heroసెప్టెంబర్‌ 28న పైడిజైరాజ్‌ 107వ జయంతి

బాలీవుడ్‌లో మూకీల కాలంలోనే తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించిన తొలి తెలుగు నటుడు పైడిజైరాజ్‌ నాయుడు. ఏడు దశాబ్దాల నట జీవితాన్ని గడిపి చరిత్రకెక్కిన మహానటుడాయన. నటుడిగానే కాక దర్శకునిగా, నిర్మాతగా హిందీ రంగంలో తనదైన ముద్ర వేశారు. సరోజినీనాయుడు భర్త గోవిందరాజులు నాయుడుకు స్వయాన మేనల్లుడాయన. 1909 సెప్టెంబర్‌ 28న కరీంనగర్‌లో జన్మించారాయన. తండ్రి ప్రజా పనుల శాఖలో అకౌంటెంట్‌గా పని చేసేవారు. ధనవంతుల కుటుంబం కావడం వల్ల ఆయన చదువు రిషీవ్యాలిలో సాగింది.

జైరాజ్‌కు చిన్నతనం నుండే నాటకాలతో పరిచయం ఉండింది. నిజాం కాలేజీలో చదివే రోజుల్లో షేక్‌స్పియర్‌ నాటకాల్లో నటించారు. ఇంజనీరింగ్‌ చదివినా తనదైన జీవనశైలిని ఏర్పరచుకోవాలనుకున్నారు. ఎలాగూ నేవీలో చేరలేకపోయానని, ఇక నటుడిగానైనా రాణించాలని 19వ ఏట 1928లో తండ్రిని ఒప్పించి బొంబాయి పయనమయ్యారు. బొంబాయిలో దిగిన జైరాజ్‌కి దొరికిన తొలి ఆలంబన తన మిత్రుడు, అప్పటి సికిందరాబాదులో ఉన్న మహవీర్‌ ఫోటో ప్లేస్‌ మూకీ నిర్మాణ సంస్థలో పని చేసిన రంగయ్య. అప్పటికి బొంబాయిలో మూకీల నిర్మాణం చాలా జోరుగా సాగుతున్నది. జైరాజ్‌ను వెంట తీసుకుని మామా వారేర్కర్‌ అనే నాటక రంగ మ్రుఖుడిని కలిశాడాయన. వారేర్కర్‌ అప్పట్లో మూకీ సినిమా తీయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. జైరాజ్‌ను చూడగానే తన సినిమాలో పని చేయడానికి ఎంపిక చేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు సినిమా పూర్తి కాలేదు. కానీ ఆ వెంటనే నాగేంద్ర మజుందార్‌ ‘జగ్‌మతీ జవానీ’ (1929)లో నటిం చడంతో జైరాజ్‌ సినీ జీవితం మొదలైంది. ఆ వెంటనే వచ్చిన ”రసీలి రాణి” (1930) జైరాజ్‌ నటించిన రెండో మూకీ కాగా హీరోగా నటించిన తొలి చిత్రం. ఈ చిత్రంలో మాధురి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అయిదు వారాలు ఆడటం అప్పటి మూకీల కాలంలో ఒక సంచలనం. ఇదో పెద్ద విజయంగా భావించేవారు ఆ రోజుల్లో. ఇదే బ్యానర్‌కు మరికొన్ని చిత్రాల్లో హీరోగా నటించారాయన. ఆ తరువాత శారదా ఫిలిం కంపెనీలో నెలకు 100 రూపాయల జీతంతో చేరారు. ఈ కంపెనీలో మొదటిసారిగా ‘మహాసాగర్‌ మోతీ’లో నటించారు. హీరోయిన్‌ జేబున్నీసా. ఆ తరువాత వీరిద్దరి సినిమాలు హిట్‌ పేర్‌గా పాపులరైనవి. ఈ క్రమంలో జైరాజ్‌ ‘ఫై ్లట్‌ టు డెత్‌’, ‘కృష్ణకుమారి’, ‘క్వీన్‌ ఆఫ్‌ ఫెయిరీస్‌’, ‘ది ఎనిమి’, ‘తుఫానీ తరుణి’, ‘షి’ (1931), మై హీరో (1932) మూకీ చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాల ద్వారా స్టార్‌డమ్‌ అందుకున్న జైరాజ్‌ అప్పటికే మూకీల్లో అగ్రహీరోలుగా స్థిరపడిన బిల్లిమోరియా, జాల్‌ మర్చంట్‌, పృథ్వీరాజ్‌ కపూర్‌ల సరసన నిలిచారు. ఇదంతా ఒక తెలంగాణ వ్యక్తి అకుంఠిత దీక్ష, పట్టుదలకు నిదర్శనం.

