హుస్నాబాద్ పర్యటనలో సిీఎం
మీ ఊరికి అదృష్టం కలసివచ్చింది. ఈ నిధులను ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుందాం.
అందరం కలిసి ఊరును బాగుచేసుకుందాం…
ఆరు నూరైనా తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులను రెండు, రెండుంబావు ఏళ్ళలో పూర్తి చేస్తామని, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై గత పాలకులు అవలంభించిన నిర్లక్ష్య వైఖరిని ఆయన విమర్శించారు. ప్రాణహిత ` చేవెళ్ళ ఒక తప్పుడు ప్రాజెక్టు అని, ప్రజా ప్రయోజనాల కోసమే తమ ప్రభుత్వం పని చేస్తుందని సీఎం చెప్పారు. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆగస్టు 8న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పర్యటించారు. ఈ సందర్భంగా గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లతో పాటు, ఉమ్మపూర్ పరిధిలోని మహాసముద్రం గండిని కూడా సి.ఎం. పరిశీలించారు.
మహాసముద్రం గండి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, హుస్నాబాద్ ప్రాంతంలో ఎండిన పంటను చూస్తే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని, ఆ ప్రాంతంలో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతామని కె.సి.ఆర్ చెప్పారు. మహాసముద్రం చెరువును తీర్చిదిద్దితే హుస్నాబాద్‌తో పాటు పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని, ఆద్భుత పర్యాటక కేంద్రంగా మారుతుందని తెలిసి వెంటనే నిధులు మంజూరు చేసినట్టు సి.ఎం. చెప్పారు.
అద్దంలా చేసుకుందాం
అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో తాను దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని అన్ని వీధులు తిరిగి పాడుబడిన గృహాలు, పేరుకుపోయిన చెత్త, చెరువుకట్టపై ముళ్ళపొదలను సి.ఎం. పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం జరిగిన గ్రామ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 17 నుంచి గ్రామజ్యోతి కార్యక్రమం చేపడుతున్నం. ముల్కనూర్లో తిరిగి అందరినీ కలిశా. చెత్త చెదారం, పాడుపడిన ఇళ్ళు, బావులు ఇవన్నీ ఉన్నయి. మన ఇంట్ల చెత్త మనమే ఊడ్చుకుంటం. జ్వరం వచ్చినా పక్కింటివాడు ఊడవడు. ఇల్లు ఎలాగో ఊరు అలాగే అనుకోవాలి. ఆకాశరామన్నరాడు. మనమే బాగుచేసుకోవాలి. రెండు చేతులు పెట్టి మొక్కుతున్నా. ఇది కె.సి.ఆర్ ఇజ్జత్‌కా సవాల్. చిన్న ముల్కనూర్ బాగుపడతదా, పడదా? అన్నది చెప్పాలి. మీ అండదండలు వుంటే తప్పకుండా చేస్తం. మీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు అందించే పూచీ నాది. ఊళ్లో చెత్త, చెదారం ఉంటే దోమలుంటయి. ఎవరినైనా కుడితె జ్వరమొస్తది. దోమలు పోవాలంటే గ్రామం పరిశుభ్రంగా ఉండాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘ చిన్నముల్కనూర్ గ్రామానికి 50 లక్ష రూపాయల నిధులు ఇస్తనని హామీ ఇచ్చి విడుద చేశాను. మరోకోటి రూపాయలు ‘గ్రామజ్యోతి’ కార్యక్రమం క్రింద ఇస్తాను’’ అని కె.సి.ఆర్. చెప్పారు. వేదికపై ఉన్న ఎం.పి. వినోద్‌ను ఉద్దేశించి, మీరెంత ఇస్తారని ముఖ్యమంత్రి ప్రశ్నించగా, 25 లక్ష రూపాయలు ప్రకటించారు. ఎం.ఎల్.ఎ. సతీష్ 10 లక్ష రూపాయలు, జిల్లా కలెక్టర్ 15 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. దీంతో ‘‘ మీ ఊరికి అదృష్టం కలసివచ్చింది. ఈ నిధులను ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. అందరం కలిసి ఊరును బాగుచేసుకుందాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమానికి గ్రామసభ ఆమోదం తెలపాలని సి.ఎం. కోరగానే కరతాళ ధ్వనులతో ప్రజలు ఆమోదం తెలిపారు.