బీబీనగర్‌ను-వరించిన-‘ఎయిమ్స్‌’23బీబీనగర్‌ను వరించిన ‘ఎయిమ్స్‌’
నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ‘నిమ్స్‌’ ప్రాంగణాన్ని ‘ఎయిమ్స్‌’ (ఆల్‌ ఇండియా మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌)గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు.

విభజన బిల్లులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ‘ఎయిమ్స్‌’ను మంజూరు చేసింది. దీనిని బీబీనగర్‌లోని ‘నిమ్స్‌’ ప్రతిపాదిత ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. జనవరి 20న ముఖ్యమంత్రి బీబీనగర్‌ మండలం రంగాపూర్‌లోని ‘నిమ్స్‌’ భవన సముదాయాన్ని పరిశీలించారు. ఇక్కడ ఎయిమ్స్‌తోపాటు, 400 ఎకరాలలో ఆధునిక ఆరోగ్య నగరి (స్మార్ట్‌ హెల్త్‌సెంటర్‌) ప్రతిపాదనలు కూడా రూపొందించవలసిందిగా అధికారులను సి.ఎం. ఆదేశించారు.

‘‘ఎయిమ్స్‌’’ ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం అవసరం. కాగా, బీబీనగర్‌లో ఇప్పటికే 160 ఎకరాల భూమి అందుబాటులోవుంది. దీనికి మరో 40 ఎకరాలు తక్షణం సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
వరంగల్‌, హైదరాబాద్‌ జాతీయ రహదారి ప్రక్కనే ఉండటం, రింగ్‌రోడ్డుకు దగ్గరలో ఉండటం, రాజధాని హైదరాబాద్‌ నగరానికి 20నుంచి 25 కిలోమీటర్ల దూరంలో వుండటం, అన్ని జిల్లాలకు అందుబాటులో ఉండటంతో ముఖ్యమంత్రి బీబీనగర్‌లోనే ‘ఎయిమ్స్‌’ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

ప్రస్తుతం బీబీనగర్‌ వద్ద నిర్మాణంలో ఉన్న నిమ్స్‌ స్థానంలో ‘ఎయిమ్స్‌’ ఏర్పాటు, స్మార్ట్‌ హెల్త్‌సిటీ ఏర్పాటుకు సుమారు వెయ్యికోట్ల రూపాయలు వ్యయమవుతుంది. ఈ నిర్మాణాలవల్ల భవిష్యత్తులో బీబీనగర్‌ను హెల్త్‌హబ్‌గా మార్చాలని సి.ఎం. ఆకాంక్షిస్తున్నారు.

‘ఎయిమ్స్‌’ క్రింద మెడికల్‌ కాలేజీతోపాటు అనుబంధంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారు. 960 పడకలుగల ఆస్పత్రిలో దాదాపు 42 రకాల సూపర్‌ స్పెషాలిటీ, అత్యాధునిక వైద్యరీతులు అందుబాటులోకి వస్తాయి. ‘ఎయిమ్స్‌’లో అన్నిరకాల వ్యాధులకు సంబంధించిన పరిశోధనా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు.

Other Updates