు పిల్లలకు ప్రభుత్వం పౌష్ఠికాహారం అందిస్తున్నదని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘బేటీ బచావో-బేటీ పడావో’ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని అన్నారు. చిన్నారుల భవిష్యత్తును చక్కదిద్దడానికి ఉపాధ్యా యులందరూ తమ గురుతర బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ఉద్భోధించారు.
ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలబాలికలకు రాష్ట్రస్థాయి బాలరత్న, బాల సూర్య అవార్డులను అందజేశారు. గద్వాలకు చెందిన లింగిశెట్టి శ్రీనిత్యకు బాలసూర్య, సృజనాత్మకరంగంలో ప్రతిభ కనబరిచినందుకు సికింద్రాబాద్ బాలభవన్‌కు చెందిన దంతోజు ఆకాంక్ష. గద్వాల్ బాలభవన్‌కు చెందిన కే.చిత్రారెడ్డి, కరీంనగర్ బాలభవన్‌కు చెందిన ఓ రమేష్‌లకు బాలరత్న అవార్డులను ప్రదానం చేశారు. నిజామాబాద్ బాలభవన్‌కు చెందిన ఎన్ గీత (సృజనాత్మక రంగం), వరంగల్ బాలభవన్‌కు చెందిన ఎం. వైష్ణవి (నృత్యం)లకు స్పెషల్ కేటగిరి అవార్డులు ప్రదానం చేశారు. మల్కాజ్‌గిరికి చెందిన మాస్టర్ నిహాల్, రంగారెడ్డి జిల్లాకు చెందిన బేబి స్ఫూర్తిలకు వండర్ కిడ్ అవార్డు, గద్వాల్ జిల్లా ఆత్మకూరు చిల్డ్రన్ హోంకు చెందిన కే లక్ష్మీ, ఖమ్మం చిల్డ్రన్ హోంకు చెందిన బీ రమ్యలకు పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించినందుకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డుల కింద రూ. 2,500 నగదు, మెమొంటో, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ముందుగా పండిట్ నెహ్రూ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సదర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహిళాభివృద్ధి, శిశు దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ కార్యదర్శి ఎం. జగదీష్, డైరెక్టర్ విజయేంద్రబాబు, జవహర్‌బాల భవన్ డైరెక్టర్ సుధాకర్, జేడీ లక్ష్మీదేవి, పీడీ కుసుమకుమారి పాల్గొన్నారు.
పండిట్ నెహ్రూ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన అనంతరం చిన్నారులకు అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలలో బాలల దినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు.