బుద్ధవనం అభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బుద్ధ జయంతి సందర్భంగా ఒక ముఖ్య ప్రకటన చేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో వున్న బుద్ధవనాన్ని మే 4వ తేదీ బుద్ధ జయంతి సందర్భంగా సందర్శించారు. బుద్ధవనం ప్రాంగణంలో ఒక మొక్కను నాటి, అక్కడే వున్న మ్యూజియాన్ని దర్శించారు.
శ్రీ పర్వతారామ బుద్ధవనం ప్రాంతాన్ని మొత్తం తిరిగి అక్కడి పరిస్థితుల్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి కెసీఆర్. అధికారులు అందించిన వివరాలన్నింటినీ దృష్టిలో వుంచుకున్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘బుద్ధగయ’ తరహాలో ఇక్కడి ‘బుద్ధవనం’ కూడా ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకునే బౌద్ధక్షేత్రంగా రూపుదిద్దుకోవాలని అన్నారు. ఇందుకోసం యాదగిరిగుట్ట క్షేత్రంలో ఏర్పాటు చేసినట్టుగానే ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పనులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలించేవిధంగా పూర్తికాలం ఇక్కడే వుండి పనిచేసే ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తాం అని ముఖ్యమంత్రి తెలియజేశారు.
ఇప్పుడున్న 274 ఎకరాల బుద్ధవనం విస్తీర్ణాన్ని మరింతగా విస్తరించుకుందామని అన్నారు. ఇందుకోసం కృష్ణానది తీరంలోవున్న స్థలాన్ని కేటాయిస్తామని అన్నారు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉన్న బౌద్ధ స్తూపాల నమూనాలను, ధ్యానమందిరాలను ఇప్పటికే కడుతున్నారని పేర్కొన్నారు. శ్రీలంక ప్రభుత్వం బహుమతిగా అందజేసిన 27 అడుగుల బుద్ధుని విగ్రహాన్ని, ఈ బుద్ధవనంలో ఒక మంచి స్థానం గుర్తించి అక్కడ నెలకొల్పుదామని ముఖ్యమంత్రి కెసీఆర్ అన్నారు.
ప్రపంచంలో ఏ ప్రాంతంలో వున్న బౌద్ధులైనా, నాగార్జునసాగర్‌కు తప్పనిసరిగా వెళ్ళి రావాలి అనే తలంపు వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్‌ను ఓ గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాలని కెసీఆర్ తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై త్వరలో హైదరాబాద్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఇక్కడ తీసుకోవాల్సిన అన్ని చర్యలపై పరిపూర్ణంగా చర్చలు జరుపుతామని ముఖ్యమంత్రి కెసీఆర్ పేర్కొన్నారు. బుద్ధ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంబడి మంత్రులు జూపల్లి కృష్ణారావు, తన్నీరు హరీశ్‌రావు, అజ్మీరా చందూలాల్, జగదీశ్‌రెడ్డి, పర్యాటకశాఖ కార్యదర్శి బీపీ ఆచార్య, నల్లగొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జర్నలిస్ట్ మల్లెపల్లి లక్షయ్య తదితరులు పాల్గొన్నారు.