దీంతో బొంబాయి వెళ్లిన తొలితెలుగు వ్యక్తి ఎల్వీ ప్రసాద్‌ కాదని మన పైడి జైరాజ్‌ అని తేటతెల్లమవుతున్నది. నిన్న మొన్నటిదాకా బొంబాయి వెళ్లి సినిమాల్లో నటించిన తెలుగువాడు ఎల్‌.వి.ప్రసాద్‌ అని, ఆయన 1930లో వెళ్ళారని సినీ చరిత్రకారులు రాసుకున్నారు. కానీ అంతకుముందే 1928లోనే బొంబాయి వెళ్లి డజన్‌ మూకీల్లో నటించిన మన జైరాజ్‌ను చరిత్రలో చేర్చలేదు. సీమాంధ్ర సినీ చరిత్రకారుల వివక్షకు ఇదొక నిదర్శనం.

‘ఆలంఆరా'(1931)తో దేశంలో టాకీల శకం మొదలైంది. టాకీ చిత్రాల్లో ఎవరి పాటలు వారే పాడుకోవాలి. మరి జైరాజ్‌కు పాడటం రాదు గనుక తాను ప్రసిద్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు ప్రొ|| దీదర్‌ వద్ద శిష్యరికం చేసి హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. ఆ తరువాత జైరాజ్‌ నటించిన తొలిటాకీ ‘షికారి’ (1932) లండన్‌కు చెందిన ఈస్టర్న్‌ ఫిలిం కంపెనీ ఈ సినిమాను హిందీ, ఇంగ్లీషు భాషల్లో తయారు చేశారు. ఆ తరువాత మాయాజాల్‌, ఔరత్‌ కా దిల్‌, పతిత పావన్‌, జహర్‌ – ఎ – ఇష్క్‌ (1933), దర్ద్‌ – ఎ – దిల్‌, షేర్‌ – ఎ- పరిస్తాన్‌, వాసవదత్త (1934), షేర్‌ దిల్‌ ఔరత్‌ (1935), బేరోజ్‌ గార్‌, గరీబ్‌ పరివార్‌ (1936) వంటి హిట్‌ చిత్రాల్లో నటించిన జైరాజ్‌ అతికొద్ది కాలంలోనే పృథ్వీరాజ్‌కపూర్‌, శాంతారాం, సోహ్రాబ్‌మోడీ వంటి అగ్రశ్రేణి తారల స్థాయికి చేరుకున్నారు.

జైరాజ్‌ నటించిన చిత్రాల్లో నాలుగైదు తప్ప అన్నీ యాక్షన్‌, సోషల్‌ చిత్రాలే. అజంతా ఫిలిం కంపెనీ వారికి చేసిన నాలుగు సినిమాల్లో చెప్పుకోదగింది ‘మిల్‌ మజ్దూర్‌’ (1933). ప్రసిద్ధ హిందీ రచయిత ప్రేమ్‌చంద్‌ కథ ఆధారంగా తీసిన ఈ చిత్రంలో జైరాజ్‌ హీరోగా, బిష్ణో హీరోయిన్‌గా నటించారు. 1936లో కరాచీలో తయారైన బేరోజ్‌గార్‌, తరువాత గాంబ్లర్‌ చిత్రాల్లో హీరోగా నటించారు. 1938లో ఆర్‌.ఎస్‌.చౌధురి తీసిన ‘రైఫిల్‌ గర్ల్‌’ (1938)లో విలన్‌గా నటించి మెప్పించడం జైరాజ్‌ నటనా ప్రావీణ్యానికి నిదర్శనం. ఇదే సంవత్సరం వచ్చిన ”బాబి” ఏకంగా 80 వారాలు ఆడింది. దీంతో జైరాజ్‌ హిందీ చిత్ర రంగంలో స్టార్‌ హోదాకు చేరుకున్నారు. ఆయన జీతం నెలకు 600కు పెరిగింది. ప్రకాశ్‌ పిక్చర్స్‌లో ”బిజ్లీ (1939) హిట్‌ తరువాత వారే దర్శకత్వం వహించే అవకాశం కల్పించి ‘మాలా’ (1941) సినిమా తీయించారు. ఆ తరువాత ప్రతిమ (1945), సాగర్‌ (1951), రాజ్‌ఘర్‌, మొహర్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేశారాయన.

1947లో బాంబే టాకీస్‌ కంపెనీ నుండి పిలుపు రావడంతో దేవికారాణి హీరోయిన్‌గా ‘హమారీ బాత్‌’తో నటించారు. దేవికారాణి చివరి చిత్రం ఇదే. జయరాజ్‌ సినీ జీవితంలో 1946 నుండి వరుసగా ఎనిమిదేళ్ల పాటు చారిత్రక చిత్రాలలో కీలక భూమిక పోషించి పాపులరయ్యారు. 1946లో రంజిత్‌ మూవీటోన్‌ వారి ‘రాజ్‌పుటానీ’లో శక్తిసింగ్‌గా, షాజహాన్‌ (1947)లో సైగల్‌ హీరో కాగా సంగత్రా షిరాజి పాత్ర పోషించిన జైరాజ్‌ సైగల్‌తో నటించిన ఆ తరం హీరోగా నిలిచిపోయారు. ఆ తరువాత అమర్‌సింగ్‌ రాథోడ్‌, వీర్‌దుర్గాదాస్‌, రాణా ప్రతాప్‌, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, టిప్పుసుల్తాన్‌, రజియాసుల్తానా, అల్హా ఉదల్‌, రాణాహమీర్‌ వంటి చరిత్రక సినిమాల్లో జైరాజ్‌ హీరోగా నటించారు. ‘షహీద్‌-ఎ-భగత్‌సింగ్‌’ లో పోషించిన చంద్రశేఖర్‌ ఆజాద్‌ పాత్ర అప్పటి ప్రేక్షకులకు మరుపుకు రానిదయ్యింది.

