బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై జనవరి 18న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శాసనసభలో ఒక ప్రకటన చేశారు.

వెనుకబడిన వర్గాల సాధికారికతకు విద్యయే తొలిమెట్టని మహాత్మా జ్యోతిబా ఫూలే భావించారు. ఆధునిక సమాజంలో బీసీ కులాలు నిలదొక్కుకోవాలంటే విద్యాపరంగా వారికి మెరుగైన అవకాశాలు కల్పించాలి. విద్య కేవలం జ్ఞానాన్ని మాత్రమేకాదు, సామాజిక హోదాను అందిస్తుంది. బలహీనవర్గాలకు ఆర్థికంగా చేయూతనందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నది. విద్యా విషయికంగా బలహీనవర్గాలు వికాసం పొందేందుకు కేజీనుంచి పీజీ వరకు ప్రభుత్వమే ఉచిత విద్యను అందించాలని మొదటినుంచీ భావించాం. ఇందుకోసం ఆవాస విద్యాలయాలు ఏర్పాటు చేసి, ఇంగ్లిష్‌ మీడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పేద వర్గాలకు విద్యనందిస్తామని మానిఫెస్టోలో పేర్కొన్నాం. అధికారంలోకి రాగానే అమలు దిశగా అడుగులు వేస్తున్నాం.

ఆవాస విద్యాలయాలు విద్యార్థుల జీవితాలలో గొప్ప పరివర్తనను సాధిస్తాయి. రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న ఎస్సీ గురుకులాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, జ్యోతిబా ఫూలేలాంటి మహనీయుల ఆశయాలు నెరవేర్చే దారిలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆవాస విద్యాలయాల ఏర్పాటుకు పూనుకున్నది.

అంబేద్కర్‌ మహాశయుని 125వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఎస్సీలకోసం 130, ఎస్టీలకు 50 రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు మంజూరు చేస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. మైనారిటీలకు రెండు వందల స్కూళ్లను మంజూరు చేసి, అందులో 71 రెసిడెన్షియల్‌ స్కూళ్ళను గతేడాదే ప్రారంభించింది. ఇదే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మాదిరిగానే బీసీ పిల్లలకోసం పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేయబోతున్నామనే విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాను. బీసీల అభ్యున్నతికోసం నిరంతరం కృషి చేసిన మహాత్మా జ్యోతిభాఫూలే పేరున ఈ స్కూళ్ళు ఏర్పాటవుతాయి. ఇందుకోసం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీని ఇప్పటికే ఏర్పాటు చేశాం. వచ్చే విద్యా సంవత్సరంనుంచి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 119 బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నాం. ఈ పాఠశాలల్లో 76,160మంది విద్యార్థులు మంచి విద్యను పొందగలుగుతారు.

బీసీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 5వ తరగతినుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఇంగ్లీషు మీడియంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన జరుగుతుంది. వీరికి తగిన మౌలిక వసతులు, మంచి పోషకాహారం, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం తదితర సదుపాయాలు అందించేందుకు ప్రతీ విద్యార్థిమీద లక్షా ఐదువేల రూపాయలనుంచి లక్షా 25వేల వరకు ఖర్చు అవుతుంది. ధనవంతుల పిల్లలు కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో పొందే విద్యకన్నా మెరుగైన విద్యను ఈ రెసిడెన్షియల్‌ స్కూళ్ళ ద్వారా బీసీ కులాల పిల్లలు పొందుతారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రమూ బలహీనవర్గాలకోసం ఇంతపెద్ద సంఖ్యలో గురుకుల విద్యాలయాలను నెలకొల్పలేదు. చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం వెనుకబడిన కులాల విద్యార్థుల అభివృద్ధికి బలమైన పునాది వేస్తుంది.

వెనుకబడిన వర్గాలకు విద్య ద్వారా విజ్ఞానం, విజ్ఞానం ద్వారా విలువలు, విలువల ద్వారా అభివృద్ధి, అభివృద్ధి ద్వారా సంపద పొందినప్పుడే దేశం నిజమైన పురోగతిని సాధిస్తుందని మహాత్మా ఫూలే అభిప్రాయపడ్డారు. ఆ మహాశయుని స్వప్నం సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం పునరంకితమవుతుందని ప్రకటిస్తున్నాను.

Other Updates