ఇంకా ‘హతీంతాయి'(1947) పెద్దహిట్‌ చిత్రంలో జైరాజ్‌హీరో. షకీలా హీరోయిన్‌. హైదరాబాదులో ఈ సినిమా విడుదలైనపుడు నాటి నిజాం నవాబు ప్రత్యేక ప్రదర్శన వేయించుకున్నారు. ఆ సందర్భంలో ఈ సినిమాలో జైరాజ్‌ పై చిత్రీకరించిన ‘పర్వర్‌’ జిగర్‌ ఆలం’ పాటను పదిసార్లు స్క్రీనింగ్‌ చేయించుకున్నారు. కాగా ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ‘ఖూనీకౌన్‌ ముజ్రింకౌన్‌’ (1965). ఇంకా గుజరాతిలో జోగిదాస్‌ రెహమాన్‌, బహురూపి, ఖిమ్రో లోడన్‌, మరాఠిలో ఛోటా జవాన్‌, ఫకిరా చిత్రాల్లో నటించారు. రెండు అంతర్జాతీయ చిత్రాల్లో నటించిన ఖ్యాతిని కూడా దక్కించుకున్న జైరాజ్‌ ‘మాయా’ ట్వెంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌ వారి ‘నైన్‌ అవర్స్‌ టు రామా’ చిత్రాల్లో నటించారు. సొంతంగా ‘సాగర్‌’ సినిమా తీసి నష్టపోయిన ఆయన మళ్లీ నిర్మాతగా మారలేదు.

1966 నుండి హీరోపాత్రల నుండి కారెక్టర్‌ పాత్రలకు మారిన జైరాజ్‌ బహారోంకె సప్నే (1967), నీల్‌కమల్‌ (1968), బేటీ తుమ్హారీ జైసీ(1969), జీవన్‌మృత్యు (1970), ఛోటీ బహు (1971), బాజీగార్‌, షెహజాదా (1972), ఆలంఆరా (1973), చోర్‌ చోర్‌ (1974), కాలాసోనా, సలాఖే, షోలే (1975), బైరాగ్‌, ఫాస్లా (1976), వీరూ ఉస్తాద్‌ (1977), ముఖద్దర్‌ కా సికిందర్‌ (1978), హీరామోతీ, ఇంకార్‌ (1979), జ్యోతీ బనే జ్వాలా, కాలాపానీ, షాన్‌ (1980), ఖూన్‌ భరీమాంగ్‌ (1988) అజూబా (1991) బేతాజ్‌ బాద్షా దో ఫంటూష్‌ (1994) వంటి వాటితో కలిసి మొత్తం 200కు పైగా చిత్రాల్లో నటించారు జైరాజ్‌.

మొత్తం 70 ఏండ్ల పాటు సినీ రంగంలో కొనసాగిన నటుల్లో వీరే మొదటి వారు. ఆ తరువాతనే లతా మంగేష్కర్‌. మన హైదరాబాదీ అయిన చంద్రశేఖర్‌ (హీరో)లు అంత సుదీర్ఘకాలం పరిశ్రమలో ఉన్నారు. ఇదొక అరుదైన రికార్డు. ఆయన సినీరంగ సేవలకు 1980లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌, అత్యున్నత ‘దాదాఫాల్కే’ అవార్డుతో సన్మానించింది. 1996లో హైదరాబాద్‌లో 100 ఏళ్ల సినిమా ఉత్సవాల సందర్భంగా చంద్రశేఖర్‌తో పాటు జైరాజ్‌ను ఘనంగా సన్మానించారు. గుజరాత్‌ ప్రభుత్వ ఉత్తమ సహాయ నటుడి అవార్డు అందుకున్నారు. 1939లోనే పంజాబీ యువతి సావిత్రిని పెళ్లి చేసుకున్నారు. దిలీప్‌రాజ్‌, జయ్‌తిలక్‌, జయశ్రీ, దీప, గీత ఆయన సంతానం. ఆయన 2000 సంవత్సరం ఆగస్టు 11న కాలం చేశారు. బొంబాయి వెళ్లి మూకీల నుండి టాకీల శకంలో తనదైన విలక్షణ ముద్ర వేసిన తొలి తెలుగువాడిగా, తెలంగాణ వాడిగా భారతీయ సినీ చరిత్రలో ఒక అధ్యాయాన్ని సృష్టించినవాడు పైడి జైరాజ్‌ నాయుడు. రేపటి తెలంగాణ సినీ చరిత్రలో ఆయన స్థానం సమున్నతమైనది.
– హెచ్‌.రమేష్‌బాబు

Other Updates